పది రోజులుగా పనుల్లేక పేదల పస్తులు
ఎడతెరిపిలేని వర్షాలకు ఎన్నెన్నో అవస్థలు
వ్యవసాయ పనుల్లేక ఇంటికే పరిమితమైన కూలీలు
ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు
మగ్గం గుంటల్లో నీరు చేరి నేతన్నల అగచాట్లు
తాటి చెట్లు తడిసిపోవడంతో దెబ్బతిన్న గీత కార్మికులు
చేతిలో కొడవలి.. నెత్తిన కండువా.. ముఖంలో ఆందోళనతో 9 మంది కూలీలు ఏ చేలోనైనా చిన్న పని దొరుకుతుందేమోనన్న ఆశతో సోమవారం కృష్ణా జిల్లా చోడవరం–పెనమలూరు రోడ్డు పక్కనున్న పొలాల వైపు ఆశగా చూస్తూ వెళ్తున్నారు. ఎటు చూసినా వర్షాలు, వరదలకు దెబ్బ తిన్న పొలాలే కనిపిస్తున్నాయి. రైతే దెబ్బ తిన్నాక కూలీలకు పనిచ్చేదెవరు? ఆ కూలీల కుటుంబాల కడుపు నింపేదెవరు? ఆ ఆవేదనే వారి మాటల్లో ప్రతిధ్వనించింది. పది రోజులుగా పని లేదని, ఇంటిల్లిపాదీ ఆకలితో ఆలమటిస్తున్నామని వారు ‘సాక్షి’ ప్రతినిధి వద్ద బోరుమన్నారు. ఎడతెరిపిలేని వర్షాలు ఉపాధిని దెబ్బతీశాయని, ప్రభుత్వమూ ఆదుకోవడంలేదని, ఎన్నెన్నో అవస్థలు పడుతున్నామని వివరించారు.
దాదాపు ఐదు వేల జనాభా కలిగిన చోడవరం గ్రామంలో 750 మంది వ్యవసాయ కూలీలు, 60 మంది భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక, చేతిలో డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వీరే కాదు.. రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు, వరదలకు లక్షలాది బడుగు జీవులు బతుకుదెరువు కోల్పోయారు. పనుల్లేక ఇంటికే పరిమితమైన వ్యవసాయ కూలీలు.. ఇసుక లేక, వర్షాలతో భవన నిర్మాణ కార్మికుల అవస్థలు.. మగ్గం గుంటల్లోకి నీరు చేరి నేతన్నల అగచాట్లు.. తాటి చెట్లు తడిసిపోయి దెబ్బతిన్న గీత కార్మికులు.. పల్లె కన్నీరు పెడుతున్న తీరుపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్ ఇది..
పది లక్షల మందికి పనుల్లేవు
విజయవాడలో వరదలతోపాటు గుంటూరు, బాపట్ల, ఎనీ్టఆర్, కృష్ణా, ఏలూరు, పశి్చమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు వ్యవసాయ కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీశాయి. వరి, అరటి, మొక్కజొన్న, చెరకు, ప్రత్తి, మిర్చి, పసుపు,
కంద పంటలు, ఆక్వా కల్చర్ç పనులపై ఆధారపడిన లక్షలాది వ్యవసాయ కార్మికులు రోజువారీ పనులను కోల్పోయారు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.10 కోట్ల మంది వ్యవసాయ కార్మికులున్నారు. వారిలో 10 లక్షల మందికిపైగా కార్మికులు వర్షాల వల్ల పనుల్లేక పస్తులుంటున్నారు. రోజూ ఇంటిల్లిపాదీ పనిచేస్తే కానీ గడవని ఈ కుటుంబాల్లో ఇప్పుడు ఒక్కరికి కూడ పని దొరకడంలేదు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ కూలీల ఉపాధి దెబ్బతింది. పది రోజులుగా పనుల్లేక అవస్థలు పడుతున్న ప్రతి కుటుంబానికి తక్షణమే రూ. 10 వేలు సాయం అందించాలని, అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గీత వృత్తికి చేటు
రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షలకుపైగా కుటుంబాలు కల్లు గీత వృత్తిపై ఆధారపడ్డాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు తడిసిపోయిన తాటి చెట్లు ఎక్కేందుకు వీలు కాకపోవడంతో గీత వృత్తి నిలిచిపోయింది. వేలాది గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. వీరందరినీ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు.
భవన నిర్మాణ రంగం కుదేలు
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అస్తవ్యస్థంగా మారడంతో భవన నిర్మాణ రంగం దెబ్బ తింది. దీనికితోడు ఇప్పుడొచి్చన వర్షాలు, వరదలకు ఇసుక రీచ్‌లలో తవ్వకాలు నిలిచిపోయాయి. దీంతో భవన నిర్మాణ రంగం మరింతగా కుదేలైంది. రాష్ట్రంలో ఆ రంగంపై ఆధారపడి జీవిస్తున్న 31 లక్షల మందికిపైగా కార్మికుల జీవనాన్ని దెబ్బతీసింది. విజయవాడలో వరద తాకిడికి అతలాకుతలమైన ప్రాంతాల్లోనే 20 వేల మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు కట్టుబట్టలతో మిగిలి, ఆహారం కోసం అలమటిస్తున్నారు.
నేతన్న అగచాట్లు..
వర్షాలు, వరదలకు చేనేత కుటుంబాలూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాష్ట్రంలో సుమారు 1.60 లక్షల మగ్గాలు ఉన్నట్టు అంచనా. పది రోజులుగా పడుతున్న వర్షాలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని నేత మగ్గాల కుంటల్లోకి నీరు చేరింది. దీంతో చేనేత కార్మికుల జీవనం స్తంభించింది. వేలాది నేతన్నల కుటుంబాలు అవస్థల పాలయ్యాయి.
శ్రీకాకుళం నుంచి వలసొచ్చాం
కొన్నేళ్ల క్రితమే 450 కుటుంబాల వాళ్లం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వలసొచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాయి. ఎక్కడ కూలి పని ఉంటే అక్కడకు వెళ్తుంటాం. నేను కూడా శ్రీకాకుళం జిల్లా నుంచే వచ్చాను. మేస్త్రీగా పది మందిని పనులకు తీసుకెళ్తున్నాను. వర్షాల వల్ల పది రోజులుగా పనుల్లేవు. మా కుటుంబాలన్నీ తిండి లేక అవస్థలు పడుతున్నాయి. – వడ్డేపల్లి భాస్కరరావు, మేస్త్రీ
కూలికెళితేనే రోజు గడిచేది
వ్యవసాయ పనులకు వెళితేనే మాకు రోజు గడిచేది. ఉదయం 6 గంటలకు పనులకు వెళ్లి మధ్యాహా్నం 1గంటకు వస్తాం. రోజు కూలీ రూ.450 ఇస్తారు. ఇంటి అద్దె నెలకు రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు ఆడ పిల్లలు. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితేనే మాకు నెల భారంగా గడుస్తుంది. అలాంటిది పది రోజులుగా పనుల్లేకఅవస్థలు పడుతున్నాం. – మడల సీతారామయ్య, చోడవరం
వర్షాలతో మగ్గం నేతకు ఇబ్బందులే
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేనేత మగ్గాల కుంటల్లో వర్షం నీరు చేరి చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మగ్గాల కుంటల్లో నీరు చేరితో దాన్ని బయటకు తోడి ఆరిన తర్వాతే మళ్లీ పని మొదలు పెట్టాలి. ఇందుకు 15 నుంచి 20 రోజులు పడుతుంది. ఇన్ని రోజులూ చేనేత కార్మికులు పస్తులుండాల్సిందే. మగ్గం కుంటల్లో నీరు చేరి కొందరు, పడుగు తడిసి పాడైపోయి మరికొందరు, నేత నూలు మొత్తబడిపోయి ఇంకొందరు నేత నేసేందుకు అవకాశం లేక ఉపాధి కోల్పోయారు. – పిల్లలమర్రి బాలకృష్ణ, చేనేత నాయకుడు
Comments
Please login to add a commentAdd a comment