వనితదే చరిత | Inspired Story on Successful Indian womens | Sakshi
Sakshi News home page

వనితదే చరిత

Dec 29 2024 5:00 AM | Updated on Dec 29 2024 5:00 AM

Inspired Story on Successful  Indian womens

ఉమెన్‌ పవర్‌ 2024

చరిత్ర సృష్టించిన విజేతలు కాలం దారిలో వెలిగే దీపాలు అవుతారు. ఎంతోమందిని తమ బాటలో నడిపించే ఉత్తేజం అవుతారు. క్రీడల నుంచి సైన్యం వరకు వివిధ రంగాలలో 2024లో  ‘శభాష్‌’ అనిపించుకోవడమే కాదు చరిత్ర సృష్టించారు మహిళలు...

పవర్‌ఫుల్‌ బుల్లెట్‌
హరియాణ లోని ఝుజ్జర్‌ జిల్లాకు చెందిన మను బాకర్‌ చిన్న వయసులోనే వివిధ ఆటల్లో అద్భుత ప్రతిభాసామర్థ్యాలు చూపింది. షూటింగ్‌లోకి అడుగు పెట్టడానికి ముందు మార్షల్‌ ఆర్ట్స్, టెన్నిస్, బాక్సింగ్, స్కేటింగ్‌లాంటి వివిధ విభాగాలలో రాణించింది. ‘షూటింగ్‌’లో ఒలింపిక్‌ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్‌ చరిత్ర సృష్టించింది. ప్రఖ్యాత షూటర్‌ల వరుసలో చేరింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్‌ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి దేశం మొత్తం గర్వపడేలా చేసింది. మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మన దేశానికి మరో కాంస్య పతకాన్ని సాధించింది. స్వాతంత్య్రం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.

పట్టుదల ఉంటే ప్రతికూలతలు పారిపోతాయి
ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా సరే... దృఢ సంకల్పం, నిబద్ధత ఉంటే తిరుగులేని విజయాలు సాధించవచ్చని నిరూపించింది రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవని లేఖర. 2012లో రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. నిరాశ నిండిన ఆ చీకటిలో అవని విల్‌పవర్‌ కోల్పోయి ఉంటే విజయాలు సాధించి ఉండేది కాదు. స్తబ్దత నుంచి బయటపడడానికి తండ్రి సలహాతో క్రీడల వైపు వచ్చింది. పారిస్‌లో జరిగిన 2024 పారాలింపిక్‌ గేమ్స్‌లో 10 మీటర్‌ల ఎయిర్‌ రైఫిల్‌ ఎస్‌హెచ్‌–1 విభాగంలో స్వర్ణపతకం గెల్చుకొని మన దేశంలోని ప్రసిద్ధ పారాలింపియన్‌లలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తొలిసారి స్వర్ణం గెలుచుకున్న అవని రెండోస్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

స్ఫూర్తినిచ్చే తేజం
భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్‌ యుద్ధవిమానాన్ని నడిపిన తొలి మహిళా ఫైటర్‌పైలట్‌గా స్క్వాడ్రన్‌ లీడర్‌ మోహనా సింగ్‌ చరిత్ర సృష్టించింది. జోద్‌పూర్‌లో జరిగిన ‘తరంగ్‌ శక్తి’ సైనిక విన్యాసాల్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. సాయుధ దళాలలో జెండర్‌ బ్యారియర్స్‌ను విచ్ఛిన్నం చేసిన అద్భుతం అది.
రాజస్థాన్‌లోని ఝున్‌ఝున్‌లో సైనిక కుటుంబంలో పుట్టిన మోహనాసింగ్‌కు ఫైటర్‌ పైలట్‌ కావాలని కోరిక. భారత వైమానిక దళం ఫైటర్‌ పైలట్‌ ్రపోగ్రామ్‌(2016)లో అవనీచతుర్వేది, భావనా కాంత్‌తో కలిసి చేరిన మొదటి మహిళల్లో మోహన ఒకరు. ఐఏఎఫ్‌ హాక్‌ ఎంకే.132 అడ్వాన్స్‌డ్‌ జెట్‌ ట్రైనర్‌లలో పూర్తిస్థాయి ఆపరేషన్‌ స్టేటస్‌ సాధించిన తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా రికార్డ్‌ సృష్టించింది. ఎయిర్‌ టు ఎయిర్, ఎయిర్‌ టు గ్రౌండ్‌ కాంబాట్‌ మోడ్స్‌లోప్రావీణ్యం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement