టీటీలో కోటి ఆశలతో... | Snehit settles for bronze in the UTT National Championship | Sakshi
Sakshi News home page

టీటీలో కోటి ఆశలతో...

Published Sun, Feb 28 2021 5:09 AM | Last Updated on Sun, Feb 28 2021 5:15 AM

Snehit settles for bronze in the UTT National Championship - Sakshi

దాదాపు ఏడాదిన్నర క్రితం... జాతీయ ర్యాంకింగ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నమెంట్‌... పురుషుల రెండో రౌండ్‌లో 18 ఏళ్ల కుర్రాడు భారత టీటీ దిగ్గజం ఆచంట శరత్‌ కమల్‌ను బోల్తా కొట్టించాడు. 9 సార్లు జాతీయ చాంపియన్‌... ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’... తను ఆరాధించే ఆటగాడు అయిన శరత్‌ కమల్‌ను ఓడించి సంచలనం సృష్టించిన ఆ కుర్రాడే తెలంగాణకు చెందిన ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌. అలాంటి అరుదైన విజయంతోనే ఆగిపోకుండా మరింత పట్టుదలతో శ్రమించిన స్నేహిత్‌ ఇటీవల తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌లో కాంస్యం సాధించాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 49 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన స్నేహిత్‌... రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌ లక్ష్యంగా తన అడుగులు వేస్తున్నాడు.

సాక్షి క్రీడా విభాగం
ఏడేళ్ల వయసులో టేబుల్‌ టెన్నిస్‌లో ఓనమాలు నేర్చుకున్న స్నేహిత్‌ వివిధ వయో విభాగాల్లో నిలకడగా రాణిస్తూ వేగంగా దూసుకుపోయాడు. జాతీయ స్థాయిలో వరుస విజయాలు నమోదు చేసిన అనంతరం 2014లో క్యాడెట్‌ విభాగంలో తొలి అంతర్జాతీయ టైటిల్‌తో అతను అందరి దృష్టిలో పడ్డాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన దక్షిణాసియా పోటీల్లో స్నేహిత్‌ రజత పతకం సాధించాడు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తన ఆటకు మరిన్ని మెరుగులు దిద్దుకున్న అనంతరం 2017 స్నేహిత్‌ కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. జోర్డాన్‌లో జరిగిన ఐటీటీఎఫ్‌ వరల్డ్‌ జూనియర్‌ సర్క్యూట్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో అతను సింగిల్స్‌ లో స్వర్ణం సహా మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ హైదరాబాద్‌ ప్యాడ్లర్‌ జూనియర్‌ స్థాయిలో వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్లొవేనియా, మయన్మార్, ఇండియన్‌ ఓపెన్, జూనియర్‌ నేషనల్స్‌తో పాటు ఆలిండియా ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లలో అతను వరుసగా పతకాలు సాధించాడు. వివిధ అంతర్జాతీయ టోర్నీలలో 20 పతకాలు అతని ఖాతాలో చేరాయి.  

ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకొని...
జూనియర్‌ విభాగంలో రెండు ప్రపంచ చాంపియన్‌ షిప్‌లలో (ఇటలీ, ఆస్ట్రేలియా) కూడా పాల్గొన్న 20 ఏళ్ల స్నేహిత్‌... జాతీయ స్థాయిలో కేడెట్, సబ్‌ జూనియర్, జూనియర్, యూత్‌ విభాగాల్లో వరుసగా ప్రతీ ఏడాది టాప్‌–4 ర్యాంక్‌లో కొనసాగాడు. అతని కెరీర్‌ను తీర్చి దిద్దడంలో కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌ కీలకపాత్ర పోషించాడు. వరుసగా ఏడేళ్ల పాటు ఘోష్‌ శిక్షణలో రాటుదేలిన స్నేహిత్‌ జూనియర్‌ స్థాయిలో నిలకడగా రాణించాడు. చెన్నైకి చెందిన ఎస్‌.రామన్‌ వద్ద కూడా స్వల్పకాలం పాటు శిక్షణ పొందగా... 2015లో మాజీ ప్రపంచ చాంపియన్‌ పీటర్‌ కార్ల్‌సన్‌ వద్ద స్వీడన్‌లో రెండు నెలల పాటు కోచింగ్‌ తీసుకోవడం అతని కెరీర్‌కు మేలు చేసింది. ఇప్పుడు కోచ్‌ ఘోష్‌తో పాటు ఫిజియో హిరాక్‌ బాగ్చీ స్నేహిత్‌ను తీర్చిదిద్దారు. ముఖ్యంగా జూనియర్‌ స్థాయి నుంచి సీనియర్‌ విభాగంలో పోటీ పడే దశలో వచ్చే ప్రతికూలతలకు అధిగమించేలా చేసి అతడిని ఫిట్‌గా తీర్చిదిద్దడంలో బాగ్చీ కీలక పాత్ర పోషించారు.  

శరత్‌ కమల్‌తో సాధన అనంతరం...
ర్యాంకింగ్‌ టోర్నీలో శరత్‌ కమల్‌పై గెలిచిన తర్వాత స్నేహిత్‌కు అనూహ్య ఫలితాలు వచ్చాయి. వరుసగా ఐదు టోర్నీల్లో అతను ఘోరంగా విఫలమయ్యాడు. ఈ దశలో మానసికంగా బలహీనపడి టోర్నీల్లో పోటీ పడటం కష్టంగా మారింది. అయితే 2019 డిసెంబర్‌లో జమ్మూలో జరిగిన యూత్‌ నేషనల్స్‌ టోర్నీ స్నేహిత్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. దీని కోసం కఠోర సాధన చేసిన అతను చివరకు ఫలితం సాధించాడు. యూత్‌ సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలవడంతో టీమ్‌ విభాగంలో రజతం కూడా దక్కింది. ఇదే విజయం సీనియర్‌ స్థాయిలో సత్తా చాటేందుకు కావాల్సిన ప్రేరణను కూడా కల్పించింది. లాక్‌డౌన్‌ సమయంలో శరత్‌ కమల్‌ స్వయంగా కొందరు యువ ఆటగాళ్లను ఆహ్వానించి వారితో కలిసి సాధన చేశాడు. అది కూడా స్నేహిత్‌కు ఉపయోగపడింది. ఇప్పుడు సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి అతను కొత్త ఘనతను నమోదు చేశాడు.

తల్లిదండ్రుల అండతో...
చాలా మంది వర్ధమాన ఆటగాళ్లలాగే స్నేహిత్‌ తల్లిదండ్రులు సూరావజ్జుల రాము, హేమ కూడా తమ అబ్బాయిని చాంపియన్‌గా తీర్చిదిద్దడంలో ఎంతో శ్రమించారు. టోర్నీలో పాల్గొనేందుకు పెద్ద మొత్తంలో సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రైవేట్‌ స్పాన్సర్ల నుంచి గానీ ఎలాంటి సహకారం లేకపోవడంతో కెరీర్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా వారు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎలాగైనా స్నేహిత్‌ను టీటీలో మేటిగా తీర్చిదిద్దాలనే సంకల్పం, పట్టుదలతో వారు ఈ ప్రతికూలతలను అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం స్నేహిత్‌కు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) స్టయిఫండ్‌ అందిస్తుండగా... ‘ఖేలో ఇండియా’ తరఫు నుంచి శిక్షణ లభిస్తోంది.

స్నేహిత్‌కు సన్మానం...
జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన స్నేహిత్‌ను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, తెలంగాణ ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు జయేశ్‌ రంజన్‌... తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ (శాట్స్‌) చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా జయేశ్‌ రంజన్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే మంచి క్రీడా పాలసీ తేనుందని... దీని ద్వారా అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత టీటీ సమాఖ్య ఉపాధ్యక్షుడు ప్రకాశ్‌రాజు, స్నేహిత్‌ కోచ్‌ సోమ్‌నాథ్‌ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు.


సీనియర్‌ నేషనల్స్‌లో పతకం సాధించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచింది. ఈ స్థాయిలో నేనూ నిలబడగలననే నమ్మకాన్ని కలిగించింది. అయితే ఇది చిరు ఆనందం మాత్రమే. నా అసలు లక్ష్యాలు ముందున్నాయి. వాటిని నెరవేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా. ముఖ్యంగా నా ఆటతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నా ఫిట్‌నెస్‌ను కూడా మెరుగుపర్చుకున్నా. ముఖ్యంగా వచ్చే రెండేళ్లలో కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించాల్సి ఉంది. ఆపై 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నా.
– ‘సాక్షి’తో ఎస్‌ఎఫ్‌ఆర్‌ స్నేహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement