స్మగ్లింగ్‌.. కోడి గుడ్డేం కాదు! | US customs seizing more eggs than drugs at Canada border | Sakshi
Sakshi News home page

స్మగ్లింగ్‌.. కోడి గుడ్డేం కాదు!

Published Sun, Mar 9 2025 5:39 AM | Last Updated on Sun, Mar 9 2025 5:39 AM

US customs seizing more eggs than drugs at Canada border

కెనడా, మెక్సికో నుంచి అమెరికాకు కాసులు కురిపిస్తున్న గుడ్ల కొరత 

డ్రగ్స్‌ను మించి సాగుతున్న దందా

కెనడా, మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా తరలిస్తూ సరిహద్దుల్లో భారీగా పట్టుబడుతున్న ఉత్పత్తుల సంఖ్య కొద్ది నెలలుగా భారీగా పెరిగిపోయింది. అయితే అవేమిటో తెలుసా? ఎప్పట్లా ఫెంటానిలో, ఇతరేతర డ్రగ్సో కాదు. పౌల్ట్రీ ఉత్పత్తులు! ఆశ్చర్యంగా ఉన్నా నిజమిది. పైగా వాటిలోనూ సింహ భాగం గుడ్లే కావడం విశేషం!! నానాకష్టాలూ పడి డ్రగ్స్‌ను దేశం దాటించేకంటే స్మగ్లింగ్‌ నెట్‌వర్కులకు ఇదే మాంచి లాభసాటి బేరంగా కన్పిస్తోందట. అమెరికాను అతలాకుతలం చేస్తున్న గుడ్ల కొరత తీవ్రతకు ఈ ఉదంతం అద్దం పడుతోంది. 

కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి ఫెంటానిల్‌ తదితర డ్రగ్స్‌ విచ్చలవిడిగా స్మగ్లింగ్‌ అవుతుండటం పరిపాటి. అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇది డొనాల్డ్‌ ట్రంప్‌కు పెద్ద ప్రచారాస్త్రంగా మారింది కూడా. కెనడాపై టారిఫ్‌ల యుద్ధానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కూడా ఫెంటానిల్‌ నిలిచింది. కానీ కొద్ది నెలలుగా కెనడా నుంచి గుడ్లు తదితర పౌల్ట్రీ ఉత్పత్తుల స్మగ్లింగ్‌ డ్రగ్స్‌ను కూడా మించిపోయిందంటూ అమెరికా అధికారులే ముక్కున వేలేసుకుంటున్నారు. గుడ్లే అమెరికన్లకు ప్రధానమైన బ్రేక్‌ఫాస్ట్‌. ఉదయాన్నే ఆమ్లెట్లుగానో, మరో రూపంలో గుడ్లు తిన్నాకే వారికి రోజు మొదలవుతుంది. వారి బ్రేక్‌ఫాస్ట్‌ అవసరాలు కాస్తా బ్లాక్‌మార్కెటర్లకు కాసుల పంటగా మారుతుండటం విశేషం!

డ్రగ్స్‌ కంటే 10 రెట్లు! 
2024 అక్టోబర్‌తో పోలిస్తే ప్రస్తుతం కెనడా నుంచి డెట్రాయిట్‌ గుండా అమెరికాలోకి అక్రమంగా గుడ్లు తరలిస్తున్న వారి సంఖ్య 36 శాతం పెరిగినట్టు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెక్సికో సరిహద్దులకు అతి సమీపంలో ఉండే శాన్‌డీగో వద్ద ఈ ఉదంతాలు ఏకంగా 158 శాతం పెరిగిపోవడం విశేషం. 2024 అక్టోబర్‌ నుంచి అమెరికా సరిహద్దులను దాటించే ప్రయత్నంలో పౌల్ట్రీ ఉత్పత్తులు పట్టుబడ్డ ఉదంతాలు 3,768కి పైగా నమోదయ్యాయి. ఇదే సమయంలో ఫెంటానిల్‌ పట్టుబడ్డ ఉదంతాలు కేవలం 352 మాత్రమే కావడం విశేషం.  

పెరుగుతున్న ఫ్లూ రిస్క్! 
బర్డ్‌ ఫ్లూ దెబ్బకు కొన్నేళ్లుగా ఉత్తర అమెరికా ఖండమంతా అతలాకుతలమవుతోంది. కెనడాలో దీని తీవ్రత తక్కువగా ఉన్నా అమెరికా బాగా ప్రభావితమైంది. అక్కడ రెండు మూడేళ్లుగా కోట్లాది కోళ్లను హతమార్చాల్సి వచ్చింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా తీవ్ర గుడ్ల కొరతకు దారితీసింది. దాంతో గుడ్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. డజనుకు 5 డాలర్ల మార్కును దాటేసి ఆల్‌టైం రికార్డు సృష్టించాయి. షికాగో, శాన్‌ఫ్రాన్సిస్కో వంటి పలు ప్రధాన నగరాల్లోనైతే డజను గుడ్లు ఏకంగా 9 నుంచి 10 డాలర్ల దాకా పలుకుతున్న పరిస్థితి! గుడ్ల సంక్షోభం చేయి దాటిపోయిందని స్వయానా అధ్యక్షుడు ట్రంపే అంగీకరించారు! ఈ ఏడాది చివరకల్లా గుడ్ల ధరలు కనీసం మరో 50 శాతం దాకా పెరగవచ్చని అంచనా. దాంతో కొద్ది నెలలుగా స్మగ్లర్ల కన్ను గుడ్లపై పడింది. కెనడా నుంచి అమెరికాలోకి వాటి అక్రమ రవాణా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అయితే దీనివల్ల బర్డ్‌ ఫ్లూతో పాటు ఇతరత్రా రోగాల రిస్కు పెరిగిపోతోందని అమెరికా ఆందోళన చెందుతోంది. కోళ్లు, గుడ్ల స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపేందుకు కెనడా, మెక్సికో సరిహద్దుల వద్ద నిఘాను మరింత కఠినతరం చేయాలంటూ ట్రంప్‌ సర్కారు తాజాగా ఆదేశాలు జారీచేసింది!

అమెరికాలో అద్దెకు కోళ్లు 
గుడ్ల సంక్షోభం పుణ్యమా అని అమెరికాలో ఇప్పుడు కోడి పెట్టలను అద్దెకిచ్చే సరికొత్త వ్యాపారం పుట్టుకొచి్చంది. అది ఇప్పుడక్కడ యమా జోరుగా సాగుతుండటం విశేషం. డజను గుడ్లకు 5 నుంచి 10 డాలర్ల దాకా పెట్టాల్సి రావడం అమెరికన్లను కలవరపరుస్తోంది. దీనికి బదులు ఇంటి పెరళ్లలో కోడిపెట్టలను సాకేందుకు వాళ్లు మొగ్గుచూపుతున్నారు. దాంతో దేశవ్యాప్తంగా కోడిపెట్టలకు చెప్పలేనంత డిమాండ్‌ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు రెంట్‌ ద చికెన్‌ వంటి పేర్లతో ఏకంగా కంపెనీలే పుట్టుకొచ్చాయి. ఆర్నెల్ల ప్రాతిపదికన కోడిపెట్టలను అద్దెకిస్తున్నాయి. కనీస అద్దె ప్యాకేజీలు 300 డాలర్ల నుంచి మొదలవుతున్నాయి. 

ఇందులో భాగంగా రెండు పెట్టలతో పాటు వాటికి ఆర్నెల్ల పాటు కావాల్సిన దాణాను కూడా కంపెనీలే ఇస్తాయి. కోళ్ల గూడు కూడా సమకూరుస్తాయి. ఆరోగ్యకరమైన పెట్ట వారానికి ఐదారు దాకా గుడ్లు పెడుతుంది. ఆ లెక్కన రెండు కోళ్లు ఆర్నెల్లకు కనీసం 250 గుడ్లు పెడతాయన్నమాట. వాటిని మార్కెట్లో కొనాలంటే ప్రస్తుత రేట్లను బట్టి కనీసం 80 నుంచి 160 డాలర్లకు పైనే పెట్టాల్సి ఉంటుంది. కోళ్లను సాకడం ద్వారా ఏ రోజుకు ఆ రోజు తాజా గుడ్లు దొరుకుతుండటం అమెరికన్లను బాగా ఆకర్షిస్తోంది. అంతేగాక గుడ్లను పొదిగించి కోళ్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. కాంట్రాక్టు ముగిశాక అవి వారికే సొంతమవుతున్నాయి. వాటిని అద్దెకిస్తూ సైడ్‌ వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొదవ లేదు. 

దొరికితే జరిమానాలు
అమెరికాలోకి గుడ్లు, ఇతర ప్రాసెస్‌ చేయని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణా చట్టవిరుద్ధం. ఫ్లూ తదితర ఆందోళనలే ఇందుకు కారణం. వీటిని దేశంలోకి తరలించే ప్రయత్నంలో పట్టుబడితే 300 డాలర్ల దాకా జరిమానా విధిస్తారు. ‘‘ఇరు దేశాలకూ కొన్నేళ్లుగా నిద్ర లేకుండా చేస్తున్న ఫెంటానిల్‌ వంటి డ్రగ్స్‌ కంటే కూడా కెనడా నుంచి అమెరికాలోకి గుడ్ల అక్రమ రవాణాయే పెరిగిపోతోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ కళ్లెదుట కన్పిస్తున్న వాస్తవమిది’’ అన్నారు కెనడా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పాలసీ చీఫ్‌ మాథ్యూ హోమ్స్‌.  

    – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement