వ్యవసాయ శాఖ అంచనా
క్షేత్రస్థాయిలో ఇంకా కొనసాగుతున్న అంచనాల ప్రక్రియ
పరిహారం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో అధికారులు
సీఎం ఆమోదించినా అమల్లోకి రాని పంటల బీమా
సాక్షి, హైదరాబాద్ /సాక్షి ప్రతినిధి నల్లగొండ/సాక్షి మహబూబాబాద్: కుండపోత వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునగగా, అందులో దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సోమవారం నాటికి 4.15 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటికి పంట నష్టం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు. ప్రధానంగా ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, ములుగు తదితర జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా. ఇప్పుడిప్పుడే పొలాల్లో నీరు తగ్గుతుండటంతో అధికారులు అంచనాలను వేగవంతం చేశారు. ఎన్ని ఎకరాల్లో పంటలు చేతికి వస్తాయో పరిశీలిస్తున్నారు.
పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంట నష్టం పరిహారానికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.
ఈ సీజన్‌లో బీమా ఇక అనుమానమే?
పంట నష్టం జరిగినప్పుడు బీమా రైతులకు ధీమా ఇస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అందుకు కేంద్రం నుంచి కూ డా అనుమతి లభించింది. అనంతరం ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు.
అయినా మార్గదర్శకాలు విడుదల చే యడంలోనూ... అమలు చేయడంలో వ్యవసాయశాఖ విఫల మైంది. పార్లమెంటు ఎన్నికలకంటే ముందునుంచే వ్యవసాయ డైరెక్టర్ కంపెనీలతో చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు వెళ్లకపోవడం విమర్శలు తావిస్తోంది. సీఎం ఆమోదం తర్వాత వెంటనే అమలు చేసినట్లయితే ఇప్పటికే బీమా అమల్లోకి వచ్చేది.
ఒక కీలక ప్రజాప్రతినిధి పంటల బీమా విషయంలో అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు వానాకాలం సీజన్ ముగుస్తుంది. ఇక ఈ సీజన్‌లో ఇప్పటికిప్పుడు బీమాను అమలు చేసే పరిస్థితి ఉండబోదని అధికారులు అంటున్నారు.
550 ఎకరాల్లో కొట్టుకుపోయిన వరి
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలం రావి రాల గ్రామంలోని పెద్ద చెరువు, కోమటి చెరువు తెగిపోయాయి. వీటి కింద 420 మంది రైతులు సాగుచేసే 550 ఎకరాల వరి మొత్తం కొట్టుకుపోయింది. 200 ఎకరాలు ఇసుక, రాళ్లతో నిండిపోయాయి. ఎకరానికి రూ.50 వేల నష్టం జరిగిందనుకున్నా, ఈ ఒక్క గ్రామంలోనే రూ.2.75 కోట్ల పంటనష్టంతో పాటు పొలం మరమ్మతు చేయాలంటే మరో రూ. కోటికి పైగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
పొలం నిండా ఇసుక మేటలు
నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన మైదం వెంకన్న అనే రైతుకు మూడు ఎకరాల పొలం ఉంది. సాగుకు అవసరమైన విత్తనాల కొనుగోలు, దున్నడం, నాట్లు మొదలైన ఖర్చుల కోసం లక్షా 20 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు.
భారీ వర్షం కారణంగా పడమటిగూడెంలోని గుండ్ల చెరువు తెగడంతో వరద నీరు కొమ్ముల వంచ పాత చెరువు మత్తడి తెగింది. దీంతో కింద ఉన్న వెంకన్న పొలంపై ఇసుక మేటలు కట్టా యి. పంటపోయింది. పెట్టుబడి పోయింది. రూ.2 లక్షలు ఖర్చు పెట్టి ఇసుక మేటలు తొలగిస్తే కానీ పొలం చేతికిరాదు.
ఆనవాలే లేకుండా పోయిన పొలం
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూదియా తండా గ్రామానికి చెందిన గుగులోతు లోక్యాకు జానకీనగర్ రోడ్డులో రెండెకరాల భూమి ఉంది. అందులో 20 రోజుల కిందట వరినాట్లు వేశారు. మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించి పొలమంతా ఇసుక మేట వేసింది. పొలం ఆనవాళ్లే లేకుండా పోయింది. తిరిగి నాటు వేసే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే అప్పు చేసి రూ.40 వేల పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక లబోదిబోమంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment