వరుసగా రెండో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్ అవని లేఖరా
ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా గుర్తింపు
భారత్‌కు ఒకే రోజు 4 పతకాలు
పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారుల జోరు మొదలైంది. పోటీల రెండో రోజే మన ఖాతాలో నాలుగు పతకాలు చేరడం విశేషం. షూటింగ్‌లో అవని లేఖరా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ స్వర్ణ పతకంతో మెరిసింది. అదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్‌కు కాంస్య పతకం దక్కింది.
వీటితో పాటు పురుషుల షూటింగ్‌లో మనీశ్ నర్వాల్ రజతాన్ని గెలుచుకోగా ... స్ప్రింట్‌లో ప్రీతి పాల్ కూడా కాంస్య పతకాన్ని అందించింది. అయితే అన్నింటికి మించి గత టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణాన్ని నిలబెట్టుకున్న అవని లేఖరా ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది.
పారిస్: పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు ఒకే ఈవెంట్‌లో తొలిసారి రెండు పతకాలు దక్కాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో అవని లేఖరా స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. అవని 249.7 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచింది. జైపూర్‌కు చెందిన 22 ఏళ్ల అవని టోక్యోలో మూడేళ్ల క్రితం జరిగిన ఒలింపిక్స్‌లోనూ పసిడి పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో తాను నమోదు చేసిన 249.6 పాయింట్ల స్కోరును కూడా అవని సవరించింది.
ఈ ఈవెంట్‌లో దక్షిణ కొరియాకు చెందిన యున్రీ లీ (246.8 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలుచుకోగా... భారత్‌కే చెందిన మోనా అగర్వాల్ (228.7 పాయింట్లు) కాంస్య పతకం సాధించింది. నడుము కింది భాగంలో శరీరాంగాలు పూర్తి స్థాయిలో పని చేయకుండా ఉండే అథ్లెట్లను ఎస్‌హెచ్1 కేటగిరీలో పోటీ పడేందుకు పారాలింపిక్స్‌లో అనుమతిస్తారు. ‘బరిలోకి దిగినప్పుడు ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆటపై దృష్టి పెట్టడమే తప్ప ఇతర విషయాలను పట్టించుకోలేదు.
టాప్–3లో నిలిచిన ముగ్గురు షూటర్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువ. పసిడి పతకం రావడం చాలా సంతోషాన్నిచ్చిం ది. ఇక్కడ భారత జాతీయ గీతం వినిపించడం గొప్పగా అనిపిస్తోంది. మరో రెండు ఈవెంట్లలో కూడా పతకాలు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తా’ అని అవని లేఖరా చెప్పింది. అవని సహచర్యం వల్లే తాను ఆటలో ఎంతో నేర్చుకోగలిగానని, ఆమె వల్లే ఇక్కడా స్ఫూర్తి పొంది పతకం సాధించానని 37 ఏళ్ల మోనా అగర్వాల్ వెల్లడించింది. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కూడా అవని తలపడనుంది.
మనీశ్ నర్వాల్‌కు రజతం...
పురుషుల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 22 ఏళ్ల మనీశ్ నర్వాల్ కూడా పతకంతో మెరిశాడు. అయితే గత ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న మనీశ్ ఈసారి రజత పతకానికే పరిమితమయ్యాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో మనీశ్ రెండో స్థానంలో నిలిచాడు.
మనీశ్ మొత్తం 234.9 పాయింట్లు సాధించాడు. ఫైనల్లో ఒకదశలో మెరుగైన ప్రదర్శనతో అగ్రస్థానంలో కొనసాగిన ఈ షూటర్ ఆ తర్వాత వరుస వైఫల్యాలతో వెనుకబడిపోయాడు. ఈ పోరులో జెంగ్డూ జో (కొరియా; 237.4 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకోగా... చావో యాంగ్ (చైనా; 214.3)కు కాంస్యం లభించింది.
కంచు మోగించిన ప్రీతి పాల్...
పారాలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున ట్రాక్ ఈవెంట్‌లో ప్రీత్ పాల్ తొలి పతకాన్ని అందించింది. మహిళల 100 మీటర్ల టి–35 పరుగులో ప్రీతికి కాంస్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల ప్రీతి రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసింది. ఈ క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది.
1984 నుంచి పారాలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు అన్ని పతకాలు ఫీల్డ్ ఈవెంట్లలోనే వచ్చాయి. ఇటీవలే ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌లో కాంస్యం సాధించిన అనంతరం ప్రీతి ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఆమెకు ఇవే తొలి పారాలింపిక్స్.
సెమీస్‌లో సుహాస్, నితీశ్...
పారా బ్యాడ్మింటన్‌లో సుహాస్ యతిరాజ్, నితీశ్ కుమార్ సెమీఫైనల్లోకి ప్రవేశించగా... మనోజ్ సర్కార్, మానసి జోషి నిష్క్రమించారు. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత సుహాస్ (ఎస్‌ఎల్4 ఈవెంట్) 26–24, 21–14తో షియాన్ క్యూంగ్ (కొరియా)పై నెగ్గగా... నితీశ్ (ఎస్‌ఎల్3 ఈవెంట్) 21–5, 21–11తో యాంగ్ జియాన్‌యువాన్ (చైనా) ను చిత్తు చేశాడు.
2019 వరల్డ్ చాంపియన్ మానసి జోషి (ఎస్‌ఎల్3) 21–10, 15–21, 21–23తో ఒక్సానా కొజినా (ఉక్రెయిన్) చేతిలో... గత ఒలింపిక్స్ కాంస్యపతక విజేత మనోజ్ 19–21, 8–21తో బున్సున్ (థాయిలాండ్) చేతిలో ఓడారు. టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం భవీనా–సోనాలీబెన్ పటేల్ 5–11, 6–11, 11–9, 6–11 స్కోరుతో యంగ్ జుంగ్–సుంగ్యా మూన్ (కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.
ప్రిక్వార్టర్స్‌లో రాకేశ్
మరోవైపు ఆర్చరీలో పురుషుల కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో రాకేశ్ కుమార్ తొలి రౌండ్‌లో 136–131తో ఆలియా డ్రేమ్ (సెనెగల్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల సైక్లింగ్ పర్సూ్యట్ సీ2 కేటగిరీలో భారత ఆటగాడు అర్షద్ షేక్ తొమ్మిదో స్థానంలో నిలిచి ని్రష్కమించాడు.
Comments
Please login to add a commentAdd a comment