
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీ
సెంట్రల్ ఫ్లోరిడా (అమెరికా): ఆర్చరీ–2025 సీజన్ తొలి టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో భారత్ నాలుగు పతకాలు గెల్చుకుంది. చివరిరోజు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
కాంస్య పతక మ్యాచ్‌లో 23 ఏళ్ల ధీరజ్ 6–4 (28–28, 28–29, 29–29, 29–28, 30–29) సెట్ పాయింట్లతో ఆండ్రెస్ టెమినో మెడీల్ (స్పెయిన్)పై విజయం సాధించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ధీరజ్ 1–7 (27–28, 28–30, 29–29, 26–30) సెట్ పాయింట్లతో ఫ్లోరియన్ ఉన్‌రా (జర్మనీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు.
క్వాలిఫయింగ్‌లో 666 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచిన ధీరజ్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో 6–0తో కెమిరిన్ పికెరింగ్ (బెర్ముడా)పై, రెండో రౌండ్‌లో 7–1తో కార్లోస్ రొజాస్ (మెక్సికో)పై, మూడో రౌండ్‌లో 7–3తో అతాను దాస్ (భారత్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–4తో థామస్ చిరాల్ట్ (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో ఉన్న ధీరజ్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా పని చేస్తున్నాడు.
ఇదే టోర్నీలో ధీరజ్ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్‌లతో కలిసి భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ సహచరుడు రిషభ్ యాదవ్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించింది. అభిõÙక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు కాంపౌండ్ టీమ్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తదుపరి ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నమెంట్ చైనాలోని షాంఘై నగరంలో మే 6 నుంచి 11వ తేదీ వరకు జరుగుతుంది.
ఓవరాల్‌గా ప్రపంచకప్ టోర్నీలలో ధీరజ్ సాధించిన పతకాలు. ఇందులో వ్యక్తిగత విభాగంలో మూడు కాంస్యాలు ఉన్నాయి. టీమ్ విభాగంలో ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు, రెండు రజతాలు ఉన్నాయి.