ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలం, నిర్లక్ష్య ఫలితం
నిఘా సమాచారం మేరకు చర్యలు తీసుకున్నట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు.
ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
వేటు పడింది వీరిపైనే..
సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్‌లైన్‌కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు.
రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.
వికారాబాద్ టౌన్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు
జోగిపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్నాడు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment