
వ్యవస్థీకృత నేరం కిందకు వచ్చేవేమిటో చట్టం స్పష్టంగా చెప్పింది
సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరంతో సమానంగా చూడలేం
వీటిని ‘మెటీరియల్ బెనిఫిట్’గా భావించలేం.. ఈ మొత్తం వ్యవహారంలో స్పష్టత ఇవ్వండి
పోలీసులను ఆదేశించిన హైకోర్టు
ఈ నెల 26న తదుపరి విచారణ
సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయి? బీఎన్‌ఎస్ సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయి? పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలం? సోషల్ మీడియా పోస్టులను మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేం.
– పోలీసులను ఉద్దేశించి హైకోర్టు
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయని హైకోర్టు పోలీసులను బుధవారం ప్రశ్నించింది. భారతీయ న్యాయసంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్–111 ప్రకారం ఆర్ధిక నేరాలు, ఒప్పంద హత్యలు, కిడ్నాప్, దోపిడీ, భూ ఆక్రమణలు, మానవ అక్రమ రవాణా, తీవ్ర పర్యవసానాలుండే సైబర్ నేరాలు వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయని గుర్తు చేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియా పోస్టులు ఎలా వ్యవస్థీకృత నేర నిర్వచన పరిధిలోకి వస్తాయో చెప్పాలంది. పరువుకు నష్టం కలిగించేలా పెట్టిన పోస్టులను సైబర్ నేరంతో సమానంగా ఎలా చూడగలమో చెప్పాలంది. ప్రస్తుత కేసులో నిందితులు ఓ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, దీన్ని పర్‌సెప్షనల్ బెనిఫిట్ (అనుభూతి ద్వారా పొందే ప్రయోజనం)గా భావించగలమే తప్ప.. మెటీరియల్ బెనిఫిట్ (ద్రవ్య సంబంధిత ప్రయోజనం)గా భావించలేమంది.
సోషల్ మీడియా పోస్టుల ద్వారా పిటిషనర్లు ఏ విధంగా ఆర్ధిక, వస్తు తదితర రూపేణ ప్రయోజనం పొందారో చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్పష్టం చేసింది. వీటన్నింటిపైనా స్పష్టతనివ్వాలని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి పోలీసులు వేర్వేరుగా నమోదు చేసిన పలు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగం మాజీ ఇన్‌చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇదే వ్యవహారంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డి కూడా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను జస్టిస్ విజయ్ బుధవారం విచారించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా పిటిషనర్లు వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ పోస్టులు వ్యవస్థీకృత నేరం కిందకు ఎలా వస్తాయో చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment