snehit
-
జైపూర్ పేట్రియాట్స్ జట్టులో ఆకుల శ్రీజ, స్నేహిత్... ఆగస్టులో యూటీటీ లీగ్...
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) లీగ్ ఐదో సీజన్ కోసం మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు 48 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 16 మంది విదేశీ క్రీడాకారులు. భారత నంబర్‌వన్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, తెలంగాణకే చెందిన యువతార సూరావజ్జుల స్నేహిత్ జైపూర్ పేట్రియాట్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచ 25వ ర్యాంకర్ శ్రీజ గత నెలలో నైజీరియా లో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆగస్టు 22 నుంచి సెపె్టంబర్ 7 వరకు చెన్నైలో జరిగే యూటీటీ లీగ్‌లో అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, చెన్నై లయన్స్, దబంగ్ ఢిల్లీ టీటీసీ, గోవా చాలెంజర్స్, జైపూర్ పేట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణేరి పల్టన్, యు ముంబా జట్లు పాల్గొంటాయి. -
క్వార్టర్స్‌లో స్నేహిత్
బీరుట్ (లెబనాన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో స్నేహిత్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... మహిళల సింగిల్స్‌లో శ్రీజ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 166వ ర్యాంకర్ స్నేహిత్ 11–7, 11–8, 11–13, 15–13తో ప్రపంచ 58వ ర్యాంకర్ అహ్మద్ సలెహ్ (ఈజిప్ట్)ను బోల్తా కొట్టించాడు. శ్రీజ 10–12, 9–11, 11–2, 9–11తో భారత్‌కే చెందిన ఐహిక ముఖర్జీ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో శ్రీజ–దియా చిటాలె (భారత్) ద్వయం 9–11, 8–11, 5–11తో చాంటల్ మాంట్జ్ (జర్మనీ)–ఇజాబెలా లుపులెస్కు (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మిక్స్డ్ డబుల్స్‌లో స్నేహిత్–శ్రీజ (భారత్) జోడీ తొలి రౌండ్లో 4–11, 4–11, 8–11తో జియా లియాన్ ని–లుకా మ్లాడెనోవిచ్ (లక్సెంబర్గ్) జంట చేతిలో ఓటమి పాలైంది. భారత్‌కే చెందిన మానవ్ ఠక్కర్–అర్చన కామత్... మనుష్ షా–దియా చిటాలె జోడీలు మిక్స్డ్ విభాగం ఫైనల్లోకి దూసుకెళ్లాయి. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీజ, స్నేహిత్
బీరుట్ (లెబనాన్): ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ఫీడర్ లెవెల్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్లు ఆకుల శ్రీజ, సూరావజ్జుల స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీజ 11–4, 11–3, 11–8తో అష్తారి మషిద్ (ఇరాన్)పై గెలిచింది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–దియా చిటాలె (భారత్) జోడీ 12–10, 11–7, 14–12తో నథాలీ మర్చెటి–లిలూ మసార్ట్ (బెల్జియం) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో స్నేహిత్ 10–12, 11–5, 12–10, 11–3తో ఖాలిద్ ఖాదర్ (జోర్డాన్)పై, తొలి రౌండ్లో 11–6, 11–8, 11–6తో బాసిల్ హర్బ్ (లెబనాన్)పై గెలుపొందాడు. -
టీటీలో కోటి ఆశలతో...
దాదాపు ఏడాదిన్నర క్రితం... జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్... పురుషుల రెండో రౌండ్లో 18 ఏళ్ల కుర్రాడు భారత టీటీ దిగ్గజం ఆచంట శరత్ కమల్‌ను బోల్తా కొట్టించాడు. 9 సార్లు జాతీయ చాంపియన్... ‘ట్రిపుల్ ఒలింపియన్’... తను ఆరాధించే ఆటగాడు అయిన శరత్ కమల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆ కుర్రాడే తెలంగాణకు చెందిన ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్. అలాంటి అరుదైన విజయంతోనే ఆగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమించిన స్నేహిత్ ఇటీవల తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 49 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన స్నేహిత్... రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ లక్ష్యంగా తన అడుగులు వేస్తున్నాడు. సాక్షి క్రీడా విభాగం ఏడేళ్ల వయసులో టేబుల్ టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్న స్నేహిత్ వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణిస్తూ వేగంగా దూసుకుపోయాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేసిన అనంతరం 2014లో క్యాడెట్ విభాగంలో తొలి అంతర్జాతీయ టైటిల్‌తో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన దక్షిణాసియా పోటీల్లో స్నేహిత్ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్న అనంతరం 2017 స్నేహిత్ కెరీర్లో కీలక మలుపుగా నిలిచింది. జోర్డాన్‌లో జరిగిన ఐటీటీఎఫ్ వరల్డ్ జూనియర్ సర్క్యూట్ ఓపెన్ టోర్నమెంట్లో అతను సింగిల్స్ లో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్ ప్యాడ్లర్ జూనియర్ స్థాయిలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్లొవేనియా, మయన్మార్, ఇండియన్ ఓపెన్, జూనియర్ నేషనల్స్‌తో పాటు ఆలిండియా ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అతను వరుసగా పతకాలు సాధించాడు. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో 20 పతకాలు అతని ఖాతాలో చేరాయి. ఫిట్నెస్ను మెరుగుపర్చుకొని... జూనియర్ విభాగంలో రెండు ప్రపంచ చాంపియన్ షిప్‌లలో (ఇటలీ, ఆస్ట్రేలియా) కూడా పాల్గొన్న 20 ఏళ్ల స్నేహిత్... జాతీయ స్థాయిలో కేడెట్, సబ్ జూనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో వరుసగా ప్రతీ ఏడాది టాప్–4 ర్యాంక్‌లో కొనసాగాడు. అతని కెరీర్‌ను తీర్చి దిద్దడంలో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు ఘోష్ శిక్షణలో రాటుదేలిన స్నేహిత్ జూనియర్ స్థాయిలో నిలకడగా రాణించాడు. చెన్నైకి చెందిన ఎస్.రామన్ వద్ద కూడా స్వల్పకాలం పాటు శిక్షణ పొందగా... 2015లో మాజీ ప్రపంచ చాంపియన్ పీటర్ కార్ల్సన్ వద్ద స్వీడన్లో రెండు నెలల పాటు కోచింగ్ తీసుకోవడం అతని కెరీర్‌కు మేలు చేసింది. ఇప్పుడు కోచ్ ఘోష్‌తో పాటు ఫిజియో హిరాక్ బాగ్చీ స్నేహిత్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా జూనియర్ స్థాయి నుంచి సీనియర్ విభాగంలో పోటీ పడే దశలో వచ్చే ప్రతికూలతలకు అధిగమించేలా చేసి అతడిని ఫిట్‌గా తీర్చిదిద్దడంలో బాగ్చీ కీలక పాత్ర పోషించారు. శరత్ కమల్‌తో సాధన అనంతరం... ర్యాంకింగ్ టోర్నీలో శరత్ కమల్‌పై గెలిచిన తర్వాత స్నేహిత్‌కు అనూహ్య ఫలితాలు వచ్చాయి. వరుసగా ఐదు టోర్నీల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఈ దశలో మానసికంగా బలహీనపడి టోర్నీల్లో పోటీ పడటం కష్టంగా మారింది. అయితే 2019 డిసెంబర్లో జమ్మూలో జరిగిన యూత్ నేషనల్స్ టోర్నీ స్నేహిత్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని కోసం కఠోర సాధన చేసిన అతను చివరకు ఫలితం సాధించాడు. యూత్ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలవడంతో టీమ్ విభాగంలో రజతం కూడా దక్కింది. ఇదే విజయం సీనియర్ స్థాయిలో సత్తా చాటేందుకు కావాల్సిన ప్రేరణను కూడా కల్పించింది. లాక్డౌన్ సమయంలో శరత్ కమల్ స్వయంగా కొందరు యువ ఆటగాళ్లను ఆహ్వానించి వారితో కలిసి సాధన చేశాడు. అది కూడా స్నేహిత్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు సీనియర్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి అతను కొత్త ఘనతను నమోదు చేశాడు. తల్లిదండ్రుల అండతో... చాలా మంది వర్ధమాన ఆటగాళ్లలాగే స్నేహిత్ తల్లిదండ్రులు సూరావజ్జుల రాము, హేమ కూడా తమ అబ్బాయిని చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమించారు. టోర్నీలో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రైవేట్ స్పాన్సర్ల నుంచి గానీ ఎలాంటి సహకారం లేకపోవడంతో కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎలాగైనా స్నేహిత్‌ను టీటీలో మేటిగా తీర్చిదిద్దాలనే సంకల్పం, పట్టుదలతో వారు ఈ ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహిత్‌కు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) స్టయిఫండ్ అందిస్తుండగా... ‘ఖేలో ఇండియా’ తరఫు నుంచి శిక్షణ లభిస్తోంది. స్నేహిత్‌కు సన్మానం... జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన స్నేహిత్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు జయేశ్ రంజన్... తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మంచి క్రీడా పాలసీ తేనుందని... దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రాజు, స్నేహిత్ కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేషనల్స్‌లో పతకం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. ఈ స్థాయిలో నేనూ నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఇది చిరు ఆనందం మాత్రమే. నా అసలు లక్ష్యాలు ముందున్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ముఖ్యంగా నా ఆటతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నా ఫిట్నెస్ను కూడా మెరుగుపర్చుకున్నా. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించాల్సి ఉంది. ఆపై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నా. – ‘సాక్షి’తో ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ -
టీటీ ఫైనల్లో స్నేహిత్
మరోవైపు అండర్–21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో స్నేహిత్ 6–11, 8–11, 11–4, 11–4, 14–16, 12–10, 11–5తో జీత్ చంద్ర (హరియాణా)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో స్నేహిత్ 10–12, 11–4, 11–5, 12–14, 11–5, 11–7తో రాజేశ్ (మహారాష్ట్ర)ను ఓడించాడు. అండర్–17 ఆర్చరీ బాలుర కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుందేరు వెంకటాద్రి కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతక పోరులో వెంకటాద్రి 148–142తో యశ్ దూబేపై విజయం సాధించాడు. -
భారత ఆటగాళ్లకు నిరాశ
బెన్‌డిగో (ఆస్ట్రేలియా): కొంతకాలంగా అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) జూనియర్ సర్క్యూట్లో విశేషంగా రాణిస్తున్న భారత ఆటగాళ్లు ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మాత్రం తడబడ్డారు. జూనియర్ బాలుర సింగిల్స్‌లో భారత ప్లేయర్ మానవ్ ఠక్కర్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించగా... మనుశ్ షా, జీత్ చంద్ర నాకౌట్ దశ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హైదరాబాద్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ గ్రూప్ దశ దాటలేకపోయాడు. గ్రూప్–12లో ఉన్న స్నేహిత్ రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండో ర్యాంక్‌లో నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మానవ్ 6–11, 5–11, 11–7, 16–14, 4–11, 11–8, 8–11తో పెంగ్ జియాంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మరోవైపు మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో జీత్ చంద్ర 8–11, 5–11, 8–11, 8–11తో ప్లెటీ (రొమేనియా) చేతిలో... మనుశ్ షా 11–6, 9–11, 11–4, 5–11, 4–11, 7–11తో పాంగ్ కొయెన్ (సింగపూర్) చేతిలో ఓటమి చవిచూశారు. జూనియర్ బాలికల సింగిల్స్‌లో అర్చన కామత్ తొలి రౌండ్లోనే ఓడిపోయింది. జూనియర్ బాలుర డబుల్స్‌లో స్నేహిత్–జీత్ చంద్ర ద్వయం తొలి రౌండ్లో... మానవ్ –మనుశ్ షా జోడీ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. -
ప్రపంచ జూ. చాంపియన్‌షిప్‌కు స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ క్రీడలో దూసుకుపోతున్న హైదరాబాద్ క్రీడాకారుడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ ప్రతిష్టాత్మక ‘ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్’లో పాల్గొననున్నాడు. ఆస్ట్రేలియాలో డిసెంబర్ 2 నుంచి 9 వరకు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచ జూనియర్ ర్యాంకింగ్స్‌లో 48వ స్థానంలో ఉన్న స్నేహిత్ భారత టీటీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అండర్–18 స్థాయిలో ప్రపంచ జూనియర్ టీటీ చాంపియన్‌షిప్ జరుగుతుంది. గతేడాది ఇటలీలో జరిగిన ఈ మెగా ఈవెంట్లోనూ స్నేహిత్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మరోసారి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున సత్తా చాటేందుకు అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని స్నేహిత్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ టోర్నీకి ముందు నవంబర్ 27 నుంచి 30 వరకు జరిగే పోర్చుగల్ ఓపెన్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యం గా బరిలో దిగుతానన్నాడు. భారత జట్టుకు ఎంపి కైన స్నేహిత్‌ను గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ) యాజమాన్యం అభినందించింది. -
స్నేహిత్‌కు ఘనసన్మానం
సాక్షి, హైదరాబాద్: టేబుల్ టెన్నిస్ యువ సంచలనం ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌కు శుక్రవారం ఘనసన్మానం జరిగింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) యాజమాన్యం స్నేహిత్‌ను సన్మానించింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్నేహిత్ సభ్యునిగా ఉన్న భారత బృందం రజత పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ స్నేహిత్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ప్రదర్శనల పట్ల హర్షం వ్యక్తం చేసిన ఏడబ్ల్యూఏఎస్‌ఏ నిర్వాహకులు భవిష్యత్‌లో జాతి గర్వించే మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
స్నేహిత్ బృందానికి రజతం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జోర్డాన్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువతార సురావజ్జుల స్నేహిత్ టీమ్ విభాగంలో రజతాన్ని సాధించాడు. మనుశ్ షా, స్నేహిత్, జీత్ చంద్రలతో కూడిన భారత్ ‘ఎ’ జూనియర్ టీమ్ ఫైనల్లో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకుంది. టైటిల్ పోరులో చైనీస్ తైపీ బృందం 3–1తో భారత్ ‘ఎ’పై విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో స్నేహిత్ 0–3తో సిన్ యాంగ్లీ చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి మ్యాచ్‌లో మనుశ్ 3–1తో మింగ్ వీ తైయ్పై గెలుపొందడంతో 1–1తో స్కోరు సమమైంది. అనంతరం డబుల్స్ పోరులో భారత్ 2–3తో తృటిలో ఓటమిపాలవడంతో చైనీస్ తైపీ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి సింగిల్స్ మ్యాచ్‌లో మనుశ్ ఒత్తిడికి చిత్తుకాగా భారత్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–0తో ఇరాన్ ‘ఎ’ టీమ్‌పై, క్వార్టర్స్‌లో ఇరాన్ ‘బి’ జట్టుపై గెలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, రెండు కాంస్యాలను భారత క్రీడాకారులు సాధించారు. -
‘చెక్’ టోర్నీలో స్నేహిత్‌కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: చెక్ ఓపెన్ అంతర్జాతీయ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ సభ్యుడిగా ఉన్న భారత బాలుర జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో భారత్ 1–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో స్నేహిత్ 7–11, 4–11, 11–7, 6–11తో సోనె కకెరు చేతిలో... రెండో సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్ 7–11, 5–11, 11–8, 6–11తో షినోజుకు హిరోటో చేతిలో ఓడిపోగా... మూడో సింగిల్స్‌లో జీత్ చంద్ర 11–9, 11–5, 11–4తో హమాడా కజుకిపై గెలుపొందాడు. అయితే రివర్స్ సింగిల్స్‌లో మానవ్ ఠక్కర్ 6–11, 11–8, 11–7, 8–11, 5–11తో సోనె కకెరు చేతిలో పరాజయం పొందడంతో భారత ఓటమి ఖాయమైంది. క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–1తో హంగేరిని ఓడించింది. ఈ పోటీలో తన సింగిల్స్ మ్యాచ్‌లో స్నేహిత్ 11–9, 11–6, 4–11, 13–11తో ఆండ్రాస్ సబాపై గెలుపొందాడు. ‘నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. చైనా, జపాన్ క్రీడాకారులకు దీటుగా ఆడాలంటే నేను చాలా శ్రమించాల్సి ఉంటుంది. మార్చిలో పరీక్షలు ముగిశాక ప్రాక్టీస్ సమయాన్ని మరింతగా పెంచి అంతర్జాతీయ టోర్నీలకు సమాయత్తమవుతాను’ అని 17 ఏళ్ల స్నేహిత్ వ్యాఖ్యానించాడు. గత ఎనిమిది నెలల కాలంలో స్నేహిత్ అంతర్జాతీయ స్థాయిలో ఏడు పతకాలు సాధించగా.. అందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. -
స్నేహిత్ @ 24
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అండర్–18 బాలుర సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ యువ సంచలనం సూరావజ్జుల స్నేహిత్ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇటీవలే ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన స్నేహిత్ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా 40 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంక్‌ను అందుకున్నాడు. సింగిల్స్‌లో భారత్ నుంచి రెండో అత్యుత్తమ ర్యాంకర్ స్నేహిత్ కావడం విశేషం. గుజరాత్ ప్లేయర్ మానవ్ ఠక్కర్ రెండో ర్యాంక్‌లో నిలిచి భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు. గత ఆరు నెలలుగా అంతర్జాతీయస్థాయిలో స్నేహిత్ జోరు కొనసాగిస్తున్నాడు. గతేడాది జోర్డాన్ ఓపెన్‌లో స్వర్ణం, రజతం నెగ్గిన 17 ఏళ్ల స్నేహిత్... స్లొవేనియా, ఇండియా ఓపెన్ టోర్నీలలో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. -
స్నేహిత్ నెగ్గాడు... భారత్ గెలిచింది
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత బాలుర జట్టు రెండో దశ పోటీలకు అర్హత పొందింది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ 3–0తో అర్జెంటీనాను ఓడించి గ్రూప్ ‘బి’లో టాపర్‌గా నిలిచింది. లీగ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ 11–2, 11–5, 11–4తో టొలొసాపై, మానుశ్ 11–9, 11–5, 11–9తో సాంచిపై, మానవ్ 11–8, 11–8, 3–11, 11–7తో బెంటన్కొర్పై నెగ్గారు. -
జాతీయ టీటీ శిబిరానికి స్నేహిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. అతను పాటియాలా లోని జాతీయ క్రీడా శిక్షణా శిబిరానికి ఎంపికయ్యాడు. టేబుల్ టెన్నిస్ జూనియర్స్ కేటగిరీలో భారత నెం.2 ఆటగాడైన స్నేహిత్ స్లోవేనియా జూనియర్ ఓపెన్ టీటీ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ టోర్నీకి సన్నాహకంగా సెప్టెంబర్ 17 వరకు పాటియాలాలో నిర్వహించే కోచింగ్ క్యాంప్‌నకు అతను హాజరు కానున్నాడు. సెప్టెంబర్ 20 నుంచి 24 వరకు స్లోవేనియా జూనియర్ ఓపెన్ టీటీ టోర్నీ జరుగుతుంది. -
స్నేహిత్ జంటకు రజతం
జోర్డాన్ ఓపెన్ టీటీ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఐటీటీఎఫ్ వరల్డ్ సర్క్యూట్ జోర్డాన్ జూనియర్, క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఫిడేల్ రఫీక్ స్నేహిత్ ఆకట్టుకున్నాడు. జోర్డాన్‌లోని అమ్మాన్లో జరిగిన ఈ టోర్నీ జూనియర్ డబుల్స్ విభాగంలో స్నేహిత్ జోడీ రజత పతకాన్ని గెలిచింది. పీఎస్‌పీబీకి చెందిన అనుక్ రామ్ జైన్‌తో జతకట్టిన స్నేహిత్ టోర్నీ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. బుధవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో స్నేహిత్–అనుక్ రామ్ ద్వయం 2–3 (7–11, 13–11, 11–8, 6–11, 9–11)తో భారత్‌కే చెందిన మానుశ్ షా–పార్థ్ విర్మాని జంట చేతిలో పరాజయం పొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో స్నేహిత్–అనుక్ రామ్ జంట 3–2 (3–11, 11–9, 11–7, 7–11, 11–9)తో హు పొ సూన్– పెంగ్ చిన్ (చైనీస్ తైపీ)పై, క్వార్టర్స్‌లో 3–0 (13–11, 11–6, 12–10)తో అబెల్ అజీజ్ యూసుఫ్– మేశ్రఫ్ అహ్మద్ (ఈజిప్టు) జోడీపై నెగ్గారు. -
స్నేహిత్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. గుజరాత్‌తోని వీర్ సావర్కర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో స్నేహిత్ 1-4 (6-11, 11-8, 9-11, 9-11, 8-11) తో భారత నెం.1 ఆటగాడు మానవ్ టక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో పరాజయం చవిచూశాడు. దాదాపు దశాబ్దం తర్వాత జూనియర్ లెవల్ జాతీయ స్థారుు టీటీ టోర్నీలో తెలుగు కుర్రాడు ఫైనల్‌కు చేరడం విశేషం. గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన స్నేహిత్ ఫైనల్‌కు చేరే క్రమంలో రెండో రౌండ్లో భారత్ నెం.2 ఆటగాడు జీత్‌చంద్ర (పశ్చిమ బెంగాల్)పై 3-1 (8-11, 11-7, 12-10, 11-6)తేడాతో; సెమీస్‌లో భారత నెం.3 ఆటగాడు మనుష్ షా (గుజరాత్) 4-1 (11-3, 11-7, 10-12, 11-9, 11-2) తేడాతో సంచలన విజయాలు నమోదు చేశాడు. -
వైకల్యం మెదడుకు కాదు..
చెస్‌లో దూసుకెళుతున్న స్నేహిత్ ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో ప్రాతినిధ్యం కొడుకు కోసం ఉద్యోగాన్ని వీడిన తండ్రి అంగవైకల్యం కారణంగా అందరిలా నడవలేడు... ఆడలేడు.. చక్రాల కుర్చీకే పరిమితం.. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన స్నేహిత్ పరిస్థితి చిన్నప్పటి నుంచీ ఇంతే.. అయితేనేం అతడు నిరాశను దరిచేరనీయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాడిగా ఎదిగాడు. - మహ్మద్ సాబేర్ మొహియోద్దీన్, మహబూబ్‌నగర్ చదరంగం క్రీడలో స్ఫూర్తిదాయక విజయాలతో దూసుకెళుతున్న స్నేహిత్ స్వస్థలం మహబూబ్‌నగర్ లోని క్రిస్టియన్‌పల్లి. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన తను అందరిలా నడవలేడు. అంగవైకల్యం కారణంగా చక్రాల కుర్చీనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు అతడికి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఇంటి వద్దనే చదువు చెప్పించారు. కాస్త కాలక్షేపంగా ఉంటుందని చెస్‌ను పరిచయం చేశారు. అయితే ఈ క్రీడను తను మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. తల్లి రమాదేవి శిక్షణ స్నేహిత్‌ను మరింత రాటుదేలేలా చేసింది. దీంతో తక్కువ కాలంలోనే నైపుణ్యం కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సే్నిహ త్ దగ్గర ఎప్పుడూ ఒకరు అందుబాటులో ఉండాల్సి రావడంతో తండ్రి రవీందర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి కొడుకు ప్రగతికి తోడ్పాటు నందిస్తున్నారు. సాధించిన విజయాలు... 2002లో లయన్స్ క్లబ్ నిర్వహించిన మండల స్థాయి, జిల్లా స్థాయి చెస్ పోటీల్లో స్నేహిత్ విజేతగా నిలిచాడు. 2003లో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లోనూ రాణించి ద్వితీయ స్థానం పొందాడు. మహబూబ్‌నగర్‌లో మల్లికార్జున్ మెమోరియల్ పేరిట నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2005లో ‘బ్రహ్మ మెంటల్లీ రిలేటెడ్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నీలో పాల్గొని మొదటి స్థానాన్ని పొందాడు. 2006లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొని రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2010లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన చెస్ టోర్నీలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి వికలాంగుల టోర్నీకి ఎంపికయ్యాడు. ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీకి... 2013 అక్టోబర్‌లో జర్మనీలోని డ్రెస్డెన్లో జరిగిన ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో స్నేహిత్ పాల్గొన్నాడు. ఆ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు క్రీడాకారులతో తలపడ్డాడు. స్నేహిత్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా అతడిపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. -
స్నేహిత్‌కు పతకం ఖాయం
ఇండియా ఓపెన్ టీటీ జింఖానా, న్యూస్‌లైన్: ఇండియా జూనియర్ అండ్ క్యాడెట్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ క్యాడెట్ డబుల్స్ విభాగంలో స్నేహిత్ జోడి పతకం ఖాయం చేసుకుంది. భారత్ ‘బి’ జట్టుగా బరిలోకి దిగిన స్నేహిత్, హరికృష్ణ జోడి సెమీస్‌కు చేరింది. గోవాలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ ‘బి’ 3-2తో భారత్ ‘సి’పై విజయం సాధించింది. తొలి సెట్లో 13-15 పరాజయం పాలైన భారత్ ‘బి’ 11-8తో రెండో సెట్‌ను దక్కించుకుంది. మూడో సెట్లో 9-11 వెనుకబడినప్పట్టికీ మిగతా సెట్లలో 11-7, 11-8 తేడాతో నెగ్గి మ్యాచ్‌ను గెలుచుకుంది. మరోవైపు వ్యక్తిగత విభాగంలో హరికృష్ణ మెయిన్ డ్రాలోకి ప్రవేశించాడు. గ్రూప్-3లో ఆడుతున్న హరికృష్ణ తొలుత 3-0తో సిద్ధాంత్ సునీల్‌పై, రెండో మ్యాచ్‌లో 3-0తో రొసారియో వెస్లీపై నెగ్గాడు. అయితే మూడో మ్యాచ్‌లో 2-3తో స్వీడన్‌కు చెందిన కార్ల్సన్ ఫిలిప్ చేతిలో ఓడాడు. ప్రస్తుతం హరికృష్ణ గ్రూపులో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
భారత టీటీ జట్టులో స్నేహిత్, శ్రీజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: టేబుల్ టెన్నిస్‌లో విశేషంగా రాణిస్తున్న హైదరాబాదీలు స్నేహిత్, ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్, హరికృష్ణలు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఐటీటీఎఫ్ గ్లోబల్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత క్యాడెట్, జూనియర్ జట్లకు ఎంపికయ్యారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.ఆర్.చౌదరి ఈ మేరకు వెల్లడించారు. భారత బాలుర జట్టులో చాన్నాళ్ల తర్వాత ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం పట్ల రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుల్తానా హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు త్వరలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారని చెప్పారు. క్యాడెట్ అండర్-15 బాలుర విభాగంలో ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణలకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. అలాగే భారత జూనియర్ జట్టుకు ఆకుల శ్రీజా, నైనాలు ఎంపికయ్యారు. ఈ పోటీలు మార్చి 25 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ చాంపియన్ అయిన స్నేహిత్... జూనియర్ , యూత్ విభాగం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. జాతీయ సబ్ జూనియర్ విభాగంలో అతను మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్నేహిత్, శ్రీజాలు గ్లోబల్ టీటీ అకాడమీలో శిక్షణ పొందారు. హరికృష్ణ సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. హరికృష్ణ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో తోటి క్రీడాకారులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. కోచ్‌లు ఇబ్రహీమ్ ఖాన్, నాగేందర్‌రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికృష్ణకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావం గల హరికి కష్ణపడేతత్వం ఉందని వారు పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో శిక్షణ పొందిన నైనా ఇప్పటికే పలు అంతర్జాతీయ టీటీ టోర్నీల్లో సత్తాచాటిన సంగతి తెలిసిందే.