హైజంప్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్
భారత్ ఖాతాలో ఆరో స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్ క్రీడలు
టోక్యోలో జరిగిన గత పారాలింపిక్స్ క్రీడల్లో భారత ఆటగాళ్లు ఐదు స్వర్ణాలు సాధించారు. ఇప్పుడు దానిని మన బృందం అధిగమించింది. 21 ఏళ్ల భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ దేశానికి ఆరో పసిడి పతకాన్ని అందించాడు. హైజంప్‌లో అతను ఈ మెడల్‌ను గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన పోటీల్లో భారత్‌కు స్వర్ణానందం దక్కగా.. ఇతర ఈవెంట్లలో మాత్రం నిరాశాజనక ఫలితాలు ఎదురయ్యాయి.
పారిస్: మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో రజతపతకంతో సత్తా చాటిన భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ ఈ సారి మరింత బలంగా పైకి లేచాడు. తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంటూ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ – టి64 ఈవెంట్‌లో ప్రవీణ్‌కు స్వర్ణపతకం దక్కింది. 2.08 మీటర్ల ఎత్తుకు ఎగిరి ఆసియా రికార్డుతో అతను పసిడిని గెలుచుకున్నాడు.
అమెరికాకు చెందిన డెరెక్ లాసిడెంట్ (2.06 మీ.) రజతం గెలుచుకోగా, తెమూర్‌బెక్ గియాజోవ్ (ఉజ్బెకిస్తాన్ – 2.03 మీ.)కు కాంస్యం దక్కింది. ముందుగా 1.89 మీటర్ల ఎత్తుతో మొదలు పెట్టిన ప్రవీణ్ తన ఏడో ప్రయత్నంలో అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు. పారిస్ పారాలింపిక్స్‌లో శరద్ కుమార్, మరియప్పన్ తంగవేలు తర్వాత భారత్ తరఫున హైజంప్‌లో పతకం సాధించిన మూడో అథ్లెట్‌గా ప్రవీణ్ నిలిచాడు.
కస్తూరికి ఎనిమిదో స్థానం...
మహిళల పవర్‌లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో భారత ప్లేయర్ కస్తూరి రాజమణికి నిరాశ ఎదురైంది. మూడు ప్రయత్నాల్లో రెండు ఫౌల్స్ కాగా, అత్యుత్తమంగా 106 కిలోల బరువు మాత్రమే ఎత్తిన కస్తూరి ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల కనోయింగ్ ‘వా’ సింగిల్ 200 మీ. హీట్స్‌లో రాణించిన ప్రాచీ యాదవ్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
కనోయింగ్ ‘కయాక్’ సింగిల్ 200 మీ. కూడా భారత ప్లేయర్ పూజ ఓఝా సెమీస్‌కు చేరింది. పురుషుల ‘కయాక్’ సింగిల్ 200 మీ.లో యష్ కుమార్ కూడా సెమీ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. పురుషుల జావెలిన్ త్రో – ఎఫ్ 54 కేటగిరీలో భారత అథ్లెట్ దీపేశ్ కుమార్ అందరికంటే చివరగా ఏడో స్థానంతో ముగించాడు. అతను జావెలిన్‌ను 26.11 మీటర్ల దూరం విసిరాడు.
పురుషుల 400 మీ. – టి47 ఈవెంట్ తొలి రౌండ్ హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి దిలీప్ గవిట్ ముందంజ వేశాడు. మహిళల 200 మీ.–టి12 పరుగు సెమీ ఫైనల్లో రాణించిన సిమ్రన్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల జావెలిన్ త్రో –ఎఫ్ 46లో భావనాబెన్ చౌదరి 39.70 మీటర్లు జావెలిన్‌ను విసిరి ఐదో స్థానంలో నిలిచింది.
బరిలోకి దిగితే పతకం ఖాయమే!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ పుట్టుకతోనే వికలాంగుడు. అతని ఎడమ కాలు పూర్తిగా ఎదగకుండా చిన్నగా ఉండిపోయింది. చిన్నతనంలో కొందరు హేళన చేయడం అతడిని తీవ్రంగా బాధపెట్టేది. దీనిని మర్చిపోయేందుకు అతను ఆటలపై దృష్టి పెట్టాడు. వైకల్యం ఉన్నా సరే దానిని పట్టించుకోకుండా మిత్రులతో కలిసి వాలీబాల్ ఆడేవాడు.
అయితే అనూహ్యంగా ఒక సారి సాధారణ అథ్లెట్లు పాల్గొనే హైజంప్‌లో అతనికీ అవకాశం దక్కింది. దాంతో అథ్లెటిక్స్‌తో తనకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌కు అర్థమైంది. సత్యపాల్ సింగ్ అనే పారా అథ్లెటిక్స్ కోచ్ అతనిలో ప్రతిభను గుర్తించి హైజంప్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేశాడు. అన్ని రకాలుగా ప్రవీణ్‌ను తీర్చిదిద్దాడు.
అనంతరం పారా క్రీడల్లో పాల్గొంటూ అతను వరుస విజయాలు సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో రజతం, ఇప్పుడు స్వర్ణంలతో పాటు ప్రవీణ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్íÙప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం కూడా గెలిచాడు. పారిస్ క్రీడలకు ముందు గజ్జల్లో గాయంతో బాధపడిన అతను సరైన సమయానికి కోలుకొని సత్తా చాటాడు.
Comments
Please login to add a commentAdd a comment