Dharamveer Singh
-
ధరమ్వీర్ ధమాకా
భారత సీనియర్ పారాలింపియన్లలో అమిత్ కుమార్ సరోహా కూడా ఒకడు. పారా ఆసియా క్రీడల్లో డిస్కస్ త్రోలో రెండు రజతాలతో పాటు క్లబ్ త్రోలో రెండు స్వర్ణాలు సాధించిన రికార్డు అతని సొంతం. దీంతో పాటు క్లబ్ త్రోలో రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ రజతాలు కూడా అమిత్ ఖాతాలో ఉన్నాయి. ఈసారి ఒలింపిక్ పతక అంచనాలతో అతను బరిలోకి దిగాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక క్లబ్ త్రో ఈవెంట్ జరిగింది. అయితే 10 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో అమిత్ పేలవ ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచాడు. కానీ కొద్ది సేపటికే అతను ఆనందంగా, ఆత్మ సంతృప్తిగా ఆ పోటీల వేదిక నుంచి వెనుదిరిగాడు. ఎందుకంటే ఇందులో స్వర్ణ, రజతాలు సాధించిన అథ్లెట్లు ధరమ్వీర్, ప్రణవ్ సూర్మా అమిత్ శిష్యులు కావడం విశేషం. వారిద్దరు పాల్గొన్న ఈవెంట్లోనే తానూ పోటీ పడ్డాడు. తాను గెలవకపోతేనేమి... తన శిష్యులిద్దరూ గెలిచి గురుపూజోత్సవం రోజున గురుదక్షిణ అందించారని అమిత్ చెప్పడం విశేషం. పారిస్: పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. ‘క్లబ్ త్రో–ఎఫ్51’ ఈవెంట్లో భారత్‌కు చెందిన ధరమ్వీర్ పసిడి పతకం సాధించాడు. ఇదే ఈవెంట్లో మరో భారత అథ్లెట్ ప్రణవ్ సూర్మాకు రజతం దక్కింది. ‘క్లబ్’ను 34.92 మీటర్ల దూరం విసిరి ధరమ్వీర్ పసిడి పతకాన్ని గెలుచుకోగా... 34.59 మీటర్ల దూరంతో ప్రణవ్ సూర్మా రజతం సొంతం చేసుకున్నాడు. తొలి నాలుగు ప్రయత్నాలు ఫౌల్ అయినా ఐదో త్రోలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి చివరకు ధరమ్వీర్ అగ్ర స్థానంలో నిలవడం విశేషం. ఈవెంట్లో దిమిత్రిజెవిచ్ (సెర్బియా–34.18 మీటర్లు)కు కాంస్యం దక్కింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలవడం పట్ల చాలా గర్వంగా ఉందని, ఈ పతకాన్ని తన గురువు అమిత్‌కు అంకితం ఇస్తున్నట్లు ధరమ్వీర్ ప్రకటించాడు. క్లబ్ త్రో ఈవెంట్‌కు మన దేశంలో పెద్దగా ఆదరణ, గుర్తింపు లేని వేళ దానిని ముందుకు తీసుకెళ్లేందుకు అమిత్ శ్రమించాడు. ఈ క్రమంలో సీనియర్ ప్లేయర్ కమ్ కోచ్‌గా ఆయన తీర్చిదిద్దిన అథ్లెట్లలో ధరమ్వీర్, ప్రణవ్ ఉన్నారు. ‘క్వాడ్రిప్లెజిక్’ బాధితులు ఈ ఎఫ్51 కేటగిరీలో పాల్గొంటారు. ఈ సమస్య వల్ల మెడ కింది భాగం మొత్తం పని చేయకుండా పోతుంది. దాంతో చక్రాల కుర్చీలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జూడోలో కపిల్‌కు కాంస్యం... పురుషుల జూడో 60 కేజీల జే1 ఈవెంట్లో భారత ప్లేయర్ కపిల్ పర్మార్ కాంస్యం సాధించాడు. కాంస్య పతక మ్యాచ్‌లో కపిల్ 10–0తో ఒలీవిరా డి ఎలెల్టన్ (బ్రెజిల్)పై విజయం సాధించాడు. ఆర్చరీలో చేజారిన కాంస్యం... భారత ఆర్చరీ మిక్స్డ్ జోడీ హర్విందర్–పూజ జత్యాన్ కాంస్య పతకం నెగ్గడంలో విఫలమైంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో హర్విందర్ –పూజ 4–5తో స్లొవేనియాకు చెందిన జివా లావ్రింక్–ఫ్యాబ్‌సిక్ చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు షూటింగ్ మిక్స్డ్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో మోనా అగర్వాల్30వ స్థానంలో, సిద్ధార్థ బాబు 22వ స్థానంలో నిలిచి ఫైనల్ చేరలేకపోయారు. మహిళల 100 మీటర్ల టి12 ఈవెంట్ ఫైనల్లో భారత అథ్లెట్ సిమ్రన్ 12.11 సెకన్లలో రేసు పూర్తి చేసి నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల పవర్ లిఫ్టింగ్ 65 కేజీల విభాగంలో భారత ప్లేయర్ అశోక్ ఆరో స్థానంతో ముగించాడు. హరియాణాలోని సోనేపట్ ధరమ్వీర్ స్వస్థలం. సహచర కుర్రాళ్లతో కలిసి కాలువలోకి దూకి ఈత కొట్టే సమయంలో అతను లోతును సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో దిగువన ఉన్న రాళ్లను ఢీకొనడంతో శరీరానికి బాగా దెబ్బలు తగిలి పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. 25 ఏళ్ల వయసులో అతను పారా క్రీడల వైపు మళ్లాడు. రెండేళ్లు తిరిగే లోపే అతను రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించగలిగాడు. వరల్డ్ పారా చాంపియన్íÙప్లో కాంస్యం గెలిచిన ధరమ్వీర్ ఆసియా పారా క్రీడల్లో రెండు రజతాలు సాధించాడు. ప్రణవ్ సూర్మాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు విషాదం ఎదురైంది. అనుకోకుండా సిమెంట్ షీట్ అతనిపై పడటంతో వెన్ను పూసకు తీవ్ర గాయమైంది. ఆరు నెలలు ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతను భవిష్యత్తులో నడవలేడని డాక్టర్లు తేల్చేశారు. ఆ తర్వాత పూర్తిగా వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యాడు. కామర్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసిన అతను బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. మరోవైపు పారా క్రీడల వైపు ఆకర్షితుడై సాధన చేశాడు. ఈ ఒలింపిక్స్‌కు ముందు ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతను వరల్డ్ చాంపియన్íÙప్లో నాలుగో స్థానంలో నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కపిల్ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ కాగా ఐదుగురు సంతానంలో అతను ఒకడు. చిన్నప్పుడు తన అన్న జూడో పోటీల్లో పాల్గొనడం చూసి ఆకర్షితుడయ్యాడు. అయితే పొలంలో వాటర్ పంప్ వద్ద కరెంట్ షాక్‌కు గురై ఆరు నెలల పాటు అతను కోమాలో ఉండిపోయాడు. తర్వాత కోలుకున్నా చూపు చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆరి్థక సమస్యలతో అతను, సోదరుడు కలిసి టీ స్టాల్ కూడా నడిపారు. పారాలింపిక్స్‌లో ‘విజన్ ఇంపెయిర్మెంట్’ కేటగిరీలోనే అతను పోటీ పడ్డాడు. -
చనిపోయి వచ్చిన జవానుకు మళ్లీ అదే కోరిక
డెహ్రాడూన్: తనకు మరోసారి మాతృదేశానికి సేవలు అందించాలని ఉందని ధరమ్ వీర్ సింగ్ అన్నారు. గత పరిస్థితులు ఎలా ఉన్నా తనకు ఆర్మీలో చేరడమే ఇష్టమని ఆయన చెప్పారు. భారత సైన్యంలో పనిచేస్తున్న ధరమ్ 2009లో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో మూడేళ్ల తర్వాత అతడు చనిపోయినట్లు ఆర్మీ కూడా కుటుంబానికి ధ్రువపత్రం ఇచ్చి పెన్షన్ కూడా మంజూరు చేసింది. అయితే, అందరు అవాక్కయ్యేలా ధరమ్ వీర్ ఏడేళ్ల తర్వాత తిరిగి ప్రాణాలతో తన ఇళ్లు చేరాడు. ఈ సందర్భంగా ఆయనను మీడియా ప్రమాద వివరాల గురించి ప్రశ్నించగా 'అది 2009, నవంబర్ 27. సరిగ్గా రాత్రి 11.30గంటల ప్రాంతంలో చక్రతా రోడ్డులో ఉన్నాం. ఓ కారు ఢీ ప్రమాదం నుంచి తప్పించే క్రమంలో నేను నడుపుతున్న వాహనం తీవ్ర ప్రమాదానికి గురైంది. ఢీవైడర్ ను ఢీకొట్టింది. నేను తీవ్రంగా గాయపడ్డానని మాత్రం గుర్తుంది. ఆ తర్వాత నేను హరిద్వార్లోకి ఎలా వెళ్లానో తెలియదు. ఒక బైక్ ప్రమాదం ద్వారా మాత్రం తిరిగి నాకు జ్ఞాపకశక్తి వచ్చింది. ఇప్పుడు మరోసారి అవకాశం ఇస్తే భారత ఆర్మీలోకి వెళ్లి నా సేవలు అందించాలని అనుకుంటున్నాను' అని చెప్పాడు. -
‘మరణించిన’ జవాన్ ఇంటికొస్తే..!
న్యూఢిల్లీ: మన సినిమాలకు మించిన స్క్రిప్ట్ ఇది. ఏడేళ్ల క్రితం చనిపోయాడనుకున్న జవాన్ బతికొచ్చాడు. ఆర్మీ సైతం అతడు చనిపోయాడని మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీచేయగా, అతడు అర్ధరాత్రి అనూహ్యంగా ఇంటికొచ్చి తలుపుతట్టాడు. అతడి పేరు ధరమ్‌వీర్‌సింగ్. వయసు 39. డెహ్రాడూన్‌లోని 66వ రెజిమెంట్‌లో జవాన్. 2009లో విధి నిర్వహణ నిమిత్తం మరో ఇద్దరు తోటి జవాన్లతో కలసి ట్రక్కులో వెళ్తుండగా వాహనం బోల్తాకొట్టింది. అతడితో సహా ఎవరి జాడ తెలియలేదు. మూడేళ్లపాటు గాలింపు చేసిన ఆర్మీ.. వారు మరణించినట్లు ప్రకటించింది. అతడి కుటుంబానికి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. ఫించన్ మంజూరు చేసింది. డెహ్రాడూన్‌లో జరిగిన ప్రమాదంలో ధరమ్వీర్ మతిభ్రమించి అక్కడి కొండల్లో పిచ్చివాడిగా తిరిగాడు. అయితే ఇటీవల అతడిని ఒక బైక్ ఢీకొట్టింది. గట్టి దెబ్బలు తగిలినా అదృష్టవశాత్తు కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది. పాత విషయాలన్నీ సినిమా రీల్ తిప్పినట్లు గుర్తొచ్చాయి. బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి అతడిని ఆస్పత్రిలో చేర్చి రూ.500 ఇచ్చాడు. దీంతో ఢిల్లీకి టికెట్ తీసుకొని అక్కడి నుంచి అల్వార్ సమీపంలోని స్వగ్రామం భితెడాకు వచ్చాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపు తట్టగా, ధరమ్వీర్ తండ్రి తలుపు తీశాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఉద్వేగంతో కొడుకును అమాంతం కౌగిలించుకున్నాడు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. మా కుటుంబ సభ్యులందరినీ చూసిన ఆనందంలో మాటలురాలేదు’ అని ధరమ్వీర్ చెప్పాడు. -
చనిపోయిన జవాను ఏడేళ్ల తర్వాత తిరిగొస్తే..
న్యూఢిల్లీ: దేవుడి ఆటముందు మన ఆట ఎంత? అనే మాట సహజంగా అప్పుడప్పుడు వింటుంటాం. ఆయన ఇచ్చే ట్విస్టులు కూడా మాములుగా ఉండవని చెబుతుంటాం. ఓ ఆర్మీ జవాను జీవింతంలో జరిగిన ఈ విషయం చూస్తే మాత్రం నిజంగానే దేవుడు గొప్ప స్క్రిప్ట్ రైటరేమో అనిపిస్తుంది కూడా. ఊహించని ట్విస్టులతో సినిమాలు తీసే డైరెక్టర్లు కూడా ఈ విషయం వింటే సినిమా కథగా పెట్టుకొని హిట్ కొట్టడం ఖాయం. చనిపోయాడని అనుకున్న ఓ ఆర్మీ జవాను తిరిగి బతికొచ్చాడు. భారత ఆర్మీ సైతం అతడి చనిపోయాడని ప్రకటించగా ఏడేళ్ల తర్వాత అబ్బురపడేలా అతడు సురక్షితంగా వచ్చి తన ఇంటి తలుపుకొట్టాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. అతడి పేరు ధరమ్ వీర్ సింగ్. డెహ్రాడూన్‌లోని 66వ సాయుధ రెజిమెంట్ దళంలో డ్రైవింగ్ జవానుగా పనిచేసేవాడు. 2009లో తన తోటి జవాన్లతో కలిసి ట్రక్కులో వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఆ వాహనం కొండల్లో నుంచి పడిపోయింది. అతడితో సహా ఏ ఒక్కరి జాడ తెలియలేదు. ఆఖరికి వారి మృతదేహాలు కూడా లభ్యం కాలేదు. అలా మూడేళ్లు వెతికిన తర్వాత వారంతా చనిపోయినట్లు ఆర్మీ ప్రకటించింది. అయితే, ఆ ప్రమాదానికి గురైన ధరమ్ వీర్.. గాయాలపాలయ్యాడు. ఆ ప్రమాదం కారణంగా మతిభ్రమించింది. దీంతో డెహ్రాడూన్ కొండల్లోనే చుట్టుపక్కల పిచ్చివాడిలా తిరిగాడు. అయితే, ఈ మధ్యే అతడిని ఓ బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో అదృష్టవశాత్తు పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది. ఆ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అతడికి రూ.500 ఇవ్వడంతో వాటిని తీసుకొని తొలుత ఢిల్లీ వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి అల్వార్‌కు సమీపంలోని బిటెడా అనే గ్రామానికి చేరుకున్నాడు. రాత్రి పూట ఇంటికెళ్లి తలుపుకొట్టగా తండ్రి వచ్చి తీశాడు. అలా చనిపోయాడనుకున్న తన కుమారుడు తిరిగి కనిపించడంతో అతడు ఓ క్షణంపాటు ఖిన్నుడయ్యాడు. వెంటనే తేరుకుని ఆనందభాష్పాలతో అతడిని హత్తుకున్నాడు. ఇంట్లో మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కుమార్తెలను గుర్తుపట్టేందుకు ధర్మేందర్ చాలా కష్టపడ్డాడు. సోదరులు, బంధువులు అతడి రాకపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వైద్య చికిత్సల కోసం ప్రస్తుతం అతడిని జైపూర్ తీసుకెళ్లారు.