
కోనరావుపేటలో గాలివాన వడగళ్లకు పడిపోయిన మొక్కజొన్న
రాష్ట్రవ్యాప్తంగా గాలిదుమారం, వడగళ్ల వాన
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా/ మహబూబ్‌నగర్ వ్యవసాయం: ఒకపక్క బోర్లలో నీళ్లు అడుగంటి ఎండిపోతున్న పంటలు.. మరోపక్క మిగిలిన కొద్దిపాటి పంటలను ముంచెత్తిన అకాల వర్షం.. దిక్కుతోచని స్థితిలో రైతన్న కంటక‘న్నీళ్లు’.. అకాల వర్షాలు అన్నదాతను తీవ్రంగా దెబ్బతీశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వరంగల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వడగళ్ల వాన పంటలను దెబ్బతీసింది. వరంగల్ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో భారీ వర్షానికి తోడు ఈదురు గాలుల కారణంగా వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి.
పొగాకు పంట కూడా దెబ్బతిన్నట్లు రైతులు చెపుతున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లో మిరప, మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల రూరల్, ధర్మపురి మండలాల్లో వడగళ్ల వాన కారణంగా సుమారు 1500 ఎకరాల్లో మామిడి రాలిపోగా, మరో 1500 ఎకరాల మేర మొక్కజొన్న పంట నేలకొరిగినట్లు ప్రాథమిక అంచనా. నువ్వులు, పసుపు తడిచిపోయిందని రైతులు వాపోతున్నారు.
మొత్తం 5,350 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీటిపాలైంది. పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. మామిడి కాయలు రాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో సిరికొండ, ఇందల్వాయి, దర్పల్లి మండలాల్లో వడగళ్లతోపాటు పిడుగులు కూడా పడ్డాయి. దర్పల్లి మండలంలోని వాడి, లింగంపల్లి, పోతాయిపల్లి గ్రామాల్లో పిడుగుపాటుకు రెండు గేదెలు, మూడు గొర్రెలు మృతిచెందాయి.
మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్, మహమ్మద్ షాపూర్, సూరంపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ తదితర గ్రామాల్లో దాదాపు 175 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. అకాల వర్షం వల్ల చేతికొచి్చన పంట నేల రాలటంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మా కష్టం అంతా వృథా అయ్యింది. ప్రభుత్వం తక్షణం పరిహారం అందించాలి’అని వరంగల్‌కు చెందిన ఓ రైతు వాపోయారు.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మోమిన్‌పేట, మర్పల్లి, నవాబుపేటలో కూరగాయ పంటలు, పూల తోటలకు నష్టం వాటిల్లింది. కందుకూరు, చేవెళ్ల, మోమిన్‌పేట, షాద్‌నగర్ మండలాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
హన్వాడ, మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్ అర్బన్, జడ్చర్ల, మూసాపేట, అడ్డాకులు, భూత్పూర్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవటంతో పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీచేశారు. పంట నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
సూత్తుండగానే మక్కలు కొట్టుకుపోయాయి
రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. రూ.30 వేల వరకు ఖర్చు చేసిన. కరువు రావడంతో దిగుబడి 36 బస్తాలకు పడిపోయింది. మక్కలను అమ్ముకునేందుకు మూడు రోజుల క్రితం జనగామ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చా. తేమ ఉందని తక్కువ ధరకు అడగడంతో కాటన్ యార్డులో ఆరబోసుకున్నా.
ఈరోజు అమ్ము కుందామని ఆశపడ్డ. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో మక్కల రాసి వద్ద వరద చేరి మొత్తం తడిసిపోయాయి. సూత్తుండగానే గింజలు కొట్టుకుపోయాయి. దిగుబడి తగ్గి ఒక రకంగా నష్టపోతే, అకాల వర్షం మరింత కుంగదీసింది. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలి.
-విజయ, కొండాపురం, పాలకుర్తి, జనగామ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment