ఆన్‌లైన్‌ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు! | how many cyber fraud complaints in 2024 in india | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలు.. విస్మయకర వాస్తవాలు!

Published Mon, Dec 9 2024 7:31 PM | Last Updated on Mon, Dec 9 2024 8:04 PM

how many cyber fraud complaints in 2024 in india

ఇంటర్నెట్‌, మొబైల్‌ డేటా వినియోగంతో దేశంలో ఆన్‌లైన్‌ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్‌ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణం‍గా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్‌లైన్‌ మోసాలకు బలయ్యాడు. సైబర్‌ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్‌ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.

11 వేల కోట్ల రూపాయలు నష్టం
ప్రతిఏటా వేల​ కోట్ల రూపాయలను సైబర్‌ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్‌లైన్‌ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్‌లైన్‌ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోర్టింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్‌ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.

డిజిటల్‌ అరెస్ట్‌.. లేటెస్ట్ ట్రెండ్‌
మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్‌ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్‌లైన్‌, మొబైల్‌ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్‌ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్‌ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం 115వ ఎపిసోడ్‌లో డిజిటల్‌ అరెస్ట్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్‌ లేదా వీడియో కాల్స్‌ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.

30 లక్షల ఫిర్యాదులు
అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్‌ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్‌ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు.  2023లో 11,31,221 కేసులు నమోదు కాగా,  2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్‌, లావోస్‌ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్‌ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్‌లైన్‌ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు.  

చ‌ద‌వండి: సైబర్‌ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

అప్రమత్తతే రక్షణ కవచం
సైబర్‌ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్‌ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్‌, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్‌ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్‌ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement