
ఫ్లోరిడా (అమెరికా): అంతర్జాతీయ ఆర్చరీ కొత్త సీజన్‌ను భారత పురుషుల కాంపౌండ్ జట్టు కాంస్య పతకంతో ప్రారంభించింది. ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం జరిగిన పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ్ దేవ్‌తలేలతో కూడిన భారత జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది.
కాంస్య పతక మ్యాచ్‌లో అభిషేక్, రిషభ్, ఓజస్ త్రయం 230–224 పాయింట్ల తేడాతో మథియాస్ ఫులర్టన్, రస్‌ముస్ బ్రామ్‌సెన్, మార్టిన్ డామ్స్‌బోలతో కూడిన డెన్మార్క్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ ‘షూట్ ఆఫ్’లో 219–219 (27–29) స్కోరుతో ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతక పోరుకు అర్హత సాధించింది.
జ్యోతి సురేఖ మాత్రమే...
మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో భారత్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ వెన్నం జ్యోతి సురేఖ మాత్రమే ఈ టోర్నీలో ఆడుతోంది. ఇతర భారత క్రీడాకారిణులకు వీసా రాకపోవడంతో టీమ్ విభాగంలో భారత్ పతకావకాశాలు దెబ్బతిన్నాయి. క్వాలిఫయింగ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ 691 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచింది. తొలి రౌండ్‌లో చిలీకి చెందిన ఒలియా ప్రాడోతో జ్యోతి సురేఖ ఆడుతుంది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రిషభ్ యాదవ్–జ్యోతి సురేఖ జోడీ పోటీపడుతుంది.
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ ఈవెంట్
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆర్చరీ క్రీడాంశంలో కొత్తగా కాంపౌండ్ ఈవెంట్‌ను జత చేశారు. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో ఆర్చరీ క్రీడాంశంలో రికర్వ్ కేటగిరీలో మాత్రమే పోటీలు నిర్వహిస్తున్నారు. రికర్వ్ విభాగంలో ఐదు ఈవెంట్స్‌లో (పురుషుల, మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్‌డ్) పతకాలు అందజేస్తున్నారు.
తాజాగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ను కొత్తగా మెడల్ ఈవెంట్‌గా ప్రవేశ పెట్టనున్నారని వరల్డ్ ఆర్చరీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాంపౌండ్ ఈవెంట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చడంతో ఈ విభాగంలో భారత స్టార్స్ జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మల నుంచి ఒలింపిక్ పతకాన్ని ఆశించవచ్చు.