దివ్యాంగుల విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు తళుక్కుమన్నారు. ఊహించని విధంగా ఒకేరోజు ఐదు పతకాలతో అదరగొట్టారు. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉండటం విశేషం. 1984 న్యూయార్క్ పారాలింపిక్స్‌లో 4 పతకాలు... 2016 రియో పారాలింపిక్స్‌లో 4 పతకాలు నెగ్గడమే భారత్ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. అయితే సోమవారం టోక్యో వేదికగా భారత క్రీడాకారులు ఏకంగా ఐదు పతకాలు సాధించి ఓవరాల్‌గా ఏడు పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. ఆరో రోజు పోటీలు ముగిశాక భారత్ 26వ స్థానంలో కొనసాగుతోంది. మరో వారంరోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్‌కు మరిన్ని పతకాలు వచ్చే అవకాశముంది.
టోక్యో: ఒలింపిక్స్, పారాలింపిక్స్ క్రీడల చరిత్రలో ఏ భారతీయ మహిళా క్రీడాకారిణికి సాధ్యంకాని ఘనతను భారత టీనేజ్ షూటర్ అవనీ లేఖరా సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎస్‌హెచ్–1 కేటగిరీలో అవనీ లేఖరా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. తద్వారా విశ్వ క్రీడల్లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవని చరిత్ర సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు (బ్యాడ్మింటన్)... 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్).. 2016 రియో పారాలింపిక్స్‌లో దీపా మలిక్ (షాట్‌పుట్), 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భవీనాబెన్ పటేల్ (టేబుల్ టెన్నిస్) రజత పతకాలు గెలిచారు. అయితే 19 ఏళ్ల అవని పారాలింపిక్స్‌లో పాల్గొన్న తొలిసారే స్వర్ణ పతకం నెగ్గి చిరస్మరణీయ ప్రదర్శన నమోదు చేసింది.
చెదరని గురి...
ఎనిమిది మంది మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అవని మొత్తం 249.6 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018లో 249.6 పాయింట్లతో ఇరీనా షెట్‌నిక్ (ఉక్రెయిన్) నెలకొల్పిన ప్రపంచ రికార్డును అవని సమం చేసింది. నిర్ణీత 10 షాట్‌ల తర్వాత అవని 103.3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండు షాట్‌లు ముగిశాక అవని 124.9 పాయింట్లతో అగ్రస్థానంలోకి వచ్చింది. అటునుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. తన టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంటూ చివరకు స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 248.9 పాయింట్లతో క్యూపింగ్ జాంగ్ (చైనా) రజతం... 227.5 పాయింట్లతో ఇరీనా షెట్‌నిక్ (ఉక్రెయిన్) కాంస్యం గెలిచారు. అవని గురి పెట్టిన మొత్తం 24 షాట్‌లలో 20 షాట్‌లు 10 కంటే ఎక్కువ పాయింట్లవి ఉండటం విశేషం. అంతకుముందు 21 మంది షూటర్ల మధ్య జరిగిన క్వాలిఫయింగ్‌లో అవని 621.7 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు.
సూపర్ సుమిత్...
బరిలోకి దిగిన తొలి పారాలింపిక్స్‌లోనే జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణ కాంతులను విరజిమ్మాడు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–64 కేటగిరిలో పాల్గొన్న 23 ఏళ్ల సుమిత్ బల్లెంను 68.55 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ క్రమంలో అతను మూడు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. హరియాణాకు చెందిన సుమిత్ బల్లెంను తొలి ప్రయత్నంలో 66.95 మీటర్ల దూరం విసిరాడు. ఈ క్రమంలో 2019లో దుబాయ్‌లో 62.88 మీటర్లతో తానే సాధించిన ప్రపంచ రికార్డును సుమిత్ సవరించాడు. అనంతరం రెండో ప్రయత్నంలో సుమిత్ జావెలిన్‌ను 68.08 మీటర్ల దూరం పంపించాడు. ఈసారి ప్రపంచ రికార్డును సృష్టించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్ల దూరం... నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్ల దూరం విసిరిన సుమిత్ ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 68.55 మీటర్ల దూరం విసిరి మూడోసారి ప్రపంచ రికార్డు సవరించడంతోపాటు పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. మైకేల్ బురియన్ (ఆస్ట్రేలియా–66.29 మీటర్లు) రజతం... దులాన్ కొడితువాకు (శ్రీలంక–65.61 మీటర్లు) కాంస్యం సాధించారు. భారత్‌కే చెందిన సందీప్ చౌదరీ 62.20 మీటర్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నాలుగో భారత క్రీడాకారుడు సుమిత్. గతంలో మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్; 1972 హెడెల్‌బర్గ్–జర్మనీ), దేవేంద్ర ఝఝారియా (అథ్లెటిక్స్; 2004 ఏథెన్స్, 2016 రియో), మరియప్పన్ తంగవేలు (అథ్లెటిక్స్; 2016 రియో) పసిడి పతకాలు నెగ్గారు.
సుమిత్‌కు రూ. 6 కోట్లు నజరానా
పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తమ రాష్ట్ర జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్‌కు రూ. 6 కోట్లు... రజత పతకం గెలిచిన డిస్కస్ త్రోయర్ యోగేశ్‌కు రూ. 4 కోట్లు నగదు పురస్కారం అందిస్తామని హరియాణా ప్రభుత్వం తెలిపింది. అలాగే స్వర్ణం గెలిచిన తమ రాష్ట్రానికి చెందిన షూటర్ అవనికి రూ. 3 కోట్లు... జావెలిన్ త్రోలో రజతం నెగ్గిన దేవేంద్ర ఝఝారియాకు రూ. 2 కోట్లు... కాంస్య పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్‌కు రూ. ఒక కోటి అందజేస్తామని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ప్రకటించారు.
Tokyo Paralympics : బుల్లెట్ దిగింది బల్లెం మెరిసింది
Published Tue, Aug 31 2021 5:22 AM | Last Updated on Tue, Aug 31 2021 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment