Crop losses
-
ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు
(సాక్షి అమరావతి, నెట్వర్క్): చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది! మరో 15–20 రోజుల్లో చేతికొస్తాయనుకున్న పంటలు ముంపు నీటిలో కుళ్లిపోతుంటే అన్నదాత కుమిలిపోతున్నాడు. వేలకు వేలు అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలు కాస్తా వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయాడు. కృష్ణా లంక గ్రామాల్లోని పొలాల్లో ఎటు చూసినా ఇసుక మేటలే కనిపిస్తుండగా బుడమేరు వరద పంట చేలల్లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. ఏలేరు వరద రైతులను కకావికలం చేసింది. ముంపు తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న పంట పొలాలు అన్నదాత గుండెను పిండేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ఈ ఏడాది మూడుసార్లు వరదలు ముంచెత్తగా పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్‌వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బహుదా, నాగావళి, వంశధార పోటెత్తడం, విరుచుకుపడ్డ వరదలతో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకం చవిచూశారు. దెబ్బతిన్న రోడ్లు.. ఉత్తరాంధ్రలో వరదలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది. రాజాంలో ప్రధాన రహదారి అంబేడ్కర్ జంక్షన్ నుంచి జీఎంఆర్‌ఐటీ వరకూ లోతైన గోతులు పడ్డాయి. తెర్లాం మండలంలో కుసుమూరు–అంపావల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికీ రాకపోకలు లేవు.నష్టం అపారం...రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 51 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా 3.08 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. అత్యధికంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది. వ్యవసాయ పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. పచ్చనేతల కనుసన్నల్లోనే అంచనాలురాజకీయాలకతీతంగా జరగాల్సిన పంట నష్టం అంచనాలు పచ్చనేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాల్సిందేనని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చేదే అరకొర సాయం.. దానికి కూడా రాజకీయ రంగు పులమడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూపూడికి చెందిన ఓ రైతు 80 ఎకరాల్లో పంట వరదలకు నష్టపోగా గత ప్రభుత్వ హయాంలో నామినేట్ పదవి పొందారనే అక్కసుతో ఆయన పేరు జాబితాలో తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.⇒ కృష్ణా, బుడమేరు వరదలు ఉమ్మడి కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. 44,521 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడగా మరో 4,070 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ⇒ పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గ పరి«ధిలో పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయి. జిల్లాలో వ్యవసాయ పంటలు 8,818.48 హెక్టార్లలో దెబ్బ తినగా 33 శాతం కన్నా ఎక్కువగా 2,852.747 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 3,368 మంది రైతులకు రూ.4.8 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీ అందించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. జిల్లాలో వరద తాకిడికి 259.13 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలకు జిల్లాలో 41 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో విద్యుత్‌శాఖ(ఏపీఎస్పీడీసీఎల్)కు రూ.64.55 లక్షల మేర నష్టం వాటిల్లింది.‘ఏలేరు’ గుండెకోత..ఏలేరు వరదలతో పిఠాపురం, కిర్లంపూడి, గొల్లప్రోలుల్లోని పంటపొలాల్లో టన్నుల కొద్దీ మేట వేసిన ఇసుకను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. ఏలేరు కాలువకు గండ్లు పడి 40 వేల ఎకరాలకుపైగా పంట పొలాల్లో రెండు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. ఏలేరు రిజర్వాయరుపై ఆధారపడి 62 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. 40 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గత నెలలో ఏజెన్సీ పరిధిలోని పెదవాగు పొంగడం.. ఆ తరువాత తమ్మిలేరు, ఉప్పుటేరు నుంచి భారీగా వరద నీరు చేరడం.. మళ్లీ వారం పాటు విస్తారంగా వర్షాలు కురవడం రైతులకు తీవ్ర వేదన మిగిల్చింది. ప్రధానంగా 5,683.20 హెక్టార్లలో వరి పూర్తిగా పాడైపోయింది.రాళ్లు రప్పలతో పొలాలు..కృష్ణా పరీవాహక ప్రాంతంలోని దిబ్బల్లంక, బెజవాడలంక, వాసనలంక తదితర లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అత్య«ధిక భూములను ఎస్సీ రైతులే సొసైటీలుగా ఏర్పడి సాగు చేసుకుంటున్నారు. వారికి వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరయ్యాయి. ఏడాదిలో ఏ సమయంలో వచ్చినా ఇక్కడ పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. అలాంటి లంకల్లో నేడు చూద్దామంటే పచ్చని పైరు కానరాని దుస్థితి. రెండు నుంచి ఐదు అడుగుల మేర ఇసుక మేట వేసింది. పిందె కట్టిన పత్తి, కాపుకొస్తున్న కూరగాయలు, కోతకు సిద్ధమైన వరి పొలాలు, గెలలేసిన అరటి, ఏపుగా ఎదిగిన జొన్న, మొక్కజొన్న.. ఇలా ఏ పంట చూసినా విగత జీవిలా నేలకొరిగి ఇసుక మేటల్లో కలిసిపోయాయి. ఉచిత విద్యుత్ కోసం గతంలో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ మోటార్లు, ఇంజన్లు దాదాపు 12 రోజులుగా వరద నీటిలో చిక్కుకుని బురదకు పాడైపోయాయి. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన పెద్దపెద్ద రాళ్లు రప్పలతో పంటపొలాలు నిండిపోయాయి. ముంచేసిన బుడమేరు..బుడమేరు వరద ముంపునకు గురైన ఉంగు టూరు, నందివాడ, బాపులపాడు, పెదపారు పూడి మండలాల్లోని వంద లాది గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరద ప్రభావానికి గురైన దిబ్బనపాడు, గారపాడు, ఆముదలపల్లి, ముక్కుపాలెం, లంకపల్లి, సిరివాడ, చినలింగాల, పెదలింగాల, చెదుర్తిపాడు, మోపాడు, ఇంజరుపూడి తదితర గ్రామాల్లో అన్నీ మాగాణి భూములే. నీటి వనరులకు లోటు ఉండదు. ఇప్పుడు ఎటు చూసినా పైర్లన్నీ సెలయేర్లను తలపిస్తున్నాయి. బుడమేరు వరద ఇంకా పంట చేలల్లో ప్రవహిస్తూనే ఉంది. ఆయా గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఈ ప్రాంత రైతులంతా ఎంటీయూ 1318 వరి రకాన్నే సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ ప్రాంతంలో మంచి పంటలు పండాయి. ఈసారి కూడా మంచి రేటు వస్తుందన్న ఆశతో రైతులంతా అదే సాగు చేశారు.కోనసీమను మూడుసార్లు ముంచెత్తిన వరద..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్‌వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీటిలో నానుతుండడంతో పంట నష్టం తీవ్రంగా ఉంది. అరటి 1,876 ఎకరాల్లో దెబ్బతింది. 2,625 ఎకరాల్లో రైతులు కూరగాయ పంటలు నష్టపోయారు. తమలపాకు, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. అయినవిల్లి మండలంలో వరద నీట నానుతున్న కొబ్బరి తోటలో సాగవుతున్న అరటి, పోక (వక్క) పంట వరదల వల్ల డిమాండ్ ఉన్నా బత్తాయి కోయలేక నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ చేయగానే గోదావరి పాయల్లో చేపల వేట నిలిపివేయడంతో 14 మండలాల్లో సుమారు 2 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి లేక అల్లాడుతున్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదడిపూడి లంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంక వాసులు ఏటా వరద మొదలైన నాటి నుంచి నవంబరు వరకు పడవలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.13 వేలకుపైగా ఎకరాల్లో రెండోసారి మునక..ఖరీఫ్ ప్రారంభం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. ఆగస్టు చివరిలో వచ్చిన వర్షాలకు యనమదుర్రు, వయ్యేరు, ఎర్ర కాలువ, ఉప్పుటేరు ఉప్పొంగడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో 14 వేల ఎకరాల్లో నాట్లకు, 30 వేల ఎకరాల్లో నారుమడులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రెండోసారి నాట్లు వేశారు. అప్పటికే ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టగా మరోసారి దమ్ము చేసి నాట్లు వేసేందుకు అంతే ఖర్చు చేయాల్సి వచ్చింది. నాటి వర్షాలకు రూ.9.54 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. తాజాగా కొల్లేరు, గోదావరి వరదలకు ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెంటపాడు తదితర మండలాల్లో 13,300 ఎకరాల్లో పంట రెండోసారి నీట మునగడం రైతులకు తీరని వేదన మిగిల్చింది.ఉత్తరాంధ్ర విలవిల.. వంద గ్రామాలు చీకట్లోనేఉత్తరాంధ్రలో వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరదలో కొట్టుకుపోయి ముగ్గురు, కొండ చరియలు విరిగిపడి మరొకరు మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకంలో గడిపారు. ఒక్క చింతూరు డివిజన్‌లోనే దాదాపు 20 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఉత్తరాంధ్రలో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అధికారికంగా ప్రాథమిక లెక్కల ప్రకారం 4,987ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మరో 500 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్లీ ముఖం చూపించలేదువర్షాలకు సాయన్న గెడ్డ పొంగి దిశ మార్చుకొని మా పొలాలపై పడింది. మూడు గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందులో నా మూడెకరాల వరి పొలం కూడా ఉంది. తొలిరోజు కలెక్టరు, రాజాం ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ ముఖం చూపించలేదు. నష్టపరిహారం ఇస్తారో లేదో తెలియదు– బొడ్డేపల్లి జగన్నాథం, మల్లయ్యపేట, విజయనగరం జిల్లాబస్తా కూడా రావు..నాకు జూపూడిలో నాలుగు ఎకరాలుంది. మరో 50 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 24 ఎకరాల్లో మినుము, మిగతాది వరి వేశా. మినుముకు రూ.15 వేలు, వరికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టా. మినుము సాగు చేసే పొలానికి కౌలు కూడా చెల్లించా. ఇప్పటికే రూ.15.90 లక్షల వరకు ఖర్చు అయింది. రెండు పంటలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బస్తా గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా నష్టపోయాం. –పల్లా శ్రీరామయ్య, ఇబ్రహీంపట్నంతీవ్ర నష్టం అయినా కౌలుకట్టాలి..40 ఏళ్లుగా వరి, చెరకు సాగు చేస్తున్నా. కౌలుకు తీసుకుని పండిస్తున్నా. ఈ ఏడాది వరి నాట్లు వేశాక ముంపు బారిన పడింది. ఇక కోలుకునే పరిస్థితి లేదు. తీవ్ర నష్టం వాటిల్లినా కౌలు కట్టాల్సిందే. పెట్టుబడి మొత్తం నీళ్ల పాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాలి. లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కోలుకోవడం కష్టం. – గంజి చిలుకునాయుడు, కౌలు రైతు, నూతలగుంటపాలెం, కశింకోట మండలం ఎకరాకు రూ.30 వేలు నష్టం గ్రామంలో ఎస్సీ రైతులంతా సొసైటీలుగా ఏర్పడి దిబ్బలంక, బెజవాడలంకల్లో 400 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాం. మూడు పంటలు పండుతాయి. 15 ఎకరాలు మాగాణి, 3 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో మినుము వేశా. వరదలతో పూర్తిగా నష్టపోయాం. ఇసుక మేట వేయడంతో ప్రతి రైతు ఎకరాకు రూ.30 వేలకుపైగా నష్టపోయారు. – రెంటపల్లి నాగరాజు, కొటికలపూడి, ఎన్టీఆర్ జిల్లా -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రావట్లేదు: బండి సంజయ్
-
కడుపులో పెట్టుకుంటం: సీఎం కేసీఆర్
పంటలు దెబ్బతింటే తెలిసీ తెలియక నష్టపరిహారం అంటారు. కానీ వాస్తవంగా దీన్ని సహాయ పునరావాస చర్యలు అంటారు. నష్ట పరిహారం అనేది ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేరు. సాధ్యం కాదు కూడా. మళ్లీ రైతు పుంజుకుని వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా సహాయ సహకారాలు అందించాలి. అందుకే ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధులు ఖమ్మం, కరీంనగర్/సాక్షి, మహబూబాబాద్, వరంగల్/దుగ్గొండి: ఇటీవలి అకాల వర్షాలకు రాష్ట్రంలోని 2,28,258 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయ పునరావాస చర్యగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ.228 కోట్లు గంటలోనే మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కరీంనగర్లో సంబంధిత జీవో కాపీని కూడా చూపించారు. ‘ఇది చాలా కాస్ట్లీ. ఎకరానికి రూ.10 వేలు ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా. ఈ పంట.. ఆ పంట అని కాకుండా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ సహాయం బాధిత రైతులకు అందుతుంది..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులెవరూ అధైర్య పడొద్దని, అండగా ఉంటామని, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం ఆయన ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతల, గార్లపాడు గ్రామాల్లో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో మొక్కజొన్న, మిర్చి, మామిడి తోటలను, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో వరి, టమాట పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. అడవి రంగాపురంలో పంట నష్టం చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని సందర్శించారు. పలుచోట్ల మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే.. ‘తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేశాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో మందుకెళ్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో గాలి దుమారం, వడగళ్ల వాన రైతులను నిండా ముంచేసింది. మొక్కజొన్న 1,29,446 ఎకరాల్లో, వరి 72,709, మామిడి 8,865, ఇతర పంటలు 17,238 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. నర్సంపేటలాంటి ప్రాంతాల్లో పంటలు గుర్తుపట్టలేనంతగా పాడయ్యాయి. కరీంనగర్లో 100 శాతం దెబ్బతిన్నాయి. నేను హైదరాబాద్ నుంచే ఎకరానికి రూ.3 వేలు చెల్లిస్తామని చెప్పి చేతులు దులుపుకోవచ్చు. కానీ రైతుల కష్టాలు నాకు తెలుసు. రైతులు బాధ తెలిసిన వాళ్లంగా రైతుల వద్దకు వచ్చి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కోడ్ ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పెద్దగా రావు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మరీ దుర్మార్గంగా, దౌర్భాగ్యంగా ఉంది. వారికి రాజకీయాలు తప్ప ప్రజలు లేరు.. రైతులు లేరు అనే పరిస్థితి ఉంది. చీఫ్ సెక్రటరీ, మేము పంటల నష్టంపై రాస్తే కేంద్ర బృందం వస్తుంది. ఎప్పుడు వస్తుందో.. ఏం సంగతో దేవునికి ఎరుక. వచ్చినా.. దొంగలు పడిన తర్వాత ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుగా ఆరు నెలలకు కాని రూపాయి రాదు. కేంద్రం ఇస్తే మహద్భాగ్యంగా.. మొక్కజొన్నకు ఎకరానికి రూ.3,333, వరికి రూ.5,400, మామిడి తోటలు ధ్వంసం అయితే రూ.7,200.. ఇదీ ఉన్నటువంటి స్కేల్. ఇది ఏ మూలకూ సరిపోదు. గతంలో పంపినదానికి ఒక్క రూపాయి కూడా కేంద్రం ఇవ్వలేదు. ఈ విధానాలకు నిరసనగా మేం కేంద్రానికి పంట నష్టంపై నివేదిక పంపదలుచుకోలేదు. చెప్పదలుచుకోలేదు.. చెప్పినా దున్నపోతు మీద వానపడినట్టే. భగవంతుడు తెలంగాణకు ఆర్థిక శక్తి ఇచ్చాడు. మా రైతులను మేమే కాపాడుకుంటాం. వందశాతం మేమే ఆదుకుంటాం..’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. రబ్బరు బంతిలా తిరిగి ఎగరాలి ‘ఖమ్మం జిల్లా జిల్లాలో కౌలు రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వీరిని కూడా ఆదుకునేలా సీఎస్‌కు చెప్పి.. జిల్లా కలెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు ఇప్పిస్తాం. డబ్బు రైతుకు ఇవ్వకుండా కౌలు రైతులను ఆదుకునేలా లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తాం. పంట నష్టపరిహారం విషయంలో 2015 నాటి జీవోను కూడా సడలిస్తాం. అయితే మొత్తానికి కాకుండా ప్రస్తుతం కౌలు రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని జీవోను రివైజ్ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వమే రైతు ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు నిరాశకు గురి కావద్దు. ధైర్యం కోల్పోవద్దు. రబ్బరు బంతిలా తిరిగి ఎగిరే విధంగా, జరిగిన నష్టానికి ఏమాత్రం చింతించకుండా భవిష్యత్తులో ఉన్నతమైన పంటలు గొప్పగా పండించే ఆలోచనకు పోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వానల ముప్పు ఇంకా తొలగిపోలేదు. మరో రెండు మూడురోజుల్లో వడగళ్లు మళ్లీ పడవచ్చు. అయినా అధైర్య పడొద్దు..’ అని సీఎం అన్నారు. దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ ‘ఇప్పటికీ వ్యవసాయం దండగనే మూర్ఖులు, కొందరు మూర్ఖ ఆర్థికవేత్తలు ఉన్నారు. వ్యవసాయంతో ఏమీ రాదని చెప్పే వాళ్లూ ఉన్నారు. కానీ ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్‌గా ఉంది. జీఎస్డీపీ పెరిగితేనే తలసరి ఆదాయం పెరుగుతుంది. జీఎస్డీపీ పెరుగుదలలో వ్యవసాయం పాత్ర చాలా పెద్దగా ఉంది. లక్షలాదిమంది పొట్ట పోసుకోవడానికి, అనేక రకాల ఉపాధులు కల్పించేలా వ్యవసాయం రంగం ఉంది. ఒక అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దినం. రాష్ట్రంలో వ్యవసాయం అత్యున్నత స్థితిలో ఉంది. వలస వెళ్లిన రైతును తిరిగి రప్పించి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత నీరు, ఉచిత విద్యుత్తు, నీటితీరువా రద్దు తదితర సదుపాయాలు కల్పించాం. ఈ రోజు దేశం మొత్తం మీద చూస్తే తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలన్నింట్లో వరి 50 లక్షల ఎకరాలు ఉంటే.. ఒక్క తెలంగాణలోనే 56 లక్షల్లో ఈ పంట ఉంది. ఇది మనందరికీ గర్వకారణం. రైతులు ఏమాత్రం నిరాశకు గురి కావద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా రూపుదాల్చుతాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి ‘దేశంలో ఒక పద్ధతి..పాడు అంటూ లేదు. ఇన్సూరెన్స్ కంపెనీలకు లాభం కలిగించే బీమాలే ఉన్నాయి తప్పితే.. పంట నష్టం జరిగినప్పుడు రైతుకు లాభం చేసే బీమాలు, కేంద్ర ప్రభుత్వ పాలసీలు లేవు. గత కేంద్ర ప్రభుత్వాలూ అంతే. ఇప్పుడున్న ప్రభుత్వమైతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. వాళ్లకు చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటేలా అన్నట్లు పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఒక మాట చెబుతున్నాం. కొత్త వ్యవసాయ పాలసీ రావాలి..’ అని కేసీఆర్ అన్నారు. మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, సీఎంఓ అధికారి రాహుల్ బొజ్జ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. బస్సులోనే మధ్యాహ్న భోజనం.. సమయం తక్కువగా ఉండడంతో సీఎం ఎక్కడా విరామం లేకుండా పర్యటించారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాకు వచ్చిన కేసీఆర్.. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎంపీలతో కలిసి బస్సులోనే మధ్యాహ్న భోజనం చేశారు. ముఖ్యమంత్రికి మంత్రి ఎర్రబెల్లి పెరుగన్నం వడ్డించారు. ధైర్యం చెప్పేందుకే వచ్చా.. కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో రైతు సోమ్లా నాయక్ పంటను పరిశీలించారు. అనంతరం ఆయనతో మాట్లాడారు. సీఎం: అరే...మిర్చి పంటంతా పాడైంది కదా.. ఈ చేను ఎవరిది? రైతు: నాదే అయ్యా...నా పేరు సోమ్లా నాయక్. సీఎం: ఎన్ని ఎకరాల్లో మిర్చి వేసినవ్...ఎంత కాలంగా సాగు చేస్తున్నావు? రైతు: ఈ ఏడు రెండెకరాల్లో వేసినా. పదేళ్ల నుంచి మిర్చి సాగు చేస్తున్నా. సీఎం: మిర్చి మీద లాభాలు వస్తున్నాయా? రైతు: పోయినేడు నష్టమే వచ్చింది. ఈ సంవత్సరం ధర మంచిగానే ఉంది. క్వింటాల్‌కు రూ.20 వేలకు పైగా పలుకుతుందనుకుంటే మాయదారి రాళ్ల వాన నట్టేట ముంచింది. సీఎం: అవును ఈ ఏడు మిర్చికి బాగానే ధర ఉంది. కానీ పంటంతా నష్టపోయావు. ఇలాంటి పరిస్థితిలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. నీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్‌లో మరింత మెరుగ్గా వ్యవసాయం చేసుకునే విధంగా సౌకర్యాలు కల్పిస్తా. రైతు: అవును అయ్యా.. తెలంగాణ వచ్చిన తర్వాతే కరెంటు, నీళ్ల తిప్పలు పోయినయి. సీఎం: (రైతు భుజంపై చేయి వేసి) ఇది మన ప్రభుత్వం. రైతు ప్రభుత్వం. అందుకోసమే మీకు ధైర్యం కల్పించేందుకు వచ్చా. బాధ పడకండి..భయపడకండి. అటు తమ్మినేని.. ఇటు కూనంనేని.. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. రావినూతల, గార్లపాడు గ్రామాల్లో ఇద్దరు నేతలు సీఎం వెంటే ఉండి పంటల పరిశీలనలో పాల్గొన్నారు. జిల్లాలో పంట నష్టం వివరాలను తెలియజేయడంతో పాటు రైతులు, కౌలు రైతుల ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కుడి, ఎడమ సీట్లలో కూర్చున్నారు. రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. -
ఎప్పటికప్పుడే పరి‘హారం’
సాక్షి, అమరావతి: ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియక ముందే పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) చెల్లిస్తూ రైతన్నకు తోడుగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా ఏ రాష్ట్రంలోనూ ఇలా అన్నదాతలకు తోడుగా నిలిచిన దాఖలాలు లేవన్నారు. గత సర్కారు అండగా నిలవకపోగా పంట నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టి వెన్ను విరిచిందన్నారు. ఒకవేళ ఇచ్చినా ఏడాది తరువాత అరకొరగా విదిలించటాన్ని చూశామని గుర్తు చేశారు. గత సర్కారుకు, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. గత నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంతోపాటు నేలకోత, ఇసుక మేట కారణంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద రూ.29.51 కోట్లతో కలిపి మొత్తం రూ.571.57 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం.శంకరనారాయణ, అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. సీఎం ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. రూ.63 కోట్లతో విత్తనాలు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు బాగా పెరిగి చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళలాడుతున్నాయి. వెలుగు కింద చీకటి కూడా ఉన్నట్లే అధిక వర్షాల వల్ల కొద్ది మేర పంట నష్టం జరిగింది. రైతన్నల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వంగా నవంబరులో వర్షాలు, వరదలతో నష్టపోయిన వారిని ఆదుకుంటూ 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను దాదాపు 1.43 లక్షల మంది రైతన్నలకు రూ.63 కోట్లు ఖర్చు చేసి అందచేశాం. నేడు కౌలు రైతులకూ న్యాయం.. కౌలు రైతులను గత సర్కారు ఏరోజూ గుర్తుంచుకోలేదు. కానీ ఇవాళ అర్హులెవరూ మిగిలిపోకుండా ఇ–క్రాప్ డేటాతో శాస్త్రీయంగా ఆర్బీకేల స్ధాయిలోనే పంట నష్టాలను అంచనా వేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను ప్రదర్శిస్తూ ఏ సీజన్లో జరిగిన నష్ట పరిహారాన్ని అదే సీజన్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మనదే. కౌలు రైతులకు సైతం ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఇన్పుట్ సబ్సిడీని అందచేస్తున్న ప్రభుత్వం కూడా ఇదే. మిస్ అయిన వారికి మరో చాన్స్ ఇ– క్రాప్ డేటా ఆధారంగా ఏ ఒక్కరూ మిస్ కాకుండా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలలో జాబితా ప్రదర్శిస్తున్న ప్రభుత్వం మనది. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ మంచి చేస్తున్నాం. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులతో సహా అన్నదాతలందరికీ చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.1,612 కోట్లు అందచేశాం. ఇన్పుట్కు నాడు ఎగనామం.. ► 2014 ఖరీఫ్‌లో సంభవించిన కరువుకు 2015 నవంబరులో గానీ ఇవ్వలేదు. 2015 కరువుకు 2016 నవంబరు కంటే కంటే ముందు ఇచ్చిన పరిస్ధితి చూడలేదు. ► 2015 నవంబరు, డిసెంబరులో భారీ వర్షాలకు రూ.263 కోట్ల పంట నష్టం జరిగితే టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ► 2016 కరువు ఇన్పుట్ సబ్సిడీ 2017 జూన్‌లో ఇచ్చారు. 2017 ఇన్పుట్ సబ్సిడీని 2018 ఆగస్టులోగానీ ఇవ్వలేదు. ► 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో జరిగిన రూ.1,832 కోట్ల పంట నష్టాన్ని, రబీలో రూ.356 కోట్ల మేర పంట నష్టాన్ని పూర్తిగా గత సర్కారు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్ధితిని గుర్తు తెచ్చుకోవాలి. నేడు ఆగమేఘాలపై పరిహారం ► దాదాపు 1.56 లక్షల రైతు కుటుంబాలకు రూ.123 కోట్ల మేర ఇన్పుట్ సబ్సిడీని 2020 ఏప్రిల్‌లో అందించాం. ► 2020లో ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278 కోట్లను అదే ఏడాది అక్టోబరులో ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. ► 2020 నవంబరులో నివర్ తుపానుతో నష్టపోయిన 8.35 లక్షల మంది రైతన్నలకు సుమారు రూ.646 కోట్లను నెల తిరగక ముందే అదే ఏడాది డిసెంబరులో అందజేశాం. – 2021 సెప్టెంబరులో గులాబ్ తుపాన్‌తో నష్టపోయిన 34,556 మంది రైతన్నలకు సుమారు రూ.22 కోట్లను అదే ఏడాది నవంబరులో అందజేశాం. రెండున్నరేళ్లలో రైతన్నలకు ఏం చేశామంటే... ► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ ద్వారా ఇప్పటివరకూ రూ.19,126 కోట్ల మేర సాయం.అరకోటి మంది రైతన్నల కుటుంబాలకు లబ్ధి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కౌలు రైతులు, అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. ► వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకంతో 65.64 లక్షల మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.1,218 కోట్లు. గత సర్కారు బకాయిలు కూడా చెల్లింపు. ► రాష్టంలో 18.70 లక్షల మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం సంవత్సరానికి రూ.9 వేల కోట్ల వ్యయం. ఇప్పటివరకు రూ.23 వేల కోట్లు ఖర్చు. ఫీడర్ల సామర్థ్యం పెంచేందుకు మరో రూ.1,700 కోట్లు వ్యయం. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 31.07 లక్షల మంది రైతులకు రూ.3,788 కోట్లు. ఈ ఖరీఫ్ నుంచి ప్రతి రైతు వద్ద రూ.10 చొప్పున తీసుకుని సంతకంతో రశీదు ఇవ్వాలని నిర్ణయం. దాదాపు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి, రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు. ► ధాన్యం సేకరణ, కొనుగోలు కోసం రెండున్నరేళ్లలో రూ.39 వేల కోట్లకు పైగా వ్యయం. గత సర్కారు హయాంలో సంవత్సరానికి రూ.7 నుంచి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి అది కూడా సమయానికి చెల్లించని దుస్థితి. ఇప్పుడు ఏటా రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. రైతులకు 21 రోజుల్లోనే చెల్లింపులు. ఇది కాకుండా పత్తి రైతులకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6,465 కోట్లతో గిట్టుబాటు ధరలతో ఆదుకుంటున్న ప్రభుత్వం. ► గత సర్కారు 2018లో రైతులకు ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను చెల్లించిన రాష్ట్ర ప్రభుత్వం. రూ.9 వేల కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలు కూడా చెల్లింపు. గత సర్కారు దిగిపోతూ పెట్టిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు సైతం చెల్లింపు. ► ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ ఇప్పటికే 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఆర్బీకేలలో అందుబాటులోకి. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద 1,720 రైతు గ్రూపులకు గతంలో రూ.25.50 కోట్ల సబ్సిడీ. ► దాదాపు రూ.2134 కోట్ల వ్యయంతో ఆర్బీకేల స్ధాయిలో యంత్రసేవా కేంద్రాలు ( కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల) ఏర్పాటుకు శ్రీకారం. రానున్న సంవత్సరానికి అన్ని ఆర్బీకేల్లో ఈ సేవలు అందుబాటులోకి. ► ఆర్బీకేల స్ధాయిలోనే వ్యవసాయ సలహా మండళ్ల ఏర్పాటు. నాలుగు అంచెల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు. ► ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఆప్కాబ్ వరకు ఆధునికీకరణ. సహకార వ్యవస్థలో హెచ్ఆర్ విధానం. ► ఎక్కడైనా రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించకుంటే వెంటనే సీఎం యాప్ (కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్) ద్వారా గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ సమాచారం అందించేలా ఏర్పాట్లు. మార్కెటింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని కనీస గిట్టుబాటు ధరతో రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు. ఇవేకాకుండా జలకళ, ఏపీ అమూల్ ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. -
2,500 హెక్టార్లలో నష్టం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లాలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటల లెక్కను వ్యవసాయ శాఖ అధికారులు తేల్చారు. 4,168 మంది రైతులకు చెందిన 2,500 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది. అత్యధికంగా వర్షపాతం నమోదైన ముసాపేట, భూత్పూర్, మహబూబ్‌నగర్ అర్బన్, హన్వాడ మండలాల్లో వరి పంట తుడిచిపెట్టుకపోవడంతో రైతులు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈదురుగాలులతో కురిసిన వర్షం కారణంగా వరి పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించిన అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం అకాల వర్షం కురియడంతో జిల్లా సరాసరి 320 మి.మీ. నమోదైంది. అత్యధికంగా ముసాపేట మండలంలో 57 మి.మీ, హన్వాడ మండలంలో 43 మి.మీ, మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో 42.5 మి.మీ, భూత్పూర్ మండలంలో 42 మి.మీ. నమోదైంది. అత్యల్పంగా బాలానగర్, మిడ్జిల్ మండలాల్లో 1.1 మి.మీ. వర్షం కురిసింది. ఏయే మండలాల్లో.. జిల్లాలో రెండు రోజులుగా కురిసిన అకాల వర్షం కారణంగా 2,500 హెక్టార్లలో వరి పంట నష్టం వాటిల్లింది. ఈనెల 6వ తేదీ సాయంత్రం కురిసిన వర్షానికి 129.68 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో 13.25 హెక్టార్లు, గండీడ్‌లో 72, హన్వాడలో 26.4, నవాబుపేటలో 18 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 7వ తేదీ సాయంత్రం కురిసిన వర్షం కారణంగా 2,370హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలోని భూత్పూర్ మండలంలో 870.8 హెక్టార్లు, గండీడ్‌లో 502, దేవరకద్ర లో 357.2 హెక్టార్లు, అడ్డాకులలో 368.4, హన్వాడలో 128, మహబూబ్‌నగర్ రూరల్‌లో 50.5, మిడ్జిల్‌లో 13.6, నవాబుపేటలో 14.4, కోయిలకొండలో 6.48 హెక్టార్లు, చిన్నచింతకుంటలో 48 హెక్టార్లు, మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలో 10.6 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు భూత్పూర్: దేవరకద్ర ఏడీఏ యశ్వంత్ రావు, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, ఏఓ రాజేందర్‌రెడ్డి బుధవారం మద్దిగట్ల గ్రామంలో నేలరాలిన వరి పంటను పరిశీలించారు. జరిగిన నష్టంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, కోఆప్షన్ సభ్యుడు శేషగిరి రావు, ఏఈఓ హన్మంతు, మా నస, వీఆర్వో దీప్తి పాల్గొన్నారు. దేవరకద్ర: మండలంలోని మీనుగోనిపల్లి, గుడిబండ, లక్ష్మీపల్లి, గోపన్‌పల్లి, పుట్టపల్లి, కౌకుంట్ల, ఇస్రంపల్లి, రేకులంపల్లి, చౌదర్పల్లి, హజిలాపూర్, బస్వాయపల్లి, పేరూర్, దేవరకద్రలో గ్రామాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను బుధవారం మండల వ్యవసాయ అధికారి రాజేందర్ అగర్వాల్, విస్తరణ అధికారులతో కలిసి పరిశీలించారు. నవాబుపేట: మండలంలోని తీగలపల్లి, కాకర్లపహ డ్, చాకలపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించారు. నివేదికను తయారు చేసి పరిహారం అందేలా చూస్తామన్నారు. పంటల పరిశీలనలో మండల వ్యవసాయ అధికారి కృష్ణకిషోర్, గౌతమి, వెంకటేష్, చెన్నయ్య, శేఖర్, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య ఉన్నారు. ఈ çసందర్భంగా మార్కెట్ చైర్మెన్ డీఎన్‌రావు, మండల వైస్‌ఎంపీపీ సంతో‹ష్, చెన్నయ్య, సర్పంచ్‌లు గోపాల్, రాములమ్మ, జంగయ్య, లక్ష్మమ్మ పరామర్శించారు. దెబ్బతిన్న పంటల పరిశీలన మూసాపేట: మండల కేంద్రంతో పాటు, కొమిరెడ్డిపల్లి, జానంపేట, నిజాలాపూర్, మహ్మదుస్సేన్‌పల్లి, సంకలమద్ది, పోల్కంపల్లి గ్రామాల్లో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను మంగళవారం మండల వ్యవసాయాధికారులు పరిశీలించారు. కొమిరెడ్డిపల్లిలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు లక్ష్మీనర్సింహ యాదవ్, జానంపేటలో విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు సాయిరెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, అనిల్‌రెడ్డి ఉన్నారు. -
పంట లెక్కలకు శాటిలైట్ సాయం
సాక్షి, హైదరాబాద్: రైతుల పంటలను అంచనా వేసేందుకు ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయశాఖను ఆదేశించింది. జిల్లా స్థాయిలో పంటల విస్తీర్ణం, వాటి పరిస్థితి, దిగుబడిని అంచనా వేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించాలని పేర్కొంది. తద్వారా వ్యవసాయ ఉత్పాదకత, వాతావరణ పరిస్థితులను అంచనా వేయొచ్చని సూచించింది. జియో–ఇన్ఫర్మేటిక్స్ ద్వారా పప్పుధాన్యాలు, ఉద్యాన పంటలు పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని అంచనా వేయాలని, కరువు అంచనా కోసం ఉపగ్రహ డేటాను ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు పంట నష్టపరిహారం పొందడానికి అనేక సమస్యలు తలెత్తుతుతున్న నేపథ్యంలో ఆయా వివాదాలను పరిష్కరించడానికి కేవలం క్షేత్రస్థాయి పరిశీలనపైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో పరిహారం అందడంలో ఆలస్యమవుతోంది. పైగా నష్టం అంచనాలు సకాలంలో జరగడంలేదు. వాటిని ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయాలనేది ప్రధాన ఉద్దేశం. రైతుల వాదనల పరిష్కారానికి సమయ వ్యవధిని తగ్గించడానికి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ, పీఎంఎఫ్‌బీవై కింద వివిధ రాష్ట్రాల్లో పంట కోత ప్రయోగాలకు ప్రత్యామ్నాయంగా పరిజ్ఞానాన్ని ఉపయోగించేలా పైలట్ అధ్యయనాలు చేయడానికి 8 ఏజెన్సీలకు ఇప్పటికే బాధ్యత అప్పగించారు. పంటల దిగుబడి అంచనా కోసం బీమా యూనిట్ స్థాయికి అవసరమైన పంట కోత ప్రయోగాల సంఖ్యను తగ్గించడానికి శాటిలైట్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడలింగ్ టూల్స్ మొదలైన సాంకేతిక పరిజ్ఞాన అధ్యయనాలను ఉపయోగించాలనేది సర్కారు ఉద్దేశం. ఆలస్యమైతే కంపెనీలకు జరిమానా.. మెరుగైన సేవలు, జవాబుదారీతనం, రైతులకు క్లెయిమ్‌లను సకాలంలో చెల్లించడం కోసం పీఎంఎఫ్‌బీవై పథకాన్ని కేంద్రం అనేక సవరణలు చేసింది. గత రబీ సీజన్ నుంచి క్లెయిమ్‌ల చెల్లింపు కోసం నిర్దేశించిన గడువు తేదీకి 10 రోజులకు మించి సెటిల్మెంట్ చేయకపోతే బీమా కంపెనీ రైతులకు ఏడాదికి 12 శాతం వడ్డీ చెల్లించాలని పేర్కొంది. అయితే ప్రస్తుతం రబీ సీజన్‌కు క్లెయిమ్‌ల పరిష్కారం జరుగుతున్నందున జరిమానా వ్యవహారాన్ని కంపెనీలు తోసిపుచ్చుతున్నట్లు కేంద్రం భావిస్తోంది. ఆ ప్రక్రియపై రాష్ట్రం దృష్టిసారించాలని సూచించింది. నెలలు, ఏళ్ల తరబడి పంటల బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేయడంలో ఆలస్యం చేస్తే బీమా కంపెనీలతోపాటు సంబంధిత రాష్ట్రాలకు జరిమానా విధించాలని కూడా కేంద్రం స్పష్టం చేసింది. అలాగే కంపెనీల విన్నపం మేరకు తన వాటా సబ్సిడీ సొమ్ము చెల్లించడంలో మూడు నెలలకు మించితే రాష్ట్రాలు 12 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. -
