దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది.
టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది.
ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు.
‘షూట్ ఆఫ్’లో సూపర్...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు.
అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్‌డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్‌జెవ్‌స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు.
పొలంలో సాధన చేసి...
హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్‌కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది.
ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం...
పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు.
బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం
పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్‌ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment