Smuggling
-
పంజాబ్‌లో 105 కిలోల హెరాయిన్ పట్టివేత
చండీగఢ్: సరిహద్దుల్లో డ్రగ్స్ రాకెట్‌ను పంజాబ్ పోలీసులు ఛేదించారు. 105 కిలోల హెరాయిన్‌ను సీజ్ చేయడంతోపాటు తుర్కియే కేంద్రంగా పనిచేసే డ్రగ్స్ స్మగ్లర్ నవ్ భులార్ ముఠాలోని నవ్‌జ్యోత్ సింగ్, లవ్‌ప్రీత్ కుమార్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హెరాయిన్‌తోపాటు సుమారు 32 కిలోల కెఫీన్ ఎన్‌హైడ్రస్, 17 కిలోల డెక్స్ట్రోమెథార్ఫాన్ (డీఎంఆర్) అనే నిషేధిత డ్రగ్స్‌ను కూడా పట్టుకున్నారు. ఈ మాదక ద్రవ్యాల విలువ రూ.100 కోట్ల పైమాటేనని చెబుతున్నారు. హెరాయిన్‌తోపాటు వీటిని కూడా వాడితే ఆ ప్రభావం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని డీజీపీ గౌరవ్ యాదవ్ ఆదివారం చెప్పారు. విదేశీ తయారీ పిస్టళ్లు ఐదు, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను దొంగచాటుగా జల మార్గంలో తరలించేందుకు స్మగ్లర్లు భారీ రబ్బర్ ట్యూబ్‌లను వినియోగించారని వివరించారు. -
అక్రమ రవాణాకు అడ్డాగా బీహార్ ఈస్ట్ వెస్ట్ కారిడార్
పట్నా: నేపాల్, మయన్మార్, కొరియా దేశాల స్మగ్లర్లు భారత్‌లో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగించేందుకు బీహార్‌ను తమ అడ్డగా మార్చుకుంటున్నారు. బీహార్ మీదుగా వెళ్లే ఈస్ట్ వెస్ట్ కారిడార్ స్మగ్లర్లకు కొత్త మార్గంగా మారింది. నేపాల్‌కు సమీపంలో ఉండటంతో స్మగ్లర్లకు ఈ రహదారి వరంలా మారింది. ఈ మార్గంలో నేపాల్ నుంచే కాకుండా మయన్మార్, కొరియా దేశాల నుంచి కూడా ‘సరుకులు’ రవాణా అవుతున్నట్లు రోజూ వార్తలు వస్తున్నాయి.స్మగ్లర్ల సిండికేట్ ఈ మార్గం ద్వారా విదేశీ సిగరెట్లను రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలిందని డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. కస్టమ్స్ కమిషనర్ డా.యశోవర్ధన్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నామన్నారు. అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పట్నా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. మోతీహరి పోలీసుల సహాయంతో భారీ మొత్తంలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ కారిడార్‌లో తొలిసారిగా ఒక కిలో 100 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. 15 రోజుల వ్యవధిలో దర్భంగా, ముజఫర్‌పూర్ మధ్య మైతీ టోల్ ప్లాజా సమీపంలో భారీగా విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి ముందు రూ.ఒక కోటి 30 లక్షల విలువైన దక్షిణ కొరియా సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదంతంలో బరేలీకి చెందిన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.తాజాగా తూర్పు చంపారన్‌లోని నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డులో రూ.9 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ప్రయాణికుల బస్సు నుంచి 9,500 సిగరెట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ విభాగం అధికారులు మోతీహరి నకర్దేరి అదాపూర్ రక్సాల్ రోడ్డు సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుంగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. దీనికితోడు భారతదేశంలో తయారయ్యే సిగరెట్లు సరైన పత్రాలు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్నాయని తెలియవస్తోంది.ఇది కూడా చదవండి: బంగారం తగ్గుదల.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత? -
ఇక బియ్యం అక్రమార్కుల భరతం
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమార్కుల భరతం పట్టేందుకు పోలీస్‌శాఖ సిద్ధమైంది.ఇప్పటికే డీజీపీ జితేందర్ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్, పౌరసరఫరాలశాఖ అధికారులతో కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేపట్టనున్నట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొన్ని ముఠా లు అక్రమంగా ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తున్నాయి.గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి లో ఈ ముఠాలు బియ్యాన్ని తక్కువ ధరకు వివి ధ మార్గాల్లో సేకరించి, వాటిని ఇతర రాష్ట్రాలకు తర లిస్తుండగా, అన్ని స్థాయిల్లో నిఘా పెట్టారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలతో అంటకాగుతున్న పోలీసు అధికారులపైనా వేటు వేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నా రు. ఇప్పటికే నిఘా వర్గాల నుంచి, ఇతర పద్ధతు ల్లో అవినీతి అధికారుల వివరాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. కీలక నిందితులపైనే గురి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా ఎక్కువగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో బ్రోకర్ల ద్వారా ఈ ముఠాలు లబి్ధదారుల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నాయి. రేషన్ దుకాణాల నుంచి బియ్యం లబ్ధిదారులు తీసుకున్న వెంటనే వారికి కిలోకు రూ.10 నుంచి రూ.12 చెల్లిస్తున్నారు. వాటిని మండల స్థాయిలో మరో దళారీకి చేరవేసి, అక్కడి నుంచి జిల్లా స్థాయికి పంపించి అక్రమ రవాణా చేస్తున్నారు. ఇదంతా స్థానిక పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులకు తెలిసే జరుగుతుందన్నది బహిరంగ రహస్యం.ప్రధానంగా వీటిని మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు, ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టులకు తరలిస్తున్నట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. పోర్టుల నుంచి విదేశాలకు ఈ బియ్యం వెళుతోందన్నారు. మరికొన్ని ముఠాలు స్థానికంగా హోటళ్లకు సైతం రేషన్ బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రీసైక్లింగ్ కోసం కొందరు మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే బియ్యం అక్రమ రవాణా కట్టడిలో కేవలం స్థానిక ముఠాలను అరెస్టు చేస్తే లాభం లేదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఈ అక్రమ రవాణాలో కీలక వ్యక్తులను గుర్తించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలతో సమాచారం సేకరిస్తున్నామన్నారు. అక్రమ అధికారులపైనా కొరడా ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తున్న పోలీసులపై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. మల్టీజోన్–2 పరిధిలో ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఇన్స్పెక్టర్లను, 13 మంది ఎస్సైలను వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. అంతకు ముందు సైతం ఇదే విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేశారు. ఇసుక అంశంలో మాదిరిగానే రేషన్ బియ్యం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తున్న పోలీసులపై నిఘా విభాగం దృష్టి పెట్టింది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ అధికారుల్లో భయం మొదలైంది. -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
రూ.ఎనిమిది లక్షల కోట్ల అక్రమ దందా!
దుస్తులు, నిత్యం వినియోగించే వస్తువులు సహా ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) వంటి ఐదు కీలక విభాగాల్లో అక్రమ మార్కెట్ పెరుగుతోందని ఫిక్కీ తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ అక్రమ మార్కెట్ విలువ ఏకంగా రూ.7.97 లక్షల కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొంది. అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి కఠిన శిక్షలు, మెరుగైన నిఘా వ్యవస్థను అమలు చేయాలని కేంద్ర సహాయమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు తెలిపారు.ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) కమిటీ-క్యాస్కేడ్, థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి. అందులోని వివరాల ప్రకారం..2022-23లో అధికంగా ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో రూ.2.23 లక్షల కోట్ల అక్రమ మార్కెట్ జరిగింది. ఇది దేశంలో జరిగిన మొత్తం అక్రమ మార్కెట్లో నాలుగో వంతు కంటే ఎక్కువ. వస్త్రాలు, దుస్తుల విభాగంలో అక్రమ వ్యాపారం రూ.4.03 లక్షల కోట్లుగా ఉంది. దేశీయ అక్రమ మార్కెట్లో దీని వాటా సగానికిపైగా ఉంది. 2017-18లో ఇది రూ.3.11 లక్షల కోట్లుగా ఉండేది. 29.67% ఈ మార్కెట్ వృద్ధి చెందింది.ఫిక్కి క్యాస్కేడ్ పదో ఎడిషన్ ‘మాస్క్రేడ్ 2024’ కార్యక్రమంలో కేంద్రమంత్రి రణ్విత్‌సింగ్ బిట్టు మాట్లాడుతూ..‘దేశ ఆర్థిక వృద్ధిని నాశనం చేసే అక్రమ మార్కెట్‌కు వ్యతిరేకంగా వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించడంతోపాటు భారీ జరిమానాలు విధించాలి’ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, సీబీఐసీ సభ్యులు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ..‘నకిలీ వస్తువులు, స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అధునాతన సాంకేతికతతో పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనివల్ల రోజూ సగటున 60 అక్రమాలు గుర్తిస్తున్నాం. గత 15 నెలల్లో 3,000 మందిని అరెస్టు చేశాం. రూ.40 కోట్ల విలువైన విదేశీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నాం’ అన్నారు. ఇదీ చదవండి: 32,000 మంది ఉద్యోగులు సమ్మె.. 27న చర్చలుఅక్రమ వ్యాపారం అనేది కేవలం భారత్‌కు సంబంధించింది మాత్రమే కాదని, ఇది ప్రపంచ సమస్య అని ఫిక్కీ క్యాస్కేడ్ ఛైర్మన్ అనిల్ రాజ్‌పుత్ అన్నారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ అక్రమ మార్కెట్‌పై తగిన చర్యలు చేపట్టాలి. అన్ని దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ఈ సమస్యను పరిష్కరించాలి’ అని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కంప్లయన్స్ అండ్ ఫెసిలిటేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ ప్రణబ్ కుమార్ దాస్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (ఐసీఏ) డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా పాల్గొన్నారు.నివేదికలోని వివరాలు..ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్), ఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు), మద్యం, పొగాకు, వస్త్రాలు & దుస్తులు వంటి ఐదు విభాగాల్లో అధికంగా అక్రమ రవాణా సాగుతోంది.2022-23లో దేశంలో అక్రమ మార్కెట్ పరిమాణం రూ.7,97,726 కోట్లుగా ఉంది.ఎఫ్ఎంసీజీ (ప్యాకేజ్డ్ ఫుడ్)-రూ.2,23,875 కోట్లుఎఫ్ఎంసీజీ (వ్యక్తిగత, గృహ సంరక్షణ వస్తువులు)-రూ.73,813 కోట్లువస్త్రాలు, దుస్తులు-రూ.4,03,915 కోట్లుపొగాకు ఉత్పత్తులు-రూ.30,017 కోట్లుమద్యం-రూ.66,106 కోట్లుఇదీ చదవండి: పెరిగిన జెరోధా లాభం! భవిష్యత్తులో నష్టాలు తప్పవన్న సీఈఓదేశీయంగా వివిధ మార్గాల్లో విభిన్న వస్తువులను అక్రమంగా తరలిస్తూ స్థానికంగా మార్కెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పన్నుల రూపంలో రావాల్సిన నిధులు సమకూరడం లేదు. దాంతో తప్పక పన్నులు, ఇతర వస్తువుల ధరలు పెంచుతున్నారు. ఏదేమైనా అక్రమ మార్కెట్ సామాన్యుడి నెత్తిన భారంగా మారుతోంది. -
పుష్పను మించిపోయిన మందు స్మగ్లర్లు
-
పగలు తోడేస్తూ.. రాత్రి తోలేస్తూ..
జగ్గయ్యపేట: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. ఆపేవారే కనబడకపోవడంతో సరిహద్దులు దాటిపోతోంది. ఉచిత ఇసుక పథకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మండలంలోని అనుమంచిపల్లి గ్రామంలోని జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జూలై 8న ఇసుక విక్రయాలు ప్రారంభించింది. మొత్తం 81వేల టన్నుల ఇసుకను ఈ ప్రాంతంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు టన్ను రూ.290 చొప్పున ధర నిర్ణయించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు విక్రయిస్తోంది. ఇందు కోసం ఇక్కడ రెవెన్యూ, పంచాయతీ, ఎస్ఈబీ అధికారులను నియమించారు. ఇసుక ప్రారంభం నాటి నుంచి నేటి వరకు 16,800 మెట్రిక్ టన్నులు ఇసుక విక్రయించినట్లు అధికారులు చెబున్నారు. అయితే ఇందులో కొన్ని వందల టన్నులు తెలంగాణకు తరలినట్టు సమాచారం.తెలంగాణకు తరలింపు ఇలా..స్టాక్ పాయింట్ వద్ద కొందరు అక్రమార్కులు తెలంగాణకు అక్రమంగా ఇసుకను రవాణా చేసేందుకు ప్రత్యేక వ్యూహాలను రచించారు. ఈ ప్రాంతం తెలంగాణకు సరిహద్దుగా ఉండటంతో ఏ గ్రామం నుంచి చూసినా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే తెలంగాణ సరిహద్దు గ్రామాలు కనిపిస్తాయి. దీంతో అక్రమార్కులు ఇసుకను సామాన్యులకు అందనీయకుండా యథేచ్ఛగా తరలిస్తున్నారు. స్టాక్ పాయింట్ల వద్ద కొందరు అక్రమార్కులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని ప్రతి రోజు 10 నుంచి 30 ట్రాక్టర్ల వరకు ఇసుకను రహస్య ప్రదేశాలకు తరలిస్తారు.అధికార పార్టీ నేత హవా?స్టాక్ పాయింట్ వద్ద గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు తన హవా కొనసాగిస్తున్నారు. తన గ్రామంలో స్టాక్ పాయింట్ ఉండటంతో గ్రామానికి ప్రతి రోజు 30 ట్రాక్టర్ల ఇసుక తను చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులకు హుకుం జారీ చేయడంతో అధికారులు కూడా ఆయనకు తలొగ్గి ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఒక్కో ట్రాక్టర్ నుంచి సదరు నాయకుడికి రూ.200 ఇస్తున్నట్లు కూడా సమాచారం.ఉదాసీనంగా అధికారులు..అక్రమంగా తరలిపోతున్న ఇసుకను నియంత్రించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ముఖ్యంగా స్టాక్ పాయింట్ వద్ద అనుభవం లేని పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులను నియమించడంతో కూపన్లు జారీ చేసి విషయంలో కూడా అవకతవకలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక వే బిల్లుపై 2 నుంచి 3 సార్లు ఇసుకను తీసుకువెళ్తున్నారు. కనీసం వీటి పర్యవేక్షణకు సిబ్బంది లేకపోవడంతో ప్రతి రోజు 20 నుంచి 80 టన్నుల ఇసుక అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఎస్ఈబీ అధికారులు సమాచారం ఇస్తే తప్ప నియంత్రణ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.ఏపీ ఇసుకకు మంచి డిమాండ్..తెలంగాణలో మునేరు, కృష్ణా ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. ఒక లారీ ఇసుక రూ.30వేలు నుంచి రూ.70వేల వరకు ధర పలుకుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇసుక కొరత ఉండటంతో ఏపీ ఇసుక కోసం ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.చెక్‌పోస్ట్‌లు ఉన్నా..65వ నంబర్ జాతీయ రహదారి రాష్ట్ర సరిహద్దు గరికపాడు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తూతూ మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన ముక్త్యాల, గండ్రాయి, అన్నవరం గ్రామాల్లో చెక్ పోస్టులు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగానే సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ముక్త్యాల చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఉన్నప్పటికీ అనుమంచిపల్లి స్టాక్ పాయింట్ నుంచి తెలంగాణ రాష్ట్రం వజినేపల్లికి ఓ ట్రాక్టర్ ఇసుకలోడు సిబ్బంది కనుచూపులోనే వెళ్లింది. సమీపంలోని తెలంగాణ బుగ్గ మాధవరం చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక తరలి వెళ్లడం గమనార్హం. -
Californium: 50 గ్రాముల రాయి... రూ. 850 కోట్ల ఖరీదు!
పట్నా: అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియంను గుట్టుచప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారినుంచి 50 గ్రాముల కాలిఫోర్నియంను స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా రూ.850 కోట్ల దాకా ఉంటుందని గోపాల్‌గంజ్ ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ వెల్లడించారు! గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని ఆయన వివరించారు. ‘‘పక్కా సమాచారం మేరకు జిల్లా ఇన్వెస్టిగేషన్ విభాగం, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, ఎస్టీఎఫ్ సంయుక్తంగా రంగంలోకి దిగాయి. యూపీ, బిహార్ సరిహద్దులో మోటార్‌బైక్ మీద వస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా కాలిఫోరి్నయం దొరికింది’’ అని తెలిపారు. దీనిపై అణు ఇంధన శాఖకు కూడా సమాచారం ఇచ్చామన్నారు. ఎందుకింత ఖరీదు? కాలిఫోర్నియం అత్యంత అరుదైన రేడియోధార్మిక పదార్థం. ఇది ప్రకృతిలో సహజంగా లభించదు. ప్రయోగశాలల్లో హెచ్చు పీడనంతో కూడిన ఐసోటోప్ రియాక్టర్లలో తయారు చేయాల్సి ఉంటుంది. ఎంతగానో శ్రమించిన మీదట అత్యంత స్వల్ప పరిమాణాల్లో మాత్రమే తయారవుతుంది! దీన్ని తయారు చేయగల సామర్థ్యమున్న అణు రియాక్టర్లు రెండే ఉన్నాయి! ఒకటి అమెరికాలో, రెండోది రష్యాలో. 1950లో భౌతిక శాస్త్ర పరిశోధకులు స్టాన్లీ గెరాల్డ్ థాంప్సన్, కెనెత్ స్ట్రీట్ జూనియర్, అల్బర్ట్ గిరోసో, గ్లెన్ టి.సీబోర్గ్ దీన్ని తొలిసారిగా తయారు చేశారు. ఈ రేడియో ధారి్మక పదార్థాన్ని భూగర్భంలో బంగారు, వెండి నిల్వల అన్వేషణతో పాటు ఇంధన క్షేత్రాల్లో చమురు, నీటి పొరలను గుర్తించేందుకు ఉపయోగిస్తారు. -
బంగారం అక్రమ రవాణా తగ్గుతుంది..
న్యూఢిల్లీ: బంగారంపై భారీగా కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి దోహదపడుతుందని సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డ్) చైర్మన్ సంజయ్ కుమార్ మల్హోత్రా తెలిపారు. అలాగే దేశంలోని రత్నాలు ఆభరణాల ఎగుమతులు పెరగడానికి, ఉపాధి వృద్ధికి సహాయపడుతుందని ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023–24) కస్టమ్స్ శాఖ, డీఆర్ఐ కలిసి 4.8 టన్నుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2022–23లో ఈ పరిమాణం 3.5 టన్నులు కావడం గమనార్హం. యల్లోమెటల్సహా పలు విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి భారీగా తగ్గిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారీ ఉపాధి కల్పన రత్నాలు, ఆభరణాల రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, ఎగుమతుల్లో ఈ రంగం వాటా 8 శాతం వరకూ ఉందని కుమార్ మల్హోత్రా తెలిపారు. దేశానికి 2023–24లో 45.54 బిలియన్ డాలర్ల విలువైన పసిడి దిగుమతులు జరిగాయి. వెండి విషయంలో ఈ విలువ 5.44 బిలియన్ డాలర్లుగా ఉంది. అదే సమయంలో ఆభరణాల ఎగుమతులు విలువ 13.23 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వార్షికంగా భారత్ 800 నుంచి 900 టన్నుల పసిడి దిగుమతులను చేసుకుంటోంది. బంగారం దిగుమతులలో స్విట్జర్లాండ్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో ఈ దేశం వాటా దాదాపు 40 శాతం. తరువాతి 16 శాతానికిపైగా వాటాతో యూఏఈ రెండవ స్థానంలో ఉంది. 10 శాతం వాటాలో దక్షిణాఫ్రికా మూడవ స్థానంలో నిలుస్తోంది. 2022లో పెరిగిన సుంకాలుదేశంలోకి వచీ్చ–వెళ్లే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భారీ పెరుగుదలను నివారించడానికి 2022 జూలైలో (10.75 శాతం నుంచి 15 శాతానికి) కస్టమ్స్ సుంకాన్ని భారీగా పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2022–23లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతంగా ఉన్న క్యాడ్, 2023–24లో ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఏకంగా మిగులు నమోదయ్యింది. -
ఎర్రమట్టి దిబ్బల వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం
-
Hyd : నిందితుల నుంచి కిలో ఆల్ఫాజోలం స్వాధీనం, ముగ్గురు అరెస్ట్
-
జాఫర్ సాధిక్ అరెస్ట్
సాక్షి, చైన్నె: మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత జాఫర్ సాధిక్‌ను శనివారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆయన వద్ద తీవ్ర విచారణ జరుగుతోంది. గతనెల ఢిల్లీలో రూ. 2 వేల కోట్లు విలువైన మాదక ద్రవ్యాలు బయటపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసులో తమిళనాడుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. విచారణలో ఈ స్మగ్లింగ్‌కు సూత్రదారి చైన్నెకు చెందిన సినీ నిర్మాత, డీఎంకే మాజీ నేత జాఫర్ సాధిక్‌గా తేలింది. మూడేళ్లలో జాఫర్ సాధిక్ ముఠా 3,500 కేజీల మత్తు పదార్థాలను తమిళనాడు నుంచి పలు దేశాలకు స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో తేలింది. తనను ఎన్సీబీ టార్గెట్ చేయడంతో జాఫర్ సాధిక్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి సోదరులు సలీం, మైదీన్ కూడా పత్తా లేకుండా పోయారు. ఇంట్లో ఉన్న వాళ్లందరూ ఎక్కడకువెళ్లారో అంతు చిక్కని పరిస్థితి. విచారణకు రావాలని జాఫర్ సాధిక్ ఇంటి వద్ద ఎన్సీబీ అధికారులు నోటీసులు అంటించి సైతం వెళ్లారు. అజ్ఞాతంలో ఉన్న సాధిక్ కోసం పలు నగరాల్లో గాలించారు. నెల రోజులుగా మకాం మారుస్తూ వచ్చిన సాధిక్ ఎట్టకేలకు ఎన్సీబీ అధికారులకు చిక్కారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లో శనివారం అతడిని అరెస్టు చేశారు. ఢిల్లీకి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఈ విషయంగా ఎన్సీబీ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొంటూ, అరెస్టు చేశామని విచారణ జరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన సొమ్మును జాఫర్ సాధిక్ సినిమాలు, హోటళ్లు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందన్నారు. ఇతగాడితో సత్సంబంధాలు కలిగిన వారి వివరాలను సేకరిస్తున్నామని, అలాగే, ఏదేని రాజకీయ పార్టీ, నాయకులకు నిధులు, విరాళాలు ఇచ్చి ఉన్న పక్షంలో వారిని కూడా విచారణ వలయంలోకి తీసుకొచ్చే విధంగా ఎన్సీబీ ఉరకలు తీస్తుండటం గమనార్హం. ఇతగాడు ఫుడ్ డెలివరి, ఫుడ్ ఎగుమతి పేరిట మాదక ద్రవ్యాలు విదేశాలకు పెద్దఎత్తున పంపించినట్టు విచారణలో వెలుగు చూసింది. -
రూ.3.61 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాదీనం
సాక్షి, అమరావతి: అక్రమంగా రవాణా చేస్తున్న రూ.3.61కోట్ల విలువైన 72.30లక్షల విదేశీ సిగరెట్లను కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు ఈ నెల 5, 6 తేదీల్లో కోల్కత్తా–చెన్నై జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. నెల్లూరు సమీపంలో 33.30 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న ఓ వాహనాన్ని, బాపట్ల జిల్లా సంతమాగులూరు సమీపంలో 39 లక్షల విదేశీ సిగరెట్లను తరలిస్తున్న మరో వాహనాన్ని గుర్తించారు. ఆ విదేశీ సిగరెట్ల ప్యాకెట్లపై తయారీ కంపెనీ వివరాలు, ఎక్సై్పరీ తేదీ, ఇతర వివరాలు ఏవీ లేవు. వాటిని తరలిస్తున్న వాహనాల డ్రైవర్లు ఆ విదేశీ సిగరెట్లను దిగుమతి చేసుకున్నట్టు తగిన పత్రాలు గానీ పన్ను చెల్లించిన రశీదులను గానీ చూపించలేకపోయారు. దాంతో మొత్తం రూ.3.61కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు జప్తు చేసి కేసు నమోదు చేశారు. గుంటూరు సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు మూడు నెలల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.88కోట్ల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
DRI SUMMIT: దేశాల మధ్య సమన్వయంతోనే స్మగ్లింగ్ నిరోధం సాధ్యం
న్యూఢిల్లీ: అక్రమ రవాణా, వ్యాపారం వెనుక ఉన్న సూత్రధారులను అణిచివేసేందుకు ప్రపంచ దేశాల ప్రభుత్వాల సమన్వయం అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. చట్టవిరుద్ధ వ్యాపారం వెనుక ఉన్న ‘‘మాస్టర్ మైండ్స్’’ ను పట్టుకోవడంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థతో పాటు పౌరుల ప్రయోజనాలను దెబ్బతీసే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు నిరోధానికి విచారణా సంస్థల సమన్వయ చొరవలు అవసరమని ఆమె అన్నారు. అక్రమంగా రవాణా, లేదా చట్టవిరుద్ధ వ్యాపార స్వభావం గత 50 నుంచి 60 సంవత్సరాలుగా మారలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. విలువైన లోహాలు, మాదక ద్రవ్యాలు, అటవీ లేదా సముద్ర జీవుల అక్రమ రవాణా కొనసాగడం విచారకరమని అన్నారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ ముప్పును అరికట్టడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆమె ఈ సందర్బంగా అన్నారు. సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవడంలో సాంకేతికత వినియోగం చాలా ప్రాధాన్యత కలిగిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఎన్ఫోర్స్మెంట్ మేటర్స్ 2023’’ అన్న అంశంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇక్కడ నిర్వహించిన ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్‌ను ఉద్ధేశించి ఆర్థికమంత్రి చేసిన ప్రారంభోపన్యాసంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► చాలా వరకు అక్రమంగా వ్యాపారం చేసే వస్తువులు అలాగే ఉంటాయి. కస్టమ్స్ అధికారులు కంగుతినేంత స్థాయిలో కొత్త వస్తువుల అక్రమ రవాణా ఏదీ లేదు. దశాబ్ద కాలంగా ఇదే ధోరణి కొనసాగుతుందంటే... దీని వెనుక ఉన్న శక్తులు ఎవరో సమాజానికి తెలియాలి. ∙అక్రమ రవాణా సూత్రధారుల అణచివేతకు డబ్ల్యూసీఓ (ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్)తో పాటు ప్రభుత్వాల మధ్య సహకారానికి చాలా ముఖ్యం. తద్వారా అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకో గలుగుతాము. ► జప్తు చేసిన వస్తువులన్నింటినీ ధ్వంసం చేసి, మార్కెట్లోకి తీసుకురాకుండా అడ్డుకోగలిగితే, అక్రమ వ్యాపారాన్ని అరికట్టడం తేలికవుతుంది. ► అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడినవారికి శిక్ష తప్పదని, ఆయా చర్యల నిరోధం సాధ్యమేనని ప్రజల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడం మన కర్తవ్యం. ► బంగారం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, పురాతన వస్తువులు, వన్యప్రాణి సంపద అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా అవసరం. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థలన్నింటినీ దెబ్బతీస్తుంది. ► దొంగిలించిన, అక్రమంగా తరలించిన పురాతన వస్తువులన్నింటినీ వాటికి సంబంధించిన స్వదేశాలకు తిరిగి అప్పగించాల్సిన అవసరం ఉంది. దీనికీ అంతర్జాతీయ సమన్వయం, సహకారం అవసరం. ► ఈ కార్యక్రమంలో డీఆర్ఐ ’ఆపరేషన్ శేష’ నాల్గవ దశను మంత్రి ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌కు ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ రీజినల్ ఇంటెలిజెన్స్ లైజన్ ఆఫీస్ (ఆర్ఐఎల్ఓ) ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్‌ల సహకారం అందిస్తోంది. కలప అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు 2015లో తొలిసారిగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. అక్రమ రవాణా పెరుగుతోంది: సంజయ్ కుమార్ అగర్వాల్ పరోక్ష పన్నులు– కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చీఫ్ సంజయ్ కుమార్ అగర్వాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం పరస్పరం అనుసంధానం కావడం, ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి వంటి అంశాల నేపథ్యంలో పురాతన వస్తువులు, సిగరెట్లు, బంగారం, అంతరించిపోతున్న వన్యప్రాణులసహా నిషేధిత వస్తువుల అక్రమ తరలింపు పెరుగుతోందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్ విలువ దాదాపు 650 బిలియన్ డాలర్లని ఆయన పేర్కొన్నారు. మొత్తం అక్రమ ఆర్థిక వ్యాపార కార్యకలాపాల్లో ఈ వాటా దాదాపు 30 శాతమని తెలిపారు. ఇది తీవ్ర ప్రభావాలకు దారితీస్తోందని పేర్కొన్న ఆయన, మనీలాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాల ఫైనాన్షింగ్ ఫైనాన్సింగ్‌కు ఇది దారితీస్తోందని, ఆయా అంశాలు జాతీయ భద్రతపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని నిరోధానికి విచారణా సంస్థల మధ్య సన్నిహిత సమన్వయ చర్యలు అవసరమని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, స్మగ్లింగ్ ముప్పును ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. వ్యాపార వ్యయాలను తగ్గించి, పోటీతత్వాన్ని పెంచే సులభతర వాణిజ్య చర్యలను కూడా ఈ దిశలో చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. -
ఎరువుల అక్రమ రవాణాకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముమ్మరంగా వ్యవసాయ పనులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
వార్నీ.. ఈ ఐడియాలు ఎలా వస్తాయో, చీరను ఇలా కూడా వాడచ్చా!
హైదరాబాద్: బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే కొందరు బంగారం దుకాణాలు పెడుతుంటే, ఇంకొందరు బంగారంలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే మరికొందరు మాత్రం ఇవేవి వద్దంటూ.. బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకుని అక్రమంగా గోల్డ్ తరలిస్తూ ఇప్పటివరకు చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లోనే పట్టుబడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఈ దారిలోప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీనికి ఉన్న గిరాకీ అలాంటిది మరీ. తాజాగా విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గోల్డ్‌ని అత్యంత తెలివిగా లిక్విడ్‌గా మార్చి చీరపై స్ప్రే చేసుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారు చీర ధర 28.01లక్షల రూపాయలు చేస్తుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు దీనిపై విచారణ జరపుతున్నారు. 28 lakhs worth of gold was seized by customs at @RGIAHyd from a Dubai passenger. He concealed the gold by spraying it over clothes and packed it amidst the luggage. #gold #goldsmuggling #RGIA@hydcus @cbic_india @XpressHyderabad@NewIndianXpress pic.twitter.com/d9llirhQb3 — Priya Rathnam (@Rathnam_jurno) August 4, 2023 -
లోదుస్తుల్లో పాములు.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన మహిళ
బీజింగ్: దక్షిణ చైనాలోని గువాంగ్ డాంగ్ ప్రావిన్స్ ఎయిర్ పోర్టులో ఒకామె తన లోదుస్తుల్లో ఐదు బ్రతికున్న పాములను అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది. ఆమె శరీరాకృతి విచిత్రంగా ఉండటంతో అనుమానం వచ్చి శెంజిన్ కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అదేంటో.. ప్రపంచంలో చిత్ర విచిత్రమైన సంఘటనలన్నీ చైనాలోనే చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ పోర్టుల్లో ఈ విధంగా జీవులను తరలిస్తున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఇలాంటి కేసుల్లో అత్యధిక స్మగ్లర్లు బ్యాగుల్లో, బాక్సుల్లో లేదా మరో విధంగా వాటిని తరలిస్తూ ఉంటారు. కానీ ప్రమాదకరంగా విషపూరితమైన సర్పాలను శరీరంలో దాచుకుని తరలించిన సంఘటనలు చాలా అరుదు. కస్టమ్స్ అధికారులు పేరు చెప్పడానికి నిరాకరించిన దక్షిణాఫ్రికాకు చెందిన సదరు మహిళ సజీవంగా ఉన్న ఒక్కో పాముని ఒక్కో స్టాకింగ్ లో పెట్టి ప్యాక్ చేసింది. ఆ ఐదు స్టాకింగ్ బ్యాగులను తన ఛాతీ వద్ద లోదుస్తుల్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా యధాతధంగా పైన డ్రెస్ వేసుకుంది. ఆమె ఎయిర్ పోర్టులోకి అడుగుపెడుతూనే కస్టమ్స్ అధికారులకు ఆమె ఆకృతి చూసి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అడ్డగించి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ఐదు పాములను జెర్రిపోతులుగా గుర్తించి వాటిని జంతు సంరక్షణ శాలకు తరలించారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ లో హిందూ దేవాలయంపై దాడి.. పబ్జీ లవ్ స్టోరీనే కారణమా? -
ఆ ఎర్రచందనం మాదే.. మాకూ వాటా ఇవ్వండి
సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది. దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. 50 శాతం వాటా అడుగుతున్నాం ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది. – మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్ -
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు
-
ఇదేం తెలివిరా నాయనా.. చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. చివరికి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు పరిశీలించగా.. 269 గ్రాముల బంగారాన్ని చాక్లెట్ కవర్లలో చుట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు అట్టపెట్టెలో ఉంచిన 13 చాక్లెట్లలో 13 చిన్న బంగారు ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
ఏంది రా అయ్యా ఇది.. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో..
యశవంతపుర(బెంగళూరు): విదేశాల నుంచి బంగారాన్ని స్మగ్లర్లు విచిత్రమైన మార్గాల్లో తెస్తూ దొరికిపోతున్నారు. రెండేళ్ల చిన్నారి డైపర్‌లో బంగారాన్ని దాచి తీసుకొచ్చిన ప్రయాణికున్ని మంగళూరు విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి బెల్ట్‌లో నడుం కట్టుకొని తెస్తుండగా పట్టుకున్నారు. మరో వ్యక్తిలో దుస్తుల్లో ద్రావణం రూపంలో బంగారాన్ని తెచ్చారు. తనిఖీల్లో గుర్తించి బంగారాన్ని సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. మార్చి 1 నుండి 15 వరకు రూ. 90 లక్షలు విలువగల 1.606 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: అనంతపురంలో విషాదం.. వారం కిందటే పెళ్లి.. ఏం జరిగిందో ఏమో! -
ఓర్ని.. చెప్పులో బంగారు దాచిపెట్టిన ప్రయాణికుడు.. ఎలా పట్టుబడ్డాడో చూడండి..
-
మహిళా కాంగ్రెస్ నేత అరెస్ట్.. కారణం ఇదే..
గాంధీనగర్: గుజరాత్‌కు చెందిన మహిళా కాంగ్రెస్ నేత మేఘనా పటేల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, విదేశీ మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో దాదాపు రూ. 10లక్షల విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. విదేశీ మద్యం అక్రమ రవాణా కేసులో మేఘనా పటేల్‌ను గుజరాత్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అయితే, ఆమె.. తన బొలెరో కారులో విదేశీ మద్యం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పిప్లాడ్ రోడ్డు ప్రాంతంలో మేఘనా పటేల్ కారును ఆపి చెక్ చేశారు. ఈ సందర్బంగా కారు నడుపుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా.. మేఘనా పటేల్ కోసం రూ.7.5 లక్షలకు పైగా విలువైన విదేశీ మద్యం తీసుకొచ్చినట్లు తేలింది.10 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో, విదేశీ మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, ఈ విదేశీ మద్యం ఎక్కడ నుంచి వచ్చింది.. దీన్ని ఎవరు విక్రయించారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మేఘనా పటేల్, కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, మేఘనా పటేల్ మాజీ మహిళా ఉపాధ్యక్షురాలుగా పని చేశారు.