క్లబ్ త్రోలో స్వర్ణం
రజతం గెలిచిన ప్రణవ్ సూర్మా
జూడోలో భారత్‌కు కాంస్యం
పారాలింపిక్స్‌లో 25కు చేరిన పతకాల సంఖ్య
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు.
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్‌లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు.
ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్‌వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్‌లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం.
పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన ధరమ్‌వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్‌వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు.
తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్‌వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్‌లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్‌వీర్ ప్రకటించాడు.
క్లబ్ త్రో ఈవెంట్‌కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్‌వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
జూడోలో కపిల్‌కు కాంస్యం...
పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్‌లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు.
ఆర్చరీలో చేజారిన కాంస్యం...
భారత ఆర్చరీ మిక్స్‌డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్‌రింక్–ఫ్యాబ్‌సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు.
మరోవైపు షూటింగ్ మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్‌లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు.
హరియాణాలోని సోనేపట్ ధరమ్‌వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్‌లో కాంస్యం గెలిచిన ధరమ్‌వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు.
ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్‌లో ‘విజన్ ఇంపెయిర్‌మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment