
AVANI LEKHARA Wins Gold Medal: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. మహిళా షూటర్ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో అవని 2018లో ఉక్రెయిన్ క్రీడాకారిణి నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేసింది. ఫైనల్లో అవని ఏకంగా 249.6 రికార్డు స్కోర్‌తో స్వర్ణాన్ని సాధించి భారతావనిని పులకింపజేసింది. అవని గోల్ట్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకం హోల్డ్‌లో పెట్టడంతో అధికారికంగా భారత పతకాల సంఖ్య ఆరుగా ఉంది.
ఇదిలా ఉంటే, జైపుర్‌కి చెందిన 19 ఏళ్ల అవని లేఖారా.. పదేళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో తన వెన్ను పూస విరిగిపోవడంతో చక్రాల కుర్చీకే పరిమితమైంది. నడుము కింద భాగం చచ్చుబడిపోవడంతో ఆమె నరకం అనుభవించింది. మూడేళ్లపాటు ఎన్నో సర్జరీలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. బడిలో చేర్చుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రెండేళ్లు ఇంట్లోనే చదువుకుంది. ఈ బాధను తనలో తానే దిగమింగుకున్న అవని.. ఏదైనా రంగంలో పట్టు సాధించాలని అప్పుడే నిర్ణయించుకుంది. తండ్రి సూచన మేరకు ఆర్చరీ, షూటింగ్‌లలో శిక్షణ పొందింది. శిక్షణలో రైఫిల్‌ని తొలిసారి తాకినప్పుడే అవని ఈ రంగంలో ఎలాగైనా రాణించాలని డిసైడ్ చేసుకుంది.
ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఎ షాట్ ఎట్ హిస్టరీ' పుస్తకం ఆమెలో స్పూర్తిని రగిల్చింది. అది చదివాక ఎప్పటికైనా దేశానికి బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత రైఫిల్ కూడా లేక కోచ్ దగ్గర అరువు తెచ్చుకుని శిక్షణ ప్రారంభించిన అవని.. మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు పతకాలు సాధించింది. ఇక 2017లో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్ పోటీల్లో రజతాన్ని సాధించిన అవని అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. సరైన శిక్షణ, సదుపాయాలు, పరికరాలు లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేస్తూ.. పాల్గొన్న ప్రతి పోటీలో ఏదో ఒక పతకం సాధిస్తూ వచ్చింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి తన కలను నెరవేర్చుకుంది.
టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకధారులు:
1. అవని లేఖారా- గోల్డ్ మెడల్ (షూటింగ్)
2. యోగేశ్ కధూనియా- సిల్వర్ మెడల్(డిస్కస్ త్రో)
3. నిశాద్ కుమార్- సిల్వర్ మెడల్(హైజంప్)
4.భవీనాబెన్ పటేల్- సిల్వర్ మెడల్(టేబుల్ టెన్నిస్)
5. దేవంద్ర ఝజారియా- సిల్వర్ మెడల్(జావిలన్‌త్రో)
6. సుందర్ సింగ్- కాంస్య పతకం(జావిలన్‌త్రో)
7. వినోద్ కూమార్- కాంస్య పతకం(హోల్డ్) (డిస్కస్ త్రో)
చదవండి: Viral Video: పతకం గెలిచిన ఆనందంలో చిందేసిన భారత అథ్లెట్..
Comments
Please login to add a commentAdd a comment