Department of Agriculture
-
ప్రకృతి చోద్యం!
ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండించడమే ప్రకృతి వ్యవసాయం. దీనివల్ల భూసారం పెరగడంతో పాటు రైతులకు పెట్టుబడి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందుబాటులోకి వస్తాయి. అందువల్లే గత ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాయి. ఇందుకోసం వ్యవసాయశాఖలోనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాయి. కానీ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం లెక్కలు ఘనంగా కనిపిస్తున్నా... క్షేత్రాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయం జిల్లాలో రికార్డుల్లోనే సాగుతోంది. అధికారులు వేలాది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం నామమాత్రానికే పరిమితమైంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక విభాగం ఉన్నా... ఉత్తుత్తి హడవుడే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ప్రకృతి వ్యవసాయం కింద జిల్లాలో సాగుచేసిన ఆహార పంటల్లో కెమికల్స్ అవశేషాలు ఉన్నట్లుగా శాస్త్రీయంగా నిర్ధారణ కావడంతో ప్రకృతి సేద్యం...అంతా చోద్యంగా మారింది. లెక్కల్లో మాత్రం 34,024 ఎకరాల్లో... 2024–25 సంవత్సరంలో జిల్లాలోని 141 గ్రామ పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 53,834 మంది రైతులతో 75,534 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలన్నది వ్యవసాయ శాఖ లక్ష్యం. ప్రకృతి వ్యవసాయ విభాగం లెక్కల ప్రకారం ఇప్పటికే 32,607 మంది రైతులు 34,024 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కానీ 32,707 మంది రైతుల్లో 5 శాతం మంది కూడా ప్రకృతి వ్యవసాయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్లే జిల్లాలో వేలాది మంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నప్పటికి.. సరి్టఫికేషన్ మాత్రం అతి కొద్ది మందికే వస్తోంది. అది కూడా స్వచ్ఛందంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకే దక్కుతోంది. సాగుకు సిబ్బంది వెనుకంజ ప్రకృతి వ్యవసాయ విభాగంలో 367 మంది పనిచేస్తున్నారు. వాస్తవానికి వీరంతా వారికున్న భూమిలో ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం చేయాలి. ప్రధానంగా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కేటగిరీ వరకు ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులకు అదర్శంగా నిలవాలి. కానీ వీరిలోనే 60 శాతం మంది ప్రకృతి వ్యవసాయాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. రైతులకు ఆదర్శంగా ఉండాల్సిన సిబ్బందే కాడికిందపడేస్తే ఇక రైతులు ఎందుకు పట్టించుకుంటారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కొందరు మాస్టర్ ట్రైనర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. విచ్చలవిడిగా కెమికల్స్ వాడుతున్నా.. ప్రకృతి వ్యవసాయం అంటూ నమ్మిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చల విడిగా కెమికల్స్ వాడకం జిల్లాలో చాలా మంది పేరుకే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఆచరణలో మాత్రం అంతా కెమికల్స్ వ్యవసాయమే. ప్రకృతి వ్యవసాయం పెద్ద ఎత్తున జరుగుతుంటే రసాయన ఎరువుల వినియోగం గణనీయంగా తగ్గాలి. కానీ వివిధ మండలాల్లో లెక్కకు మించి రసాయన ఎరువులు వినియోగిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.50 లక్షల టన్నుల వరకు రసాయన ఎరువుల వినియోగం ఉంది. జిల్లాల పునరి్వభజన తర్వాత కర్నూలు జిల్లాలో 1.50 లక్షల టన్నుల వరకు వినియోగమవుతోంది. 2024–25 ఖరీఫ్‌లో 1,27,567.657 టన్నుల రసాయన ఎరువులను వినియోగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. సాగు విస్తీర్ణం పెంచుతాం జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపుతున్నారు. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి శిక్షణ ఇస్తున్నాం. జీవామృతం, కషాయాల తయారీపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసే సిబ్బంది కూడ ఎకరా, అర ఎకరా విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 54,834 మంది రైతులతో ప్రకృతి వ్యవసాయం చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారిప్రకృతి వ్యవసాయం అంటే... ప్రకృతి వ్యవసాయం అంటే ఎలాంటి పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకుండా పంటలు పండించడం. పంటల సాగులో ద్రవ, ఘన జీవామృతాన్ని మాత్రమే వినియోగించడం. చీడపీడల నివారణకు కషాయాలు, బ్రహ్మస్త్రం, అగ్ని అస్త్రం, దశపర్ణి కషాయం తదితర వాటిని వినియోగించడం. ఏ రకంగానూ ఇటు పురుగుమందులు, అటు రసాయన ఎరువులు వినియోగించకపోవడం. అలా..వరుసగా మూడేళ్లు సాగు చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లుగా పరిగణిస్తారు. కానీ అధిక దిగుబడుల కోసం చాలా మంది వి చ్చల విడిగా రసాయన మందులు వాడుతున్నారు. కల్లూరు మండలం లక్ష్మీపురం పంచాయతీలో 631 మంది మహిళలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఆ పంచాయతీలో ముగ్గురు మాత్రమే 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందుకే సరి్టఫికేషన్ కూడా ఎవరూ వెళ్లడం లేదు. అధికారులు చెబుతున్న లెక్కలన్నీ ఇలాగే ఉంటున్నాయి. పాలేకర్ స్ఫూర్తితో 150 మంది రైతులు.. ఎవరి ప్రమేయం లేకుండా స్వచ్ఛందగా జిల్లాలోని 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వీరు దాదాపు పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు. వీరు సుబాష్ పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం చేస్తుండటం విశేషం. ప్రకృతి వ్యవసాయ విభాగం చెబుతున్న వారిలో 5 శాతం కూడ ప్రకృతి వ్యవసాయం చేసే వారు లేరు. ఈ 150 మంది రైతుల ఉత్పత్తులతోనే ప్రకృతి వ్యవసాయ సిబ్బంది హడావుడి చేస్తున్నారు.34,024 ఎకరాలు అధికారుల లెక్కల ప్రకారం ప్రకృతి సాగు విస్తీర్ణం367 ప్రకృతి సాగు విభాగంలోని సిబ్బంది75,534 ఎకరాలు ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయం లక్ష్యం? ? ప్రస్తుతం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు -
చేతులు కాలినా విధానాలు మారవా?
పంజాబ్ రైతులు పత్తిలో భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదుర్కోవడానికి ఏళ్లుగా వాడిన బీటీ–1, బీటీ– 2 రెండూ విఫలమైనాయి. చేతులు కాలిన తర్వాత కూడా విధాన నిర్ణేతలు ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి గ్లైఫోసేట్)ను తట్టుకోగల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి (హెచ్‌టీబీటీ)ని అనుమతించే ప్రయత్నం కలవరపెడుతోంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలుకొట్టే విషయం ఏమిటంటే, పత్తి దిగుబడిలో భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవానికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు. జీఎం మొక్కజొన్న, జీఎం సోయా, జీఎం అల్ఫాల్ఫా పైలట్ ప్రాజెక్ట్‌లకు అమెరికా ప్రయత్నిస్తోంది. నెమ్మదిగా ఇవి జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి.ఏదో తప్పు జరుగుతోంది. 2070 నాటికి భారతదేశం నికర–జీరో ఉద్గారాలకు కట్టు బడి ఉన్న సమయంలో, మన విధాన ప్రతిస్పందన కూడా అలాగేఉండాలి. రసాయన రహిత వ్యవసాయ పద్ధతుల కోసం మార్గదర్శకా లను రూపొందించడంపై దృష్టి పెట్టాలి. కానీ హానికరమైన కలుపు నివారిణి గ్లైఫోసేట్ (గడ్డిమందు)ను పత్తి సాగులోకి విస్తృతంగా అను మతించడానికి వ్యవసాయ శాఖ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు పరిశ్రమల శ్రేణులతో జతకట్టడం కలవర పెడుతోంది.ఇది ఇక్కడితోనే ఆగదు. హెర్బిసైడ్(కలుపు నివారిణి)ని తట్టుకో గల జన్యుపరివర్తిత కొత్త తరం పత్తి(హెచ్‌టీబీటీ)ని ఆమోదించడంలోని చిక్కులను కూడా ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని నివేది కలు చెబుతున్నాయి. భారతదేశంలో వాణిజ్య సాగు కోసం ఆమోదించిన ఏకైక జన్యుమార్పిడి పంట అయిన బీటీ పత్తి విస్తీర్ణం పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లలో కుప్పకూలిన సమయంలో ఇది వస్తోంది. సాగులో 46 శాతం క్షీణత, వాయవ్య ప్రాంతాల్లో పత్తి దెబ్బతినడం మన కళ్లు తెరిపించాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా, అదే పరిష్కారంగా ముందుకు సాగడం కలవరపెడుతోంది (ఇప్పుడు కలుపు సంహారిణిని తట్టుకునే అదనపు జన్యువుతో).గతంలోనూ ఇలాగే చెప్పారు!రైతులపై, పర్యావరణంపై బీటీ పత్తిపంట కలిగించిన విధ్వంసం నుండి ఏదైనా పాఠాలు నేర్చుకుంటే తక్షణ దిద్దుబాటు జరగాలి. కానీ పరిశ్రమ లాబీ ఎంత బలమైనదంటే, మన విధాన రూపకర్తలు వాళ్ల ఒత్తిడికి ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. బీటీ పత్తి సాగు విస్తీర్ణం కనిష్ఠ స్థాయికి పడిపోయిన పంజాబ్ నుండే ఇది మొదలైంది. బీటీ–3 విత్తనాలను కేంద్రం అందుబాటులోకి తేవాలని ఆ రాష్ట్రం డిమాండ్ చేసింది. పంజాబ్ రైతులు భయంకరమైన బోల్వార్మ్ తెగుళ్ళను ఎదు ర్కోవడానికి సంవత్సరాలుగా వాడిన బీటీ పత్తి రకాలైన బీటీ–1, బీటీ– 2 (బోల్‌గార్డ్ అని పిలుస్తారు) రెండూ విఫలమై దెబ్బతిన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వినాశకరమైన తెల్లదోమ దాడి అనేకమంది రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రెండింతలు జాగ్రత్తగా ఉంటుందని నేను అనుకున్నాను. చేతులు కాలి పోయిన తర్వాత కూడా పంజాబ్ ఎలాంటి పాఠాలూ నేర్చుకోలేదు. జాతీయ స్థాయిలో విధాన నిర్ణేతలు సరేసరి.మరింత ముందుకు వెళ్ళేముందు, హెర్బిసైడ్లను తట్టుకునే జన్యు మార్పిడి పత్తి అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సులువుగా చెప్పాలంటే, హెర్బిసైడ్ని తట్టుకోవడం కోసం ఒక అద నపు జన్యువును పత్తి రకంలో చొప్పిస్తారు. ఇక్కడ గ్లైఫోసేట్ అని భావించాలి. ఇంతకుముందు మోన్ శాంటోను కొనుగోలు చేసిన బేయర్ కంపెనీ వెబ్సైట్లో, బోల్‌గార్డ్–3 (రైతులు దీనిని బీటీ–3 అని పిలుస్తున్నారు) ‘మూడు ప్రోటీన్ లతో మీ పత్తి మొక్కలను బోల్వార్మ్ నుండి, ఇతర తెగుళ్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు. పురుగు నియంత్రణను తక్కువ పిచికారీలతో అరికట్ట వచ్చనీ, పత్తికి అన్ని సీజన్లలోనూ తక్కువ నష్టం కలిగిస్తుందనీ చెప్పారు.జన్యుమార్పిడి పత్తికి చెందిన మునుపటి రెండు జాతుల పనితీరుపై కూడా ఇలాగే అతిశయించి చెప్పారు. వాస్తవ సత్యాలను మాత్రం చాలా సౌకర్యవంతంగా ఫుట్నోట్లలో పెట్టేశారు. ‘నేచర్ ప్లాంట్స్ జర్నల్’ 2020 మార్చిలో ప్రచురించిన ఒక పత్రంలో, నాగ్ పూర్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ కె.ఆర్. క్రాంతి, ప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త, వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన గ్లెన్ డేవిస్ స్టోన్ ఇద్దరూ భారతదేశంలో బీటీ పత్తి దీర్ఘకాలిక ప్రభావాన్ని పరిశీలించారు. వారి అంతిమ నిర్ధారణ ఏమిటంటే, దిగుబడి విషయంలో జన్యుమార్పిడి పత్తి పేలవంగా పనిచేసింది. పురుగుమందుల వాడకం తగ్గిన ప్రారంభ దశ తర్వాత, రసాయనాల వినియోగం వాస్తవానికి పెరిగింది. బీటీ పత్తిని విడుదల చేసిన తర్వాత భారతదేశం చూసిన ఉత్పత్తి పెరుగుదల వాస్తవానికి ఎరు వులు, నీటిపారుదల వంటి ప్రధాన ఇన్ పుట్ల పెరుగుదల కారణంగా జరిగిందే.పురుగుమందుల వాడకం విషయానికొస్తే, 2002–2013 మధ్య పత్తిపై పురుగుమందుల వాడకం 93 శాతం పెరిగింది. ఎరువుల విని యోగం 2004–2016 మధ్య 58 శాతం పెరిగింది. జన్యుమార్పిడి పత్తి సాగును చేపట్టిన 24 సంవత్సరాల తర్వాత భారత్, దిగుబడి పని తీరుకు సంబంధించి 70 దేశాలలో 36వ స్థానంలో ఉంది. బీటీ పత్తి సాగు వల్ల అధిక దిగుబడి వస్తుందనే అపోహను బద్దలు కొట్టే విషయం ఏమిటంటే, భారత్ కంటే ముందున్న చాలా దేశాలు వాస్తవా నికి జన్యుమార్పిడి రకాలను పండించడం లేదు.పత్తి సాగును మార్చడానికి విధాన నిర్ణేతలకు ఇది గుణపాఠం కాదా? ఆ విషయానికి వస్తే, ఇప్పటికే సాగులో ఉన్న రకాలతో పోలిస్తే తక్కువ దిగుబడిని ఇస్తున్నప్పటికీ జీఎం ఆవాలు అధిక దిగుబడిని ఇస్తున్నాయంటున్న వాదనలను కూడా వారు చూడకూడదా? తద్వారా, దీర్ఘకాలిక ఆరోగ్యం, పర్యావరణ ప్రభావాలను (పంటల ఉత్పాదకతలో ఎలాంటి తగ్గుదల లేకుండా) పట్టించుకుంటూ, వాతా వరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులకు మారడం వైపు దృష్టి కేంద్రీకరించవద్దా?బీటీ పత్తితో దుర్భరమైన అనుభవం వ్యవసాయ రోడ్‌మ్యాప్‌ను మళ్లీ గీయవలసిన అవసరాన్ని చూపుతుంది. స్థిరమైన ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల అగ్రిబిజినెస్ దిగ్గజం బేయర్‌తో పరిశోధనా సహకారం నెలకొల్పుకున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్(ఐకార్) వాస్తవాలను చూడటానికి నిరాకరించింది.జంట వ్యూహంఅభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి జీఎం పంటలను నెట్టడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో మెక్సికో ప్రతిఘటించిన తర్వాత నెమ్మదిగా పెద్ద మార్కెట్ అయిన భారత్ వైపు దృష్టి పెట్టింది. ఆహార భద్రతను పెంపొందించడానికి అమెరికా జన్యుమార్పిడి పంటల దిగుబడిపై దృష్టి సారించింది (వాణిజ్యపరంగా ప్రవేశపెట్టిన జన్యుమార్పిడి పంటల నుండి దిగుబడి పెరిగినట్లు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఆధారాలు లేవు). ఇథనాల్ ఉత్పత్తిలో వాడేందుకు జీఎం మొక్కజొన్న, ఇంకా జీఎం సోయా, ఎండుగడ్డి పశుగ్రాసం కోసం జీఎం అల్ఫాల్ఫా లాంటి కొన్ని పైలట్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయడా నికి కూడా ప్రయత్నిస్తోంది. జీఎం అల్ఫాల్ఫా లాంటిది వెంటనే ఆహార గొలుసులోకి వెళ్లదు కాబట్టి ప్రజల ఆమోదం పొందుతుంది. జన్యుమార్పిడి మొక్కల లోకి చొచ్చుకుపోవడానికి కూడా కొన్ని ప్రయ త్నాలు జరుగుతున్నాయి. నెమ్మదిగా ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు జన్యుమార్పిడి ఆహార పంటల తుది ప్రవేశానికి తలుపులు తెరుస్తాయి. అయితే వీటిని విమర్శించేవారి వాదనలను కొట్టిపారేసేందుకూ, జీఎం పంటలు, రసాయనాల ప్రమాదాలను తక్కువచేసి చూపేందుకూ పెద్ద ప్రయత్నాలే జరుగుతున్నాయని ఇంటర్నేషనల్ మీడియా కలెక్టివ్ పరిశోధన చెబుతోంది. ఆఖరికి సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాల సంభావ్యతను తగ్గించేందుకు కూడా దీన్ని పొడిగి స్తున్నారు. ఉదాహరణకు హార్వర్డ్ పబ్లిక్ హెల్త్ స్కూల్లోని ఒక ప్రొఫె సర్‌కు చక్కెర పరిశ్రమ భారీ సొమ్మిచ్చి, సుక్రోజుకూ, గుండె వ్యాధికీ సంబంధం లేదని చెప్పించినట్టు! వంగడానికి సిద్ధంగా ఉండే అధికార వ్యవస్థ(శాస్త్రీయ సంస్థలతో సహా) ద్వారా జీఎం పంటలను చొప్పించడం, విమర్శకులను తీవ్రంగా ఎదుర్కోవడం అనే జంట వ్యూహం రాబోయే రోజుల్లో మరింత పదునెక్కనుంది. జాగ్రత్త!దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులుఈ–మెయిల్: hunger55@gmail.com -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
50 లక్షల టన్నుల సన్నాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం పౌర సరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దసరా పండుగ తర్వాత వరి కోతలు మొదల య్యే అవకాశమున్న నేపథ్యంలో.. జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ, కార్పొరేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదనపు కలెక్టర్ల నేతృత్వంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ డిసెంబర్ నెలాఖరు వరకు సాగనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 7,185 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ శాఖ వివరాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 60.8 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. మొత్తంగా 146.70 లక్షల మెట్రిక్ టన్నులు (ఎంఎల్టీ) దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 91 లక్షల టన్నుల మేర కొనుగోలు కేంద్రాలకు వస్తుందని.. అందులో 50 లక్షల టన్నుల మేర సన్న ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ నుంచి ఆయా వివరాలు తీసుకొని జిల్లాల వారీగా సన్నాల కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7,185 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. ఇందులో సగానికిపైగా సన్న ధాన్యం సేకరణ మాత్రమే చేస్తాయని ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు.వ్యవసాయ శాఖ లెక్కల ఆధారంగా జిల్లా కలెక్టర్లే సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. ఐకేపీ, పీఏసీఎస్‌తోపాటు ఇతర సహకార సంఘాల నేతృత్వంలో కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు. ఎంపిక చేసిన రకాలు, కొలతలతో.. ‘బోనస్’ రాష్ట్రంలో పండించే ధాన్యానికి కనీస మద్ధతు ధర గ్రేడ్–ఏ రకాలకు రూ.2,320 సాధారణ రకాలకు రూ.2,300గా నిర్ణయించారు. సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఆయా రకాల ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2,800 చొప్పున చెల్లించనున్నారు. వ్యవసాయ శాఖ ఇప్పటికే 33 రకాలను సన్నాలుగా గుర్తించింది. బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్– 15048, హెచ్ఎంటీ, సో నా, జైశ్రీరాం తదితర రకాలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవేకాకుండా.. బియ్యం గింజ పొడ వు 6 మిల్లీమీటర్లు, వెడల్పు 2 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్న ఇతర రకాలను కూడా సన్నాలుగా గుర్తిస్తారు. బియ్యం గింజ పరిమాణాన్ని గుర్తించడానికి ‘గ్రెయిన్ కాలిపర్’యంత్రాలను వినియోగిస్తా రు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన గ్రెయిన్ కాలిపర్లను కొనుగోలు చేసినట్లు ప్రొ క్యూర్‌మెంట్ విభాగం అధికారి ఒకరు తెలిపారు. పెరిగిన సన్నాల సాగు..సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. చాలా జిల్లాల్లో సన్నాల సాగు పెరిగింది. వ్యవసాయ శాఖ నిర్దేశించిన 33 రకాల్లో మేలిమి రకమైన హెచ్ఎంటీ, జైశ్రీరాం వంటివాటితోపాటు ఎక్కువ దిగుబడి ఇచ్చే బీపీటీ లోని పలు వెరైటీలను రైతులు భారీ ఎత్తున సాగు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరి వేసిన 45 వేల ఎకరాల్లో పూర్తిస్థాయిలో సన్నాల సాగే జరగగా.. పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్, మంచిర్యాల జిల్లాల్లోనూ సన్నాల సాగు ఎక్కువగా జరిగింది. జనవరి నుంచే రేషన్ దుకాణాలకు ఇవ్వాలని భావిస్తున్న సన్న బియ్యానికి అవసరమైన ధాన్యం సమకూరుతుందని పౌరసరఫరాల శాఖ భావిస్తోంది. -
‘ఫసల్ బీమా’లో కొత్త పద్ధతి!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకానికి సంబంధించి కొత్త పద్ధతిని అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రీమియం సొమ్ము కంటే పరిహారపు సొమ్ము రైతులకు ఎక్కువగా చెల్లించే పరిస్థితి నెలకొంటే, బీమా కంపెనీకి నష్టం రాకుండా నిర్ణీత మొత్తంలో ప్రభుత్వం చెల్లించాలని యోచిస్తోంది.పరిహారపు సొమ్ము కంటే ప్రీమియం ఎక్కువెక్కువగా ఉంటే ముందనుకున్న లెక్క ప్రకారం నిర్ణీత మొత్తం ప్రభుత్వానికి కంపెనీ చెల్లించేలా, అటు వ్యవసాయ బీమా కంపెనీకి, ఇటు ప్రభుత్వానికి ఏ మాత్రం నష్టం జరగకుండా ఈ పథకాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అనేక సందర్భాల్లో ప్రీమియం ఎక్కువ చెల్లించగా, క్లెయిమ్స్ మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇలా కంపెనీలు తెలంగాణ నుంచి రూ. వందల కోట్ల లాభాలు పొందాయి. దీంతో గత ప్రభుత్వం ఈ పథకం నుంచి బయటకొచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొత్త పద్ధతి ప్రకారం అటు రైతులకు, ఇటు ప్రభుత్వానికి, మరోవైపు కంపెనీలకు కూడా నష్టం జరగకుండా ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీమా పథకం అమలు పంటల బీమా పథకంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ పద్ధతిలో పంటల బీమాను అమలు చేస్తున్న మధ్యప్రదేశ్‌ను అనుసరించాలని యోచి స్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలో ఇటీవల వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి పర్యటించి.. అక్కడ అమలవుతున్న పంటల బీమాను అధ్యయనం చేశారు. బీమా అమలు చేస్తున్న కంపెనీలతోనూ చర్చించారు. ఏఐ పరిజ్ఞానంతో పంట నష్టాన్ని అత్యంత సక్రమంగా అంచనా వేయొచ్చని అంటున్నారు. ప్రస్తుతం మాన్యు వల్ పద్ధతిలో నష్టాన్ని అంచనా వేస్తుండగా, పారదర్శకంగా ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు మాన్యువల్‌గానూ... మరోవైపు ఏఐ ద్వారానూ పంటల నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఆ ప్రకారం నష్టాన్ని అంచనా వేస్తే, నష్టపోయిన పంటలకు బీమా కంపెనీలు పరిహారం ఇస్తాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. సింగిల్ రైతుకూ పరిహారం ఇచ్చేలా...!జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో...పంట నష్టం జరిగిన సింగిల్ రైతుకు కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంటే రైతు యూనిట్‌గా రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తారు. గతంలో అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్‌గా వివిధ రకాలుగా పంటలను బట్టి పథకం ఉండేది. అంతేగాక సంబంధిత యూనిట్లో ఉన్న వ్యవసాయ పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే బీమా పథకం వచ్చేది. అంటే వందెకరాలుంటే... 33 ఎకరాలు దెబ్బతింటేనే పథకం కింద రైతులకు పరిహారం అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక ఎకరా, అరెకరా ఉన్న ఒక్క రైతుకు కూడా పరిహారం అందుతుంది. అయితే ఈ వెసులుబాటును అమలుచేయాలంటే బీమా కంపెనీలు ఎక్కువ ప్రీమియం వసూలు చేస్తాయని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. కాగా, రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులు ఉన్నారు. గతంలో పంటల బీమా పథకాలు అమల్లో ఉన్నప్పుడు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల మంది పంటల బీమా చేయించేవారు. ఇప్పుడు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల బీమా పరిధిలోకి వచ్చే రైతుల సంఖ్య 50 లక్షలు ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీమియం కూడా రూ. 2,500 కోట్ల మేరకు చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు. » ఓ ఉన్నతాధికారి లెక్క ప్రకారం ఉదాహరణకు ప్రభుత్వం రైతుల తరఫున బీమా కంపెనీకి కోటి రూపాయల ప్రీమియం చెల్లించిందనుకుందాం. ఒక సీజన్లో పంటల నష్టం వల్ల రైతులకు బీమా కంపెనీ రూ. 1.20 కోట్లు చెల్లిస్తే...కంపెనీకి రూ. 20 లక్షల నష్టం వచ్చినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వం రూ. 40 లక్షలు చెల్లించి... ఆ కంపెనీకి రూ. 20 లక్షలు లాభం జరిగేలా చూస్తుంది.» అలా కాకుండా అదే కోటి ప్రీమియం ప్రకారం చూసుకుంటే... పంట నష్టం జరిగి రైతులకు కంపెనీ రూ. 60 లక్షలు చెల్లిస్తే... అప్పుడు ప్రభుత్వానికి రూ.40 లక్షలు నష్టం జరిగినట్టు లేదా అదనంగా కంపెనీకి 40 శాతం ఎక్కువ ప్రీమియం సొమ్ము చెల్లించినట్టు లెక్క. అప్పుడు ప్రభుత్వానికి అంతగా నష్టం జరగకుండా కంపెనీ రూ.20 లక్షలు ఇచ్చి కొంత వెసులుబాటు ఇస్తుంది. అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. -
పత్తి కాదు..వరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి సాగు పడిపోయింది. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం ఈసారి పత్తి విస్తీర్ణాన్ని సాధారణ సాగు లక్ష్యం కంటే పెంచాలని పిలుపు ఇచ్చినా రైతులు పట్టించుకోలేదు. వరివైపే మొగ్గుచూపారు. ఈ నెలాఖరుతో వానాకాలం సీజన్ ముగుస్తున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ బుధవారం ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ సీజన్లో ఏకంగా 60 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పేర్కొంది. సాధారణ సాగు విస్తీర్ణం ప్రకారం చూసినా కనీసం 50.48 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావాలి. కానీ సర్కారు ప్రత్యేకంగా నిర్దేశించిన లక్ష్యాన్ని పక్కనపెడితే, సాధారణ విస్తీర్ణంతో పోల్చినా 86.67 శాతానికే పత్తి సాగు పరిమితమైంది. ఈ సీజన్లో కేవలం 43.76 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగయ్యింది. సర్కారు లక్ష్యంతో పోల్చుకుంటే.. ఏకంగా 16.24 లక్షల ఎకరాలు తగ్గగా, సాధారణ విస్తీర్ణంతో పోల్చుకుంటే 6.72 లక్షల ఎకరాలు తగ్గడం గమనార్హం. వరి వైపు రైతుల మొగ్గు రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.29 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకు నూటికి నూరు శాతం సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 57.18 లక్షల ఎకరాలు కాగా గతేడాది 64.61 లక్ష ల ఎకరాల్లో సాగైంది. తాజా సీజన్లో దాన్ని అధిగమించి 65.49 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 114.53 శాతం పెరిగింది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతు లు వరి వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తగ్గిన పప్పు ధాన్యాల సాగు పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గడం గమనార్హం. అన్ని రకాల పప్పుధాన్యాల సాధారణ సాగు విసీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల (69.30 శాతం) ఎకరాల్లోనే సాగైంది. కీలకమైన కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 4.99 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అలాగే పెసర సాధారణ సాగు విస్తీర్ణం 1.01 లక్షల ఎకరాలు అయితే, కేవలం 68,556 (67.38 శాతం) ఎకరాల్లోనే సాగైంది. మొక్కజొన్న 6.09 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 5.46 లక్షల (89.73 శాతం) ఎకరాల్లో, సోయాబీన్ 4.29 లక్షల ఎకరాలకు గాను ఇప్పటివరకు 4.01 లక్షల (93.47 శాతం) ఎకరాల్లో, జొన్న 70,068 ఎకరాలకు గాను 41,782 ఎకరాల్లో సాగైంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి యాసంగి పంటల సీజన్ ప్రారంభం కానుంది. -
6 లక్షల ఎకరాల్లో పంట నష్టం?
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి నల్లగొండ/సాక్షి మహబూబాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగగా, అందులో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి 4.15 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటికి పంట నష్టం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, ములుగు తదితర జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే పొలాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు అంచనాలను వేగవంతం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయో పరిశీలిస్తున్నారు. పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సీజన్లో బీమా ఇక అనుమానమే? పంట నష్టం జరిగినప్పుడు బీమా రైతులకు ధీమా ఇస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూ డా అనుమతి లభించింది. అనంతరం ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు. అయినా మార్గదర్శకాలు విడుదల చే యడంలోనూ... అమలు చేయడంలో వ్యవసాయశాఖ విఫల మైంది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందునుంచే వ్యవసాయ డైరెక్టర్ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలు తావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత వెంటనే అమలు చేసినట్లయితే ఇప్పటికే బీమా అమల్లోకి వచ్చేది. ఒక కీలక ప్రజాప్రతినిధి పంటల బీమా విషయంలో అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు వానాకాలం సీజన్ ముగుస్తుంది. ఇక ఈ సీజన్లో ఇప్పటికిప్పుడు బీమాను అమలు చేసే పరిస్థితి ఉండబోదని అధికారులు అంటున్నారు. 550 ఎకరాల్లో కొట్టుకుపోయిన వరి మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రావి రాల గ్రామంలోని పెద్ద చెరువు, కోమటి చెరువు తెగిపోయాయి. వీటి కింద 420 మంది రైతులు సాగుచేసే 550 ఎకరాల వరి మొత్తం కొట్టుకుపోయింది. 200 ఎకరాలు ఇసుక, రాళ్లతో నిండిపోయాయి. ఎకరానికి రూ.50 వేల నష్టం జరిగిందనుకున్నా, ఈ ఒక్క గ్రామంలోనే రూ.2.75 కోట్ల పంటనష్టంతో పాటు పొలం మరమ్మతు చేయాలంటే మరో రూ. కోటికి పైగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పొలం నిండా ఇసుక మేటలు నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైదం వెంకన్న అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు, దున్నడం, నాట్లు మొదలైన ఖర్చుల కోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు. భారీ వర్షం కారణంగా పడమటిగూడెంలోని గుండ్ల చెరువు తెగడంతో వరద నీరు కొమ్ముల వంచ పాత చెరువు మత్తడి తెగింది. దీంతో కింద ఉన్న వెంకన్న పొలంపై ఇసుక మేటలు కట్టా యి. పంటపోయింది. పెట్టుబడి పోయింది. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ఇసుక మేటలు తొలగిస్తే కానీ పొలం చేతికిరాదు.ఆనవాలే లేకుండా పోయిన పొలం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామానికి చెందిన గుగులోతు లోక్యాకు జానకీనగర్ రోడ్డులో రెండెకరాల భూమి ఉంది. అందులో 20 రోజుల కిందట వరినాట్లు వేశారు. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి పొలమంతా ఇసుక మేట వేసింది. పొలం ఆనవాళ్లే లేకుండా పోయింది. తిరిగి నాటు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అప్పు చేసి రూ.40 వేల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నాడు. -
రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశాం
సాక్షి, హైదరాబాద్/ నల్లగొండ టౌన్: తాము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రూ.2 లక్షలలోపు రుణాలున్న రైతులందరికీ రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. రాష్ట్రంలోని 3,292 బ్యాంకుల బ్రాంచీలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి సేకరించిన పంట రుణాల వివరాలతో.. డిసెంబర్ 9వ తేదీని కటాఫ్‌గా తీసుకుని రుణమాఫీ అమలు చేశామని వివరించారు. ఈ మేరకు శనివారం మంత్రి తుమ్మల ఒక ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ విధివిధానాలను ప్రకటించిన మూడు రోజుల్లోనే తొలివిడత కింద రూ.లక్ష లోపు రుణాలున్న 11.50లక్షల మంది రైతులకు రూ.6,098.93 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షలలోపు రుణాలున్న 6,40,823 ఖాతాదారులకు రూ.6190.01 కోట్లు, పంద్రాగస్టు నాడు రూ.2లక్షలలోపు రుణాలున్న 4,46,832 ఖాతాల్లో రూ.5,644.24 కోట్లు.. కలిపి మొత్తంగా 22.37 లక్షల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లను జమ చేయడం ద్వారా వారందర్నీ రుణవిముక్తులను చేశామని తెలిపారు. తగిన రికార్డులిస్తే మాఫీ చేస్తాం.. రేషన్‌కార్డు కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే పరిగణనలోకి తీసుకున్నామని, అది మాఫీకి ప్రామాణికం కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఆధార్‌కార్డులో తప్పులు, రేషన్‌కార్డు లేనివారు, ఇతర కారణాలతో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ కాని వారు దగ్గరలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి, తగిన రికార్డులు సమర్పిస్తే త్వరలో రుణమాఫీ వర్తింపజేస్తామని వివరించారు. రూ.2 లక్షల కంటే అధికంగా రుణాలున్నవారు.. సదరు అధిక మొత్తాన్ని బ్యాంకు లో జమచేస్తే, వారికి రుణమాఫీ చేయడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. కానీ రైతులను అయోమయానికి గురిచేసేలా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరమని మండిపడ్డారు. తొలి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి, వాటికి సంబంధించిన 44.95 కోట్ల నిధులను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇక కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమ స్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.70,000 నుండి రూ.80,000లోపు రుణాలున్న ఖాతాలకు సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకుంటున్నట్టు వివరించారు. ప్రతిపక్ష నేతలు ని జంగా రైతు సంక్షేమాన్ని కోరేవారే అయితే.. ముందుగా వారు గత పదేళ్లలో చెల్లించకుండా వదిలేసిన రుణాల వివరాలు తెప్పించుకొని చెల్లించాలని వ్యా ఖ్యానించారు. గత ప్రభుత్వం చెల్లించని పలు పథ కాల బకాయిలను తాము చెల్లించామని తెలిపారు. రుణమాఫీపై అర్థంలేని విమర్శలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని మంత్రి తుమ్మల మండిపడ్డారు. శనివారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘అగ్రి షో’ను శనివారం ఆయన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ.2 లక్షలకు మించి ఉంటే ముందు కట్టండిఆ తర్వాత రుణమాఫీ చేస్తామంటూ రైతులకువ్యవసాయ శాఖ సూచనసాక్షి, హైదరాబాద్: రూ.2 లక్షలకు మించి రుణాలున్న రైతులు.. అదనపు సొమ్మును బ్యాంకులో కట్టాలని, మిగతా రెండు లక్షలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖ పేర్కొంది. ఉదాహరణకు ఒక రైతుకు రూ.2.10 లక్షల రుణముంటే.. అదనంగా ఉన్న రూ.10 వేలు బ్యాంకులో జమ చేస్తే, తర్వాత ప్రభుత్వం రూ.2 లక్షలను బ్యాంకులో జమ చేస్తుందని తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఒక ప్రకటన జారీ చేసింది.ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు తదితర వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉందని తెలిపింది. రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, వివరాలను సరిచేసుకుంటే వారి ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని ప్రకటించింది. బ్యాంకులు, ఖాతాల్లో పలు సాంకేతిక పొరపాట్ల వల్ల దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని... ఆ తప్పులను సరిచేసి, ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి నిధులు పంపిస్తున్నామని తెలిపింది. అందువల్ల రూ.2 లక్షలలోపు రుణాలుండి ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి, అందుకు కారణం తెలుసుకోవాలని సూచించింది. కుటుంబ నిర్ధారణ జరగని కారణంగా రుణమాఫీ కాలేదని ఫిర్యాదులుంటే అధికారులు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తారని.. ఆ రైతు కుటుంబంలోని వారి ఆధార్ కార్డులు, ఇతర వివరాలను తీసుకుని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారని వివరించింది. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నెలరోజుల్లోగా పరిశీలించి, అర్హులైన వారికి రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించింది. -
తగ్గిన ‘సాగు’పై అధికారుల ఆరా
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ‘సాగు ఢమాల్.. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన సాగు విస్తీర్ణం’శీర్షికన ‘సాక్షి’మెయిన్‌లో శనివారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ కథనంలో వచ్చిన వివరాలను ఆరా తీయడంకోసం వ్యవసాయశాఖ.. మహబూబ్‌నగర్ జిల్లాలోని రైతు వద్దకు సంబంధిత అధికారులను పంపి వివరాలు సేకరించింది. ‘సాక్షి’కి తన అభిప్రాయాన్ని తెలియజేసిన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని మాచన్‌పల్లికి చెందిన రైతు మల్లు వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు ఏఈఓ ఎండీ హనీఫ్ వెళ్లి ఆయన పొలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. తనకు సొంతంగా నాలుగున్నర ఎకరాల పొలం ఉందని, దాంతోపాటు 20 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటానని, ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో కేవలం మూడున్నర ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగు చేశానని, మిగతా 17 ఎకరాల్లో పంట సాగు చేయడానికి భారీ వర్షాలు రాకపోవడమే కాకుండా బోర్లలో సరిపడా నీరు ఇంకా పెరగలేదని ఆ రైతు ఏఈఓకు వివరించారు. 17 ఎకరాలకు సరిపడా నారుమడి సిద్ధంగా ఉందని, భారీ వర్షం కోసం ఎదురు చూస్తున్నానని ఆయన తెలిపారు. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో పంటల సాగు ఇంత అధ్వానంగా ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెదవి విరిచినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే వాస్తవాలు తెలుసుకోవడానికి అధికారులను రైతుల వద్దకు పంపినట్లు తెలిసింది. -
రైతు రుణమాఫీపై రగడ!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. తమకు రుణమాఫీ జరగలేదంటూ రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఏఈవో, ఏవో, ఏడీఏ, డీఏవో స్థాయి అధికారులకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. అలాగే కొన్నిచోట్ల ఎమ్మార్వో కార్యాలయాలకు కూడా ఫిర్యాదులు వచి్చనట్లు సమాచారం. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారమే రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వేలాది ఫిర్యాదులు అందాయి. మరోవైపు అనేకచోట్ల రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.తమకు లక్ష రూపాయల లోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ జరగలేదంటూ నిలదీస్తున్నారు. అయితే ఇటు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి గానీ, బ్యాంకర్ల నుంచి గానీ సరైన సమాధానం రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఎందుకు రాలేదో తమకు తెలియదంటున్నారని వాపోతున్నారు. ఏ నిబంధనల వల్ల లక్షలాది మంది రైతులకు రుణమాఫీ జరగలేదో తమకూ అంతుబట్టడం లేదని అధికారులంటున్నట్లు తెలిసింది. అయితే పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్‌కార్డు లేకపోవడం వంటివే అనేకమంది రైతులను రుణమాఫీకి అనర్హులుగా చేశాయని వ్యవసాయ శాఖ అధికారులు కొందరు పేర్కొంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రచారం జరుగుతుండగా, దీనిపై స్పష్టత లేకపోవడం, మరోవైపు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులందుతుండటంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులున్నారు. గురువారం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం.. దాదాపు 11.50 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6,098 కోట్లు బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. కాగా లక్ష రూపాయల లోపే రుణం ఉన్నప్పటికీ మాఫీ జరగని లక్షలాది మంది రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఖమ్మం జిల్లాలో 20% నుంచి 30% లోపుగానే.. ఖమ్మం జిల్లాలో 20 శాతం నుంచి 30 శాతం లోపుగానే లక్ష లోపు రుణాలు మాఫీ అయ్యాయి. ఖమ్మం డీసీసీబీలో ఏకంగా లక్ష మందికి పైగా రుణమాఫీ కాకపోవడంపై చర్చ జరుగుతోంది. జిల్లాలో 57,857 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. అయితే చాలామందికి రుణమాఫీ కాకపోవడంతో శుక్రవారం రైతులు సహకార సొసైటీలు, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. తమకు అన్ని అర్హతలున్నా ఎందుకు మాఫీ కాలేదంటూ అధికారులను అడిగారు. టోల్‌ప్రీ నంబర్లు ఏర్పాటు ఈ నేపథ్యంలో రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలుగా ఖమ్మం కలెక్టరేట్లో 1950తో పాటు 90632 11298 టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా స్థాయిలో ఐటీ పోర్టల్, మండల స్థాయిలో సహాయ కేంద్రాల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదు నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. 2022 నవంబర్‌లో మహబూబాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.70 వేల పంట రుణం తీసుకున్నా. దానిని 2023లో రెన్యువల్ చేయించుకోగా బ్యాంకు అధికారులు తిరిగి రూ.85 వేల రుణం ఇచ్చారు. ఈ రూ.85 వేల రుణం మాఫీ కాలేదు. నాక్కూడా రుణమాఫీ వర్తింపజేయాలని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. – అజీ్మర వెంకన్న, దామ్యతండా, మహబూబాబాద్ మండలం నాతోటి వ్యక్తికయ్యింది..నాకు కాలేదు నాకు తడ్కల్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.42 వేల పంట రుణం ఉంది. ఏటా లోన్‌ను రెన్యువల్ చేస్తున్నా. ఈసారి నా రుణం మాఫీ అవుతుందని అనుకున్నా. కానీ కాలేదు. నాతో పాటు రుణం తీసుకొన్న వారి పేరు రుణమాఫీ జాబితాలో ఉంది. దీనిపై వ్యవసాయాధికారులను అడిగినా ఏమీ చెప్పడం లేదు. – కొండాపురం పెద్దగోవింద్రావు, బాన్సువాడ, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉమ్మడి మెదక్ డీసీసీబీ పరిధిలో సుమారు 42 వేల మంది రైతులు లక్ష లోపు రుణమాఫీ అర్హులు. వీరికి రూ.162 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. కానీ కేవలం 19,542 మంది రైతులకు రూ.75 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. అంటే కేవలం 45 శాతం మంది రైతులకు మాత్రమే మాఫీ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులు 51,417 మంది ఉండగా.. వీరికి రూ.236.54 కోట్లు మాఫీ కావాల్సి ఉంది.కానీ 20,130 మంది రైతులకు రూ.92.02 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. దీంతో మాఫీకాని వారు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 72,513 మంది ఉండగా, 33,913 మందికి సంబంధించిన రూ.143.10 కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయి. మిగతా వారికి మాఫీ జరగలేదు. ఇక వరంగల్ డీసీసీబీ పరిధిలో లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు 57,129 మంది కాగా 23,841 మంది రైతుల ఖాతాల్లోనే మాఫీ సొమ్ము జమైంది. దీంతో మిగిలిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేడే లక్ష రుణమాఫీ.. ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ ప్రక్రియలో మొదటి విడతగా గురువారం రూ.లక్ష వరకు రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారులు బుధవారం ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి ఆధ్వర్యంలో ఈ ట్రయల్ రన్ జరిగింది. రుణమాఫీ ప్రక్రియ సజావుగా జరిగేందుకు దీనిని నిర్వహించారు. అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల్లో సంబురాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ నిధులను విడుదల చేసిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆన్లైన్లో రైతులతో మాట్లాడనున్నారు. కొన్ని గ్రామాల్లో గందరగోళం రైతు వేదికల్లో వేడుకలకు సంబంధించి స్థానిక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతులను తరలించనున్నారు. ఇలావుండగా రుణమాఫీకి సంబంధించి అధికారులు రూపొందించిన జాబితాపై అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో గందరగోళం నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. -
రాష్ట్రంలో డీఏపీ కొరత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీఏపీ కొరత నెలకొంది. ఫలితంగా కీలకమైన వానాకాలం పంటల సీజన్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు పుంజుకుంటున్న తరుణంలో కొరత ఏర్పడటంతో అనేక చోట్ల డీఏపీ బ్లాక్ మార్కెట్లోకి వెళుతున్నట్లు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 1.12 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా, కేంద్రం 43 వేల మెట్రిక్ టన్నులను మాత్రమే సరఫరా చేసింది. దీంతో కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంపై గత నెల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి జె.పి.నడ్డాకు ఎరువుల కేటాయింపుల పెంపుపై లేఖ రాశారు. జూలై నెలలో 80 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు ఎరువులను, ముఖ్యంగా డీఏపీని కేటాయిస్తామని హామీయిచ్చారని అప్పట్లో తుమ్మల తెలిపారు. అయితే ఇప్పుడు డీఏపీ సరఫరాపై కేంద్రం స్పష్టత ఇవ్వడంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీజన్లో కావాల్సిన డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు ఈ వానాకాలం సీజన్‌కు 24.40 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో యూరియానే 10.40 లక్షల మెట్రిక్ టన్నులు ఉండటం గమనార్హం. యూరియాతోపాటు డీఏపీ 2.40 లక్షల మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 10 లక్షల మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 60 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ లక్ష టన్నులు రైతులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఆ క్రమంలోనే అత్యధికంగా మే, జూన్ నెలల్లో 4.60 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున ఎరువులు కేటాయించారు. అంటే ఆ రెండు నెలలకే 9.20 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. కానీ కేంద్రం నుంచి డీఏపీ సరైన సమయానికి రాలేదు. ఏప్రిల్, మే నెలలకు కేటాయించాల్సిన దాంట్లో కేవలం మూడో వంతే రాష్ట్రానికి సరఫరా అయింది. ఈ విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ సరిగ్గా పర్యవేక్షణ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులను అధికారులు మభ్యపెడుతున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. -
విత్తన సహకార సంస్థ ఏర్పాటు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా విత్తన ఉత్పత్తి, సేంద్రియ ఉత్పత్తుల సహకార సంస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, విత్తన ఉత్పత్తుల్లో నిమగ్నమైన రైతులకు నేరుగా ప్రయోజనం కలుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సహకార సంఘాలకు గురువారం జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా అవార్డులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. రైతులనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో సహకార ఉద్యమం దాదాపు 125 సంవత్సరాల నుంచి ఉందని, కానీ సకాలంలో మార్పులు చేయకపోవడం వల్ల అది కాలం చెల్లినట్లు కనిపిస్తోందని అన్నారు. సహకార రంగం ఈ కాలపు అవసరాలకు అనుగుణంగా బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పటిష్టతకు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేయడం చాలా ముఖ్యమని, ఇందు కోసం ప్రభుత్వం ద్వారా అనేక చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. కాగా, ఈ కార్య క్రమంలో ఐదు సహకార సంఘాలకు అవార్డు లతో పాటు రూ.25 వేల నగదు బహుమతిని అందజేశారు. టీజీకాబ్ చైర్మన్ ఎం.రవీందర్రావు, ఎండీ గోపి, ఎన్సీడీసీ రీజనల్ డైరెక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగుల హాజరుపై నివేదిక ఇవ్వండివ్యవసాయ శాఖ డైరెక్టరేట్ పరిధిలో ఉద్యోగుల హాజరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ సంచాలకుడిని ఆదేశించారు. గురువారం మంత్రి బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు సమయానికి రాని విషయాన్ని గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల హాజరు తీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి ఈ సందర్భంగా డైరెక్టర్‌ను ఆదేశించారు. -
46 లక్షల ఎకరాల్లో పంటల సాగు
సాక్షి, హైదరాబాద్: వానాకాలం పంటల సాగును ఈ సారి పెద్ద ఎత్తున చేపడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు అధికంగా పంటలు వేస్తున్నారు. గత సంవత్సరం వానాకాలంలో ఇదే సమయానికి 25.79 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా, ఈ సీజన్లో బుధవారం నాటికి 46.85 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ ఏడాది వానాకాలం అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.76 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. ఇప్పటివరకు వేసిన పంటల్లో అత్యధికంగా పత్తి ఏకంగా 33.81 లక్షల ఎకరాల్లో సాగైంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.48 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 66.97 శాతం వేశారు. ఈ ఏడాది పత్తిని 60 లక్షల ఎకరాల్లో పండించాలని చేయాలని ప్రభుత్వం రైతులకు పిలుపునిచ్చింది. కాగా, వరి సాధారణ సాగు విసీర్తం 57.18 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.71 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అంటే మూడు శాతానికే పరిమితమైంది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 8.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.81 లక్షల ఎకరాల్లో వేశారు. అందులో ఒక్క కంది పంటనే 2.37 లక్షల ఎకరాలు కావడం గమనార్హం. మొక్కజొన్న సాధారణ సాగు విసీర్ణం 6.09 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.92 లక్షల ఎకరాలు సాగైంది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 2.55 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 99.96 శాతం.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు సాగైన జిల్లాల్లో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. ఈ జిల్లా సాధారణ పంటల సాగు విస్తీర్ణం 5,62,594 ఎకరాలు కాగా, 5,62,386 ఎకరాల్లో సాగైంది. అంటే 99.96 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇంత తక్కువ కాలంలో ఇంత సాగు కావడం విశేషం. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 8.16 శాతం విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఆయా ప్రాంతాలను బట్టి సాధారణం, అధికం, అత్యధిక వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తెలిపింది. 17 జిల్లాల్లో అధికం నుంచి అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. నారాయణపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగాం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏ జిల్లాలోనూ లోటు వర్షపాతం నమోదు కాలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. -
నాలుగు పథకాలకు రూ.60 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న 3 నెలల్లో రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా పథకాలకు రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది ప్రభుత్వానికి భారమైనా.. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి సాహసోపేతమైన నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రానున్న కాలంలో ఆర్థిక వెసులుబాటును బట్టి ఒక్కొక్కటిగా అన్ని పథకాలను పునరుద్ధరిస్తామని, ఇప్పటికే మట్టి నమూనా పరీక్ష కేంద్రాలను తిరిగి వాడుకలోకి తెచ్చి భూసార పరీక్షలు ప్రారంభించిన విషయాన్ని తుమ్మల గుర్తుచేశారు. రైతుబీమాలో 1,222 క్లెయిమ్స్ వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెండింగ్ ఉంటే చనిపోయిన రైతు కుటుంబాలకు మనం అందించే ఆసరా సకాలంలో అందుతుందా? లేదా? అన్నది పరిశీలించాలని పేర్కొన్నారు. పంటల నమోదులో కచ్చితత్వం ఉండాలని, ఇది అన్నింటికీ ప్రాతిపదిక అన్నారు. ఆయిల్ పామ్ ప్రాజెక్ట్ చేపట్టి మూడేళ్లయినా ఇంకా రెండు శాఖల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేదని తుమ్మల అసంతృప్తి వ్యక్తంచేశారు. 2023–24 సంవత్సరంలో 2.30 లక్షల ఎకరాల లక్ష్యానికి గాను కేవలం 59,200 ఎకరాలు మాత్రమే పురోగతి ఉందన్నారు. హెచ్‌ఈవోలు లేనిచోట ఏఈవోలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. రైతును ఎంపిక చేయడం నుంచి డ్రిప్ ఇన్స్టాల్ చేయించడం, మొక్కలు నాటించడం వరకు అన్నింటిపై ఏఈవో, ఏవో బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు సబ్సిడీపై ఇతర పంటలు సాగుచేసే రైతులకు కూడా ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్, డైరెక్టర్ గోపి, ఉద్యాన డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. -
మూడు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఉత్తర, తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, అలాగే వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణ స్థితిలో నమోదైనప్పటికీ.. కొన్ని జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం ఉంది. ఈ మూడు రోజుల పాటు వర్షాలు ఆశాజనకంగా ఉంటే రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 13.07 సెంటీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో నైరుతి సీజన్లో జూన్ నెలలో కురవాల్సిన సగటు వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఈ నెలలో గురువారం నాటికి నమోదు కావాల్సిన సగటు వర్షపాతం 11.14 సెంటీమీటర్లు కాగా.. 13.07 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, మూడు జిల్లాల్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. 16 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 8 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు చెపుతున్నాయి. సాగు పనులు ముందుకెళ్లాలంటే ఈ వారం వర్షాలే కీలకం కానున్నాయి. సాగు విస్తీర్ణం పెరుగుదలకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
రైతు భరోసాకు పదెకరాలు పరిమితి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా పథకానికి పరిమితులు విధించాలని.. గతంలో మాదిరి అందరికీ కాకుండా, పదెకరాల వరకు భూములున్న రైతులకే పెట్టుబడి సాయం అందించాలని రైతులు పేర్కొన్నారు. కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకు పరిమితి పెట్టినా మంచిదేనని అన్నారు. చాలా మంది రైతులు సాగులో ఉన్న భూమికి, సాగుచేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని కోరారు. ఆదాయ పన్ను చెల్లించే రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కోరారు. విదేశాలకు వెళ్లే తమ పిల్లల విద్యా రుణాల కోసం బ్యాంకులకు ఆదాయ పన్ను స్టేట్మెంట్లు చూపించాల్సి వస్తుందని.. కాబట్టి ఆదాయ పన్ను చెల్లించేవారికి కూడా రైతుభరోసా ఇవ్వాలని సూచించారు. ప్రతీ వారం నిర్వహించే ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ‘రైతు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు వంటి వాటికి రైతు భరోసాను నిలిపివేయాలని కోరారు.దొడ్డు రకాల వరికీ బోనస్ ఇవ్వాలిసన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. చాలా మంది రైతులు దొడ్డు రకం వరికి కూడా బోనస్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో దొడ్డు వరి సాగు చేసేవారే ఎక్కువని, వారికీ బోనస్ ఇస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని పేర్కొన్నారు. సన్న రకాలకు ఎటూ డిమాండ్ ఉంటుందని.. మార్కెట్లోనూ మద్దతు ధర కంటే ఎక్కువగా రేటు పలుకుతుందని వివరించారు. ఇక సీజన్ సమయంలో పంటల సాగుకు అవసరమైన కూలీల కొరత ఉంటుందని.. దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుందని అనేక మంది రైతులు వాపోయారు. అందువల్ల వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయ యంత్రాల సరఫరా నిలిచిపోయిందని, దాంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.రైతుబంధుతో రూ.25,670 కోట్లు వృథా: మంత్రి తుమ్మలగతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు వర్తింపజేసి.. 12 విడతల్లో దాదాపు రూ.25,670 కోట్ల ప్రజాధనం వృధా చేశారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు. 93 శాతం వాటా ఉన్న సన్న, చిన్నకారు రైతుల వాటా రైతుబంధు మొత్తంలో 68 శాతం కూడా లేదని.. దానికితోడు 17.5 శాతం ఉన్న కౌలు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం రైతుబంధు స్థానంలో రైతుభరోసా పథకాన్ని తీసుకొస్తోందని, పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ.15 వేలకు పెంచుతున్నామని చెప్పారు. అయితే రైతుబంధు తరహాలో ప్రజాధనం వృథా కాకుండా ఉండేలా పటిష్ట విధానాల రూపకల్పనకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. రైతునేస్తం కార్యక్రమంలో రైతులు వెల్లడించిన, రాత పూర్వకంగా సేకరించిన సూచనలను క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం రైతుభరోసాకు సంబంధించి ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని.. పూర్తిగా అందరి అభిప్రాయాలు తీసుకున్నాక, శాసనసభలో చర్చించాక పథకాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఆలస్యమైనప్పటికీ అర్హులకు మాత్రమే అందేలా రైతుభరోసాకు రూపకల్పన చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రైతుసంఘం నాయకుడు అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత పంటల బీమాను కొనసాగించాల్సిందే
సాక్షి, అమరావతి: మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు రాసిన లేఖను సంఘ అధ్యక్షుడు వి.కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శులు కె.ప్రభాకరరెడ్డి ఆదివారం మీడియాకు విడుదల చేశారు. రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని, రబీలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు పరిహారం, సున్నా వడ్డీ రాయితీలను జమ చేయాలని, వ్యవసాయ విద్యుత్ మీటర్ల ఏర్పాటు జీవోను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రైతు భరోసా కేంద్రాలను అభివృద్ధి చేసి, రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావాలని, సొసైటీలకు పాలు పోసే రైతులకు లీటర్‌కు రూ.5, బోనస్ ఇవ్వాలని, మూతపడిన డెయిరీలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. మద్దతు ధరపై ప్రతి పంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని, ఆహార, పప్పుధాన్యాలు, వాణిజ్య, ఉద్యాన పంటలన్నిటికి మద్దతు ధరలు ప్రకటించాలని కోరింది. రబీలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన రూ.1,600 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని, రైతుల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అప్పుల పాలైన రైతులు బకాయిపడిన రూ.2 లక్షల వ్యవసాయ రుణాలను రద్దు చేయాలని కోరింది.చక్కెర కర్మాగారాల్ని పునరుద్ధరించాలిరాష్ట్రంలోని 32 లక్షల కౌలు రైతులకు యజమాని సంతకంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన బ్యాంక్ రుణాలు, ఇతర సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘం కోరింది. రాష్ట్రంలో మూతపడిన 25 చక్కెర కర్మాగారాలను వెంటనే పునరుద్ధరించాలని, పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరింది. -
17 లక్షల ఎకరాల్లో సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 19 వరకు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి 15.60 లక్షల ఎకరాలు, కంది 76 వేల ఎకరాల్లో సాగయిందని చెప్పారు. రానున్న రోజుల్లో వరినాట్లు, ఆరుతడి పంటల సాగు ఊపందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సచివాలయంలో వానాకాలం పంటల సాగు, ఎరువుల నిల్వ, సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేస్తే కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలని, అదే విధంగా విక్రయాలను పరిశీలించాలని సూచించారు. 10.40 ఎల్ఎంటీల యూరియా కేటాయింపు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) యూరియా, 2.40 ఎల్ఎంటీల డీఏపీ, 10.00 ఎల్ఎంటీల కాంప్లెక్స్ , 0.60 ఎల్ఎంటీల ఎంవోపీ ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. జూలై చివరి నాటికి 5.65 ఎల్ఎంటీల యూరియా అవసరం కాగా ఇప్పటికే 8.35 ఎల్ఎంటీల యూరియా, అలాగే 1.57 ఎల్ఎంటీల డీఏపీ, 1.30 ఎల్ఎంటీల కాంప్లెక్స్, 0.38 ఎల్ఎంటీల ఎంవోపీ అందుబాటులో తెచ్చామన్నారు. 1.07 ఎల్ఎంటీల యూరియా, 0.54 ఎల్ఎంటీల డీఏపీ, 1.06 ఎల్ఎంటీల కాంప్లెక్స్ ఎరువులను రైతులు కొనుగోలు చేశారని మంత్రికి అధికారులు వివరించారు. ఆగస్టు వరకు సరిపడా ఎరువుల కోసం కేంద్ర మంత్రికి లేఖఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులను వీలైనంత త్వరగా రాష్ట్రానికి సరఫరా చేయాలని కోరుతూ కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ మంత్రి జేపీ నడ్డాకు మంత్రి లేఖ రాశారు. వానాకాలం పంటలు తెలంగాణలో ముందుగా ప్రారంభమవుతాయని, దానికి తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే రెండు నెలలకు సరిపడా ఎరువులను ముందుగానే తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని తెలిపారు. రాష్ట్ర కేటాయింపుల ప్రకారం ఆగస్టు నెల వరకు కేటాయించిన డీఏపీ, ఇతర ఎరువులను వెంటనే సరఫరా చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. -
వ్యవసాయానికి రూ.1.34 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వ్యవసాయ రంగానికి రూ.1.34 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. 2024–25 రాష్ట్ర స్థాయి రుణ ప్రణాళికను రూ.6.33 లక్షల కోట్లుగా ఖరారు చేసింది. ఇది గత ఏడాది కంటే 161 శాతం అధికం కావడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం ఈ రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో భట్టి మాట్లాడారు. బ్యాంకర్లకు సామాజిక, మానవీయ కోణం ఉండాలని సూచించారు. బ్యాంకర్లకు పాజిటివ్ ధృక్పథం లేకపోతే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కోరారు. బలహీన వర్గాలకు విరివిగా రుణాలు ఇస్తేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితో రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడనుందని భట్టి చెప్పారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా పెండింగ్‌లో పెట్టదని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. సన్న చిన్నకారు రైతులపై చిన్నచూపు: మంత్రి తుమ్మల వ్యవసాయ రంగానికి సంబంధించి గత సంవత్సరం కంటే రూ.13 వేల కోట్ల రుణాలు అధికంగా మంజూరు చేసినప్పటికీ, సన్న చిన్నకారు రైతుల వాటా అనుకున్నంత మేర లేదని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రంలో 73.11 శాతం భూములు వారి చేతిలోనే ఉన్నాయని, వీరికి ఇచ్చే రుణాలను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ బ్యాంకులకు చెందిన 6,415 శాఖల ద్వారా సేవలందిస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 1,874 మాత్రమే ఉన్నాయన్నారు. వాటిని పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకుల నుండి ప్రోత్సాహం కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ కమల్ ప్రసాద్ పటా్నయక్, నాబార్డు సీజీఎం సుశీల్ చింతల, ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్‌కుమార్, ఎస్బీఐ జనరల్ మేనేజర్ దేబశిష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. రుణాల కేటాయింపులు ఇలా... – 2024–25 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,33,777 కోట్లు – ప్రాధాన్య రంగాలకు అడ్వాన్సులు రూ.2,80,550 కోట్లు – వ్యవసాయ రంగానికి రూ.1,34,138 కోట్లు – వ్యవసాయ రంగ కేటాయింపుల్లో పంట రుణాలకు రూ.81,478 కోట్లు. (గతం కంటే 10.95% పెరుగుదల), వ్యవసాయ పెట్టుబడులకు రూ.28,222 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.5,197 కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు రూ.19,239 కోట్లు – సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రూ.1,29,635 కోట్లు – గృహ రుణాలు రూ.10,768 కోట్లు – విద్యా రుణాలు రూ.2,706 కోట్లు – ఇతర రంగాలకు రూ.3,301 కోట్లు – 2023–24లో మొత్తం డిపాజిట్లు రూ.7,79,953 కోట్లు (గతం కంటే రూ. 96,547 కోట్లు వృద్ధి) – మొత్తం అడ్వాన్సులు రూ.9,79,058 కోట్లు (గతం కంటే రూ.1,65,162 కోట్ల వృద్ధి) – పంట రుణాలు రూ.64,940 కోట్లు. (లక్ష్యంలో 88.42% మంజూరు) – వ్యవసాయ పెట్టుబడి రుణాలు, అనుబంధ రంగాలు, కార్యక్రమాలకు రూ. 47,935 కోట్లు (లక్ష్యంలో 121.89% ఇచ్చారు) -
పాత పద్ధతిలోనే రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్‌లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన. సీజన్‌కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది. మార్గదర్శకాలపై కసరత్తు రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. -
అపరాలలోనూ విత్తన మార్పిడి
సాక్షి, అమరావతి: విత్తన మార్పిడిపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టింది. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రకాల స్థానంలో కొత్తగా అభివృద్ధి చేసిన వంగడాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఖరీఫ్, రబీ సీజన్లలో విస్తారంగా సాగయ్యే అపరాలతో పాటు రబీ సీజన్లో ఎక్కువగా సాగయ్యే శనగలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టాటలని నిర్ణయించింది. ఖరీఫ్‌లో వరి తర్వాత ఎక్కువగా 5.9 లక్షల ఎకరాల్లో కందులు, 1.5 లక్షల ఎకరాల్లో మినుములు, పెసలుతో పాటు ఇతర అపరాలు సాగువుతుంటాయి.రబీలో వరి తర్వాత 10.92 లక్షల ఎకరాల్లో శనగ, 7.25 లక్షల ఎకరాల్లో మినుము, 1.75 లక్షల ఎకరాల్లో పెసలు, మరో 1.10 లక్షల ఎకరాల్లో ఇతర అపరాలు సాగవుతుంటాయి. అపరాలు, శనగలలో కొన్ని రకాలు 30 ఏళ్లకు పైబడి సాగులో ఉన్నాయి. ప్రధానంగా ఖరీఫ్‌లో కందులులో ఎల్‌ఆర్‌జీ 52 (2015) వంగడం 1.50 లక్షల ఎకరాలలో సాగవుతుండగా, ఎల్‌ఆర్‌జీ 41 రకం (2007) 29వేల ఎకరాలు, ఆషా (1992) వంగడం 11వేల ఎకరాల్లో సాగవుతోంది. మినుములో పీయూ–31 (2005) రకం 58 వేల ఎకరాల్లో సాగవుతోంది. రబీలో శనగలు అత్యధికంగా 1999లో విడుదలైన జేజీ–11 రకం ఏకంగా 7.25 లక్షల ఎకరాల్లో, కేఏకే–2 (2000) రకం 44 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ రకాలు చీడ పీడలను తట్టుకోలేకపోతున్నాయి. తుపాన్లు, వర్షాల సమయంలో ముంపునకు గురై రైతులకు భారీ నష్టాన్ని మిగులుస్తున్నాయి. వీటికి ప్రత్యామ్నాయంగా ఇటీవల విడుదలైన తెగుళ్లను తట్టుకుంటూ అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రోత్సహించేలా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. దశలవారీగా విస్తరణ డీఏఏటీఐ, కేవీకే శాస్త్రవేత్తలు, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో జిల్లా స్థాయిలో నిర్వహించిన సదస్సులతో కొత్త విత్తనాల సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. దశలవారీగా కొత్త రకాల సాగును విస్తరించనుంది. 2024–25 సీజన్లో 10 శాతం, 2025–26 సీజన్లో 15 శాతం, 2026–27లో 25 శాతం విస్తీర్ణంలో విత్తన మారి్పడి చేయనున్నారు. తరువాత సంవత్సరాల్లో ఇదే విధానం కొనసాగుతుంది. ఈ విత్తనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. కొత్త రకాల ప్రత్యేకతను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాల్ పోస్టర్లు, కరపత్రాలు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతుల సందేశాలతో కూడిన వీడియోలు, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా వివరిస్తారు. మినుములో ప్రత్యామ్నాయ రకాలు » పీయూ–31కు బదులుగా ఖరీఫ్ సీజన్లో ఎల్బీజీ 884, టీబీజీ 104, వీబీఎన్8, ఎల్జీబీ 904, జీబీజీ1, టీబీజీ 129, ఎల్బీజీ 787, ఎల్బీజీ 752 ప్రవేశపెడతారు. రబీలో ఎల్బీజీ 752 మినహా మిగిలిన వంగడాల సాగును ప్రోత్సహిస్తారు. » తరచూ తెగుళ్ల బారిన పడుతున్న ఐపీయూ 2–43 కి ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్బీజీ 904 రకం » ఎల్బీజీ 752కు బదులుగా ఖరీఫ్‌లో టీబీజీ 129, రబీలో టీబీజీ 104, వీబీఎన్ 8, ఎల్బీజీ 904, జీబీజీ1, ఎల్బీజీ 787 » టీ–9కు బదులుగా రెండు సీజన్లలో ఎల్బీజీ 884 రకాన్ని, టీబీజీ 104కు బదులుగా ఎల్బీజీ 904 రకం ఏపీ సీడ్స్ ద్వారా సర్టిఫైడ్ సీడ్ ఉత్పత్తి బ్రీడర్ విత్తనాన్ని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉత్పత్తి చేసింది. ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనాన్ని పండిస్తారు. ఈ మూల విత్తనాన్ని ఏపీ సీడ్స్ ఎంపిక చేసిన రైతుల క్షేత్రాల్లో నాటి సరి్టఫైడ్ సీడ్‌ను పండిస్తారు. వీటిని ఏపీ విత్తన ధ్రువీకరణ అథారిటీ ధ్రువీకరిస్తుంది. బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ముందుగా ప్రాధాన్యతనిస్తారు. పూర్తిస్థాయిలో విత్తనం అందుబాటులోకి తెచ్చిన తర్వాత సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తారు. పెసలులో ప్రత్యామ్నాయ రకాలు: » ఐపీఎం 2–14కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 574, ఎల్జీజీ 607,ఎల్జీజీ 630 ఎల్జీజీ 600 రకాలు. రబీలో వీటితో పాటు అదనంగా విరాట్, శిఖ రకాలు » ఎల్జీజీ 407కు ప్రత్యామ్నాయంగా రెండు సీజన్లలో ఎల్జీజీ 607 రకాలు, ఎల్జీజీ 460కు బదులుగా ఐపీఎం 2–14, ఎల్జీజీ 630, ఎల్జీజీ 607 రకాలు కందులులో ప్రత్యామ్నాయ వంగడాలు ళీ ఎల్‌ఆర్‌జీ 52 స్థానంలో ఖరీఫ్‌లో టీఆర్జీ 59 (తిరుపతి కంది), ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33, పీఆర్జీ 176 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 (కృష్ణ) రకాలను ప్రవేశపెడతారు. » ఎల్‌ఆర్‌జీ 41 స్థానంలో ఖరీఫ్‌లో పీఆర్జీ 158, టీఆర్జీ 59, ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 (సౌభాగ్య), పీఆర్జీ 176, ఎల్‌ఆర్‌జీ 52 రకాలను, రబీలో ఎల్‌ఆర్‌జీ 105 రకాలు » ఐసీపీహెచ్ 2740, ఐసీపీఎల్ 87119, పీఆర్జీ 158 రకాలకు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105 రకం » ఐసీపీహెచ్ 87063 కు బదులుగా రెండు సీజన్లలోనూ ఎల్‌ఆర్‌జీ 105, ఎల్‌ఆర్‌జీ 133–33 రకాలను ప్రవేశపెడతారు. శనగలో ప్రత్యామ్నాయ రకాలు శనగలో కేఏకే 2కు బదులుగా ఎన్‌బీఈజీ 119 రకాన్ని, జేజీ 11కు బదులుగా ఎన్‌బీఈజీ 776 రకాలు, ఎన్ఈజీ 452 (నంద్యాల గ్రామ్ 452), ఎన్‌బీఈజీ 810 (నంద్యాల గ్రామ్ 810), ఎన్‌బీఈజీ 857 (నంద్యాల గ్రామ్) వంటి కొత్త వంగడాల సాగును ప్రోత్సహించనున్నారు -
కాడి.. మేడి.. ఖరీఫ్‌కు రెడీ
సాక్షి, అమరావతి: మృగశిర కార్తె మొదలైంది. వ్యవసాయ పనిముట్లయిన కాడిమేడిలకు పూజలు చేస్తున్న రైతులు సాగు కోసం భూమిని రైతన్నలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారు. అక్కడక్కడా కొన్ని చోట్ల దుక్కిదున్ని పచ్చి రొట్ట వేసుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నారుమడులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఏజెన్సీ జిల్లాల్లో వరి పంట విత్తుకుంటున్నారు. ఈసారి ముందుగానే నైరుతి రుతు పవనాలు పలకరించడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల్లో ఉత్సాహం నింపింది. పలుచోట్ల ఇప్పటికే సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనట్టుగా చెబుతున్నారు. ఆర్బీకేల వద్ద అన్నదాతల సందడి ఎన్నికలలో బిజీబిజీగా ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోకుండా రైతులు విత్తుకునేందుకు వీలుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులను పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు ఆర్బీకేల్లో నిల్వ చేసిన విత్తనాల మొలక శాతం కట్టి నాణ్యతను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చి0ది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ విత్తన పంపిణీ జోరందుకుంది. వరి సహా ఇతర విత్తనాలను సైతం ఆర్బీకేల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం తమ వివరాల నమోదు కోసం వస్తున్న రైతులు, ఇప్పటికే నమోదు చేసుకున్న వారు విత్తనాల కోసం వస్తుండటంతో ఆర్బీకేల్లో సందడి మొదలైంది. పరిహారం ఆదుకుంది గత ఖరీఫ్‌లో ఏర్పడిన కరువుకు సంబంధించిన పరిహారంతో పాటు రబీలో మిచాంగ్ తుపాన్ వల్ల పంటలు నష్టపోయిన 10.44 లక్షల మంది రైతులకు రూ.1,289.57 కోట్ల పెట్టుబడి రాయితీ కౌంటింగ్‌కు ముందే జమ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. ఇప్పటికే 8.89 లక్షల మందికి రూ.1,126.45 కోట్లు జమైంది. ఇంకా 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కావాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌కు ముందు జగన్ ప్రభుత్వం పెట్టుబడి రాయితీ అందించడం రైతులకు కొంత ఊరటనిచ్చి0ది.ఇప్పటికే 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల పంపిణీ ఖరీఫ్ సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. ఇందులో వరి 39.07 లక్షల ఎకరాలు, 14.80 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.67 లక్షల ఎకరాల్లో పత్తి, 6.35లక్షల ఎకరాల్లో కందులు, 3.55 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు సాగు చేయనున్నారు. ఇందుకోసం 6.32 లక్షల క్వింటాళ్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. 6.50 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఆర్బీకేల్లో 3.92 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని నిల్వ చేశారు. 3.09 లక్షల క్వింటాళ్ల విత్తనాల కోసం 4.84 లక్షల మంది రైతులు ఆర్బీకేల్లో నమోదు చేసుకున్నారు. 3.52 లక్షల మంది రైతులు 2.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలను తీసుకెళ్లారు. 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా.. ఇప్పటికే 10 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. 5 లక్షల బాటిళ్ల నానో యూరియా, 2 లక్షల బాటిళ్ల నానో డీఏపీ ఇఫ్కో ద్వారా పంపిణీకి సిద్ధం చేశారు. కనీసం 5.60 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల ద్వారా సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు.పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు ఐదేళ్లుగా ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించింది. ఐదేళ్లలో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,288.17 కోట్ల పెట్టుబడి సాయం అందింది. ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే మే, జూన్ నెలల్లో రూ.7,500 చొప్పున రైతులు తొలివిడత పెట్టుబడి సాయం అందుకునేవారు. ఈ సొమ్ములు ఖరీఫ్‌లో విత్తనాల కొనుగోలు, వ్యవసాయ పనులకు ఎంతగానో ఉపయోగపడేవి. మళ్లీ జగన్ ప్రభుత్వం వచ్చి ఉంటే తమకు ఈపాటికే పెట్టుబడి సాయం అంది ఉండేదని రైతులు చెప్పుకుంటున్నారు. తాము అధికారంలోకి రాగానే ఏటా రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇంకా కొలువుతీరలేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సాయం ఎప్పుడు చేతికి అందుతుందో తెలియక రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.