Cyber crime
-
హైదరాబాదీలు కోల్పోయిన డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రోజుకు రూ.3.8 కోట్లు.. వారానికి రూ.26.6 కోట్లు.. నెలకు రూ.114.1 కోట్లు.. ఏడాదికి రూ.1,369.5 కోట్లు.. ఈ లెక్కలు ఏమిటా అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ వాసుల నుంచి మోసగాళ్లు కాజేసిన సరాసరి మొత్తమిది. ఓ దోపిడీ ఘటనకు ఉన్న ప్రాధాన్యం, దాని దర్యాప్తుపై చూపించే శ్రద్ధ, మోసాలకు సంబంధించిన కేసులపై ఉండదు. ఇదే వైట్ కాలర్ నేరగాళ్లుగా పిలిచే మోసగాళ్లకు కలిసి వస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో నమోదైన మోసాల కేసుల్లో హైదరాబాద్ వాసులు కోల్పోయింది డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు. ఈ ‘వైటుగాళ్లు’ఇలా రెచ్చిపోవడానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. ఆశ, నమ్మకాలే పెట్టుబడి ఈ మోసగాళ్లు ఎదుటి వారిలో ఉన్న ఆశ, నమ్మకాలనే పెట్టుబడిగా ముందుకు వెళ్తుంటారు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ.. ఇదీ వైట్‌కాలర్ అఫెండర్ల ప్రచారం. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం ఉంటుంది. టార్గెట్‌ను ఎంచుకోవడం, రెక్కీలు చేయడం, పక్కా ప్లాన్ సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరం చేయడంలో పూర్తిస్థాయి ‘సక్సెస్’ అవుతారన్న నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి ముందో, చేస్తూనో పోలీసులకు చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. మోసాలకు సంబంధించిన ఆర్థిక నేరాలు చేసే వైట్‌కాలర్ నేరగాళ్లు ఇంత ‘శ్రమ’పడాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వ్యక్తినో, వ్యక్తులనో, సంస్థనో పక్కాగా నమ్మించగలిగితే చాలు. ఒక్కోసారి వీరి లాభం రూ.కోట్లలోనూ ఉంటుంది. ఈ కారణంగానే వైట్‌కాలర్ అఫెండర్లు ఓ పక్క నేరుగా, మరోపక్క సైబర్ నేరగాళ్లుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. చిక్కిన వారికి శిక్షలు తక్కువే ఈ మోసగాళ్లకు చట్టంలో ఉన్న లొసుగులే కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట ప్రకారం రూ.లక్ష మోసం చేసినా... రూ.10 కోట్లు మోసం చేసినా చీటింగ్ ఆరోపణలపై ఒకే సెక్షన్ కింద కేసులు నమోదవుతాయి. ఆ మోసం చేయడానికి అనుసరించిన మార్గాన్ని బట్టి ఇంకొన్ని సెక్షన్లు అదనంగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఎదుటి వారిని మోసం చేయడానికి పత్రాలు తయారు చేసినా, ఇతర గుర్తింపులు చూపించినా ఫోర్జరీ, ఇంపార్సినేషన్ తదితరాలు జోడిస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైనప్పుడు అది నమోదైన సెక్షన్ ప్రకారమే శిక్ష ఉంటుంది. దీంతో ఎంత పెద్ద మొత్తం కాజేసినా మోసగాళ్లు తక్కువ శిక్షలతో బయటపడుతున్నారు. పదేపదే నేరాలు చేసేవారిపై పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. అయితే నిర్ణీత కాలంలో, నిర్ణీత సంఖ్యలో కేసులు ఉంటేనే దీన్ని వాడే ఆస్కారం ఉంది. ఓ మోసగాడు ఒకే ఉదంతంలో రూ.100 కోట్లు కాజేసినా అతడిపై దీన్ని ప్రయోగించడానికి అవకాశం లేదు. ఈ కారణాలతోనే అందినకాడికి దండుకుపోతున్న మోసగాళ్లకు చెక్ చెప్పడం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీళ్లతో కొత్త తలనొప్పులు ఈ వైట్‌కాలర్ నేరాల్లో సైబర్ క్రైమ్ కూడా ఒకటి. సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక కేసులే నమోదు కావట్లేదు. నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండదు. సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు ఈ నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టు ఉండట్లేదు. ఫలితంగా ఇంటర్నెట్ కేంద్రంగా జరిగే సైబర్ నేరాల్లో 50 శాతం కూడా నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో సగానికి సగం కూడా కొలిక్కి రావట్లేదు. ఇక వీరి నుంచి నగదు రికవరీ అనేది దుర్లభం. మోసాలు చేసే నేరగాళ్లు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా శిక్షలు పడటం అరుదుగా మారింది. దీనికి దర్యాప్తు అధికారులకు ఉన్న అవగాహన లోపాలు ఒక కారణమైతే.. బాధితుల రాజీ ధోరణి మరో కారణంగా మారింది. వైట్‌కాలర్ నేరాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల నుంచి సహకారం లభించట్లేదు. కేసు నమోదై, దర్యాప్తు పూర్తయినప్పటికీ.. కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటివరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు. చక్కదిద్దే చర్యలు ప్రారంభం ఈ పరిస్థితులను బేరీజు వేసిన పోలీసు విభాగం.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్ట పోవడాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. సీసీఎస్ అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్, ఎకనమిక్ నేరాల దర్యాప్తుపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్ర నేరాల్లో ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు. ఆయా కేసులను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విభాగాలూ దర్యాప్తు చేపడుతున్నాయి. హైదరాబాద్‌లో నమోదైన నేరాల గణాంకాలు 2023లో సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 361 వైట్ కాలర్ నేరాల్లో రూ.1,355 కోట్లు.. 2,984 సైబర్ నేరాల్లో రూ.147 కోట్లు బాధితులు నష్టపోయారు. 2024లో (నవంబర్ వరకు) సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన 248 వైట్‌కాలర్ నేరాల్లో రూ.1,036 కోట్లు, 2,868 సైబర్ నేరాల్లో రూ.38 కోట్లు బాధితులు కోల్పోయారు.చదవండి: ఖాజాగూడ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్కఠిన చట్టం అవసరం మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చ ట్టాలు అవసరం. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్ ప్రొటెక్ష న్ యాక్ట్‌తో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. దీనికితోడు చోరీలు, దోపిడీలు చేసే వారితో పాటు ఇలాంటి వైట్ కాలర్ నేరగాళ్ల పైనా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. మోసగాళ్లు కాజేసిన మొత్తం ఆధారంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా అమలులోకి వచ్చిన బీఎన్ఎస్లోనూ ఇలాంటి అవకాశం లేదు. – ప్రభాకర్, మాజీ డీఎస్పీ -
బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో జరి గే వాదోపవాదాల లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించడం చట్టవిరుద్ధమని తెలిసినా ప్రసారం చేశారని టీవీ 5 చైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్‌తోపాటు యాంకర్ సింధూర శివపై న్యాయ వాది ఇమ్మానేని రామారావు నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం ఆ వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ నెల 17న ఓ కార్యక్రమం ప్రసారం సందర్భంగా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు, న్యాయవాదులపై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. న్యాయవ్యవస్థ, న్యాయవాదుల అస్తిత్వాన్ని కించపరిచేలా విద్వేషపూరితంగా, వ్యంగ్యంగా వ్యాఖ్యలు ప్రసారం చేశారని ఆరోపించారు.ఉన్నత న్యాయస్థానం వెబ్సైట్లోకి చొరబడి వార్తాసంస్థల ముసుగులో న్యాయప్రక్రియ, వాదనలను కాపీరైట్‌ను ఉల్లంఘించి ప్రసారం చేశారని, న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేలా సింధూర శివ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారన్నారు. లైవ్ స్ట్రీమింగ్‌ను రికార్డు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దని.. అలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు చెప్పినా ధిక్కరిస్తూ ప్రసారం చేశారని వెల్లడించారు. ఇది కోర్టు ధిక్కరణేకాక, సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని, ధిక్కరణలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
పార్ట్‌టైం ఉద్యోగం పేరుతో సైబర్ మోసగాళ్ల వల
గోదావరిఖని: పార్ట్‌టైం ఉద్యోగం ఎరచూపి సైబర్ మోసగాళ్లు ఓ గృహిణి నుంచి రూ.31.60 లక్షలు కాజేశారు. గోదావరిఖని సైబర్ క్రైం ఏసీపీ వెంకటరమణ కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ గృహిణికి ఇన్‌స్ట్రాగామ్‌లో సైబర్ మోసగాళ్లు పరిచయమయ్యారు. మాటల్లో పెట్టి పార్ట్‌టైం ఉద్యోగం ఇప్పిస్తామని, దీనిద్వారా ఆదాయం వస్తుందని నమ్మించారు. ఇందుకోసం తొలుత తమకు రూ.10 వేలు డిపాజిట్‌గా పంపించాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె అకౌంట్‌కు రూ.13 వేలు పంపించారు. మరోసారి రూ.10 వేలు పంపిస్తే రూ.18 వేలు ఖాతాలో జమచేశారు. ఇలా రూ.లక్ష వరకు పంపించగా.. ఇక టాస్క్ ప్రారంభమైందని, అది పూర్తయ్యే వరకూ సొమ్ము పంపించాలని చెప్పగానే.. విడతల వారీగా రూ.31.60 లక్షలను ఆమె అవతలి వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు పంపించింది. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా, వారి నుంచి సమాచారం కూడా లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం సీఐ కృష్ణకుమార్.. హైదరాబాద్ మలక్‌పేట్‌కు చెందిన సోహెల్ రెస్టారెంట్లో పనిచేస్తున్న మహమ్మద్ అవాద్‌ను నిందితుడిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన పేరిట బ్యాంకుల్లో మూడు ఖాతాలు తెరిచి ఇలియాస్ అనే వ్యక్తికి ఇచ్చానని, ఇందులో డబ్బు జమచేస్తామని, ఆ తర్వాత తమ బ్యాంకులోకి మళ్లించుకుంటారని చెప్పాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అసలు సైబర్ మోసగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. -
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
పెన్షన్ స్కీం పేరిట
సాక్షి, హైదరాబాద్: ‘మీరు పెన్షన్ పథకానికి అర్హులయ్యారు..మేం పంపిన లింక్‌పై వెంటనే క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి’.. అంటూ సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్లు పంపుతున్నట్టు సైబర్ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు. www.pm&yojana.org వెబ్సైట్ పేరిట మోసపూరిత ఎస్ఎంఎస్లు పంపుతున్నట్టు వారు తెలిపారు.ఇలాంటి మెసేజ్‌లు వస్తే వాటిని నమ్మవద్దని, అందులోని లింక్‌లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచించారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడంతో ఫోన్లు హ్యాక్ అవుతాయని, అనంతరం సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుని మోసగించే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. ఇలాంటి ఎస్ఎంఎస్లు వస్తే వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. -
నల్గొండ జిల్లా కేంద్రంగా సైబర్ మోసాలు
-
బీఆర్ఎస్ నేత అరెస్ట్.. కారణం ఇదే!
సాక్షి, నల్లగొండ: సైబర్ మోసం కేసులో మిర్యాలగూడకు చెందిన బీఆర్ఎస్ నేత అన్నభిమోజు నాగార్జున చారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో నాగార్జునకు లింకులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మోసాలకు దుబాయ్ నుంచి లింకులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.వివరాల ప్రకారం.. ముంబై కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాలతో మిర్యాలగూడకు చెందిన నాగార్జున చారికి లింకు ఉన్నందన కారణంగానే ఆయనతో పాటు నాగేంద్రచారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడకు చెందిన కొందరి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షల్లో నగదు బదిలీ అయినట్టు పోలీసులు గుర్తించారు. లావాదేవీలు జరిగిన బ్యాంకు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని విచారించగా నాగార్జున చారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.అమాయకుల పేర్లపై బ్యాంకు అకౌంట్లు తెరిపించిన నాగార్జున చారి. వారి ఖాతాల ద్వారా నగదు బదిలీ చేయించి కమీషన్లు ఇస్తూ అందులో తాను వాటా తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సైబర్ మోసానికి దుబాయ్ తో సైతం లింకులు ఉన్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై మూడు రోజులుగా సీసీఎస్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. భారీగా నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. -
Andhra Pradesh: ప్రశ్నిస్తే.. పీడీ చట్టం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న చంద్రబాబు సర్కారు మరింత బరితెగించింది! యావత్ భారతం ‘రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ’ వేడుకలను జరుపుకొంటున్న తరుణంలో.. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులపై ఉక్కుపాదం మోపే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెర తీసింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ‘నల్ల చట్టాన్ని’ తీసుకువచ్చింది. ‘పీడీ’ (ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్) చట్టానికి సవరణ ముసుగులో పచ్చ పన్నాగాన్ని పన్నింది. రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. సైబర్ నేరాలను పీడీ చట్టం పరిధిలోకి తెస్తున్నట్లు చట్ట సవరణ చేసినట్టు డ్రామా ఆడిన చంద్రబాబు ప్రభుత్వం అసలు కుతంత్రం వేరే ఉంది! అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ఐటీ చట్టంలోని అంశాలను సైబర్ నేరాలు అంటూ గంపగుత్తగా అధికారిక ముద్ర వేసేసింది. తద్వారా సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా జమ కట్టేసేందుకు తెగించింది. ఆ నెపంతో సోషల్ మీడియా పోస్టులపై ఏకంగా పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో మగ్గేలా చేసేందుకు పథకం వేసింది. ఈ దుర్మార్గంపై ఎక్కడికక్కడ బాధితులు, ప్రజాస్వామ్యవాదులు, పౌరహక్కుల సంఘం నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించనున్నారు. ప్రశ్నించే గొంతుల అణచివేతకు కుట్ర...పీడీ చట్టానికి సవరణ పేరుతో పన్నాగంతీవ్రమైన నేరాలను కట్టడి చేసేందుకు 1986లో తీసుకువచ్చిన పీడీ చట్టానికి సవరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. పీడీ చట్టం పరిధిని విస్తృతం చేస్తున్న నెపంతో కథ నడిపించింది. పీడీ చట్టం ప్రకారం ఆరు కేటగిరీల నేరాలపై కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. నాటుసారా, అక్రమ మద్యం తయారీ / సరఫరా / రవాణాదారులు, దొంగతనాలకు పాల్పడే బందిపోటు ముఠాలు, మాదక ద్రవ్యాల తయారీ / సరఫరా / విక్రయదారులు, మానవ అక్రమ రవాణాదారులు, గూండాలు, భూ కబ్జాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగించవచ్చు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో పీడీ చట్టాన్ని సవరించింది. భూ కబ్జాలకు పాల్పడేవారు అనే అంశాన్ని విస్తృతం చేస్తూ దాని పరిధిలోకి మరో 15 అంశాలను చేర్చింది. వాటిలో ‘సైబర్ నేరాలు’ చేర్చింది. సైబర్ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు అవకాశం కల్పించింది. కేంద్ర ఐటీ చట్టం పరిధిలోని కేసులన్నీ సైబర్ నేరాలట!కూటమి సర్కారు కుట్రచంద్రబాబు ప్రభుత్వం పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్ నేరాలకు తనదైన భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉంది. ‘కేంద్ర ఐటీ చట్టం 2000’ పరిధిలోకి వచ్చే నేరాలన్నీ సైబర్ నేరాలే అని గంపగుత్తగా పేర్కొనడం ప్రభుత్వ కుతంత్రానికి నిదర్శనం. ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో పొందుపరిచిన నేరాలకు కేంద్ర ప్రభుత్వం పీడీ చట్టం లాంటి తీవ్రమైన చట్టాన్ని ప్రయోగించడం లేదు. ఐటీ చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఐటీ చట్టం పరిధిలోని అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధపడింది.ఒకటికి మించి అక్రమ కేసులు.. వేధింపుల పన్నాగంఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో సోషల్ మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు సామాన్యులు సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ఎన్నికల హామీలను అమలు చేయకపోవటాన్ని సోషల్‌మీడియా వేదికగా యాక్టివిస్టులు, ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారిని అక్రమ కేసులతో వేధిస్తోంది. తాజాగా ఆ కుట్రలకు మరింత పదును పెట్టేందుకే పీడీ చట్టానికి సవరణ పేరుతో కుట్ర పన్నింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు ప్రస్తుతం అవకాశం ఉంది. ఆ చట్టం ప్రకారం సోషల్ మీడియా పోస్టులు పెట్టినవారికి ‘41 ఏ’ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుని పంపించి వేయాలి. ఏకపక్షంగా అరెస్ట్ చేసేందుకు అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేస్తే న్యాయస్థానాలు సమ్మతించవు. రిమాండ్‌ను తిరస్కరిస్తాయి. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పదును పెట్టింది. ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ వాటిని ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెచ్చింది. తద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఒకటికి మించి కేసులు నమోదు చేసి... దాన్ని సాకుగా చూపించి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ కుట్రలో భాగంగానే నెల రోజులుగా ఒక్కో సోషల్ మీడియా కార్యకర్తపై పలు జిల్లాల్లో అక్రమ కేసులను నమోదు చేస్తోంది. వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించేందుకు పూర్తిస్థాయి కుట్రలకు బరి తెగించింది.ఏడాదిపాటు అక్రమ నిర్బంధానికే...!పీడీ చట్టం ప్రకారం కేసు నమోదైన వారిని గరిష్టంగా ఏడాది పాటు జైలులో ఉంచవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా, అక్రమ మద్యం దందా లాంటి తీవ్రమైన నేరాలకు తరచూ పాల్పడేవారిపై కఠిన చర్యలకు పీడీ చట్టాన్ని రూపొందించారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు, రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు పీడీ చట్టాన్ని సవరించింది. పీడీ చట్టం కింద నమోదు చేసిన కేసులను రాష్ట్ర స్థాయి సలహా కమిటీ సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటుంది. కమిటీకి చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. వారిని రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందన్నది గమనార్హం.సోషల్ మీడియాపై పీడీ చట్టం రాజ్యాంగ విరుద్ధంసోషల్ మీడియాపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలన్న ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ద్ధం. ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో ప్రశ్నించడానికి – దూషించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోవడం ప్రభుత్వ పెద్దల వైఫల్యం. రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి? రాష్ట్రంలో కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నాయి. న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కేసులపై డిబేట్లు నిర్వహిస్తూ ఏకపక్షంగా తీర్పులు చెబుతున్నాయి. స్వీయ నియంత్రణ పాటించాలని మీడియా సంస్థలను సుప్రీంకోర్టు అనేకసార్లు హెచ్చరించింది. కొన్ని టీవీ చానళ్లు రాజకీయ పార్టీలతో కలసి ప్రజలను బెదిరించేందుకు యత్నిస్తున్నాయి. సోషల్ మీడియాపై ఆంక్షలు, కేసులు న్యాయస్థానాల్లో నిలవవు. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్యానిదే అంతిమ విజయం. – మామిడి సుదర్శన్, ‘సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ – స్ట్రాటజీ (సీపీఆర్‌ఎస్) వ్యవస్థాపకుడుబిల్లు ఆమోదంలోనూ కనికట్టు...ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఉద్దేశించిన పీడీ చట్ట సవరణ బిల్లును టీడీపీ ప్రభుత్వం ఆమోదించుకున్న తీరు తీవ్ర విస్మయం కలిగిస్తోంది. శాసనసభలో ఈ నెల 21న ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తరువాత బడ్జెట్ సమావేశాల చివరి రోజు అంటే ఈ నెల 22న శాసన మండలిలో అదనపు అజెండాగా ఈ బిల్లును చేర్చింది. ప్రధాన అజెండాలో దీన్ని పేర్కొనకపోవడం గమనార్హం. తద్వారా ఆ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం లేకుండా ప్రభుత్వం ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది.సైబర్ నేరాలను నిర్వచించని కూటమి ప్రభుత్వంనిజమైన సైబర్ నేరాలకు పాల్పడేవారిపై పీడీ చట్టం ప్రయోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎందుకంటే సైబర్ నేరాలు ఏమిటన్నది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్వచిస్తూ పేర్కొంది. అందుకోసం ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ‘1930’ అందుబాటులోకి తెచ్చింది. ఆ పోర్టల్ పరిధిలోకి వచ్చే అంశాలను అంటే బ్యాంకుల మోసాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలు మొదలైన నేరాలను ఏపీ ప్రభుత్వం పీడీ చట్టం పరిధిలోకి తీసుకువస్తే ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశం సైబర్ నేరాలను అరికట్టడం కాదు. ఆ ముసుగులో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం! ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిని అక్రమ కేసులతో వేధించడం. అందుకోసమే పీడీ చట్టానికి సవరణ చేస్తూ సైబర్ నేరాలను అనే అంశాన్ని చేర్చింది. కానీ అసలు సైబర్ నేరాలు అంటే ఏమిటో నిర్వచించకపోవడం ప్రభుత్వ కుట్రకు బట్టబయలు చేస్తోంది.భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం..చంద్రబాబు సర్కారు అరాచక చర్యలు రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం దేశ పౌరులకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. అయితే సోషల్ మీడియా పోస్టులను పీడీ చట్టం పరిధిలోకి తేవడం ద్వారా కూటమి సర్కారు ఆ హక్కును కాల రాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ చట్టాన్ని ప్రయోగించేందుకు కుట్ర పన్నిందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ బిల్లును ప్రజాస్వామ్యవాదులు సమష్టిగా వ్యతిరేకించాలని, న్యాయ పోరాటం చేయాలని సూచిస్తున్నారు. -
సైబర్ చోర్ టెకీస్
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకోకపోతే దొంగ అవుతావా?’అని చిన్నప్పుడు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు తిట్టడం అందరికీ అనుభవమే. కానీ, మంచి చదువు చదివినవారు కూడా కొందరు ఈజీ మనీకి అలవాటుపడి నేరాల బాట పడుతున్నారు. తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వాడి సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ప్రకారం సైబర్ నేరా లు చేస్తున్నవాళ్లలో 45 శాతం మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత సాంకేతిక విద్య పట్టభద్రులే ఉన్నారు. వారిలోనూ 49 శాతం మంది వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉన్నది. సైబర్ నేరాలకు పాల్పడుతున్నవాళ్లలో మూడు శాతం మంది ప్రభు త్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఉక్కుపాదం మోపుతున్న టీజీసీఎస్పీ సైబర్ నేరాల కట్టడి కోసం తెలంగాణ పోలీసులు టీజీసీఎస్బీని ఏర్పాటు చేశారు. ఈ నేరాల తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తులో అడ్డంకులను అధిగమించడంతోపాటు పక్కాగా దర్యాప్తు చేపట్టేందుకు నేరుగా టీజీసీఎస్బీ డైరెక్టర్ పర్యవేక్షణ కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను (సీసీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో 76 సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణవ్యాప్తంగా 795 సైబర్‌నేరాలతో, దేశవ్యాప్తంగా 3,357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. న్యూ ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్‌లపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. కొన్ని కేసుల్లో స్థానిక పోలీసుల సహకారం సైతం ఉండటంలేదని టీజీసీఎస్బీ పోలీసులు తెలిపారు. ఏ తరహా నేరాలు ఎక్కువ? సైబర్ నేరాల్లో పార్ట్‌టైం జాబ్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ (స్టాక్ ట్రేడింగ్), డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్, హ్యాకింగ్, అడ్వరై్టజ్‌మెంట్, మ్యాట్రిమోనియల్ మోసాలు ఎక్కువ ఉంటున్నాయి. పట్టుబడుతున్న వారిలో సైబర్ మోసాలకు పాల్పడే వారితోపాటు మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లు, అకౌంట్ ఆపరేటర్లు, సిమ్‌కార్డులు సరఫరా చేసేవాళ్లు, బ్యాంకు అధికారులు, ట్రావెల్ ఏజెంట్లు, హ్యాకర్లు సైతం ఉన్నారు. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం సైబర్ నేరగాళ్ల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉన్నాం. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం. ప్రజలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీరు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 87126 72222 వాట్సప్ నంబర్లో లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లోనూ ఫిర్యాదు చేయవచ్చు. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీ -
మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..
బంజారాహిల్స్: మీ డాడీ దగ్గర రూ.2,000 అప్పుగా తీసుకున్నాను..వాటిని ఇద్దామంటే ఆయన మొబైల్ నెంబర్ పోగొట్టుకున్నాను..నీ నెంబర్‌ను అప్పుడెప్పుడో ఫీడ్ చేసుకున్నాను..మీ పేరు, మీ నాన్న పేరు ఇదే కదా? అంటూ ఓ వ్యక్తి తియ్యటి మాటలతో సైబర్ వల విసిరి గృహిణికి అప్పు చెల్లించే ముసుగులో మోసం చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కొత్త రకంగా చక్కటి ప్లాన్‌తో సైబర్ మోసగాడు ఆమెను నమ్మించి మాటల్లో దింపి తికమకపెట్టి రూ.35 వేలు తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లో నివసించే స్వాగతారాయ్ అనే గృహిణికి సైబర్ మోసగాడు ఫోన్ చేసి మీ డాడి అశోక్‌కుమార్ శర్మకు తాను రూ.2000 బాకీ ఉన్నానని, వాటిని జీపే చేస్తానని ఆమెకు చెప్పాడు. తన పేరు, తండ్రి పేరు కరెక్ట్‌గానే చెబుతున్నాడు కదా అని ఆమె నమ్మి జీపే చేయమంది. వెంటనే ఆయన రూ.10,000 ఒకసారి, రూ.20,000 ఒకసారి మీ అకౌంట్‌కు పంపించాను, నీకు మెసేజ్ వచి్చంది చూసుకో అని చెప్పాడు. ఆ మేరకు ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. కొద్దిసేపట్లోనే రూ.12,000 మరోసారి పంపించాడు. ఆమెకు ఆ మెసేజ్ కూడా వచ్చింది. రెండు నిమిషాల తర్వాత ఫోన్ చేసి పొరపాటున రూ.40,000 పంపాను..రెండు వేలు కట్ చేసుకుని రూ.38 వేలు తనకు తిరిగి జీపే చేయాలని ఆమెను తికమకపెట్టాడు. బాలింతరాలు అయిన ఆమె ఓ వైపు చిన్నారి ఏడుస్తుండడం, ఇంకోవైపు తన చికాకు..ఈ గొడవలోనే రూ.38 వేలు బదిలీ చేసింది.మరుక్షణంలోనే ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.38 వేలు వెళ్లడం, తన ఖాతా జీరో అని చూపించడంతో వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త వెంటనే గంట వ్యవధిలోనే (గోల్డెన్ అవర్) బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. వెంటనే పోలీసులు ఇది సైబర్ మోసమని గుర్తించి ఆమెకు వచి్చనవి నకిలీ మెసేజ్‌లు అని తెలుసుకుని సైబర్ మోసగాడి ఖాతాను ఫ్రీజ్ చేశారు. గంట వ్యవధిలోనే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడంతో సైబర్ మోసగాడి నుంచి డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్‌ను ఆమె పొందింది. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే గంట సేపట్లోనే గోల్డెన్ అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. -
వీరు నేరస్థులా?
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని వ్యవస్థీకృత నేరస్థులుగా చిత్రించే ప్రయత్నాలు ప్రమాదకరం. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సెక్షన్లలో లేని శిక్షలను పేర్కొంటూ వచ్చిన ఒక వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చట్టాలకు వక్ర భాష్యం చెప్పే విధంగా ఉన్న అటువంటి వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అనిపిస్తోంది.సోషల్ మీడియా కార్యకర్తలు వ్యవస్థీకృత నేరస్థులని అందునా, ఒక పార్టీకి చెందిన వారి కోసం భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏర్పాటయింది అనేటువంటి రీతిలో ఒక పత్రికలో వార్త చదివిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, సెక్షన్లలో లేని శిక్షలు, అన్వయం కానివారికి అన్వయిస్తారు. ‘ఖబడ్దార్’ అనే రీతిలో భూతద్దంలో చూపించి భయభ్రాంతులను చేసే విధంగా, చట్టాలకు వక్రభాష్యం చెప్పే విధంగా ఉన్న ఆ వార్తలు చూస్తే ఏ విలువల కోసం ఈ జర్నలిజం అని పించింది. అందుకే అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111లో ఏముంది అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాగా, సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, మరెవరైనా కావచ్చు పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుని ఎడాపెడా కేసులు బనాయిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. భారత అత్యున్నత న్యాయస్థానం అనేక తీర్పుల్లో ఇదే సత్యాన్ని స్పష్టం చేసింది. అంతెందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయ స్థానం కూడా ఇదే విషయాన్ని ఉటంకిస్తూ ఒక హెచ్చరిక జారీ చేసింది. చట్టాలకు అతిశయోక్తులు జోడించి చెప్పటం, వక్ర భాష్యాలు చెప్పడం నేరం. చిన్న నేరాలకు సంబంధం లేని సెక్షన్లు పెట్టిన పోలీసు అధికా రులపై చర్యలు తీసు కున్న ఉదంతాలు కూడా చాలా ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 111 విషయానికి వచ్చినట్లయితే ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో ఏ విధమైన పోస్టులు చేసినా వాళ్లకు భారీ శిక్షలు తప్పవు అని అర్థం వచ్చే రీతిలో ప్రచురితమైన వార్తను చూసినప్పుడు అసలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ఏమిటనేది ఒకసారి పరిశీలిస్తే, ఆ వార్తలోని అర్ధ సత్యం అర్థం అవుతుంది. కిడ్నాప్, వ్యవస్థీకృత నేరాలు, వాహన దొంగతనం, దోపిడీ, భూ దోపిడీ, కాంట్రాక్ట్ హత్య, ఆర్థిక నేరం, సైబర్ నేరాలు, వ్యక్తుల అక్రమ రవాణా, డ్రగ్స్, ఆయుధాలు లేదా అక్రమ వస్తువులు, అక్రమ సేవలు, వ్యభిచారం లేదా మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడటం సెక్షన్ 111 కిందికి వస్తాయి. సైబర్ నేరాలు అంటే... ఎవరైనా వ్యక్తులు గానీ, ఒక వ్యక్తి గానీ ఒక సమూహ గౌరవానికి, ఒక వ్యక్తి గౌరవానికీ భంగం కలిగించే విధంగా కానీ; శారీరకంగా, మానసికంగా బాధపెట్టే విధంగా కానీ ప్రవర్తిస్తే, అది ఐటీ చట్టం–2000 ప్రకారం సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది. విస్తృత ప్రజా ప్రయోజనాలతో కానీ, విశ్వసనీయ సమాచారంతో కానీ ప్రచురించినా, ప్రసారం చేసినా అది ఐటీ చట్టం కింద నేరంగా పరిగణించటం సాధ్యం కాదు. ఇటువంటివే మరి కొన్ని మినహాయింపులు ఈ చట్టపరిధిలో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అంటే ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా ఒక వ్యక్తి ఐడీని దొంగిలించటం లేదా అతని అకౌంట్ మొత్తం హ్యాక్ చేయడం, ఈ–మెయిల్ పాస్వర్డ్ దొంగిలించి తద్వారా తప్పుడు మెసేజ్‌లు బయటికి పంపడం, అశ్లీల చిత్రాలను, వీడియోలను సమాజంలోకి పంపడం; దేశ భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా నేరా లకు పాల్పడటం వంటివన్నీ సైబర్ నేరాలుగా పరిగణి స్తారు. సమాజంలో జరుగుతున్న వ్యవహారాన్ని వార్తలుగా కానీ రాజకీయ పరమైన విమర్శలుగా కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటికి ఈ చట్టాలను ఆపాదించడం సరికాదు. ఇక వ్యవస్థీకృత నేరం అంటే, నేర కార్యకలా పాల్లో సిండికేట్ సభ్యునిగా లేదా ఉమ్మడిగా వ్యవహరించే ఏ వ్యక్తీ లేదా వ్యక్తుల సమూహం... హింసకు పాల్పడటం, బెదిరింపు, బలవంతం లేదా ఏదైనా ఇతర చట్టవిరు ద్ధమైన మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో సహా ప్రత్యక్ష లేదా పరోక్ష భౌతిక ప్రయోజనాన్ని పొందడం వ్యవస్థీకృత నేరంగా పరిగణించబడుతుంది. మరి ఇవన్నీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలా వర్తింపచేస్తారో గౌరవ న్యాయ స్థానాలే నిర్ణయించాలి. ‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాన్ని కొనసాగించడం’ అంటే చట్టప్రకారం నిషేధించబడిన పనులు చేయడం. ఇందుకు గాను మూడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తారు. ఏ వ్యక్తి అయినా ఒక్క రుగా లేదా ఉమ్మడిగా, వ్యవస్థీకృత నేర సిండికేట్ సభ్యు నిగా చేస్తే, అదీ పదేళ్ల వ్యవధిలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలు అయితే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇవి నేరాలకు అన్వయం కానీ రాజకీయ విమర్శలకు వర్తించవు.ఇక సోషల్ మీడియాకి సంబంధించిన శిక్షలు అంటూ కొన్ని సెక్షన్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ సెక్షన్లు దేనికి అన్వయం అవుతాయో భారతీయ న్యాయ సంహిత ప్రకారం పరిశీలిద్దాం. ఐటీ యాక్ట్ 67 ప్రకారం... నేరాలకు పాల్పడిన వారికి అంటూ, వీరు దేశంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారికి ఈ సెక్షన్ కింద ఐదేళ్ల జైలు శిక్ష, 70 లక్షల జరిమానా ఉంటుంది అని రాశారు. అసలు వాస్తవం పరిశీలిస్తే, 67 ప్రకారం రాజకీయపరమైన విమర్శలు ఈ చట్ట పరిధిలోకి రావు. అశ్లీల దృశ్యాలు ప్రచు రించినా, ప్రసారం చేసినా ఈ చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల జరిమానా ఉంటుంది. వేరే వ్యక్తి పేర అకౌంట్ కానీ, ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా కానీ మోసం చేయడం, ఇన్‌కమ్‌టాక్స్ అకౌంట్స్ హ్యాక్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సెక్షన్ 66డీ కిందకి వస్తుంది.ఈ నేరాలకు పాల్పడిన వారికి లక్ష జరిమానా, మూడు వేల జైలు. ఇక సెక్షన్ 356 ప్రకారం పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ప్రచురిస్తే లేదా ప్రసారం చేస్తే రెండేళ్ల జైలు, జరిమానా ఉంటుంది. అయితే పరువు ప్రతిష్ఠ కేసులకు సంబంధించి చాలా మినహాయింపులు ఉన్నాయి. ఇందులో కూడా విస్తృత ప్రజాప్రయోజనాలు ఉన్న, నమ్మ దగిన సమాచారం ఉన్నా, సత్యనిష్ఠకు సంబంధించి రుజువు చేయగలిగితే అది డిఫమేషన్ కిందికి రాదు.అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19(1 )ఏ అండగా నిలుస్తుంది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సమాజంలో అశాంతి రేకెత్తించడం, మహిళల్ని కించపరచటం కచ్చితంగా నేరాలే! ఈ నేరాలకు ఎవరు పాల్పడినా వాళ్లను శిక్షించవలసిందే! ఇందులో ఎవరికీ మినహాయింపులు ఉండవు కానీ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 111 ప్రత్యేకంగా ఒక పార్టీకో, ఒక పార్టీలో సోషల్ మీడియా వారి కోసమో నిర్దేశించినట్టుగా వార్తలు రాయడం సత్యనిష్ఠకు వ్యతిరేకం, భంగకరం. చట్టం ముందు అందరూ సమానులే! చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా వారు కచ్చితంగా శిక్షార్హులే! అంచేత చట్టాల ఉల్లంఘనకు పాల్పడే వారిని రాజకీయాలకు అతీ తంగా శిక్షించడానికి పూనుకున్నప్పుడు సమాజం హర్షిస్తుంది. కాదంటే న్యాయ పరిరక్షణలో చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. వారు ఏ స్థాయిలో ఉన్నా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడక తప్పదు. పి. విజయ బాబు వ్యాసకర్త సీనియర్ సంపాదకులు,రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రులు -
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు డబుల్!.. ఇవి నమ్మారో..
50 వేలు కట్టండి.. లక్ష రూపాయలు ఇస్తాం.. ఈ లింక్‌పై క్లిక్ చేయండి మీ డబ్బులు డబుల్ త్రిపుల్ అవుతాయి.. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు.. ఇంత డబ్బులు చెల్లించకపోతే జైలు ఊసలు లెక్కపెడతారు..! మీ మొబైల్‌కి ఓటీపీ వచ్చిందా? అయితే ఇక్కడ టైప్ చేయండి లేదంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..! ఈ ఆన్లైన్ గేమ్ ఆడితే రోజుకు 50 వేలు సంపాదించవచ్చు.. ఓ సారి ట్రై చేయండి..! ఇవన్నీ మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో విన్న మాటలు. ఇవి నమ్మినవాళ్లు ఇప్పటికీ చాలా డబ్బులే పొగొట్టుకోని ఉంటారు.గతంలో సైబర్ ఫ్రాడ్ అంటే ఏదో న్యూస్‌లో వస్తే విన్న సందర్భాలే కానీ ఇప్పుడు మాత్రం ఆన్లైన్ మోసాల బాధితులు మన పక్కనే కనిపిస్తారు.. మన ఫ్రెండ్సో, ఫ్యామిలీ మెంబర్సో కేటుగాళ్ల వలలో చిక్కుకుని మన దగ్గర లబోదిబోమని బాధపడిన సందర్భాలు ఎక్కువే ఉండి ఉంటాయి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్ లెక్కలు దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోటిపడుతున్నాయి.త్వరలోనే సైబర్ ఫ్రాడ్ మోసాల ఎకానమీ సైజు...ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరుకుంటాయట. ఇది పోలీసులతో పాటు అనేకమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న వాస్తవం! ఏంటి నమ్మడం లేదా? అయితే ఇప్పుడు మేం చెప్పబోయే లెక్కలు వింటే మీకే అర్థమవుతోంది.రోజుకు 15,000 సైబర్ మోసాలుప్రతి 6 సెకన్లకు ఒకటి.. నిమిషానికి 10.. రోజుకు 15,000.. ఏడాదికి 50లక్షలు.. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కుకోని విలవిలలాడుతున్నడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగాళ్ల జేబుల్లోని వెళ్లాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ సైబర్ ఫ్రాడ్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణ పౌరులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రతిరోజూ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు నష్టపోతున్నారు. దేశంలోని మొదటి ఐదు సైబర్ ఫ్రాడ్ బాధిత రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇక 2022లో అయితే సైబర్ ఫ్రాడ్ కేసుల్లో తెలంగాణ టాప్ పొజిషన్లో నిలిచింది. 96శాతం సైబర్ నేరాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఇందులో మోసపూరిత లింక్‌లపై క్లిక్ చేయడం, ఇతరులతో పాటు మోసగాళ్లతో సున్నితమైన, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం లాంటివి చేయడం కారణంగానే సైబర్ ఫ్రాడ్ కేసులు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెబుతోంది.ఏడాదికి లక్షల కోట్లుసైబర్ క్రైమ్ మోసాల డబ్బుల లెక్కలు ఏడాదికి లక్షల కోట్లు దాటుతుంది. ఇది ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ కనిపిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే 2035 నాటికి గ్లోబల్ సైబర్ క్రైమ్ నష్టం 10.5 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందన్నది నిపుణుల మాట. 10.5 ట్రిలియన్ డాలర్స్ అంటే ప్రస్తుత లెక్కల ప్రకారం 87 లక్షల కోట్లు. అంటే USA, చైనా తర్వాత ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఇది సమానం. ఇక అన్నిటికంటే బాధకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్-3లో ఉంది.2023లో ఆన్లైన్ స్కామ్స్‌లో భారత్ భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్ దాడులు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ఏరియాల్లో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాల్లోనే రికార్డయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు రూ.46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే రికార్డవని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్‌స్టేషన్ గడప వరకు రాని కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.సైబర్ నేరాలకు హాట్స్పాట్లుముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు సైబర్ నేరాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి, కేసుల్లో దాదాపు 40శాతం సిటీస్ నుంచే రికార్డవుతున్నాయి. అయితే అటు గ్రామీణ ప్రాంతాల ప్రజలనే కేటుగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూర్లు, టౌన్స్ నుంచి సిటీలకు చదువు కోసం ఉద్యోగాల కోసం వచ్చేవారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే విలేజ్ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుందట. అందుకే మోసగాళ్ల ట్రాప్‌లో చిక్కుకుని వీరంతా బలైపోతున్నారు.నకిలీ క్రిప్టోకరెన్సీ పాత్రసైబర్ ఫ్రాడ్ కేసుల్లో నకిలీ క్రిప్టోకరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని.. అప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపెడతారు.. ఆ తర్వాత మొత్తం దోచుకుంటారు. ఇక KYC అప్డేట్ మెయిల్ లింక్స్, వాట్సాప్‌లో ఇన్స్టాంట్ లోన్ మెసేజీలు పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.ఇక బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలను డూప్ చేస్తూ నకిలీ ఇమెయిల్స్ పంపుతారు. ఆ మెసేజీలు అచ్చం బ్యాంక్‌వారు పంపినట్టే ఉంటాయి.. లోగో కూడా వారిదే ఉంటుంది. ఆ తర్వాత అక్కడున్న లింకులు క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్‌కు గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్లు నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రమికవేత్తలు డిజిటల్ అరెస్టుల ఫ్రాడ్లకు చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పొగొట్టుకుంటున్నారు.డిజిటల్ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్లో సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు సెటప్ ఉంటుంది. నేరుగా డూప్ సీజేఐ మాట్లాడతారు..! కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ మాత్రమే. అందుకే ప్రతీఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఆదమరిస్తే అంతే సంగతి, కష్టపడి సంపాదించుకున్నదంతా క్షణకాలంలో ఆవిరైపోతుంది. బతుకులను వీధిపాలు చేస్తుంది, ప్రాణాలను కూడా బలితీసుకుంటుంది. మీ పిల్లలను, తల్లిదండ్రులను దిక్కులేనివారిని చేస్తుంది..! సో బీకేర్ ఫుల్. -
ఈ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు, డబుల్..
-
చనిపోయిన వారిపై కేసు పెట్టి విచారణకు రమ్మని నోటీసు
-
విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఓవరాక్షన్
గుంటూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై అడ్డగోలు కేసులు పెడుతున్నారు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులు. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వారిపై కేసు పెట్టి విచారణకు రమ్మని నోటీసు పంపడమే ఇందుకు ఉదాహరణ.తుళ్లూరు మండలం బోరుపాలెంలో ఏడాదిన్నర క్రితం తురక శీను అనే వ్యక్తి చనిపోతే, ఇప్పుడు అతనికి సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు పంపింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక జయోహో జగనన్న వాట్పాస్ గ్రూపులో 87 మందికి పైగా కేసు నమోదు చేశారు. వారిని సైతం విచారణకు రావాలని ఆదేశించింది.ఏపీలో వింత కేసులుఏపీలోని పోలీసులు వింత కేసులు నమోదు చేస్తున్నారు. వాట్పాప్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు పోస్టు పెట్టడంతో గ్రూప్ సభ్యులందరికీ నోటీసులు ఇచ్చారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. వైఎస్సార్ కుటుంబం గ్రూప్‌లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు పోస్టు పెడితే గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారు.ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు.దీంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌కు వాట్సాప్ గ్రూప్ సభ్యులు తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సెకనుకో సైబర్ నేరం.. రోజుకు 90 లక్షల కంప్యూటర్ వైరస్ల పుట్టుక
ఏదో ఒక పెద్ద జీవి అమాంతం నోరు తెరిచి ఈ డైవర్‌ను మింగేస్తున్నట్లు కనిపి స్తోంది కదూ.. ఈ సాడీన్ చేపలు వేల సంఖ్యలో గుంపుగా తిరుగుతుంటాయి. ఆ సమయంలో ఇవి రకరకాల ఆకారాలను ఏర్పరుస్తుంటాయి. ఆ సందర్భంగా తీసినదే ఈ చిత్రం. ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ అవార్డు–2024లో బెంజమిన్ యావర్ తీసిన ఈ చిత్రం నేచర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికైంది.సాక్షి,హైదరాబాద్: మనదేశంలో ప్రతి సెకనుకు ఒక సైబర్ నేరం జరుగుతోందని ప్రముఖ సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు పెండ్యాల కృష్ణశాస్త్రి తెలిపారు. ప్రతి 8 నిమిషాలకు ఒక ర్యాన్సమ్వేర్ దాడి జరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీరోజు 90 లక్షల కంప్యూటర్ వైరస్లు పుట్టుకొస్తున్నాయని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో బిట్కాయిన్ల రేటు పెరుగుతోందంటే ఓ భారీ సైబర్ దాడికి రంగం సిద్ధమవుతోందని సంకేతమని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడేది,లావాదేవీలు జరిపేది బిట్కాయిన్ల రూపంలోనే కావడమే అందుకు కారణమని వివరించారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నగర పోలీసులు, సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ‘హైదరాబాద్ యాన్యువల్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్–2024’(హాక్–2.0) నిర్వహించింది. దీనికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సినీ నటుడు అడవి శేషు తదితరులు హాజరయ్యారు. ఈ సదస్సులో కృష్ణశాస్త్రి కీలకోపన్యాసం చేశారు. సాఫ్ట్వేర్ రంగంతోపాటు దేశంలోని అన్నిరంగాలకు సైబర్ దాడుల ముప్పు పొంచి ఉన్నదని తెలిపారు. ప్రతీరోజూ పుట్టుకొస్తున్న 90 లక్షల కంప్యూటర్ వైరస్లలో రెండు శాతం వైరస్ల లక్షణాలు ఎవరికీ తెలియదని అన్నారు. కృష్ణశాస్త్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..గుర్తించటం కష్టమే..సైబర్ నేరగాళ్లు నిత్యం కొత్త మార్గాల్లో దాడులకు పాల్పడుతుండటంతో వాటిని గుర్తించటం కష్టంగా మారింది. విమాన సర్వీసులకు జీపీఎస్ స్ఫూఫింగ్, డ్రాపింగ్ పెద్ద సవాల్‌గా పరిణమించింది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల జీపీఎస్‌ను హ్యాక్ చేసేందుకు 64 శాతం అవకాశం ఉంది. ప్రపంచంలోని ప్రతి ఆటోమేటిక్ వ్యవస్థకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉంది. ఎస్సెమ్మెస్‌ల ద్వారా లింకులు పంపే విషింగ్, ఈ–మెయిల్స్ ద్వారా పంపే ఫిషింగ్ స్కామ్‌లు ఇప్పటివరకు చూశాం. తాజాగా క్యూఆర్ కోడ్ పంపిస్తూ చేసే క్యూఆర్ ఇషింగ్ కూడా జరుగుతోంది. పుణేలోని కాస్మోస్ బ్యాంక్ సర్వర్‌పై మాల్వేర్తో దాడి చేసిన సైబర్ నేరగాళ్లు రూ.94 కోట్లు కాజేశారు. 2018లో ఇది జరిగినా ఆ మొత్తం ఎక్కడకు వెళ్లిందో ఇప్పటికీ గుర్తించలేకపోయాం. హెల్త్ డేటా లీకైతే బయోవెపన్స్ ముప్పువ్యక్తిగత, ఆర్థిక డేటాతోపాటు హెల్త్ డేటా కూడా అత్యంత కీలకం. ఇటీవల కాలంలో వైద్య రంగానికి చెందిన సంస్థలు, ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు, ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్ల మీద సైబర్ దాడులు చేస్తూ ప్రజల హెల్త్ డేటాను కాజేస్తున్నారు. ఇది శత్రుదేశాల చేతికి చిక్కితే భవిష్యత్తులో బయోవెపన్స్ (జీవాయుధాలు) ముప్పు పెరుగుతుంది. ఈ హెల్త్ డేటా ద్వారా ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్లు ఏ ప్రాంతంలో ఎక్కువ నివసిస్తున్నారు అనేది వారికి తెలుస్తుంది. దీంతో ఆయా బ్లడ్ గ్రూప్స్ వారిపైనే ఎక్కువ ప్రభావం చూపేలా బయోవెపన్స్ తయారు చేసి ప్రయోగించే ప్రమాదం ఉంటుంది. ఈ ఏడాది డిజిటల్ ఫోరెన్సిక్‌కు సిల్వర్ జూబ్లీ ఇయర్. ఈ నేపథ్యంలో ప్రిడెక్టివ్, రెస్పాన్సివ్ కంట్రోల్స్‌ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
సైబర్ సవాలు
అమృతంతో పాటు హాలాహలం పుట్టిందట. సౌకర్యాలెన్నో తెచ్చిన డిజిటల్ సాంకేతికత విసురు తున్న తాజా సవాళ్ళను చూస్తే అదే గుర్తొస్తుంది. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్ళు, పెచ్చుమీరు తున్న డిజిటల్ స్కామ్‌ల సంఖ్యే అందుకు తార్కాణం. ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ బారినపడి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ రూ. 75 లక్షలు, ఓ పారిశ్రామికవేత్త రూ. 7 కోట్లు నష్టపోయిన కథనాలు అమాయ కుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. చదువు లేని సామాన్యుల దగ్గర నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తమ కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్న వైనం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కొత్త సాంకేతికత వచ్చినప్పుడల్లా కొత్త రకం మోసాలూ అంతే వేగంగా ప్రభవించడం ఆది నుంచీ ఉంది. అయితే, అడ్డుకట్ట వేసినప్పుడల్లా మోస గాళ్ళు సైతం తెలివి మీరి కొత్త రీతుల్లో, మరింత సృజనాత్మకంగా మోసాలు చేయడమే పెను సవాలు. అనేక అంశాలతో ముడిపడ్డ దీన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే ఏకకాలంలో అనేక స్థాయుల్లో చర్యలు చేపట్టాలి. అందుకు ప్రజా చైతన్యంతో పాటు ప్రభుత్వ క్రియాశీలత ముఖ్యం. సాక్షాత్తూ భారత ప్రధాని సైతం తన నెల వారీ ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసంగంలో తాజాగా ఈ ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ గురించి ప్రస్తావించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాధితులను ముందుగా ఫోన్లో సంప్రతించడం, మీ ఆధార్ నంబర్ – ఫోన్ నంబర్‌పై వెళుతున్న డ్రగ్స్ పార్సిల్‌ను పట్టుకున్నామనడం, ఆపై వాట్సప్, స్కైప్‌లలో వీడియో కాల్‌కు మారడం, తాము నిజమైన పోలీసులమని నమ్మించడం, నకిలీ పత్రాలు చూపి ‘డిజిటల్ అరెస్ట్’ చేసినట్టు బాధితులను భయపెట్టడం, ఆఖరికి వారి కష్టార్జితాన్ని కొల్లగొట్టడం ‘డిజిటల్ అరెస్ట్ మోసాల’ వ్యవహారశైలి. మోసగాళ్ళు తమను తాము పోలీసులుగా, సీబీఐ అధికారులుగా, మాదకద్రవ్యాల నిరోధక శాఖకు చెందినవారిగా, రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా, చివరకు జడ్జీలమని కూడా చెప్పుకుంటూ... అమాయకులపై మానసికంగా ఒత్తిడి తెచ్చి, భయభ్రాంతులకు గురి చేసి ఆఖరికి వారి నుంచి లక్షల రూపాయల కష్టార్జితాన్ని అప్పనంగా కొట్టేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్, ట్రేడింగ్ స్కామ్, పెట్టుబడుల స్కామ్, డేటింగ్ యాప్‌ల స్కామ్... ఇలా రకరకాల మార్గాల్లో సైబర్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఏటేటా ఈ మోసాలు పెరుగు తున్నాయి. ఒక్క ఈ ఏడాదే కొన్ని వేల డిజిటల్ అరెస్ట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్న ఈ సైబర్ నేరాల గణాంకాలు చూస్తే కళ్ళు తిరుగుతాయి. 2021లో 4.52 లక్షల ఫిర్యాదులు వస్తే, 2022లో 9.66 లక్షలు, గత ఏడాది 15.56 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇక, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే ఏకంగా 7.4 లక్షల ఫిర్యాదులు అందా యని నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) కథనం.ఆర్థిక నష్టానికొస్తే జనవరి – ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ. 120 కోట్ల పైగా పోగొట్టుకున్నారు. అలాగే, ట్రేడింగ్ స్కామ్‌లలో రూ. 1420.48 కోట్లు, పెట్టుబడుల స్కామ్‌లలో రూ. 222.58 కోట్లు, డేటింగ్ స్కామ్‌లలో రూ. 13.23 కోట్లు నష్టపోవడం గమనార్హం. చిత్రమేమిటంటే, ఈ డిజిటల్ మోసాల్లో దాదాపు సగం కేసుల్లో మోసగాళ్ళు మయన్మార్, లావోస్, కాంబోడియాల నుంచి కథ నడిపినవారే!గమనిస్తే, గత పదేళ్ళలో భారతీయ మధ్యతరగతి వర్గం వార్షికాదాయం లక్షన్నర – 5 లక్షల స్థాయి నుంచి రూ. 2.5 – 10 లక్షల స్థాయికి మారిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నివేదిక. సహజంగానే ఆర్థిక స్థాయితో పాటు మధ్యతరగతి అవసరాలు, ఆకాంక్షలూ పెరిగాయి. కాలంతో పాటు జీవితంలోకి చొచ్చుకువచ్చిన డిజిటల్ సాంకేతికతను అందరితో పాటు అందుకోవాల్సిన పరిస్థితి. డిజిటల్ అక్షరాస్యత లేకపోయినా డిజిటల్ చెల్లింపు వేదికలు సహా అన్నీ అనివార్య మయ్యాయి. అయితే, సౌకర్యంతో పాటు సవాలక్ష కొత్త సవాళ్ళనూ ఆధునిక సాంకేతికత విసిరింది. అవగాహన లేమితో సామాన్యుల మొదలు సంపన్నుల దాకా ప్రతి ఒక్కరూ మోసపోతున్న ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నది అందుకే. జీవితమంతా కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము ఇలా మోసాల పాలవుతుండడంతో మధ్యతరగతి సహా అందరిలోనూ ఇప్పుడు భయాందోళనలు హెచ్చాయి. దీన్ని ఎంత సత్వరంగా, సమర్థంగా పరిష్కరిస్తామన్నది కీలకం. ప్రధాని చెప్పినట్టు ‘డిజిటల్‌గా అరెస్ట్’ చేయడమనేదే మన చట్టంలో లేదు. అసలు ఏ దర్యాప్తు సంస్థా విచారణకు ఫోన్ కాల్, వీడియో కాల్ ద్వారా సంప్రతించదు. కానీ, అలా అబద్ధపు అరెస్ట్‌తో భయపెట్టి డబ్బు గుంజడం మోసగాళ్ళ పని. అది జనం మనసుల్లో నాటుకొనేలా చేయాలి. డిజిటల్ నిరక్షరాస్యతను పోగొట్టి, సాంకేతికతపై భయాలను తొలగించాలి. సరిగ్గా వాడితే సాంకేతికతలో ఉన్న లాభాలెన్నో గ్రహించేలా చూడాలి. క్షణకాలం సావధానంగా ఆలోచించి, అప్రమత్తమైతే మోస పోమని గుర్తించేలా చేయాలి. ఒకవేళ మోసపోతే, ఎక్కడ, ఎలా తక్షణమే ఫిర్యాదు చేసి, సాంత్వన పొందాలన్నది విస్తృత ప్రచారం చేయాలి. మోసాలను అరికట్టి, అక్రమార్కుల భరతం పట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టాలి. మన సైబర్ భద్రతా వ్యవస్థను ఎప్పటికప్పుడు తాజా అవస రాలకు అనుగుణంగా నవీకరించాలి. అన్ని రకాల సైబర్ నేరాలపై చర్యల్లో సమన్వయానికి కేంద్రం ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐసీ4)ను నెలకొల్పింది. తీరా దాని పేరు మీదే అబద్ధాలు, మోసాలు జరుగుతున్నందున అప్రమత్తత పెంచాలి. అవసరంతో పని లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని అన్నిచోట్లా అడగడాన్నీ, అందించాల్సి రావడాన్నీ నివారించాలి. ఎంతైనా, నిరంతర నిఘా, నిర్దిష్టమైన అవగాహన మాత్రమే సైబర్ మోసాలకు సరైన విరుగుడు. -
అలర్ట్: ఈ–చలాన్ పేరిట సైబర్ మోసాలు
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ లింక్‌లు పంపుతున్నారు. అందులో.. మీ వాహనాలపై ఉన్న ఈ–చలాన్లు చెల్లించండని.. పేర్కొంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు చెల్లించాలని వచ్చే ఎస్ఎంఎస్లో నకిలీ వెబ్సైట్ లింక్ ఉంటుందని, వాహనదారులు దీన్ని క్షుణ్ణంగా గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాస్తవానికి ఈ–చలాన్‌కు సంబంధించిన నిజమైన వెబ్‌లింక్ echallan.parivahan.gov.in కాగా దీన్ని కొద్దిగా మార్పు చేసి సైబర్ నేరగాళ్లు challaanparivahan.inను పంపుతున్నట్టు తెలిపారు. ఇలాంటి అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘డిజిటల్ అరెస్టు’ మోసగాడి పట్టివేత రాయదుర్గం: ‘డిజిటల్ అరెస్ట్’ కేసులో మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్స్పెక్టర్ కె రామిరెడ్డి నేతృత్వంలో పుణేలో ఈ మేరకు నిందితుడు కపిల్‌కుమార్ (42)ను అరెస్ట్ చేశారు. ఇతను 40 ఏళ్ల మహిళను లక్ష్యంగా చేసుకొని డిజిటల్ అరెస్ట్ మోసానికి పాల్పడ్డాడు. బాధితురాలికి ఆమె పేరుతో ఉన్న సమస్యకు సంబంధించి ఢిల్లీ హైకోర్టునుంచి ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మహిళను మీ బ్యాంకు ఖాతా ద్వారా మోసపూరిత కార్యకలాపాలు, మనీ లాండరింగ్ లావాదేవీలు జరిగాయని పేర్కొన్న నిందితులు డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెను 24 గంటలపాటు భయపెట్టారు. అనంతరం భారీ మొత్తం నగదును బదిలీ చేయించుకున్నారు. ఈ కేసులో ఈ కేసులో ఏ1గా కింగ్‌శుక్ శుక్లా, ఏ2గా కపిల్‌కుమార్ ఉన్నారు. పనిచేసే సంస్థకే కన్నం బంజారాహిల్స్: నమ్మకంగా పనిచేస్తూ పనిచేసే సంస్థకే ఉద్యోగి దాదాపు రూ.1.40 కోట్ల మోసానికి పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్‌లో దాదాపు ఏడున్నర ఏళ్లుగా విశ్వనాథ్‌రెడ్డి అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అదే సంస్థలో అతని భార్య సఫియా నజీర్ మేనేజర్‌గా పనిచేస్తుంది. ఈ నెల 18న ఏషియన్ ముక్తా సంస్థలో అంతర్గతంగా నిర్వహించిన ఆడిటింగ్‌లో భాగంగా విశ్వనాథ్‌రెడ్డి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసినట్లు గుర్తించారు. చదవండి: సైబర్ మోసాల నుంచి తప్పించుకోండిలా..నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి సంస్థ రూ.1,47,08,928 నిధులను తన భార్య, సోదరుడు రాసిం రాజశేఖర్, స్నేహితుడు శశాంక్ పేరుతో ఉన్న ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. హిందుస్థాన్ కోకోకోలా బేవరేజస్, సాయి నైన్ ఎంటర్ప్రైజెస్ల పేర్లతో మొత్తం నాలుగు ఖాతాల్లోకి ఈ మొత్తం డబ్బును మళ్లించినట్లు గుర్తించారు. ఆడిటింగ్‌లో భాగంగా ఈ నిధుల గోల్మాల్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఏషియన్ ముక్తా ఏ2 సినిమాస్ సంస్థ మేనేజింగ్ పార్టనర్ సునీల్ నారంగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 316 (4), 318 (4), 335, 336 (3), 338, రెడ్ విత్ 3(5)ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులుతిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. -
సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారా.. మీ డబ్బు తిరిగొచ్చే చాన్స్!
సైబర్ మోసగాళ్ల బారిన పడి తమ డబ్బును పోగొట్టుకున్న వారు తిరిగి పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఇందుకు వారు చేయాల్సిందల్లా సకాలంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేస్తే రికవరికీ అవకాశం ఉంటుందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో బాధితులు మోసపోవడం ఎంత తేలికో... నేరగాళ్లను పట్టుకోవడం అంత కష్టం. నగదు రికవరీ అనేది దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. ‘గోల్డెన్ అవర్’లో ఫిర్యాదు చేసిన బాధితులకు మాత్రం చాలా వరకు న్యాయం జరుగుతోంది. క్రిమినల్స్‌కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేసిన వీరి నగదును రిటర్న్ చేయడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్లు బాధితులకు తిరిగి ఇప్పించగలిగారు. ఆ సమయమే గోల్డెన్ అవర్.. బాధితులు ‘గోల్డెన్ అవర్’లో అప్రమత్తం కావడంతో పాటు తక్షణం ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నేరం బారిన పడిన తర్వాత తొలి గంటనే గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు. ఆ తర్వాత ఎంత ఆలస్యమైతే నగదు వెనక్కు వచ్చే అవకాశాలు అంత తగ్గిపోతుంటాయి. ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో బాధితులు తొలుత సైబర్ క్రైమ్ ఠాణాకు రావడంపై దృష్టి పెట్టకుండా తక్షణం 1930 నంబర్‌కు కాల్ చేసి లేదా (cybercrime.gov.in)కు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.రెండు రకాలుగా నగదు ఫ్రీజ్.. ఉత్తదారిలోని వివిధ ప్రాంతాలు కేంద్రంగా దేశ వ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడే నిందితులు బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించడానికి సొంత బ్యాంకు ఖాతాలను వాడరు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంలో మనీమ్యూల్స్‌గా పిలిచే దళారులకు చెందిన వాటితో పాటు బోగస్ వివరాలతో తెరిచిన బ్యాంకు ఖాతాలకు దీనికోసం వినియోగిస్తుంటారు.చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..ఓ నేరం కోసం ఒకే ఖాతాను కాకుండా వరుస పెట్టి బదిలీ చేసుకుపోవడానికి కొన్నింటిని వాడుతుంటారు. మోసపోయిన బాధితులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసినప్పుడు ఆ అధికారులు ప్రాథమిక ఖాతాల్లోని నగదు ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆన్లైన్ ఫ్రీజింగ్ అంటారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అప్పటికే కొంత నగదు మరో ఖాతాలోకి వెళ్లినట్లు తేలితే ఆయా బ్యాంకుల సహకారంతో దాన్నీ ఫ్రీజ్ చేస్తారు. దీన్ని ఆఫ్‌లైన్ ఫ్రీజింగ్‌గా వ్యవహరిస్తుంటారు. ఒక్కో టీమ్‌లో ఒక్కో కానిస్టేబుల్.. ఫిర్యాదు చేసినప్పుడు నగదు ఫ్రీజ్ అవుతోందనే విషయం చాలా మంది బాధితులకు తెలియట్లేదు. దీనికి సంబంధించి వస్తున్న ఎస్సెమ్మెస్‌లను వాళ్లు పట్టించుకోవట్లేదు. కొంత కాలానికి తెలిసినప్పటికీ కోర్టుకు వెళ్లి, అనుమతి పొందటం వీరికి పెద్ద ప్రహసనంగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రతి టీమ్‌కు ఓ కానిస్టేబుల్‌ను నియమించారు. సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన నగదు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ అధికారి బాధితులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు వచ్చి నగదు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరతాడు. అలా ఠాణాకు వచ్చిన బాధితులను కోర్టుకు తీసుకువెళ్లి పిటిషన్ వేయడంతో పాటు నగదు విడుదలకు సంబంధించిన బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా కానిస్టేబుల్ చేస్తున్నారు. గత ఏడాది మొత్తమ్మీద రిఫండ్ అయిన మొత్తం రూ.20.86 కోట్లుగా ఉండగా.. పోలీసుల చర్యల కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్ నాటికే ఇది రూ.32.49 కోట్లకు చేరింది. ఈ నెల్లో రిఫండ్‌తో కలిపితే ఇది దాదాపు రూ.40 కోట్ల వరకు ఉంది. -
సైబర్ నేరస్తుల బారి నుంచి తప్పించుకోండిలా..
Cyber Crime Prevention Tips: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్షంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేర్లతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ ఒశ్వాల్(82)ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆయన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ చోరులు.సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, నిపుణులు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవేంటో తెలుసుకుందాం.1. ట్రాయ్ ఫోన్ స్కామ్:మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికం రెగ్యులెటరీ అథారిటీ (ట్రాయ్) నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు. సైబర్ చోరుడు.. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే ట్రాయ్.. ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికం కంపెనీలు మాత్రమే ఆ పని చేస్తాయి.2. పార్శిల్ స్కామ్: నిషేధిత వస్తువులతో కూడిన పార్శిల్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబరును పోలీసులకు ఇవ్వాలి.3. డిజిటల్ అరెస్ట్: మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఎక్కడికి వెళ్లినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్లైన్ విచారణలు నిర్వహించరు.4. కుటుంబ సభ్యుల అరెస్ట్: కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని మీకు ఫోన్ కాల్ వస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్‌తో చాలా మందిని బురిడీ కొట్టించారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు చిక్కుల్లో పడ్డారనగానే ఎవరికైనా కంగారు పుడుతుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్నారని చెబుతున్నవారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి.5. రిచ్ క్విక్ ట్రేడింగ్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్పకాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.6. ఈజీ వర్క్.. ఎర్న్ బిగ్: చిన్నచిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి.. భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు స్కామ్‌లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.7. క్రెడిట్ కార్డ్ స్కామ్: మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్‌తో భారీ లావాదేవి జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి.. తన మరొకరికి కాల్ ఫార్వార్డ్ చేస్తాడు. మిమ్మల్ని నమ్మించిన తర్వాత సీవీవీ, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నయిట్టయితే, దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించాలి. అంతేకానీ అపరిచితులకు వివరాలు చెప్పకండి.8. నగదు బదిలీతో మస్కా: కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్‌కు ఫేక్ మేసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి.. పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మేసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోండి.9. కేవైసీ గడువు: కేవైసీ గడువు ముగిసిందని, అప్డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ.. ఎస్ఎంఎస్, కాల్, ఈ-మెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్‌లకు కనెక్ట్ అయివుంటాయి. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి.10. పన్ను వాపసు: ట్యాక్స్‌పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నావారికి ఫోన్ చేసి తమను తామును అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరతారు. డిటైల్స్ చెప్పగానే మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్‌పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి. కాబట్టి వారికే నేరుగా ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను అసలు నమ్మకండి.స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే..1. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి2. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి3. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి4. అనుమానాస్పద కాల్లు/నంబర్లపై రిపోర్ట్ చేయండి5. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి6. కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేయండి7. వ్యక్తిగత/బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దుస్కామర్లపై ఫిర్యాదు చేయండిలా..1. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (1800-11-4000)2. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in)3. స్థానిక పోలీస్ స్టేషన్4. ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండిsancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp -
వీడియో కాల్ కలకలం.. అర్థరాత్రి ఎమ్మెల్యేకు నగ్నంగా ఫోన్ కాల్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరస్తులు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి పొలిటీషియన్ వరకు ఏదో రకంగా ఇబ్బందులు పెడుతూ డబ్బులు కాజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, ఇటీవలి కాలంలో వాట్సాప్‌లో నగ్న వీడియో కాల్స్ చేసి కొందరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని ఓ ఎమ్మెల్యే సైతం ఇదే పరిస్థితి ఏర్పడింది.వివరాల ప్రకారం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు వింత అనుభవం ఎదురైంది. ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత సదరు ఎమ్మెల్యేకు వీడియో కాల్ వచ్చింది. గుర్తుతెలియని నంబర్ నుంచి కాల్ రావడంతో ఎవరో అనుకుని.. వీడియో కాల్‌ను ఎమ్మెల్యే ఆన్సర్ చేశారు. దీంతో ఫోన్ స్క్రీన్‌పై ఓ మహిళ నగ్నంగా కనిపించింది. దీంతో, వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే కాల్‌ను కట్ చేశారు.ఈ క్రమంలో వీడియో కాల్ నుంచి తేరుకున్న ఎమ్మెల్యే.. నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో కూడా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.అయితే, తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా అలా వీడియోకాల్ చేశారా? లేక నిజంగానే గుర్తుతెలియని వ్యక్తులే చేసి ఉంటారా? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. తన ప్రతిష్ఠను దిగజార్చడంతోపాటు బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పాల్పడి ఉంటారనే సందేహంతో ఆయన వెంటనే నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే గురువారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ)లో సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్న ఫోన్‌నంబర్ ఎవరిదని కనుక్కునే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో తెలుగు బిగ్‌బాస్ కంటెస్టెంట్!
తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ భాషను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో విచారణ చేస్తున్నట్లు సమాచారం. హర్షసాయి తనను లైంగికంగా వేధించాడంటూ నార్సింగి పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేశారు.(ఇది చదవండి: యూట్యూబర్ హర్షసాయిపై కేసు.. నిజాలు బయటపెట్టిన యువతి)అయితే బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు సంబంధించి యూట్యూబ్ ఛానెల్స్‌లో అసత్య ప్రచారం చేసినందుకు ఆర్జే శేఖర్‌పై యువతి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు. కాగా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్-8లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ఆర్జే శేఖర్ భాషా రెండోవారంలోనే ఎలిమినేట్ అయి బయటకొచ్చేశాడు. -
అప్రమత్తంగా ఉందాం... కాపాడుకుందాం
‘‘సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండి, మనల్ని మనం కాపాడుకోవాలి’’ అంటున్నారు రష్మికా మందన్నా. గత నవంబరులో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్–ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ శరీరానికి రష్మికా ముఖాన్ని పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియో రష్మికతో పాటు చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు తారల ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.కాగా, తన గురించి వచ్చిన డీప్‌ఫేక్ వీడియో గురించి స్పందిస్తూ... ‘‘నేను స్కూల్లో, లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉండగలనా? అని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని రష్మిక అప్పట్లో ట్వీట్ చేశారు. అలాగే ‘‘అందరం కలిసి ఈ ధోరణికొక విరుగుడు కనిపెడదాం’’ అని మహిళలకు పిలుపునిచ్చారు కూడా. ఇప్పుడా పిలుపునకు ఒక సాధికారత లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సి)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మికా మందన్నాని నియమించింది. కేంద్ర హోమ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. రష్మికా మందన్నాని రాయబారిగా ఎంపిక చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సైబర్ సేఫ్టీ జాతీయ ప్రచారోద్యమ రాయబారిగా తాను నియమితమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొని, ఓ వీడియో విడుదల చేశారు రష్మిక. ఆ వీడియోలో ‘‘మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. సైబర్ క్రైమ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. దాని ప్రభావం ఎంత ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మన ఆన్లైన్ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మనందరం కలిసి మన కోసం, భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్‌ని రూపొందించుకుందాం. సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువమందికి అవగాహన కల్పించి, రక్షించాలని అనుకుంటున్నాను.సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక దాదాపు ఏడాది క్రితం (నవంబరు 6) రష్మిక సైబర్ క్రైమ్ బాధితురాలు... ఏడాది తిరక్క ముందే ప్రజల్ని బాధితులు కానివ్వకుండా జాగృతం చేయనున్న సైబర్ యోధురాలు. ఇదిలా ఉంటే... కెరీర్ పరంగా ‘దేవదాస్’ (2018) చిత్రంలో ఇన్స్పెక్టర్ పూజగా నటించారు‡రష్మిక. తెరపై తన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌గా తన బాధ్యతను చాలా సిన్సియర్‌గా నిర్వర్తించాలని బలంగా నిర్ణయించుకున్నారు. -
బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి
కొన్నాళ్ల క్రితం హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో ఒకటి వైరల్ అయింది. ఈమెనే కాదు చాలామంది సెలబ్రిటీలకు ఇలానే జరిగింది. ఈ విషయమై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం సైబర్ నేరాల అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మికని నియమించారు. సైబర్ నేరాలపై ఈమెతోనే అవగాహన కల్పించారు. ఈ మేరకు రష్మిక ఓ వీడియో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)రష్మిక ఏమందంటే?'నా డీప్ ఫేక్ వీడియోని చాలా వైరల్ చేశారు. అదో సైబర్ నేరం. అప్పుడే ఇలాంటి సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నిలబడాలని, వీటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. కేంద్ర హోం అఫైర్స్ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ పనిచేస్తోంది. ఆ సంస్థకు నేను బ్రాండ్ అంబాసిడర్. సైబర్ నేరగాళ్లు ఎలా దాడి చేస్తారో చెప్పలేం. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిసికట్టుగా పోరాడుదాం. సైబర్ నేర రహిత దేశాన్ని సృష్టించుకుందాం' అని రష్మిక చెప్పింది.కర్ణాటకకు చెందిన ఈమె చాలా తక్కువ టైంలోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 'పుష్ప' మూవీ ఈమెకు వేరే లెవల్ క్రేజ్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ మూవీస్ ఉన్నాయి. ఇవి కాకుండా పలు హిందీ చిత్రాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.(ఇదీ చదవండి: కోలుకున్న రజినీకాంత్.. 'వేట్టయన్' టీమ్‌తో ఇలా) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
100 కోట్ల స్పామ్ కాల్స్‌కు చెక్
భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన యాంటీ స్పామ్ టెక్నాలజీ (ఏఎస్టీ) సంచలనం సృష్టిస్తోందని టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఏఎస్టీ వినియోగంలోకి వచ్చిన మొదటి 10 రోజుల్లో దేశవ్యాప్తంగా కంపెనీ 100 కోట్ల స్పామ్ కాల్స్‌ను గుర్తించి కస్టమర్లను హెచ్చరించింది. స్పామ్ కాల్, ఎస్ఎంఎస్ను విశ్లేషించి కస్టమర్‌ను అప్రమత్తం చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. 2 మిల్లీ సెకన్లలో ఈ సొల్యూషన్ 150 కోట్ల సందేశాలను, 250 కోట్ల కాల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 12.2 కోట్ల స్పామ్ కాల్స్, 23 లక్షల స్పామ్ సందేశాలను గుర్తించినట్టు ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ సర్కిల్ సీఈవో శివన్ భార్గవ తెలిపారు. కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక వల్ల స్పామ్ కాల్స్ 97 శాతం, స్పామ్ ఎస్ఎంఎస్లు 99.5 శాతం తగ్గాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా 20 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు పేర్కొన్నారు. ఏఎస్టీ కచ్చితత్వం 97 శాతం ఉందన్నారు.ఇదీ చదవండి: కారణం చెప్పకుండా ఐపీవో ఉపసంహరణస్పామ్ కాల్స్ సంఖ్య పరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని శివన్ భార్గవ వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా స్పామ్ కాల్స్ కారణంగా ఏడాదిలో 3 బిలియన్ డాలర్ల(రూ.25 వేలకోట్లు) విలువైన బ్యాంకు మోసాలు నమోదయ్యాయి. 2024 ఏప్రిల్–జులై మధ్య భారత్‌లో రూ.1,720 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. సైబర్ మోసాలపై నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో (ఎన్సీఆర్పీ) రోజూ సుమారు 7,000 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. దేశంలో 60 శాతం మంది మొబైల్ యూజర్లకు రోజులో కనీసం మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయి. 87 శాతం మంది అవాంచిత ఎస్ఎంఎస్లు అందుకుంటున్నారు. స్పామ్ ముప్పునకు పరిష్కారం కోసం ఏడాదిగా శ్రమించి ఏఎస్టీని సొంతంగా అభివృద్ధి చేశాం. 100 మందికిపైగా డేటా సైంటిస్టులు నిమగ్నమయ్యారు’ అని వివరించారు.