
2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత
16 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా ఈవెంట్ బరిలోకి
ఆక్లాండ్: మరో అవకాశం కోసం వేచి చూడకుండా... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని... న్యూజిలాండ్ పురుషుల ఫుట్‌బాల్ జట్టు దర్జాగా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్‌కుఅర్హత సాధించింది.
పది దేశాలు పోటీపడ్డ ఓసియానియా జోన్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీ (FIFA 2026 World Cup)కి అర్హత పొందిన తొలి జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. సోమవారం జరిగిన ఓసియానియా జోన్ ఫైనల్లో న్యూజిలాండ్ 3–0 గోల్స్ తేడాతో న్యూ కాలడోనియా జట్టుపై గెలిచింది.
న్యూజిలాండ్ తరఫున మైకేల్ జోసెఫ్ బాక్సల్ (61వ నిమిషంలో), బార్సరూసెస్ (66వ నిమిషంలో), హెన్రీ జస్ట్ (80వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఫైనల్లో ఓడిపోయిన న్యూ కాలడోనియా జట్టుకు ప్రపంచకప్ బెర్త్ దక్కించుకునే మరో అవకాశం మిగిలి ఉంది.
ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, మధ్య, దక్షిణా అమెరికా జోన్‌లకు చెందిన ఆరు జట్లు పోటీపడే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ టోర్నీలో విజేతగా నిలిస్తే న్యూ కాలడోనియా జట్టు కూడా ప్రపంచకప్‌కు అర్హత పొందుతుంది.
2026లో ప్రపంచకప్ టోర్నీకి అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత పొందగా... జపాన్, న్యూజిలాండ్ ఈ మూడు జట్లతో చేరాయి.
వందేళ్ల చరిత్ర కలిగిన ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ పోటీపడనుండటం ఇది మూడోసారి. తొలిసారి 1982లో వరల్డ్‌కప్‌లో ఆడిన న్యూజిలాండ్ రెండోసారి 2010 ప్రపంచకప్‌లో పోటీపడింది. ఆ తర్వాత 2014, 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు న్యూజిలాండ్ అర్హత సాధించడంలో విఫలమైంది.
సెమీస్‌లో పోర్చుగల్
లిస్బన్: నేషన్స్ లీగ్ టోర్నమెంట్‌లో పోర్చుగల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్‌తో జరిగిన రెండో అంచె క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 5–2 గోల్స్ తేడాతో గెలిచింది. తొలి అంచె క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ చేతిలో ఒక గోల్ తేడాతో ఓడిన పోర్చుగల్ ఈ మ్యాచ్‌లో స్పష్టమైన విజయాన్ని అందుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి పోర్చుగల్ 3–2తో గెలిచింది. అయితే గోల్స్ సగటు 3–3తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు అదనపు సమయం ఆడించారు. అదనపు సమయంలో పోర్చుగల్ మరో రెండు గోల్స్ సాధించింది.