‘పుస్తకం హస్తభూషణం’ అంటారు. అయితే అది అలంకారం మాత్రమే కాదు అంధకారాన్ని పారదోలే వజ్రాయుధం అనేది ఎంత నిజమో చెప్పడానికి అవని లేఖరా ఒక ఉదాహరణ. కారు ప్రమాదం తాలూకు జ్ఞాపకాల కారు చీకట్లో నిస్తేజంగా మారిన అవని జీవితంలో ఒక పుస్తకం వెలుగు నింపింది. విజేతను చేసింది. తాజాగా... పారిస్ పారాలింపిక్స్ షూటింగ్‌లో స్వర్ణం గెలుచుకొని మరోసారి సత్తా చాటింది అవని లేఖరా..
టోక్యోలో జరిగిన పది మీటర్‌ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్ హెచ్ 1 ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది అవని లేఖరా. చిన్నప్పటి నుంచే అవనికి ఆటలు అంటే ఇష్టం. తండ్రి సలహా మేరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేసేది. ఆ తరువాత తన ఆసక్తి షూటింగ్ వైపుకు మళ్లింది. జైపూర్(రాజస్థాన్)లోని కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న అవని అక్కడే షూటింగ్‌లో తొలిసారిగా బంగారు పతకాన్ని గెలుచుకుంది.
2012లో కారు ప్రమాదంలో వెన్నెముక గాయంతో పక్షవాతానికి గురైంది అవని. పక్షవాతం మాట ఎలా ఉన్నా మానసికంగా తాను బాగా బలహీనపడింది. ఆ సమయంలో స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఆత్మకథ అవనికి ఎంతో స్ఫూర్తి ఇచ్చింది, జీవితాన్ని ఉత్సవం చేసుకునే శక్తిని ఇచ్చింది. అలా 2015లో తనకు ఇష్టమైన షూటింగ్‌లోకి వచ్చింది. ఒక యజ్ఞంలా సాధన మొదలు పెట్టింది. ఒకే పారాలింపిక్స్ (టోక్యో)లో రెండు పతకాలు అందుకున్న భారతదేశ ఏకైక మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. గత మార్చిలో అవనికి పిత్తాశయ శస్త్ర చికిత్స జరిగింది. మరోవైపు తన ముందు పారిస్ పారాలింపిక్స్ కనిపిస్తున్నాయి. కొన్ని నెలల విరామం తరువాత మళ్లీ రైఫిల్ చేతిలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ తాలూకు శారీరక బాధ, మానసిక ఒత్తిడి తన నుంచి దూరమయ్యాయి. లక్ష్యం ఒక్కటే తన కళ్ల ముందు కనిపించింది,
టోక్యో ఒలింపిక్స్ విజేతగా అవనిపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం చిన్న విషయమేమీ కాదు. అయితే ఆమెకు ఒత్తిడి అనుకోని అతిథి ఏమీ కాదు. టోక్యో పారాలింపిక్స్ తన తొలి ఒలింపిక్స్. దీంతో ఎంతో ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఆ ఒత్తిడిని చిత్తు చేసి చరిత్ర సృష్టించింది.
తాజాగా పారిస్ పారాలింపిక్స్‌లోనూ విజయభేరీ మోగించింది.
ఒక క్రికెటర్ టోర్నీలో విఫలమైతే తనను తాను నిరూపించుకోవడానికి పట్టే సమయం తక్కువ. అదే ఒలింపియన్ విషయంలో మాత్రం నాలుగేళ్లు వేచిచూడాలి’ అభినవ్ బింద్రా ఆత్మకథలోని వాక్యాన్ని అవని ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. దీనివల్ల బంగారంలాంటి అవకాశాన్ని కోల్పోకుండా జాగ్రత పడుతుంది. ఆ జాగ్రత్తే ఈసారి కూడా బంగారు పతకాన్ని మెడలోకి తీసుకువచ్చింది. టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 పాయింట్లతో రికార్డ్ నెలకొల్పింది అవని. తాజాగా 249.7 పాయింట్‌లతో తన రికార్డ్‌ను తానే బ్రేక్ చేసుకోవడం మరో విశేషం.
Comments
Please login to add a commentAdd a comment