అకాల వర్షాలకు అన్నదాత కుదేలు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ సోమవారం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నెల 3 నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో 20 జిల్లాల్లోని 108 మండలాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్, నిర్మల్, జనగాం, నల్లగొండ, యాదాద్రి, సిద్దిపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, రాజన్న సిరిసిల్ల, వరంగల్ అర్బన్, మేడ్చల్, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం, కొమురంభీం, భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఆ జిల్లాల్లో 61,079 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక తెలిపింది. అందులో అత్యధికంగా 59,113 ఎకరాల్లో వరి పంట ధ్వంసమైంది. పెసర, సజ్జ, మొక్కజొన్న పంటలకు కూడా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా 12,222 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు నివేదిక వెల్లడించింది. మొత్తంగా 34,347 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని లెక్క తేల్చింది. ఉద్యాన పంటలు దాదాపు 40 వేల ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. పంట నష్టం జరిగిన రైతులు బీమా కంపెనీల దృష్టికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. వడగండ్ల వానలు.. సోమవారం ఈదురుగాలులు, వడగండ్ల వానలకు జనగామ జిల్లా రైతులు అతలాకుతలమయ్యారు. పొలంలోనే వరిచేను నేలకొరి ధా న్యం రాలిపోయింది. అమ్ముకోవడానికి కొను గోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. 1,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం ఎండపల్లిలో సుమారుగా 250 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక్క ఎండపల్లి గ్రామంలోనే సుమారు 250 ఎకరాల పంటకు నష్టం చేకూరింది. కొద్ది రోజుల్లో కోతకు వచ్చే దశలో వడగళ్ల ధాటికి గింజలు పూర్తిగా నేల రాలిపోయాయి. నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారి అనూష పంట పొలాల్లో రైతులతో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో సోమవారం ఈదురు గాలులు భీభత్సాన్ని సృష్టించాయి. వరి పంట నేలరాలింది. మామిడికాయలు రాలిపోయా యి. పంట నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. పెద్దపల్లి జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి. గత బుధవారమే భారీ ఈదురుగాలు లు, రాళ్ల వానలతో అతలాకుతలమై పంట పొలాలు నేలవారగా, మామిడి కాయలు రాలిపోయాయి. మళ్లీ సోమవారం అకాల వర్షం కురవడంతో మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం, మిగిలిన వరిపొలాలు, కల్లాల్లో ధాన్యం తడిసింది. రాఘవపూర్, గుర్రాంపల్లి, మారేడుగొండ, రాంపల్లి, హన్మంతునిపేట, నిట్టూరు గ్రామాలతో సుల్తానాబాద్ మండలం లో వర్షాలతో పంట దిగుబడులు నష్టపోయా యి. పెద్దపల్లి మండలం ముత్తారం, అప్పన్నపేట, గౌరెడ్డిపేట, రాఘవపూర్ల్లో మామిడితోటల కాయలు రాలిపోయాయి. -
ఉసురు తీసిన అప్పులు
గోనెగండ్ల/ నందికొట్కూరు/ గూడూరు రూరల్/ బొమ్మనహాళ్: వరుస పంట నష్టాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాల క్షేపం చేస్తోంది. దీంతో దిక్కుతోచని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనంతపురంలో మరొకరు తనువు చాలించారు. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపడుతున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన బెస్త మల్లయ్యకు(58) ఐదెకరాల పొలం ఉంది. వర్షాభావంతో నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర లభించలేదు. ఈ ఏడాదీ వేసిన పత్తి వర్షాల్లేక ఎండిపోయింది. దీంతో సాగుకు, కుటుంబ పోషణ నిమిత్తం చేసిన ప్రైవేట్ అప్పులు దాదాపు రూ.6లక్షలకు చేరాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వీటిని తీర్చే మార్గం కానరాక ఆదివారం రాత్రి పురుగు మంది సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మల్లయ్య మరణించాడు. పంటలు పండక.. అప్పులు తీర్చలేక.. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) నాలుగేళ్లుగా పంట నష్టాలను చవిచూశాడు. రెండేళ్ల క్రితం అప్పులు తీర్చేందుకు ఐదెకరాల సొంత భూమి అమ్మినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నా పంటలు సక్రమంగా పండలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా చేరాయి. బంగారు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు కూడా తీసుకున్నాడు. అప్పులన్నీ తలకు మించిన భారం కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న రాజేశ్వరరెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పొలంలోనే పురుగుమందు సేవించి.. ఇదే జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన చాకలి చిన్న గిడ్డన్న (45) తనకున్న 2.25 ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగుచేసేవాడు. మూడేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి కనిపించక ఈ నెల 7న పొలంలోనే పురుగుల మందు తాగాడు. రైతులు, కూలీలు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. పంటను కాపాడుకోలేక... అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన దాసరి హనుమంతప్ప కుమారుడు దాసరి నాగరాజు(24)కు 1.5 ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి చికిత్సకు రూ.3.50 లక్షల దాకా అప్పు చేశాడు. బ్యాంకుల్లో పంట రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా వడ్డీలకే సరిపోయింది. దీంతో కొంతకాలం బళ్లారిలో కూలీగా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల గ్రామం చేరుకుని వరి సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపుగా ఉన్న పంటను కాపాడుకునేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడం.. అప్పటికే అప్పులు ఎక్కువవడంతో అప్పు దొరికే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కుదేలైన అన్నదాత
-
3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, అమరావతి: ఎడతెరిపి లేని వర్షాలు పంటలను తుడిచిపెట్టాయి. వరుణుడి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పలు రకాల పంటలు పూర్తిగా వర్షార్పణం అయ్యాయి. రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. దక్షిణ కోస్తాలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలతో సుమారు 3.70 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా. దెబ్బతిన్న పంటల్లో వరి మొదటి స్థానంలో ఉండగా పత్తి, మొక్కజొన్న, చెరకు, అరటి, పసుపు, కంద వంటి పంటలు తర్వాతి స్థానాలలో ఉన్నాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు అధికార బృందాలు త్వరలో గ్రామాలలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు 2.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఇప్పటికిప్పడు నష్టం విలువ ఎంత అనేది చెప్పడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నా రైతు సంఘాలు మాత్రం వేయి కోట్లకు పైమాటే అంటున్నాయి. పంట నష్టం వివరాలను తగ్గించి చూపే ప్రయత్నం అధికారులు చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. గత ఏడాది కూడా ఇలాగా నష్ట తీవ్రతను తగ్గించి చూపారని వారు గుర్తు చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున తక్షణమే సాయం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 1.48 లక్షల ఎకరాల్లో వరికి దెబ్బ దక్షిణాకోస్తాలోని విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో దాదాపు 1.48 లక్షల ఎకరాల్లో వరి పంట నీట మునిగి ఉంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలోని 16 లంక గ్రామాల భూముల్లో పంట పూర్తిగా వరద నీటిలో మునిగి ఉంది. ప్రస్తుతం ఆయా లంక గ్రామాలకు వెళ్లేందుకు పడవలు తప్ప వేరే మార్గం లేకపోవడంతో ఎంత విస్తీర్ణం మేర నీట మునిగి ఉందనేది తెలియడం లేదు. లంక గ్రామాల్లో వేసిన ఉద్యాన, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలోనే సుమారు 17,300 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 34,594 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు అంచనా వేశారు. కోనసీమలోని లంక గ్రామాలలో పసుపు, కంద పంటలు నీట మునిగి ఉన్నాయి. పంట నష్ట పరిహారం ఏదీ? ఎక్కడ? గత మేలో కురిసిన అకాల వర్షాలకు సుమారు రూ.200 కోట్ల నష్టం జరిగినా ఇంతవరకు రైతులకు నయాపైసా చేతికి అందలేదు. అదిగో ఇదిగో అని తిప్పుతూనే ఉన్నారు. అప్పట్లో మార్కెట్ యార్డులలో సుమారు 7 లక్షల టన్నుల ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోయాయి. నష్టం అంచనా అంటూ హడావిడి చేసి రెండు నెలల తర్వాత ఆ మొత్తాన్ని రూ.190 కోట్లకు చేర్చినా రైతులకు అందింది శూన్యమే. ఇప్పుడు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఇంకెంత కాలం పడుతుందో, రైతు చేతికి వచ్చేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. తెగుళ్ల బెడద– నివారణ సూచనలు ఎడతెరిపి లేని వర్షాల వల్ల పంటలకు తెగుళ్లు సోకే బెడద ఎక్కువగా ఉండొచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ పంట సంరక్షణకు పలు సూచనలు చేశారు. వీటిని పాటించి పంటను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. వరి నాటు వేసిన పొలంలో అధికంగా ఉన్న నీటిని తొలగించి ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సా కోనాజోల్ గాని వాలిదామైసిన్ను గానీ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. పత్తి వేసి నెల రోజులు దాటితే ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. కుళ్లు తెగులు, బాక్టీరియా మచ్చ తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాముల్ని పిచికారీ చేయాలి. వంగ, టమాటా వంటి కూరగాయల పంటలకు తెగుళ్లు రాకుండా ఆక్సిక్లోరైడ్‌ను నీళ్లలో కలిపి మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపుకు తాటాకు తెగులు ఆశించినట్టయితే ప్రోపికొనజోల్ లేదా మాంకోజెట్ ను పిచికారీ చేసుకోవాలని శాస్త్రవేత్తలు తెలిపారు. -
పంట నష్టం అపారం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వంద కోట్లకుపైగా నష్టం ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్‌లో మూడు రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండగా, చెరువులు నిండుకున్నాయి. పంట పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరి, పంటనష్టం రోజురోజుకు పెరుగుతోంది. వర్షాకాలం ప్రారంభమైన మొదట్లో వర్షాలు కురిసినట్లే కురిసి ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా, భారీ వర్షాలతో పంటకు జీవం పోసినట్లే పోసి, వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు జరిగిన నష్టానికి ఆవేదన చెందుతున్నారు. వరద పంటల్లో చేరగా, మరి కొన్ని ప్రాంతాల్లో ఇసుక మేటలు వేశా యి. ఉమ్మడి జిల్లాలో వరి పంట 10 వేల ఎకరాలకు పైగా నష్టపోగా, పత్తి పంట 1.5 లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశా రు. సోయా 20 వేల ఎకరాలు, కంది పంట 10 వేల ఎకరాలు, జొన్న, ఇతర పంటలు 5 వేల ఎకరాలకుపైగా నష్టపోయాయి. వర్షాలు ఇంకా కురుస్తుండటంతో పంట నష్టం తీవ్రత పెరిగే అవకాశముంది. నష్టపోయిన పంట రూ.100 కోట్లకు పైగా ఉంటుంది. ఖరీఫ్‌లో వేసిన పంటలు వర్షార్పణం అవుతాయేమోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. -
అకాల నష్టం..
జంగారెడ్డిగూడెం : రాకాసి గాలులు విరుచుకుపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. ఉరుము, మెరుపు లేకుండా రాత్రివేళలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. చేతికందిన పంట నేలనంటడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటను చూసి పోలవరం మండలంలో ఓ రైతు గుండె ఆగింది. మొక్కజొన్న, వరి, అరటి, నిమ్మ పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షంతో జంగారెడ్డిగూడెం వ్యవసాయ, ఉద్యాన, విద్యుత్ శాఖల పరిధిలో పెద్దెత్తున నష్టం సంభవించింది. శనివారం రాత్రి వేళలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. సుమారు 12,500 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. చేతికి వచ్చే దశలో పంటలు నేలపాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రధానంగా జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోనే ఎక్కువ నష్టం సంభవించింది. మొక్కజొన్న రైతు విలవిల వ్యవసాయశాఖ పరిధిలోని మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం జరిగింది. కేఆర్ పురం వ్యవసాయశాఖ డివిజన్ పరిధిలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 1,500 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖాధికారి చెన్నకేశవులు తెలిపారు. నష్టాలేనిమ్మ.. ఉద్యాన శాఖ పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. అరటి, నిమ్మ, మామిడి తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో సుమారు 300 ఎకరాల్లో అరటి పంట నేలకూలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అరటి తోటలన్నీ నేలరాలడంతో ఎందుకు పనికిరాకుండా పూర్తిగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లోని నిమ్మతోటల్లో కాయలు నేలరాలాయి. ఈదురుగాలుల ధాటికి మామిడి పంటకు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. సుమారు 500 ఎకరాల్లో మామిడికాయలు నేలరాలాయి. ఉద్యాన శాఖకు జరిగిన పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఏడీ ఎ.దుర్గేష్ తెలిపారు. విద్యుత్ శాఖకు నష్టం విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం జరిగింది. భారీ ఈదురుగాలులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 20 విద్యుత్ స్తం భాలు దెబ్బతినగా వీటిలో 33 కేవీ విద్యుత్ స్తంభాలు 10, 11 కేవీ విద్యుత్ స్తంభాలు 11 దెబ్బతిన్నట్టు విద్యుత్ శాఖ డీఈ ఎ.రవికుమార్ తెలిపారు. మరో 10 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్నాయన్నారు. సుమారు రూ.10 లక్షల వరకు నష్టం జరిగినట్లు చె ప్పారు. వీటన్నింటిని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామన్నారు. పంటను చూసి ఆగిన గుండె పోలవరం: చేతికందిన పంట నేలనంటడంతో చూసి తట్టుకోలేక ఓ రైతు పొలం వద్దే కు ప్పకూలి మృతిచెందిన ఘటన పోలవరం మండలంలోని పాతపట్టిసీమ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాతపట్టిసీమకు చెందిన పందిటి వెంకట్రాజు (65) గ్రామంలో తన సొంత పొలం ఎకరంతో పాటు కౌలుకు తీసుకుని మరో మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. పంట బాగా పండి చేతికందే దశకి వచ్చింది. శనివారం రాత్రి బలమైన ఈదురుగాలులు వేయడంతో పంట అంతా నేలకొరిగింది. ఆదివారం ఉదయం చేలోకి వెళ్లిన వెంకట్రాజు పంటను చూసి కుప్పకూలి మృతిచెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు ఎకరాలకు సుమారు రూ.50 వేల వరకూ పెట్టుబడి పెట్టాడు. మూడు ఎకరాలను ఎకరాకు రూ.20 వేలు చొప్పున కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వెంకట్రాజు పంట చేతికి వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. అతడికి దాదాపు రూ.5.50 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. దొండపూడి ఆంధ్రాబ్యాంకులో రూ.లక్ష, సహకార సంఘంలో రూ.1.50 లక్షలు, పొలం మీద రూ.1.50 లక్షలు, బంగారంపై రూ.50 వేలు, ప్రైవేట్ అప్పు రూ.లక్ష వరకు ఉన్నట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పట్టిసీమ వీఆర్వో కె.రమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు మానసికంగా అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు. -
రైతు సమస్యల పట్టింపేదీ?
ప్రభుత్వంపై ఉత్తమ్ ధ్వజం * సీఎం తీరు అత్యంత బాధ్యతారాహిత్యం * మరో రెండేళ్లు కరువు ఉండదంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు * ప్రభుత్వ తాత్కాలిక లెక్కల ప్రకారమే 4.45 లక్షల ఎకరాల్లో పంట నష్టం * కరువు, వరదల వల్ల ఎదురైన పంట నష్టాలకు పరిహారం ఇవ్వాలి * రైతు సమస్యల పరిష్కారానికి అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరువు మరో రెండేళ్ల దాకా ఉండదంటూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. వ్యవసాయం, రైతు సమస్యల పరిష్కారంకన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైన, ప్రాధాన్యమైన అంశాలేమున్నాయని ప్రశ్నించారు. రైతు సమస్యలపై చర్చించి, పరిష్కరించేందుకు వీలుగా వెంటనే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావుతో కలసి ఆదివారం గాంధీభవన్‌లో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ తాత్కాలిక లెక్కల ప్రకారమే 4,45,792 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, క్షేత్రస్థాయిలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. కరువు, వరదలతో పంటలు చేతికందక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దీనికితోడు మూడో విడత రుణ మాఫీ సొమ్ము విడుదల కాకపోవడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల అప్పుల వేధింపులు పెరగడం వంటి సమస్యలను రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. ఇలాంటి సంక్షోభ తరుణంలో కరువు, వరదల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి వివరించి ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించడం క్షమించరాని నేరమన్నారు. పూర్తి నష్టం అంచనా వేయకుండానే.. రాష్ట్రంలో కనీసం ఇప్పటిదాకా వ్యవసాయం, రైతు సమస్యలపై సమగ్ర సమీక్ష కూడా జరగలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. సమగ్ర సమాచారం లేకుండా, వరద ప్రభావం ఇంకా పోకుండా, క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పూర్తిగా అంచనా వేయకుండా కొందరు మంత్రులను ఢిల్లీకి పంపడం వల్ల ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. కరువు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు, వాణిజ్య పంటలకు రూ. 20 వేలు, పప్పు ధాన్యాలకు రూ. 35 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మిర్చి, పత్తి వంటి వాణిజ్య పంటలకు సంబంధించిన కల్తీ విత్తనాలతో ఖమ్మం, వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారన్న ఉత్తమ్...ఇందుకు కారణమైన కంపెనీల అనుమతులను రద్దు చేయాలని, రైతులకు నష్ట పరిహారం ఇప్పించాలన్నారు. కరువులో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేని కోసం వినియోగించిందో చెబుతూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక సీఎంగా కేసీఆర్: పొన్నాల రైతు, వ్యవసాయ వ్యతిరేక ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పొన్నాల విమర్శించారు. కరువు, రైతు సమస్యలపై కేంద్రానికి నివేదికలు ఇస్తే ధనిక రాష్ట్రం హోదా పోతుందన్న ఆలోచనతో వాస్తవ నివేదికలను పంపడంలేదని ఆరోపించా రు. కరువు వచ్చినప్పుడు 50 రోజులు అదనంగా ఉపాధి హామీ పనులు కల్పించాల్సిన ప్రభుత్వం... పని దినాలను తగ్గించడం దారుణమన్నారు. 211 కోట్ల కూలీ బకాయిలు పెండింగ్‌లో ఉండటం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రానికి కేం ద్రం రూ. 90 వేల కోట్లు ఇచ్చినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పారని, ఆ నిధులు ఏమయ్యాయో ప్రభుత్వం చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. -
పంటల నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ రూ. 147 కోట్లు
పాత బకాయిలు కలిపి విడుదలకు వ్యవసాయశాఖ విన్నపం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, వడగండ్లతో రాష్ట్రంలో 2010 నుంచి ఇప్పటివరకు వ్యవసాయ, ఉద్యానశాఖలకు జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు రూ. 147.77 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు వ్యవసాయశాఖ విన్నవించింది. జరిగిన నష్టం... ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మంగళవారం ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌తో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం ఇప్పటివరకు జరిగిన నష్టాన్ని ఆర్ధికమంత్రికి విన్నవించారు. 2010 నుంచి ఈ ఏడాది జూన్ వరకు భారీ వర్షాలు, వడగండ్లు, అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం కింద రూ. 86.56 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని ఆయన కోరారు. అలాగే 2012 నుంచి ఈ ఏడాది వరకు వ్యవసాయ పంటలకు జరిగిన నష్టానికి రూ. 61.21 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కోరారు. అకాల వర్షాలతో 2014 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన పంటల నష్టానికి రూ. 23.90 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అకాల వర్షాలతో జరిగిన నష్టానికి రూ. 21.92 కోట్లు విడుదల చేయాలన్నారు. 2013 ఫిబ్రవరి, మార్చి, మే నెలల్లో అకాల వర్షాలకు వరంగల్, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఉద్యాన పంటలకు జరిగిన నష్టానికి రూ. 39.74 కోట్లు విడుదల చేయాలన్నారు. తమ విన్నపం మేరకు ఆర్థికశాఖ పచ్చజెండా ఊపిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావం నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఇన్పుట్ సబ్సిడీ సొమ్ము అందితే వారికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద ఆర్థికశాఖకు ఈ విన్నపం చేశామన్నారు. -
అన్నదాత:మారని తలరాత
రాష్ట్రంలో ఆగని రైతు ఆత్మహత్యలు వర్షాభావం, పంట నష్టం, అప్పుల బాధలే కారణం ఎనిమిది నెలల్లో 700 మంది బలవన్మరణం 96 మందే ఆత్మహత్యకు పాల్పడ్డారంటున్న సర్కారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వర్షాభావం, కరువు, పంట నష్టాలు, రుణభారం, వడ్డీ వ్యాపారుల వేధింపులు వంటివాటితో విసిగి వేసారిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక లెక్కలే చెబుతుండగా.. 700 మందికిపైగా బలవన్మరణాలకు పాల్పడినట్లుగా రైతు సంఘాలు ఆధారాలతో సహా చూపుతున్నాయి. రైతుల ఆత్మహత్యలను తక్కువగా చూపుతున్న ప్రభుత్వం.. వాటి నివారణకు చర్యలేమీ తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ పోలీసు అధికారులు మాత్రం గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 660 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 87 మంది ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించడం గమనార్హం. ప్రైవేటు అప్పులు రూ.18 వేల కోట్లు! గత ఖరీఫ్‌లో రైతులకు ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో విత్తనాలు సరఫరా చేయలేదు. దీంతో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనాల్సి వచ్చింది. దానికితోడు వర్షాలు సరిగా కురవకపోవడంతో.. మరోసారి విత్తనాలు వేయాల్సి వచ్చి, ఖర్చులు రెండింతలయ్యాయి. మూడుసార్లు విత్తనాలు వేసిన రైతులూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం రుణమాఫీపై సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఖరీఫ్ పూర్తయ్యే వరకు (సెప్టెంబర్ 30 నాటికి) బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం రైతులు రూ.18 వేల కోట్ల మేరకు ప్రైవేటు అప్పులు చేసినట్లు అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాభావం కూడా ఏర్పడి పంటల్లో 40 శాతం ఎండిపోయాయి. దీంతో వరి దిగుబడి బాగా తగ్గిపోయింది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోనైతే వందలాది ఎకరాల్లో వరిని తగులబెట్టారు. బావుల కింద వేసిన పంటలు విద్యుత్ లేక ఎండిపోయాయి. పత్తి ఎకరాకు 2 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెరిగిన అప్పులు, వడ్డీలు, ఎండిన పంటలు.. రైతులను బలవన్మరణానికి పురిగొల్పుతున్నాయి. తక్కువగా చూపుతున్న సర్కారు.. ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్య రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా చూపుతోందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. అన్నదాతల ఆత్మహత్యలను నిర్ధాంచేందుకు జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీ సభ్యులుగా కమిటీలు వేశారు. వారు నిర్ధారించిన ప్రకారం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 96 మంది ఆత్మహత్య చేసుకున్నారని వ్యవసాయశాఖ చెబుతోంది. ఈ లెక్కలపై రైతు సంఘాలు, బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో 674 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని వారు ఆధారాలతో సహా స్పష్టం చేస్తున్నారు. నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అసలు ఆత్మహత్యలే జరగలేదని ప్రభుత్వం చెబుతోంది. కానీ నల్లగొండలో 93 మంది, నిజామాబాద్‌లో 48 మంది, ఖమ్మంలో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాలు లెక్కతేల్చాయి. మరోవైపు చాలా ఆత్మహత్యలు ‘ఇతర కారణాల’తో జరిగినవిగా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంటోంది. నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరమనే ఉద్దేశంతోనే సర్కారు పెద్దలు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి.ట దుర్భర పరిస్థితులు.. 2014-15లో వ్యవసాయరంగం అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంది. రుతుపవనాలు సకాలంలో రాకపోవడంతో ఖరీఫ్, రబీల్లో పూర్తిస్థాయి వర్షాలు కురవలేదు. గత ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ముగిసిన గత సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో సరాసరి 715 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 498.1 మిల్లీమీటర్లు (30% లోటు) నమోదైంది. అలాగే గత అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ వరకు రబీలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 50.8 మిల్లీమీటర్లు (61% లోటు) మాత్రమే నమోదైంది. మొత్తంగా గత వ్యవసాయ సీజన్లో 906.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 649.6 మిల్లీమీటర్లకే (25% లోటు) పరిమితమైంది. ఫలితంగా ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 20.60 లక్షల హెక్టార్ల నుంచి 17.18 లక్షల హెక్టార్లకు (83%) పడిపోయింది. రబీలో ఆహార ధాన్యాల సాగు 10.41 లక్షల హెక్టార్ల నుంచి 8.13 లక్షల హెకార్టకే (78%) పరిమితమైంది. మిగిలింది ఆవేదనే.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గిపోవడానికి తోడు, వచ్చిన ఆ కాస్త దిగుబడికీ సరైన మద్దతు ధర లభించక అన్నదాతలు ఆందోళనలో మునిగిపోయారు. అలాంటి చాలామంది రైతులు నష్టాన్ని తట్టుకోలేక, పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే ఆవేదనతో గుండె ఆగిపోయి మరణించారు. -
శాంతించిన వంశధార
- ఒడిశాలోని క్యాచ్మెంట్ ఏరియాలో తగ్గిన వర్షాలు - గొట్టా బ్యారేజీ నుంచి క్రమంగా తగ్గుతున్న నీటి విడుదల - తేలుతున్న పంట నష్టాలు.. రైతుల గగ్గోలు హిరమండలం: ఒడిశాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వంశధారకు వరద ముప్పు తప్పింది. ఎగువ నుంచి వచ్చే నీటి పరిమాణం తగ్గడంతో హిరమండలంలోని గొట్టా బ్యారేజీ నుంచి నీటి విడుదలను కూడా అధికారులు క్రమంగా తగ్గించారు. వరద నీరు తగ్గుతున్న కొద్దీ.. ఇప్పుటికే ముంపునకు గురైన పంటల నష్టాలు తేలుతున్నాయి. మూడు రోజులుగా నీటిలో నాని దెబ్బతిన్న పంటలను చూసుకొని రైతులు కుంగిపోతున్నారు. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గొట్టా బ్యారేజీ నుంచి 79వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా.. సోమవారం ఉదయం నుంచి క్రమం గా దాన్ని తగ్గిస్తూ వచ్చారు. ఉదయం 6 గంటలకు 71,105 క్యూసెక్కులు, 10 గంటలకు 67,158 క్యూసెక్కులు, సాయంత్రం 5 గంటలకు 51,598 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. 19 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నట్లు వంశధార డీఈఈ ఎస్.జగదీష్ తెలిపారు. ఆర్డీవో పరిశీలన వంశధార వరద పరిస్థితిని గొట్టా బ్యారేజీ వద్ద పాలకొండ ఆర్డీవో ఎన్.తేజ్‌భరత్ సోమవారం పరిశీలించారు. ఒడిశాలోని క్యాచ్మెంట్ ఏరియా ల్లో వర్షపాతం, వరదల నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండి, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ఆయనతో పాటు తహశీల్దారు డి.చంద్రశేఖరరావు, ఎంపీడీఓ బి.కుమారస్వామి, తదితరులు ఉన్నారు. -
పంట నష్టం అపారం
తాండూరు, న్యూస్‌లైన్: కుండపోత వర్షాలతో జిల్లాలో వివిధ పంటలకు అపార నష్టం వాటిల్లిందని, రైతులకు ప్రభుత్వం నుంచి వీలైనంత తొందరగా పరిహారం ఇప్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లావ్యాప్తంగా పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పంట నష్టం, విద్యుత్ సమస్యలపై శనివారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి వివరించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించి పంట నష్టంపై సర్వే చేయించనున్నట్టు తెలిపారు. సర్వే నివేదికలన్నింటినీ క్రోడీకరించి పరిహారం కోసం త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. గతేడాది నీలం తుపానుతో జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందకపోవడంపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మొక్కజొన్నల కొనుగోలుకు జిల్లాలో 20 కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.1310 చెల్లిస్తారని... రైతులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తే క్వింటాలుకు రూ.300 తక్కువ ధర వస్తుందన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు మెజార్టీ అవసరం లేదు... గతంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఆయా అసెంబ్లీల్లో బిల్లు పెట్టి అందరి ఆమోదం పొందే అవకాశం ఉండేదని, అయితే ఇప్పుడు అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెడితే మెజార్టీ అవసరం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు. సీడబ్ల్యూసీ నిర్ణయం, నోట్‌కు కేబినెట్ ఆమోదం తెల్పిన తర్వాత ఎవరు అడ్డుకున్నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల వలసలకు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మంత్రి విముఖత చూపారు. వికారాబాద్‌లో 50 ఎకరాల్లో సుమారు రూ.30కోట్లతో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు కానుందని, దీంతో సుమారు 2వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ పార్కుకు స్థలాల కేటాయింపు, అభివృద్ధితో ఏపీఐఐసీకి ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి సంబంధించి నామినేటెడ్ పోస్టులు తర్వలో భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ పోస్టుల భర్తీ ఆగిపోయిందని వివరించారు. తెలంగాణలో వికారాబాద్ జిల్లా కేంద్రం... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వికారాబాద్ జిల్లా కేంద్రం అవుతుందని మంత్రి ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్‌లో విశ్వవిద్యాలయంతోపాటు వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు అధికారులతో మాట్లాడతానన్నారు. వికారాబాద్ లారీ అసోసియేషన్ విన్నపం మేరకు ఇసుక తరలింపు సమస్యపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. జిల్లాలో 12 ఎస్సీ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి స్థలాల కేటాయింపు తదితర ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పెద్దేముల్ కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు సుమారు రూ.25 కోట్ల జైకా నిధులు రానున్నాయని, మరో 11 ప్రాజెక్టుల అభివృద్ధికీ ప్రతిపాదనలు పంపించామని మంత్రి వివరించారు. తాండూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతానన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మారెడ్డి, రమేష్, విశ్వనాథ్‌గౌడ్, అల్విన్ అనంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అపూ(నయీం), అలీం తదితరులు పాల్గొన్నారు.