‘మరణించిన’ జవాన్ ఇంటికొస్తే..!
న్యూఢిల్లీ: మన సినిమాలకు మించిన స్క్రిప్ట్ ఇది. ఏడేళ్ల క్రితం చనిపోయాడనుకున్న జవాన్ బతికొచ్చాడు. ఆర్మీ సైతం అతడు చనిపోయాడని మరణ ధ్రువీకరణ పత్రం కూడా జారీచేయగా, అతడు అర్ధరాత్రి అనూహ్యంగా ఇంటికొచ్చి తలుపుతట్టాడు. అతడి పేరు ధరమ్‌వీర్‌సింగ్. వయసు 39. డెహ్రాడూన్‌లోని 66వ రెజిమెంట్‌లో జవాన్. 2009లో విధి నిర్వహణ నిమిత్తం మరో ఇద్దరు తోటి జవాన్లతో కలసి ట్రక్కులో వెళ్తుండగా వాహనం బోల్తాకొట్టింది. అతడితో సహా ఎవరి జాడ తెలియలేదు.
మూడేళ్లపాటు గాలింపు చేసిన ఆర్మీ.. వారు మరణించినట్లు ప్రకటించింది. అతడి కుటుంబానికి మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. ఫించన్ మంజూరు చేసింది. డెహ్రాడూన్‌లో జరిగిన ప్రమాదంలో ధరమ్‌వీర్ మతిభ్రమించి అక్కడి కొండల్లో పిచ్చివాడిగా తిరిగాడు. అయితే ఇటీవల అతడిని ఒక బైక్ ఢీకొట్టింది. గట్టి దెబ్బలు తగిలినా అదృష్టవశాత్తు కోల్పోయిన జ్ఞాపకశక్తి తిరిగొచ్చింది. పాత విషయాలన్నీ సినిమా రీల్ తిప్పినట్లు గుర్తొచ్చాయి. బైక్‌తో ఢీకొట్టిన వ్యక్తి అతడిని ఆస్పత్రిలో చేర్చి రూ.500 ఇచ్చాడు.
దీంతో ఢిల్లీకి టికెట్ తీసుకొని అక్కడి నుంచి అల్వార్ సమీపంలోని స్వగ్రామం భితెడాకు వచ్చాడు. అర్ధరాత్రి ఇంటికెళ్లి తలుపు తట్టగా, ధరమ్‌వీర్ తండ్రి తలుపు తీశాడు. చనిపోయాడనుకున్న కొడుకు కళ్ల ముందు ప్రత్యక్షమవడంతో నిశ్చేష్టుడయ్యాడు. ఉద్వేగంతో కొడుకును అమాంతం కౌగిలించుకున్నాడు. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ‘ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను. మా కుటుంబ సభ్యులందరినీ చూసిన ఆనందంలో మాటలురాలేదు’ అని ధరమ్‌వీర్ చెప్పాడు.