ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు | Huge Crop Loss Across Andhra Pradesh With Floods | Sakshi
Sakshi News home page

ముంచేసిన బుడమేరు.. చెరువుల్లా పొలాలు

Published Mon, Sep 16 2024 5:31 AM | Last Updated on Mon, Sep 16 2024 5:31 AM

Huge Crop Loss Across Andhra Pradesh With Floods

చెరువుల్లా పొలాలు.. కనుచూపు మేర ఇసుక మేటలే.. 

నోటికాడ ముద్ద నేలపాలు.. ఆవిరైన అన్నదాత ఆశలు

కృష్ణా లంకల్లో కన్నీళ్లు.. ముంచేసిన బుడమేరు.. ‘ఏలేరు’ వరదతో కకావికలం

వరుసగా వర్షాలు, వరదలతో ఉభయ గోదావరి అతలాకుతలం 

ఉత్తరాంధ్రలో నాగావళి, వంశధార విశ్వరూపం.. 

25 వేల ఎకరాల్లో పంట నష్టం.. రహదారుల పరిస్థితి దారుణం 

ఇసుక మేటలు తొలగించాలంటే రైతన్నలపై ఎకరాకు రూ.20 వేలకు పైగానే భారం 

నష్టంపై సర్కారు ప్రాథమిక అంచనా 5.93 లక్షల ఎకరాలే.. వాస్తవానికి అంతకుమించి నష్టం 

ఎకరాకు రూ.10 వేలు ఏకాడికి? ఆదుకోకుంటే రబీ వేయలేమంటున్న రైతులు 

ఖరీఫ్‌లో తగ్గనున్న ప్రధాన పంటల దిగుబడులు.. పచ్చనేతల కనుసన్నల్లోనే పంట నష్టం అంచనాలు  

(సాక్షి అమరావతి, నెట్‌వర్క్‌): చేతికొచ్చిన పంట నోటికందకుండా పోయింది! మరో 15–20 రోజుల్లో చేతికొస్తాయనుకున్న పంటలు ముంపు నీటిలో కుళ్లిపోతుంటే అన్నదాత కుమిలిపోతు­న్నాడు. వేలకు వేలు అప్పులు చేసి రెక్కలు ముక్కలు చేసుకొని సాగు చేసిన పంటలు కాస్తా వర్షాలు, వరదలకు తుడిచిపెట్టుకుపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయాడు. కృష్ణా లంక గ్రామాల్లోని పొలాల్లో ఎటు చూసినా ఇసుక మేటలే కనిపిస్తుండగా బుడమేరు వరద పంట చేలల్లో ఇంకా ప్రవహిస్తూనే ఉంది. 

ఏలేరు వరద రైతులను కకావికలం చేసింది. ముంపు తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న పంట పొలాలు అన్నదాత గుండెను పిండేస్తున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను ఈ ఏడాది మూడుసార్లు వరదలు ముంచెత్తగా పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్‌వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఉత్తరాంధ్రలో బహుదా, నాగావళి, వంశధార పోటెత్తడం, విరుచుకుపడ్డ వరదలతో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. పలు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామా­లకు వారం పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకం చవిచూశారు. 

దెబ్బతిన్న రోడ్లు.. 
ఉత్తరాంధ్రలో వరదలకు రోడ్లు బాగా దెబ్బతి­న్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వెళ్లే రోడ్డు చెరువును తలపిస్తోంది.  రాజాంలో ప్రధాన రహదారి అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి జీఎంఆర్‌ఐటీ వరకూ లోతైన గోతులు పడ్డాయి. తెర్లాం మండలంలో కుసుమూరు–అంపావల్లి గ్రామాల మధ్య కల్వర్టు కొట్టుకుపోవడంతో ఇప్పటికీ రాకపోకలు లేవు.

నష్టం అపారం...
రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 5.42 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, 51 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతినగా 3.08 లక్షల మంది రైతులు నష్టపోయినట్లు అంచనా వేశారు. అత్యధికంగా ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రైతులకు అపార నష్టం జరిగింది. వ్యవసాయ పంటలకు రూ.358.91 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.42.34 కోట్లు, పట్టు పరిశ్రమకు రూ.2.68 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.  

పచ్చనేతల కనుసన్నల్లోనే అంచనాలు
రాజకీయాలకతీతంగా జరగాల్సిన పంట నష్టం అంచనాలు పచ్చనేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఎన్నిక­ల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారి పేర్లను జాబితాల నుంచి తొలగించాల్సిందేనని అధికారులపై టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్టు రైతులు పేర్కొంటున్నారు. ఇచ్చేదే అరకొర సాయం.. దానికి కూడా రాజకీయ రంగు పులమడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూపూడికి చెందిన ఓ రైతు 80 ఎకరాల్లో పంట వరదలకు నష్టపోగా గత ప్రభుత్వ హయాంలో నామినేట్‌ పదవి పొందారనే అక్కసుతో ఆయన పేరు జాబితాలో తొలగించాలని స్థానిక టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.


కృష్ణా, బుడమేరు వరదలు ఉమ్మడి కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. 44,521 హెక్టార్లలో పంటలు ముంపు బారిన పడగా మరో 4,070 హెక్టార్లలో ఉద్యాన పంటలు, 50 హెక్టార్లలో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. 

⇒ పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గ పరి«ధిలో పంటలు ఎక్కువ దెబ్బతిన్నాయి. జిల్లాలో వ్యవసాయ పంటలు 8,818.48 హెక్టార్లలో దెబ్బ తినగా 33 శాతం కన్నా ఎక్కువగా 2,852.747 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 3,368 మంది రైతులకు రూ.4.8 కోట్ల మేర ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాల్సి ఉంటుందని లెక్కగట్టారు. జిల్లాలో వరద తాకిడికి 259.13 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. వర్షాలకు జిల్లాలో 41 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, వరదలకు జిల్లాలో విద్యుత్‌శాఖ(ఏపీఎస్‌పీడీసీఎల్‌)కు రూ.64.55 లక్షల మేర నష్టం వాటిల్లింది.

‘ఏలేరు’ గుండెకోత..
ఏలేరు వరదలతో పిఠాపురం, కిర్లంపూడి, గొల్లప్రోలుల్లోని పంటపొలాల్లో టన్నుల కొద్దీ మేట వేసిన ఇసుకను చూసి రైతులు విలవిలలాడుతున్నారు. ఏలేరు కాలువకు గండ్లు పడి 40 వేల ఎకరాలకుపైగా పంట పొలాల్లో రెండు అడుగుల ఎత్తున ఇసుక పేరుకుపోయింది. ఏలేరు రిజర్వాయరుపై ఆధారపడి 62 వేల ఎకరాల్లో సాగు జరుగుతోంది. 40 వేల మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో గత నెలలో ఏజెన్సీ పరిధిలోని పెదవాగు పొంగడం.. ఆ తరువాత తమ్మిలేరు, ఉప్పుటేరు నుంచి భారీగా వరద నీరు చేరడం.. మళ్లీ వారం పాటు విస్తారంగా వర్షాలు కురవడం రైతులకు తీవ్ర వేదన 
మిగిల్చింది. ప్రధానంగా 5,683.20 హెక్టార్లలో వరి పూర్తిగా పాడైపోయింది.

రాళ్లు రప్పలతో పొలాలు..
కృష్ణా పరీవాహక ప్రాంతంలోని దిబ్బల్లంక, బెజవాడలంక, వాసనలంక తదితర లంక గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ అత్య«ధిక భూములను ఎస్సీ రైతులే సొసైటీలుగా ఏర్పడి సాగు చేసుకుంటున్నారు. వారికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో పట్టాలు మంజూరయ్యాయి. ఏడాదిలో ఏ సమయంలో వచ్చినా ఇక్కడ పచ్చని పొలాలు దర్శనమిస్తాయి. అలాంటి లంకల్లో నేడు చూద్దామంటే పచ్చని పైరు కానరాని దుస్థితి. రెండు నుంచి ఐదు అడుగుల మేర ఇసుక మేట వేసింది. 

పిందె కట్టిన పత్తి, కాపుకొస్తున్న కూరగాయలు, కోతకు సిద్ధమైన వరి పొలాలు, గెలలేసిన అరటి, ఏపుగా ఎదిగిన జొన్న, మొక్కజొన్న.. ఇలా ఏ పంట చూసినా విగత జీవిలా నేలకొరిగి ఇసుక మేటల్లో కలిసిపోయాయి. ఉచిత విద్యుత్‌ కోసం గతంలో ఏర్పాటు చేసిన వందలాది విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ మోటార్లు, ఇంజన్లు దాదాపు 12 రోజులుగా వరద నీటిలో చిక్కుకుని బురదకు పాడైపోయాయి. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన పెద్దపెద్ద రాళ్లు రప్పలతో పంటపొలాలు నిండిపోయాయి. 

ముంచేసిన బుడమేరు..
బుడమేరు వరద ముంపునకు గురైన ఉంగు టూరు, నందివాడ, బాపులపాడు, పెదపారు పూడి మండలాల్లోని వంద లాది గ్రామాల్లో ఏ రైతును కదిపినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. వరద ప్రభావానికి గురైన దిబ్బనపాడు, గారపాడు, ఆముదలపల్లి, ముక్కుపాలెం, లంకపల్లి, సిరివాడ, చినలింగాల, పెదలింగాల, చెదుర్తిపాడు, మోపాడు, ఇంజరుపూడి తదితర గ్రామాల్లో అన్నీ మాగాణి భూములే. 

నీటి వనరులకు లోటు ఉండదు. ఇప్పుడు ఎటు చూసినా పైర్లన్నీ సెలయేర్లను తలపిస్తున్నాయి. బుడమేరు వరద ఇంకా పంట చేలల్లో ప్రవహిస్తూనే ఉంది. ఆయా గ్రామాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైగా పంట భూములున్నాయి. ఈ ప్రాంత రైతులంతా ఎంటీయూ 1318 వరి రకాన్నే సాగు చేస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ ప్రాంతంలో మంచి పంటలు పండాయి. ఈసారి కూడా మంచి రేటు వస్తుందన్న ఆశతో రైతులంతా అదే సాగు చేశారు.

కోనసీమను మూడుసార్లు ముంచెత్తిన వరద..
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మామిడికుదురు, సఖినేటిపల్లి, ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లో పలు లంక గ్రామాలకు వెళ్లే రహదారులు, కాజ్‌వేలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద నీటిలో నానుతుండడంతో పంట నష్టం తీవ్రంగా ఉంది. అరటి 1,876 ఎకరాల్లో దెబ్బతింది. 2,625 ఎకరాల్లో రైతులు కూరగాయ పంటలు నష్టపోయారు. తమలపాకు, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. 

అయినవిల్లి మండలంలో వరద నీట నానుతున్న కొబ్బరి తోటలో సాగవుతున్న అరటి, పోక (వక్క) పంట 

వరదల వల్ల డిమాండ్‌ ఉన్నా బత్తాయి కోయలేక నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పరిసర ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. మొదటి ప్రమాదకర హెచ్చరిక జారీ చేయగానే గోదావరి పాయల్లో చేపల వేట నిలిపివేయడంతో 14 మండలాల్లో సుమారు 2 వేల మంది మత్స్యకారులు జీవనోపాధి లేక అల్లాడుతున్నారు. పి.గన్నవరం మండలం గంటి పెదడిపూడి లంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంక వాసులు ఏటా వరద మొదలైన నాటి నుంచి నవంబరు  వరకు పడవలపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది.

13 వేలకుపైగా ఎకరాల్లో రెండోసారి మునక..
ఖరీఫ్‌ ప్రారంభం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగానికి కష్టాలు తప్పడం లేదు. ఆగస్టు చివరిలో వచ్చిన వర్షాలకు యనమదుర్రు, వయ్యేరు, ఎర్ర కాలువ, ఉప్పుటేరు ఉప్పొంగడంతో తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి నియోజకవర్గాల్లో 14 వేల ఎకరాల్లో నాట్లకు, 30 వేల ఎకరాల్లో నారుమడులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రెండోసారి నాట్లు వేశారు. అప్పటికే ఎకరాకు రూ.12 వేల వరకు పెట్టుబడి పెట్టగా మరోసారి దమ్ము చేసి నాట్లు వేసేందుకు అంతే ఖర్చు చేయాల్సి వచ్చింది. 

నాటి వర్షాలకు రూ.9.54 కోట్ల మేర పంట నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.  తాజాగా కొల్లేరు, గోదావరి వరదలకు ఆకివీడు, కాళ్ల, అత్తిలి, పెంటపాడు తదితర మండలాల్లో 13,300 ఎకరాల్లో పంట రెండోసారి నీట మునగడం రైతులకు తీరని వేదన మిగిల్చింది.

ఉత్తరాంధ్ర విలవిల.. వంద గ్రామాలు చీకట్లోనే
ఉత్తరాంధ్రలో వరదలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలో వరదలో కొట్టుకుపోయి ముగ్గురు,  కొండ చరియలు విరిగిపడి మరొకరు మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. రూ.ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. పోలవరం ముంపు ప్రాంతాలైన విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. 

రంపచోడవరం నియోజకవర్గంలో 100 గ్రామాలకు వారం రోజుల పాటు రాకపోకలు నిలిచిపోవడంతోపాటు విద్యుత్తు సరఫరా లేక నరకంలో గడిపారు. ఒక్క చింతూరు డివిజన్‌లోనే దాదాపు 20 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఉత్తరాంధ్రలో 25 వేల ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అధికారికంగా ప్రాథమిక లెక్కల ప్రకారం 4,987ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. మరో 500 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురయ్యాయి. అయితే క్షేత్రస్థాయిలో వేలాది ఎకరాల్లో  ఇసుక మేటలు వేసిన పరిస్థితి కనిపిస్తోంది.  

మళ్లీ ముఖం చూపించలేదు
వర్షాలకు సాయన్న గెడ్డ పొంగి దిశ మార్చుకొని మా పొలాలపై పడింది. మూడు గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అందులో నా మూడెకరాల వరి పొలం కూడా ఉంది. తొలిరోజు కలెక్టరు, రాజాం ఎమ్మెల్యే వచ్చి చూసి వెళ్లిపోయారు. అధికారులు మళ్లీ ముఖం చూపించలేదు. నష్టపరిహారం ఇస్తారో లేదో తెలియదు
– బొడ్డేపల్లి జగన్నాథం, మల్లయ్యపేట, విజయనగరం జిల్లా

బస్తా కూడా రావు..
నాకు జూపూడిలో నాలుగు ఎకరాలుంది. మరో 50 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. 24 ఎకరాల్లో మినుము, మిగతాది వరి వేశా. మినుముకు రూ.15 వేలు, వరికి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టా. మినుము సాగు చేసే పొలానికి కౌలు కూడా చెల్లించా. ఇప్పటికే రూ.15.90 లక్షల వరకు ఖర్చు అయింది. రెండు పంటలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. బస్తా గింజలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా నష్టపోయాం. 
–పల్లా శ్రీరామయ్య,  ఇబ్రహీంపట్నం

తీవ్ర నష్టం అయినా కౌలుకట్టాలి..
40 ఏళ్లుగా వరి, చెరకు సాగు చేస్తున్నా. కౌలుకు తీసుకుని పండిస్తున్నా. ఈ ఏడాది వరి నాట్లు వేశాక ముంపు బారిన పడింది. ఇక కోలుకునే పరిస్థితి లేదు. తీవ్ర నష్టం వాటిల్లినా కౌలు కట్టాల్సిందే. పెట్టుబడి మొత్తం నీళ్ల పాలైంది. ప్రభుత్వం వెంటనే స్పందించి అన్నదాతలను ఉదారంగా ఆదుకోవాలి. లేకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కోలుకోవడం కష్టం. 
– గంజి చిలుకునాయుడు, కౌలు రైతు, నూతలగుంటపాలెం, కశింకోట మండలం 

ఎకరాకు రూ.30 వేలు నష్టం 
గ్రామంలో ఎస్సీ రైతులంతా సొసైటీలుగా ఏర్పడి దిబ్బలంక, బెజవాడలంకల్లో 400 ఎకరాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నాం. మూడు పంటలు పండుతాయి. 15 ఎకరాలు మాగాణి, 3 ఎకరాల్లో పత్తి, 3 ఎకరాల్లో మినుము వేశా. వరదలతో పూర్తిగా నష్టపోయాం. ఇసుక మేట వేయడంతో ప్రతి రైతు ఎకరాకు రూ.30 వేలకుపైగా నష్టపోయారు. 
– రెంటపల్లి నాగరాజు, కొటికలపూడి, ఎన్టీఆర్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement