
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యువ సంచలనం సూరావజ్జుల స్నేహిత్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్నేహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను అందుకున్నాడు. సింగిల్స్‌లో భారత్ నుంచి రెండో అత్యుత్తమ ర్యాంకర్ స్నేహిత్ కావడం విశేషం. గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ రెండో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు. గత ఆరు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో స్నేహిత్ జోరు కొనసాగిస్తున్నాడు. గతేడాది జోర్డాన్ ఓపెన్‌లో స్వర్ణం, రజతం నెగ్గిన 17 ఏళ్ల స్నేహిత్... స్లొవేనియా, ఇండియా ఓపెన్ టోర్నీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment