డ్రగ్స్‌ దందా: హైదరాబాద్‌ టు ఆస్ట్రేలియా.. | Hyderabad Based International Drug Smuggling | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ దందా: హైదరాబాద్‌ టు ఆస్ట్రేలియా..

Published Sat, Oct 2 2021 2:32 AM | Last Updated on Sat, Oct 2 2021 2:32 AM

Hyderabad Based International Drug Smuggling - Sakshi

ముంబైలో పట్టుబడ్డ డ్రగ్స్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధాని కేంద్రంగా అంతర్జాతీయ డ్రగ్స్‌ మాఫియా కొనసాగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. డ్రగ్స్‌ తయారీకి ముంబై నుంచి ఫండింగ్‌ చేస్తున్న మాఫియా ఇక్కడి నుంచి ఏకంగా ఆస్ట్రేలియాకే స్మగ్లింగ్‌ చేసే వరకు వెళ్లిందంటే వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) శుక్రవారం ముంబైలో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకుంది. ఈ వ్యవహారంలో మరోసారి హైదరాబాద్‌ పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది.

త్వరలోనే ఛేదిస్తాం
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ తయారు చేయించిన మాఫియా ఆ డ్రగ్స్‌ను ఏమాత్రం సందేహం రాకుండా మెత్తలు, పరుపుల్లో పెట్టి షిప్పింగ్‌ ద్వారా ఇక్కడి నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు పంపించే యత్నంచేసి దొరికిపోయింది. ఎన్‌సీబీ బృందాలు శుక్రవారం ముంబైలోని నార్త్‌ అం«ధేరీలో సోదాలు నిర్వహించి పలు బాక్స్‌లు గుర్తించాయి. ఇందులో మెత్తల్లో దాచి ఉంచిన 4.6 కేజీల ఎపిడ్రిన్‌ డ్రగ్స్‌ ప్యాక్‌లను స్వాధీనం చేసుకుంది. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని ఎన్‌సీబీ ముంబై జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంకెడే స్పష్టంచేశారు. హైదరాబాద్‌ నుంచి ముంబై మీదుగా ఆస్ట్రేలియాకు బుక్‌ చేశారని వెల్లడించారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉన్న అంధేరీలో ఈ డ్రగ్స్‌ పట్టుబడటం గమనార్హం. ఎంత మొత్తంలో డ్రగ్స్‌ విదేశాలకు వెళ్లాయో  త్వరలోనే ఛేదిస్తామని సమీర్‌ వాంకెడే చెప్పారు.

సిద్ధిఖ్‌ అహ్మద్‌ లింకులతోనేనా?
మూడు రోజుల క్రితం గోవాలో డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన హైదరాబాదీ సిద్ధిఖ్‌ అహ్మద్‌ విచారణలో సంచలన వివరాలు వెల్లడించాడు. ముంబై ఎన్‌సీబీ జోన్‌ కింద గోవా సబ్‌జోనల్‌ పనిచేస్తుంది. హైదరాబాద్‌లో భారీగా ఎండీఎంఏ డ్రగ్‌ తయారీ జరిగి అక్కడి నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు సిద్ధిఖ్‌ తెలిపాడు. 

పదేపదే హైదరాబాద్‌ పేరు..
ఇక్కడి పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టి ఈ డ్రగ్స్‌ తయారు చేయడం హైదరాబాద్‌తోపాటు తెలంగాణ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా డ్రగ్స్‌ తయారుచేస్తున్న కంపెనీలను స్థానిక నిఘా విభాగాలు ఎందుకు గుర్తించడంలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోవా, ముంబై, బెంగళూరు డ్రగ్‌ కేసుల్లో పదేపదే హైదరాబాద్‌ పేరు బయటకు రావడం ఎన్సీబీతోపాటు స్థానిక పోలీసులు, నిఘా విభాగాలకు తలనొప్పిగా మారింది.

కంపెనీలపై ప్రత్యేక నజర్‌తోపాటు దాడులు చేసేందుకు ఎన్‌సీబీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు తెలిసింది. వరుస దాడులతో ఇప్పటికే ఆయా కంపెనీల్లో డ్రగ్స్‌ మాయ మైపోయి ఉంటాయని దర్యాప్తు విభాగాలు అనుమానిస్తున్నాయి. అయితే విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సూత్రధారులు, హైదరాబాద్‌ పాత్రధారులు ఎవరన్నది తేల్చే పనిలో ఎన్‌సీబీ ఉన్నట్టు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement