సాక్షి, అమరావతి: రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు ఇతర రాష్ట్రాలకు అనధికారిక రవాణా జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. మంగళగిరిలోని వ్యవసాయ కార్యాలయం నుంచి జిల్లా, మండల వ్యవసాయ అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎరువుల రవాణా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు.
దీనికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, పోలీస్ శాఖలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విజిలెన్స్ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. కేటాయింపుల మేరకు రాష్ట్రానికి వచ్చే ప్రతి ఎరువు బస్తాను ఐఎఫ్‌ఎంఎఎస్ ద్వారా రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ముమ్మరంగా వ్యవసాయ పనులు
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని హరికిరణ్ చెప్పారు. గ్యాప్ సర్టిఫికేషన్ కోసం ఖరీఫ్ సీజన్‌లో జిల్లాకు 50 మంది రైతులతో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇలా ఎంపిక చేసిన 1,300 మంది రైతులతో ఏర్పాటు చేసిన ఎఫ్‌పీవోలతో అవగాహనా ఒప్పందాలు చేసుకోవాలన్నారు.
ఏపీ స్టేట్ ఆర్గానిక్ ఉత్పత్తుల సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ) రిజిస్ట్రేషన్‌తో సేంద్రియ పద్ధతిలో సాగు చేసే పంటలకు ఎఫ్‌పీవోలతో అగ్రిమెంట్ చేయించి ఆయా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని సూచించారు. పంట వేసిన నెల రోజులకు జియో రిఫరెన్సింగ్ ద్వారా ఈ–క్రాప్ నమోదు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment