ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3.09 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి
నేడు ఇంకా పెరగనున్న వరద ఉద్ధృతి
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3.05 లక్షల క్యూసెక్కులు వరద నీరు చేరింది. గోదావరి డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో బ్యారేజ్‌లో ఫ్లడ్‌కుషన్ ఉంచడానికి కొంతమేర ఖాళీ చేస్తూ సముద్రంలోకి 3.09 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శ్రీరాంసాగర్‌లోకి 2.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తేసి 2.40 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4.72 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ప్రాణహిత ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజ్)లోకి 9.02 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దాని దిగువన సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.23 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి గోదావరి 39 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇది క్రమేపీ పెరుగుతూ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువన పోలవరం ప్రాజెక్టు వద్ద 29.550 మీటర్ల మేర నీటిమట్టం ఉంది. స్పిల్‌వే నుంచి 4 లక్షల 12 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment