Avani Lekhara
-
కాలితో సంతకం చేసిన శీతల్.. ప్రధాని మోదీకి జెర్సీ
పారాలింపిక్స్ క్రీడాకారులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. పారా విశ్వక్రీడల్లో అత్యధిక పతకాలు సాధించిన బృందాన్ని కొనియాడారు. భారత పారాలింపిక్స్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్కును సెట్ చేశారంటూ అభినందించారు. కాగా పారిస్ పారాలింపిక్స్-2024లో భారత్ అత్యధికంగా 29 పతకాలు గెలిచింది. ఇందులో ఏడు స్వర్ణాలు, తొమ్మిది రజతాలు, పదమూడు కాంస్య పతకాలు ఉన్నాయి.నేలపై కూర్చున్న మోదీఈ క్రమంలో టోక్యో పారాలింపిక్స్ పతకాల(19) రికార్డు బ్రేక్ అయింది. ఈ నేపథ్యంలో పారిస్ నుంచి పతకాలతో తిరిగి వచ్చిన పారా అథ్లెట్లతో ప్రధాని మోదీ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పారాలింపియన్ల అంకితభావాన్ని కొనియాడిన ప్రధాని వారిని అభినందించారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరితో విడివిడిగా కలుసుకొని ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా శారీరక ఎదుగుదల లోపం ఉన్న జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్‌తో మోదీ అహ్లాదంగా గడిపారు. మరుగుజ్జు క్రీడాకారుడైన అతని చేతుల మీదుగా టోపీ ధరించేందుకు నేలపై కూర్చున్నారు. దీంతో నవ్‌దీప్ అమితానందంతో ప్రధానికి టోపీ తొడిగాడు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)అనంతరం తన చేతి భుజంపై ఆటోగ్రాఫ్ కోరగా... ప్రధాని వెంటనే పెన్ తీసుకొని అతని ముచ్చట తీర్చారు. జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన అతని గురించి అడిగి తెలుసుకున్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)కాలితో సంతకం చేసిన శీతల్అదే విధంగా.. షూటర్ అవని లేఖరా, జూడో ప్లేయర్ కపిల్ పర్మార్, ఆర్చర్లు శీతల్ దేవి, రాకేశ్ కుమార్ తదితరులు ప్రధానితో ముచ్చటించారు. ఈ సందర్భంగా శీతల్ కాలితో సంతకం చేసిన జెర్సీని మోదీకి బహూకరించింది. ఇక ఈ భేటీకి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ శుక్రవారం.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు.చదవండి: అలాంటి వాళ్లే ఇప్పుడు మిఠాయిలు తినిపిస్తున్నారు: శీతల్ దేవి India's Paralympic champions have set a new benchmark with the highest-ever medal count. It was a delight to interact with them. https://t.co/yLkviuJCaI— Narendra Modi (@narendramodi) September 13, 2024 -
ప్రమాదం నుంచి పతకం దాకా, చరిత్రను తిరగరాసింది
‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..టోక్యోలో జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం. -
అవని అద్వితీయం
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది. వీటితో పాటు పురుషుల షూటింగ్లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది. ఈ ఈవెంట్లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు. టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కూడా అవని తలపడనుంది. మనీశ్ నర్వాల్‌కు రజతం... పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు. మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది. కంచు మోగించిన ప్రీతి పాల్... పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. 1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్. సెమీస్‌లో సుహాస్, నితీశ్... పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు. 2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్ మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు. -
Paris Paralympics 2024: మెరిసిన అవని.. షూటింగ్లో భారత్‌కు స్వర్ణం
ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్-2024లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. భారత పారా షూటర్ అవని లేఖరా పసిడి పతకంతో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో బంగారుపతకం సాధించింది. ఫైనల్లో 249.7 స్కోరు సాధించి అగ్రస్ధానంలో నిలిచిన అవని.. గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కాగా పారా ఒలింపిక్స్‌లో అవనీకి ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. టోక్యో పారాలింపిక్స్-2021లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 22 ఏళ్ల అవని పసిడి పతకం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను ఆమె తన పేరిట లిఖించుకుంది. పారా ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రెండు గోల్డ్‌మెడల్స్‌ను సొంతం చేసుకున్న తొలి భారత మహిళా షూటర్‌గా అవని చరిత్ర సృష్టించింది.కాంస్యంతో మెరిసిన మోనా అగర్వాల్..ఇక ఇదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో మరో భారత షూటర్ మోనా అగర్వాల్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మోనా 228.7 స్కోరుతో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. 🇮🇳🥇 UNSTOPPABLE! The defending champion Avani Lekhara clinches gold at the Paris Paralympics 2024, proving she's still on top!📷 Pics belong to the respective owners • #AvaniLekhara #Shooting #ParaShooting #Paris2024 #Paralympics #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/advcNuWvYR— The Bharat Army (@thebharatarmy) August 30, 2024 -
వారి కోసం ప్రత్యేకం.. పెద్ద మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra keeps his promise: టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ఆనంద్ మహీంద్రా. ప్రతిభకు తగ్గ సత్కారం చేయడంలో ఆయనెప్పుడు వెనుకాడరు అనడానికి మరో ఘటన ఉదాహారణగా నిలించింది. టోక్యోలో 2020 ఆగస్టులో జరిగిన పారా ఒలంపిక్స్‌లో అవని లేఖర 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో బంగారు పతాకం సాధించింది. అంతేకాదు 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అవని లేఖరను ప్రశంసిస్తూ ఆమెకు సులభంగా ప్రయాణించేందుకు వీలుగా కొత్త మహీంద్రా వాహనాన్ని బహుమతిగా ఇస్తానంటూ ఆగస్టులో ఆయన ప్రకటించారు. ఆనంద్ మహీంద్రా నుంచి ఆజ్ఞలు రావడం ఆలస్యం.. వెనువెంటనే పనులు జరిగిపోయాయి. మహీంద్రా గ్రూపు చీఫ్ డిజైనర్ ప్రతాప్ బోస్ ఆధ్వర్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఓఓ మోడల్లో మార్పులు చేశారు. డ్రైవర్ సీటు పక్కన ఉండే కో డ్రైవర్ సీటు బయటకి వచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ మార్పు వల్ల దివ్యాంగులు సులభంగా కారులోకి ఎక్కడం, దిగడం చేయవచ్చు. దివ్యాంగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిన కారును అవని లేఖరకు ఇటీవల అందించారు. తనకు బహుమతిగా వచ్చిన కారుని చూసిన అవని లేఖర మురిసిపోయింది. ధ్యాంక్యూ ఆనంద్ మహీంద్రా అండ్ టీమ్ అంటూ తాను కారులో కూర్చున్న ఫోటోలను ట్వీట్ చేసింది. 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/WgHyREpiYo — anand mahindra (@anandmahindra) January 19, 2022 -
Rewind 2021: ఈసారి మనకు ఒలింపిక్స్‌లో స్వర్ణం, రజతం, కాంస్యం!
Tokyo Olympics: ఆధునిక ఒలింపిక్స్ 1896లో ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన వాటిలో భారతదేశానికి సంబంధించినంత వరకు మైలురాయిలాంటి విజయాలను అందించిన సంవత్సరంగా 2021 మిగిలిపోతుంది. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా ప్రాబల్యం కారణంగా వాయిదా పడి, నిబంధనల మేరకు చివరకు 2021లో నిర్వహించారు. ఈ ఒలిపింక్స్‌లో మన దేశం స్వర్ణం, రజతం, కాంస్యం.. ఇలా మూడు రకాల పతకాలను గెలుచుకుని ఒలింపిక్స్ చరిత్రలో భారత్ ఆట తీరుపై అంచనాలను పెంచింది. మన క్రీడాకారులు కూడా ఎంతో ప్రతిభను ప్రదర్శించి విజయాలను చేజిక్కించుకున్నారు. బజరంగ్ పూనియా హరియాణా జజ్జర్ ప్రాంతానికి చెందిన బజరంగ్ అరవై అయిదు కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో కజకిస్తాన్‌కు చెందిన నియజ్ బెకోవన్ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. నీరజ్ చోప్రా స్వాతంత్య్ర భారత చరిత్రలో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని ఒలింపిక్స్‌లో సాధించిన క్రీడాకారుడిగా నీరజ్ రికార్డ్ సృష్టించాడు. అంతగా గుర్తింపులేని జావెలిన్ త్రో క్రీడలో అంతర్జాతీయ దిగ్గజాలను సైతం కాలదన్ని స్వర్ణపతాకంతో భారతీయ కలలను నెరవేర్చాడు. హరియాణా పానిపట్టు జిల్లాలోని ‘ఖంద్రా’గ్రామంలో పదిహేడు మంది ఉండే ఉమ్మడి కుటుంబంలో పెద్దబ్బాయి అయిన నీరజ్ తన కలలను మాత్రమే కాక భారతీయుల కలలనూ నిజం చేశాడు. మీరాబాయి చాను మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మీరాబాయి 2021, ఆగస్ట్ 5న టోక్యో ఒలింపిక్స్‌లో భారతీయ త్రివర్ణ పతాకం రెపరెలాడేలా చేసింది. నలభై తొమ్మిది కిలోల వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో స్నాచ్ విభాగంలో ఎనభై ఏడు కిలోలను, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 115 కిలోలను ఎత్తి మొత్తం 202 పాయింట్లతో భారత్‌కు వెండి పతకాన్ని ఖాయం చేసింది. ఇరవై ఆరేళ్ల మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో భారత విజయయాత్రకు శ్రీకారం చుట్టింది. రవికుమార్ దహియా టోక్యో ఒలింపిక్స్‌లో యాభై ఏడు కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో రజత పతకాన్ని సాధించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతాక విజేతగా, ఏషియన్ చాంపియన్‌గా మంచి ట్రాక్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న దహియా ఒలింపిక్స్‌లోనూ అదే పరంపరను సాగించడం విశేషం. లవ్లీనా బొర్గొహెన్ అస్సాంలోని గోలాఘాట్‌లో జన్మించిన లవ్లీనా కిక్‌బాక్సింగ్‌తో కెరీర్ మొదలుపెట్టింది. టోక్యో ఒలిపింక్స్‌లో అరవై తొమ్మిది కిలోల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. పి.వి. సింధు బాడ్మింటన్ క్రీడలో చెరిగిపోని ముద్రవేసిన తెలుగు అమ్మాయి పూసర్ల వెంకట సింధు ఈసారి కాంస్య పతకాన్ని సాధించింది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. పారాలింపిక్స్‌లో భారతీయులు శారీరకంగా, మానసికంగా ఉన్న సవాళ్లు సంకల్పాన్ని ఉసిగొల్పి, దీక్షగా మలచి, పట్టువిడువని సాధనగా మార్చితే విజయం పతకంగా ఇంటికి రాదూ! అలా మిగిలిన ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే క్రీడాసంరంభమే.. రెండో ప్రపంచానంతరం ప్రారంభమైన పారాలింపిక్స్. 2021 సంవత్సరపు ఈ క్రీడల్లో మన దేశ పతాకం రెపరెపలాడింది. మొత్తం 17 మంది క్రీడాకారులు 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు సాధించి మన సత్తా చాటారు. ఆ విజేతలు వీరే.. అవనీ లేఖరా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక విరిగి నడుం కింది భాగం చచ్చుబడిపోయి.. వీల్‌చైర్‌కే అంకితమైంది. అయినా అధైర్యపడక మొక్కవోని దీక్షతో షూటింగ్ నేర్చుకుని భారత్ తరపున పారాలింపిక్స్‌కి ఎన్నికైంది. ఈ పోటీల్లో పాల్గొన్న మొదటిసారే రెండు పతకాలను సాధించిన తొలి భారతీయ యువతిగా రికార్డ్ సృష్టించింది. తంగవేలు మరియప్పన్ తమిళనాడులోని సేలం జిల్లా, పెరియనడాగపట్టి అనే కుగ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన తంగవేలు ఓ బస్సు ప్రమాదంలో కుడికాలిని పోగొట్టుకున్నాడు. అయినా పాఠశాల స్థాయి నుంచే హైజంప్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఓవైపు ఆ క్రీడను సాధన చేస్తూనే మరో వైపు జీవనాధారం కోసం పేపర్‌బాయ్‌గా పనిచేసేవాడు. రియో పారాలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ గెలుపునే టోక్యో పారాలింపిక్స్‌లోనూ కొనసాగించి హైజంప్‌లో రెండో విడతా బంగారు పతకాన్ని సాధించాడు. ప్రమోద్ భగత్ బిహార్‌లోని హాజీపూర్‌లో జన్మించిన ప్రమోద్ పోలియోతో ఎడమ కాలిని కోల్పోయాడు. అయితే క్రికెట్ పట్ల ప్రేమతో ఎప్పుడూ గ్రౌండ్లో గడుపుతూ తన వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకునే ప్రయత్నం చేసేవాడు. ఆ తర్వాత తన మేనత్తతో భువనేశ్వర్ వెళ్లి అక్కడే తన దృష్టిని బాడ్మింటన్ వైపు మరల్చాడు. నాలుగుసార్లు బాడ్మింటన్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించి వరల్డ్ నంబర్ వన్‌గా ప్రశంసలు పొందాడు. అయితే టోక్యో పారాలింపిక్స్‌తో తొలిసారి బాడ్మింటన్‌ను ప్రవేశపెట్టడం వల్ల ఈ పోటీలో పాల్గొని స్వర్ణపతకాన్ని సాధించి దేశ కీర్తిని చాటాడు. సుమిత్ కుస్తీలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కలలు గన్న సుమిత్ 2014లో జరిగిన ఓ యాక్సిడెంట్లో ఎడమకాలిని పోగొట్టుకున్నాడు. తన దృష్టిని అథ్లెటిక్స్ అందులోనూ ‘జావెలిన్ త్రో’ వైపు మరల్చి తీవ్రమైన సాధన చేశాడు. ఆ పోటీలో పాల్గొనెందుకు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పోటీదారులను వెనక్కి నెట్టి టోక్యో పారాలింపిక్స్ జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. దేవేంద్ర ఝఝరియా రాజస్థాన్, చుంచ జిల్లాలోని ఓ కుగ్రామంలో పుట్టిన దేవేంద్ర ఎనిమిదేళ్ల వయసులో విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కాలిపోవడంతో దాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆత్మన్యూనతకు లోనుకాకుండా ఒంటి చేత్తోనే ఆడగలిగిన క్రీడ జావెలిన్ త్రోని ఎంపిక చేసుకొని పట్టుదలతో ప్రాక్టీస్ చేశాడు. ఏథెన్స్ పారాలింపిక్స్‌లో ప్రపంచరికార్డును సృష్టించేంతగా ఎదిగాడు. తర్వాత రియో పారాలింపిక్స్‌లో, ప్రస్తుత టోక్యో పారాలింపిక్స్‌లో కూడా విజేతగా నిలిచి మూడు పారాలింపిక్స్ పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అతనికిప్పుడు 40 ఏళ్లు. ఆ వయసులో ఈ విజయం నిజంగా విశేషం. కృష్ణ నాగర్ రాజాస్థాన్కు చెందిన కృష్ణ .. హార్మోన్ల లోపం వల్ల మరుగుజ్జుగా ఉండిపోయాడు. కానీ బాడ్మింటన్ పట్ల ఆసక్తితో దాన్ని నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో పతకాన్ని సాధించి మరుగుజ్జుతనం తన లక్ష్యసాధనకు ఆటంకం కాదని నిరూపించాడు. మనీష్ నర్వాల్ హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన మనీష్ పుట్టుకతోనే కుడిచేయిపై పట్టును కోల్పోయి, ఒంటి చేతితోనే జీవితాన్ని నెట్టుకు రాసాగాడు. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే ఈ 19ఏళ్ల కుర్రాడు తన లోపాన్ని దృష్టిలో పెట్టుకుని తన ఏకాగ్రతను షూటింగ్ వైపు మళ్లించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. భావినా పటేల్ గుజరాత్, మెహసాగా జిల్లాకు చెందిన భావినా పోలియో వల్ల కాళ్లను పోగొట్టుకుని చక్రాల కుర్చీకే పరిమితం అయింది. ఎన్నో ప్రతిబంధకాలను అధిగమించి టేబుల్ టెన్నిస్‌ను నేర్చుకుని టోక్యో పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకుని ఈ క్రీడలో పతకాన్ని సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఈ క్రీడాకారిణి వయసు ఎంతో తెలుసా.. పందొమ్మిదేళ్లు మాత్రమే. సమీర్ బెనర్జీ భారతీయ మూలాలున్న ఈ అమెరికన్ యువకుడు ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. అరుదైన రికార్డ్ సృష్టించాడు. సమీర్ తండ్రి అస్సాం రాష్ట్రీయుడు. తల్లిది ఆంధ్రప్రదేశ్. అబ్దుల్ రజాక్ గుర్నా ప్రతిష్ఠాత్మక నోబెల్ సాహిత్య పురస్కారాన్ని 2021 గాను గెలుచుకున్న సాహితీవేత్త అబ్దుల్ రజాక్. టాంజానియాకు చెందిన ఆయన 1994లో ‘ప్యారడైజ్’ నవలతో సాహిత్య ప్రస్థానం మొదలుపెట్టారు. ఆయన రచనల్లో వలసవాదపు మూలాలు, తూర్పు ఆఫ్రికా దేశాల్లోని ఆధునికత తాలూకు విధ్వంసం, సాంస్కృతిక సంఘర్షణలు కనిపిస్తాయి. 1948లో, జాంజిబార్‌లో జన్మించిన అబ్దుల్ 1960వ దశకంలో శరణార్థిగా ఇంగ్లండ్‌కు చేరాడు. అనంతరం అక్కడే ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేసి, రిటైర్ అయ్యాడు. -
భారీ నజరానాలు, కోట్లల్లో డబ్బు.. కేవలం ఇవేనా.. అసలు సంగతి వేరే!
భారత ఒలింపిక్స్, పారాలింపిక్స్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి మనకు స్వర్ణాల పంట పండింది. టోక్యో ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో) పసిడి అందించి చరిత్ర సృష్టించగా.. పారాలింపిక్స్‌లో అవని లేఖరా, సుమిత్ అంటిల్, ప్రమోద్ భగత్, కృష్ణా నగర్, మనీష్ నర్వాల్ స్వర్ణాలు సాధించి గర్వకారణమయ్యారు. వీరితో పాటు మన క్రీడాకారులంతా మెరుగ్గా రాణించడంతో ఒలింపిక్స్‌లో మొత్తంగా 7 పతకాలు, పారాలింపిక్స్‌లో 19 పతకాలు మన సొంతమయ్యాయి. అయితే, మెడల్స్ సాధించిన ఆటగాళ్లలో చాలా మంది హర్యానాకు చెందిన వారే కావడం విశేషం. మొత్తంగా.. ఈ రాష్ట్రానికి చెందిన 9 మంది అథ్లెట్లు పతకాలు గెలవడం గమనార్హం. ముఖ్యంగా గత రెండు ఎడిషన్లలో పారాలింపిక్స్‌లో హర్యానా అథ్లెట్లు ఆరు మెడల్స్‌తో మెరవడం వారి ప్రతిభకు అద్దం పడుతోంది. మరి దేశ జనాభాలో కేవలం 2 శాతం గల ఈ చిన్నరాష్ట్రం భారత్‌కు క్రీడామణికాంతులను అందించే నర్సరీగా ఎలా మారింది? విశ్వ వేదికపై సత్తా చాటిన హర్యానా సక్సెస్ సీక్రెట్ ఏంటి? భారీ ఆర్థిక సాయం, నజరానాలు ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పతకం సాధించిన క్రీడాకారులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా హర్యానా భారీ నజరానాలు అందజేస్తుంది. ఒలింపిక్‌లో స్వర్ణం సాధిస్తే ఆరు కోట్లు, రజతానికి 4, కాంస్యానికి రెండున్నర కోట్ల రూపాయలు క్రీడాకారులకు ఇచ్చేది. అంతేకాదు తృటిలో పతకం కోల్పోయి నాలుగో స్థానంలో నిలిచిన వారికి కూడా 50 లక్షల ప్రోత్సాహకం అందించేది. 2018 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించింది. ఇక తాజా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రతీ ప్లేయర్‌కు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందించింది. ఈ తరహాలో క్రీడల కోసం భారీగా ఖర్చు చేయడం హర్యానాకు మాత్రమే సాధ్యమైంది. ఈ విషయం గురించి హాకీ ఇంటర్నేషనల్ మాజీ ప్లేయర్, ప్రస్తుత క్రీడా శాఖా మంత్రి సందీప్ సింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది ఆటగాళ్లు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. అలాంటి సందర్భాల్లో క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే ధైర్యం చేయాలంటే ఈమాత్రం ప్రోత్సాహకాలు ఉండాలి. వారి కుటుంబాలకు కూడా ఓ భరోసా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అందించే నజరానాల కంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం చాలా ఎక్కువ. విశ్వక్రీడల్లో పసిడి సాధిస్తే 75 లక్షలు, మిగతా ఒలింపియన్స్‌కు కేవలం లక్ష రూపాయల బహుమానం మాత్రమే ఉంటుంది. మూలాలే బలంగా.. సాధారణంగా చాలా రాష్ట్రాల్లో ఒలింపిక్స్ లేదంటే ఇతర ప్రధాన ఈవెంట్లలో పతకం సాధించిన తర్వాత క్రీడాకారులను ప్రభుత్వ ఉద్యోగాలు వరిస్తాయి. కానీ హర్యానాలో అందుకు భిన్నం. మెరికల్లాంటి ఆటగాళ్లను గుర్తించి.. ఆర్థిక భరోసా ఉండేలా ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన బాక్సర్ మనోజ్‌కుమార్ ఈ విషయం గురించి చెబుతూ.. ‘‘చాలా మంది చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చినవారే. ఆర్థిక తోడ్పాటు లేనివారే. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే భవిష్యత్తు బాగుంటుందని భావిస్తారు. అందుకే, క్రీడల్లో ప్రతిభ కనబరిచే వారికి ప్రభుత్వం ముందుగానే ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు చేపడుతోంది. కాబట్టి ఇక వారు ఎలాంటి ఆందోళన లేకుండా ఆటలపై దృష్టి సారించే వీలు కలుగుతుంది’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా పోలీస్ విభాగం సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటగాళ్లకు చోటు కల్పించేలా చర్యలు తీసుకున్న తొలి రాష్ట్రాల్లో హర్యానా ఉందనడంలో అతిశయోక్తి లేదు. మట్టిలోని మాణిక్యాలు.. ప్రతిభకు పదునుపెట్టి 2008 నాటి నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో హర్యానాకు చెందిన కనీసం ఒక రెజ్లర్ అయినా సరే కచ్చితంగా పతకం సాధించడం పరిపాటిగా మారింది. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో మొత్తం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది రెజ్లర్లు ప్రాతినిథ్యం వహించారు. అదే విధంగా.. కామన్వెల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏసియన్ గేమ్స్‌లోనూ ఇప్పటికే సత్తా చాటారు. మాజీ రెజ్లర్, ప్రస్తుతం కోచ్‌గా సేవలు అందిస్తున్న ఈశ్వర్ దహియా(2016 ఒలింపిక్ మెడలిస్ట్ సాక్షి మాలిక్ ఈయన శిక్షణలోనే రాటు దేలారు) ఈ విషయాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మట్టిలో మాణిక్యాలను గుర్తించి, సహజమైన ప్రతిభను వెలికితీయడం ఇక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా అనేక సదుపాయాలు కల్పిస్తోంది. అయితే, ఇంకాస్త మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే పతకాల పంట పండుతుంది. అయితే, కేవలం మెడల్స్ వస్తేనే మేం సంతృప్తి చెందం. సాధించాల్సింది ఇంకా ఉందనే విషయాన్ని ఎల్లపుడూ గుర్తుపెట్టుకుంటాం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించారు. విశ్వవేదికపై మెరిసిన హర్యానా ఆణిముత్యాలు టోక్యోలో హర్యానా ప్లేయర్లు అద్భుతమే చేశారు. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర లిఖించగా.. రెజ్లర్లు రవికుమార్ దహియా(రజతం), భజరంగ్ పునియా(కాంస్యం) మెడల్స్ సాధించారు. అంతేగాక ఒలింపిక్ చరిత్రలో తొలిసారిగా సెమీస్ చేరిన మహిళా హాకీ జట్టులోనూ కెప్టెన్ రాణీ రాంపాల్ సహా తొమ్మిది మంది ప్లేయర్లు ఉండటం విశేషం. పసిడి సాధించిన నీరజ్ చోప్రా తమ రాష్ట్రం గురించి మాట్లాడుతూ.. ‘‘హర్యానా ప్రజలు పోరాటయోధులు. క్రీడల్లో మా విజయానికి ఈ గుణమే కారణం. మేం దృఢంగా ఉంటాం. జాతీయంగా ఎప్పుడో మా ప్రతిభను నిరూపించుకున్నాం. ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జిస్తున్నాం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన షూటర్ మనీష్ నర్వాల్ కోచ్ రాకేశ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ఫరిదాబాద్ వంటి పలు పట్టణాల్లో అనేక షూటింగ్ రేంజ్‌లు ఉన్నాయి. షూటింగ్ పట్ల ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. బల్లాబ్‌ఘర్‌లో ఉన్న నా రేంజ్లోనూ దాదాపు 10 మంది అంతర్జాతీయంగా పోటీపడుతున్నారు. 30-35 మంది జాతీయంగా వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. మా వ్యవస్థ క్రీడలను ప్రోత్సహించే విధంగా ఉంది. విజయాలు సాధించడానికి మూలాలు బలంగా ఉండటమే కారణం’’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో హర్యానా 2008 బీజింగ్: ►రెండు కాంస్యాలు- బాక్సర్ విజేందర్‌సింగ్, రెజ్లర్ సుశీల్ కుమార్ 2012 లండన్: ►ఒక రజతం(రెజ్లర్ సుశీల్ కుమార్), రెండు కాంస్యాలు(రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్) 2016 రియో: ►ఒక కాంస్యం(రెజ్లర్ సాక్షి మాలిక్) 2020 టోక్యో: ►ఒక స్వర్ణం(నీరజ్ చోప్రా), ఒక రజతం(రెజ్లర్ రవికుమార్ దహియా), 2 కాంస్యాలు(రెజ్లర్ భజరంగ్ పునియా), పురుషుల హాకీ జట్టు సభ్యులు పారాలింపిక్స్‌లో పతకాలు 2016 రియో ►రజతం(షాట్‌పుట్టర్ దీపా మాలిక్) 2020 టోక్యో: ►2 స్వర్ణాలు(జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షూటర్ మనీష్ నర్వాల్), ఒక రజతం(షూటర్ సింగ్‌రాజ్ అధానా), 2 కాంస్యాలు(అధానా, ఆర్చర్ హర్వీందర్ సింగ్) - వెబ్‌డెస్క్ చదవండి: Virat Kohli: అరె ఏంట్రా ఇది.. ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట! -
Tokyo Paralympics 2021: ఘనంగా టోక్యో పారాలింపిక్స్ ముగింపు వేడుకలు
టోక్యో: జపాన్ రాజధాని టోక్యోలో వేదికగా జరిగిన పారాలింపిక్ క్రీడలు ముగిశాయి.12 రోజుల పాటు జరిగిన టోక్యో పారాలింపిక్స్ లో భారత్ అద్బుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 19 పతకాలు లభించాయి. వాటిలో 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా 19 పతకాలతో పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది. పారాలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి గోల్డెన్ షూటర్ అవని లేఖార ప్రాతినిధ్యం వహించింది.త్రివర్ణ పతాకం చేతబూనిన అవని లేఖర ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సాయంత్రం నిర్వహించిన ముగింపు ఉత్సవంలో బాణసంచా, రంగురంగుల విద్యుద్దీప కాంతులు, జపనీస్ కళాకారుల విన్యాసాలు, లేజర్ లైటింగ్ షో ముగింపు వేడుకల్లో ఆకట్టుకున్నాయి. చదవండి: Pramod Bhagath:ప్రమోద్ భగత్ నిజంగా 'బంగారం'... జీవితం అందరికి ఆదర్శం టోక్యో నుంచి తిరిగి వస్తున్న భారత బృందాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. దేశ క్రీడా చరిత్రలో టోక్యో ఒలింపిక్స్ ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ మనకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. భారత అథ్లెట్ల బృందంలోని ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని అభినందించారు. అథ్లెట్లు, కోచ్ లు, వారి కుటుంబసభ్యులకు అందరూ మద్దతివ్వాలని ప్రధాని పిలుపునిచ్చారు. చదవండి: పారాలింపిక్స్‌లో పతకం సాధించిన ఐఏఎస్ ఆఫీసర్.. Change begins with sports... First time a woman para athlete marches with the National Flag.. thank you @AvaniLekhara .. you so richly deserve this honor. You have in true sense won hearts of Indians. #Tokyoparalympics2020 #closingceremony Oh it's farewell time already. Sayonara pic.twitter.com/Zi6VaZdQRI — Deepa Malik (@DeepaAthlete) September 5, 2021 A historic performance by the Indian athletes helped India finish with 19 medals, including five gold!! Watch #AvaniLekhara participate as #TeamIndia's Flagbearer at the closing ceremony of the #TokyoParalympics VC: DD Sports pic.twitter.com/CZ7t0KcFXu — The Better India (@thebetterindia) September 5, 2021 -
Tokyo Paralympics: అవని అద్వితీయం
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత మహిళా టీనేజ్ షూటర్ అవనీ లేఖరా అద్భుతాన్ని ఆవిష్కరించింది గత సోమవారం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ –1 విభాగంలో స్వర్ణం సాధించిన 19 ఏళ్ల ఈ రాజస్తానీ షూటర్ శుక్రవారం 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఎస్‌హెచ్–1 ఈవెంట్లో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. మరోవైపు హర్వీందర్ సింగ్ కాంస్యం రూపంలో ఆర్చరీలో భారత్ తొలి పతకం నెగ్గగా... అథ్లెట్ ప్రవీణ్ కుమార్ హైజంప్‌లో రజతం సాధించాడు. దాంతో శుక్రవారం భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. బ్యాడ్మింటన్‌లో కనీసం రెండు పతకాలు ఖాయమయ్యాయి. ఓవరాల్‌గా భారత్ 2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో 37వ స్థానంలో ఉంది. టోక్యో: దివ్యాంగుల విశ్వ క్రీడల్లో శుక్రవారం భారత క్రీడాకారులు మెరిశారు. ఏకంగా మూడు పతకాలు గెలిచి మురిపించారు. మహిళల షూటింగ్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో 19 ఏళ్ల అవనీ లేఖరా కాంస్య పతకం నెగ్గింది. ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌కు చెందిన 19 ఏళ్ల అవని 445.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. 16 మంది పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో అవని 1176 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టోక్యో పారాలింపిక్స్‌లో అవనికిది రెండో పతకం. గత సోమవారం అవని 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్–1 విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రదర్శనతో పారాలింపిక్స్ చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని గుర్తింపు పొందింది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు నెగ్గిన రెండో భారతీయ ప్లేయర్ అవని. 1984 పారాలింపిక్స్‌లో జోగిందర్ సింగ్ మూడు పతకాలు గెలిచాడు. ఆయన షాట్‌పుట్‌లో రజతం, జావెలిన్ త్రోలో కాంస్యం, డిస్కస్ త్రోలో కాంస్యం సాధించాడు. ‘షూట్ ఆఫ్’లో సూపర్... టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్లు దీపిక కుమారి, అతాను దాస్ నిరాశపరిచినా... టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం హరీ్వందర్ సింగ్ అద్భుతం చేశాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. శుక్రవారం జరిగిన పురుషుల రికర్వ్ ఓపెన్ వ్యక్తిగత విభాగంలో హరియాణాకు చెందిన 31 ఏళ్ల హరీ్వందర్ కాంస్య పతకం గెలిచాడు. కాంస్యం గెలిచే క్రమంలో హరీ్వందర్ మూడు ‘షూట్ ఆఫ్’లను దాటడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో హర్వీందర్ ‘షూట్ ఆఫ్’లో 10–8తో నెగ్గాడు. అంతకుముందు ఇద్దరు 5–5తో సమఉజ్జీగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా... హర్వీందర్ 10 పాయింట్ల షాట్ కొట్టాడు. కిమ్ మిన్ సు 8 పాయింట్ల షాట్‌తో సరిపెట్టుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్లో హరీ్వందర్ సింగ్ ‘షూట్ ఆఫ్’లో 10–7తో స్టెఫానో ట్రావిసాని (ఇటలీ)పై... ప్రిక్వార్టర్ ఫైనల్లో ‘షూట్ ఆఫ్’లోనే 8–7తో బాటో టిసిడెన్డోర్జియెవ్ (రష్యా ఒలింపిక్ కమిటీ)పై గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో హరీ్వందర్ 6–2తో మైక్ జార్జెవ్స్కీ (జర్మనీ)పై నెగ్గాడు. అయితే సెమీఫైనల్లో హరీ్వందర్ 4–6తో కెవిన్ మాథెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం బరిలో నిలిచాడు. భారత్‌కే చెందిన మరో ఆర్చర్ వివేక్ చికారా ప్రిక్వార్టర్ ఫైనల్లో 3–7తో డేవిడ్ ఫిలిప్స్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. పొలంలో సాధన చేసి... హరియాణాలోని కైథాల్ జిల్లాలోని గుహ్లా చీకా గ్రామానికి చెందిన హరీ్వందర్ ప్రస్తుతం పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. అతనికి ఏడాదిన్నర వయసు ఉండగా డెంగ్యూ బారిన పడ్డాడు. ఆ సమయంలో స్థానిక డాక్టర్ ఒకరు హర్వీందర్‌కు ఇచి్చన ఇంజెక్షన్ విక టించింది. దాంతో హరీ్వందర్ కాళ్లలో సరైన కదలిక లేకుండా పోయింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ కారణంగా హరీ్వందర్ ప్రాక్టీస్‌కు దూరమై తన గ్రామంలో ఉండిపోవాల్సి వచి్చంది. ఈ దశలో హరీ్వందర్కు ఓ ఆలోచన తట్టింది. అప్పటికే పంటను కోయడంతో ఖాళీగా ఉన్న తమ పొలంలోనే ఆర్చరీ రేంజ్‌ను ఏర్పాటు చేసుకొని హర్వీందర్ రోజూ రెండుసార్లు సాధన చేశాడు. అతని సాధనకు పారాలింపిక్స్‌లో పతకం రూపంలో ఫలితం వచ్చింది. ప్రవీణ్... ఆసియా రికార్డు... రజతం... పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ టి64 కేటగిరీలో పాల్గొన్న 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించాడు. రెండేళ్ల క్రితమే ఈ ఆటలో అడుగుపెట్టిన ప్రవీణ్ 2.07 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ఆసియా రికార్డు సృష్టించడంతోపాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. బరిలోకి దిగిన తొలిసారే పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని ప్రవీణ్ అన్నాడు. జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ (బ్రిటన్–2.10 మీటర్లు) స్వర్ణం సాధించగా... లెపియాటో (పోలాండ్–2.04 మీటర్లు) కాంస్యం గెలిచాడు. మహిళల ఎఫ్–51 డిస్కస్ త్రో విభాగంలో భారత్‌కు చెందిన కశిష్ లాక్రా (12.66 మీటర్లు) ఆరో స్థానంలో, ఏక్తా (8.38 మీటర్లు) ఎనిమిదో స్థానంలో నిలిచారు. పురుషుల షాట్‌ఫుట్ ఎఫ్–56 విభాగం ఫైనల్లో భారత్‌కు చెందిన సోమన్ రాణా (13.81 మీటర్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు ఖాయం పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్–4 విభాగంలో భారత ప్లేయర్లు సుహాస్ యతిరాజ్, తరుణ్... ఎస్ఎల్–3 విభాగంలో ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. తద్వారా భారత్‌కు కనీసం రెండు పతకాలను ఖాయం చేశారు. -
'అవని' మరోసారి మెరిసింది.. షూటింగ్లో భారత్‌కు మరో పతకం
టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 50 మీటర్ల ఎయిర్ రైఫిల్(SH1) విభాగంలో కాంస్య పతకం సాధించి భారత పతకాల సంఖ్య 12కు చేర్చింది. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన అవని.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవని సాధించిన కాంస్య పతకంతో ఆమె మరో రికార్డును నెలకొల్పింది. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో జోగిందర్ సింగ్ బేడీ, మరియప్పన్ తంగవేళు, దేవేంద్ర ఝాజరియా తర్వాత ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన 4వ భారత అథ్లెట్‌గా రికార్డుల్లోకెక్కింది. చదవండి: ప్రవీణ్ కూమార్‌కు రజతం.. భారత్ ఖాతాలో 11 పతకాలు -
అవని ఆనందం ఆకాశమంత...
పదకొండేళ్ల వయసు... ఆడుతూ పాడుతూ అన్నింటా తానే అయి అవని కనిపించేది. చురుకుదనానికి చిరునామాలా ఉండే ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా చీకటి అలముకుంది. అయితే అనూహ్యంగా ఎదురైన కారు ప్రమాదం ఆమెను ఒక్కసారిగా అగాధంలోకి పడేసింది. జీవితం పట్ల ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించుకోని, ఎలా ముందుకు వెళ్లాలో తెలీని వయసు! లేడి పిల్లలా సాగే పరుగు ఆగిపోయి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి రావడం అవనికి తీవ్ర ఆవేదనను మిగిల్చింది. దాంతో సహజంగానే తన బాధను, అసహనాన్ని, ఆగ్రహాన్ని తల్లిదండ్రుల మీద చూపించేది. అలాంటి స్థితి నుంచి ఆమెను బయటకు తీసుకొచ్చిన ప్రయత్నం ఒక ఒలింపిక్ చాంపియన్‌ను తయారు చేసింది. రాజస్తాన్ రాజధాని జైపూర్ అవనీ లేఖరా స్వస్థలం. 2012లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూస విరిగిపోయింది. నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోవడంతో ఇక చేసేందుకు ఏమీ లేక వీల్‌చైర్‌లోనే ఆమె జీవితం కొత్తగా మొదలైంది. సుమారు మూడేళ్లపాటు అవని తీవ్ర క్షోభ అనుభవించింది. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు చదవడం మినహాయిస్తే మరో వ్యాపకం లేకపోయింది. ఒకరోజు ఆమెను ఈ జ్ఞాపకాల నుంచి కాస్త దూరంగా, బయటి ప్రపంచంలోకి అడుగు పెడితే బాగుంటుందని భావించిన తండ్రి ప్రవీణ్ సమీపంలోని షూటింగ్ రేంజ్‌కు తీసుకుపోయాడు. నగరంలోని జగత్‌పుర వద్ద ఉన్న షూటింగ్ రేంజ్ మొదటి సారే ఆమెను ఆకట్టుకుంది. అయితే అది సరదాగా మాత్రమే. పూర్తి స్థాయిలో ప్లేయర్ కావాలనే ఆలోచన రానేలేదు. ఇలాంటి స్థితిలో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ ‘ఎ షాట్ ఎట్ గ్లోరీ’ని చదివే అవకాశం కలిగింది. అంతే... ఆ విజయ ప్రస్థానం ఒక్కసారిగా అవనిలో స్ఫూర్తి నింపింది. దాంతో మెల్లగా షూటింగ్‌పై ఆసక్తిని పెంచుకుంది. కూతురిలో వచ్చిన మార్పును గమనించిన తండ్రి ఆమెకు సరైన దిశానిర్దేశం చేసేందుకు ఇదే తగిన సమయమని భావించాడు. అవని పూర్తి స్థాయిలో షూటింగ్ క్రీడపై దృష్టి పెట్టే అవకాశం కల్పించాడు. కోచింగ్ సౌకర్యం, ఎక్విప్మెంట్ అందించే విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవనికి థెరపీ చేయాల్సిన ఫిజియో కరోనా సమయంలో చాలా దూరం నుంచి రావాల్సి ఉండటంతో ఇబ్బంది లేకుండా ఆ బాధ్యతలు కూడా తల్లిదండ్రులే తీసుకున్నారు. ఈ ఆరేళ్ల శ్రమ ఇప్పుడు అవనిని ఒలింపిక్ విజయం శిఖరంపై నిలబెట్టింది. బింద్రా ప్రేరణగా ముందంజ వేసిన ఆ అమ్మాయి ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా తనకంటూ కొత్త చరిత్రను లిఖించుకుంది. వరుస విజయాలతో... ఒలింపిక్ పతకంతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్నా... గత నాలుగేళ్లుగా అవని నిలకడగా విజయాలు సాధిస్తూనే వచ్చింది. 2017లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం జరగ్గా, జూనియర్ స్థాయిలో ప్రపంచ రికార్డుతో సత్తా చాటింది. అదే ఏడాది బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్యంతో తొలిసారి అవని వెలుగులోకి వచ్చింది. తర్వాతి ప్రపంచకప్ (క్రొయేషియా)లో అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రజతం సాధించిన ఆమె... 2019లోనూ దానిని నిలబెట్టుకుంది. భారత మాజీ షూటర్ సుమా శిరూర్ ఈ ప్రస్థానంలో అవనికి కోచ్‌గా వ్యవహరించింది. గత రెండేళ్లుగా ఒలింపిక్స్ కోసమే ప్రత్యేక ప్రణాళికతో వీరు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అవని రాజస్తాన్ రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖలో అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హోదాలో విధులు నిర్వహిస్తోంది. మరోవైపు జైపూర్ యూనివర్సిటీ నుంచి ‘లా’ కూడా చదువుతోంది. నా సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను. ప్రపంచాన్ని గెలిచినట్లుగా అనిపిస్తోంది. నా పతకాన్ని భారతీయులందరికీ అంకితమిస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. గతం గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం లేదు. నేను వర్తమానంలోనే జీవించడాన్ని ఇష్టపడతాను. ఫైనల్లో బరిలోకి దిగినప్పుడు కూడా పతకం లక్ష్యంగా పెట్టుకోలేదు. ఒక్కో షాట్ సమయంలో ఆ ఒక్క షాట్ గురించి మాత్రమే ఆలోచించేదాన్ని. తొలిసారి రైఫిల్ పట్టుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఇక దాంతో పెనవేసుకుపోయిన నా అనుబంధం ఇక్కడి వరకు తీసుకొచ్చింది. –అవనీ లేఖరా -
Tokyo Paralympics : బుల్లెట్ దిగింది బల్లెం మెరిసింది
దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తళుక్కుమన్నారు. ఊహించని విధంగా ఒకేరోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్‌లో 4 పతకాలు నెగ్గడమే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే సోమవారం టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి ఓవరాల్‌గా ఏడు పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 26వ స్థానంలో కొనసాగుతోంది. మరో వారంరోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది. టోక్యో: ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో ఏ భారతీయ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను భారత టీనేజ్ షూటర్ అవనీ లేఖరా సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు (బ్యాడ్మింటన్)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్).. 2016 రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ (షాట్‌పుట్), 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్) రజత పతకాలు గెలిచారు. అయితే 19 ఏళ్ల అవని పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది. చెదరని గురి... ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. నిర్ణీత 10 షాట్ల తర్వాత అవని 103.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు షాట్లు ముగిశాక అవని 124.9 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది. అటునుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంటూ చివరకు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 248.9 పాయింట్లతో క్యూపింగ్ జాంగ్ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్నిక్ (ఉక్రెయిన్) కాంస్యం గెలిచారు. అవని గురి పెట్టిన మొత్తం 24 షాట్లలో 20 షాట్లు 10 కంటే ఎక్కువ పాయింట్లవి ఉండటం విశేషం. అంతకుముందు 21 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో అవని 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. సూపర్ సుమిత్... బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్‌లోనే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ కాంతులను విరజిమ్మాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్ బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను మూడు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. హరియాణాకు చెందిన సుమిత్ బల్లెంను తొలి ప్రయత్నంలో 66.95 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2019లో దుబాయ్‌లో 62.88 మీటర్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సుమిత్ సవరించాడు. అనంతరం రెండో ప్రయత్నంలో సుమిత్ జావెలిన్‌ను 68.08 మీటర్ల దూరం పంపించాడు. ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్ల దూరం... నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరం విసిరిన సుమిత్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 68.55 మీటర్ల దూరం విసిరి మూడోసారి ప్రపంచ రికార్డు సవరించడంతోపాటు పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్‌బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు. సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్‌కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు. -
అవని లేఖరాకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన షూటర్ అవని లేఖరాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా అరుదైన ఘనత సాధించి క్రీడా ప్రపంచంలో సరికొత్త రికార్డును సృష్టించారంటూ ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే రాణిస్తూ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా పారాలింపిక్స్‌లో సత్తా చాటుతున్న క్రీడాకారులందరికీ సీఎం జగన్ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలిపారు. టోక్యోలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారని కొనియాడారు. భారత్ ఖాతాలో ఇప్పటి వరకు 7 పతకాలు చేరాయని, మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీట్ చేశారు. చదవండి: వెన్నుపూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితం.. ఇప్పుడు ‘గోల్డెన్ గర్ల్’గా Congratulations @AvaniLekhara on becoming the first Indian woman to win a #Paralympics #Gold medal. With this record breaking performance you have created landmark for Indian sports and athletics. May you keep shining and bring more glory to the country. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2021 -
అవనికే తొలి ప్రత్యేక ఎస్యూవీ: ఆనంద్ మహీంద్ర ఆఫర్
సాక్షి,ముంబై: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖరాకు పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. భారత పారా ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మాలిక్ అభ్యర్థన మేరకు ప్రత్యేక ఎస్‌యూవీల తయారీకి మొగ్గు చూపిన ఆయన తాజాగా అవనికి బంపర్ ఆఫర్ ప్రకటించారు ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నవారికి తయారు చేయనున్న తమ తొలి ఎస్‌యూవీని ఆమెకే ఇస్తానని ప్రకటించారు. షూటింగ్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించి చరిత్ర సృష్టించిన అవనిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. చదవండి : Avani Lekhara: గోల్డెన్ గర్ల్ విజయంపై సర్వత్రా హర్షం పారా ఒలింపిక్స్ అవని సాధించిన ఘనతపై దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. మరోవైపు తనకు బంగారు పతకం లభించడంపై అవని సంతోషాన్ని ప్రకటించారు. ఈ అనుభూతిని వర్ణించ లేనిదని ప్రపంచం శిఖరానికి ఎదిగిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. కాగా తన లాంటి ప్రత్యేక సామర్థ్యం ఉన్న వారికోసం భారతదేశంలో ప్రత్యేక ఎస్‌యూవీలను తయారు చేయమని భారత ఆటోమొబైల్ పరిశ్రమను దీపా మాలిక్ అభ్యర్ణించారు. తనకు ఎస్యూవీ నడపడం అంటే చాలా ఇష్టమనీ, ఇలాంటి కార్లలో ప్రత్యేక సీట్లను ఏర్పాటు చేయాలని మహీంద్రా, టాటా మోటార్స్, ఎంజీ ఇండియా లాంటి భారతీయ ఆటోమొబైల్ దిగ్గజాలను కోరారు. ఎవరైనా ప్రత్యేక సీట్లతో కూడిన ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకువస్తే, తప్పనిసరిగా కొనుగోలు చేస్తానని ఆమె ప్రకటించారు.ఈ మేరకు ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. దీపా మాలిక్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఈ సవాలును స్వీకరించి వారికోసం ఎస్‌యూవీలను తయారీపై దృష్టి పెట్టాలని తన ఉద్యోగి వేలును కోరిన సంగతి తెలిసిందే. A week ago @DeepaAthlete suggested that we develop SUV’s for those with disabilities. Like the one she uses in Tokyo.I requested my colleague Velu, who heads Development to rise to that challenge. Well, Velu, I’d like to dedicate & gift the first one you make to #AvaniLekhara https://t.co/J6arVWxgSA — anand mahindra (@anandmahindra) August 30, 2021 Impressed with this technology.Sincerely hope Automobile world in India can give us this dignity and comfort.. I love to drive big SUVs but getting in and out is a challenge, Give me this seat n I buy your SUV @anandmahindra @TataCompanies @RNTata2000 @MGMotorIn #Tokyo2020 pic.twitter.com/0yFGwvl46V — Deepa Malik (@DeepaAthlete) August 20, 2021 -
స్వర్ణంతో చరిత్ర, ‘గోల్డెన్ గర్ల్’కు అభినందనల వెల్లువ
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్ అవని లేఖారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరడమే కాకుండా పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా 19 ఏళ్ల అవని రికార్డు నెలకొల్పడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. చదవండి : Avani Lekhara: ఆనంద్ మహీంద్ర స్పెషల్ ఆఫర్ ‘‘అద్భుతం..భారతీయ క్రీడలకు ఇది నిజంగా ప్రత్యే సందర్భం. షూటింగ్ పట్ల ఉన్న మక్కువ, నిబద్ధత, కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ’’ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అవనిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. సోమవారం టోక్యో పారా లింపిక్స్‌లో పతకాల వర్షం కురుస్తోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించిన అవని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అవని గోల్ట్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరడం విశేషం. చదవండి: Tokyo Paralympics: స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా అవని రికార్డు Congratulations @AvaniLekhara 👏 for wining #gold for #IND in #Paralympics #Praise4Para #Cheers4India #Hindustaniway @ananya_birla #AvaniLekhara — A.R.Rahman #99Songs 😷 (@arrahman) August 30, 2021 Phenomenal performance @AvaniLekhara! Congratulations on winning a hard-earned and well-deserved Gold, made possible due to your industrious nature and passion towards shooting. This is truly a special moment for Indian sports. Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) August 30, 2021 History!! History!! History!! Avani Lekhara became the first ever Indian woman to win a GOLD MEDAL 🏅 in #Paralympics She won Gold in the 10M Air Rifle event.#AvaniLekhara #Tokyo2020 #Avani #Gold #Teamindia https://t.co/8L0TDGni2y pic.twitter.com/hxfujeOl8j — Rishikesh Sharma (@kop_sports) August 30, 2021 #Paralympics#Praise4Para India's FIRST GOLDDDDD!!! 🇮🇳 @AvaniLekhara wins in Women's 10m AR Standing SH1 Final - she has shot 249.6 - a Paralympic record !! pic.twitter.com/etFEERYxbF — Aslam Gurukkal (@AslamGurukkal) August 30, 2021 -
Avani Lekhara: భారత 'అవని' పులకించింది..
AVANI LEKHARA Wins Gold Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో అవని 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఫైనల్లో అవని ఏకంగా 249.6 రికార్డు స్కోర్‌తో స్వర్ణాన్ని సాధించి భారతావనిని పులకింపజేసింది. అవని గోల్ట్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకం హోల్డ్‌లో పెట్టడంతో అధికారికంగా భారత పతకాల సంఖ్య ఆరుగా ఉంది. ఇదిలా ఉంటే, జైపుర్‌కి చెందిన 19 ఏళ్ల అవని లేఖారా.. పదేళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. నడుము కింద భాగం చచ్చుబడిపోవడంతో ఆమె నరకం అనుభవించింది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. ఈ బాధను తనలో తానే దిగమింగుకున్న అవని.. ఏదైనా రంగంలో పట్టు సాధించాలని అప్పుడే నిర్ణయించుకుంది. తండ్రి సూచన మేరకు ఆర్చరీ, షూటింగ్లలో శిక్షణ పొందింది. శిక్షణలో రైఫిల్‌ని తొలిసారి తాకినప్పుడే అవని ఈ రంగంలో ఎలాగైనా రాణించాలని డిసైడ్ చేసుకుంది. ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఎ షాట్ ఎట్ హిస్టరీ' పుస్తకం ఆమెలో స్పూర్తిని రగిల్చింది. అది చదివాక ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత రైఫిల్ కూడా లేక కోచ్ దగ్గర అరువు తెచ్చుకుని శిక్షణ ప్రారంభించిన అవని.. మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు పతకాలు సాధించింది. ఇక 2017లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ పోటీల్లో రజతాన్ని సాధించిన అవని అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. సరైన శిక్షణ, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేస్తూ.. పాల్గొన్న ప్రతి పోటీలో ఏదో ఒక పతకం సాధిస్తూ వచ్చింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను నెరవేర్చుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకధారులు: 1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్) 2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో) 3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్) 4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్) 5. దేవంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో) 6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో) 7. వినోద్ కూమార్- కాంస్య పతకం(హోల్డ్) (డిస్కస్ త్రో) చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్..