cyber scam
-
బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలు సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు. aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్ చేయడం సవాల్‌గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్‌డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్ 24న అరెస్టు చేశారు. బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం.. మ్యూల్ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్‌ప్లాగ్ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్‌ఫ్లాగ్ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది. మ్యూల్ బ్యాంకు ఖాతా అంటే..? ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్ బ్యాంక్ అకౌంట్‌గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు. మ్యూల్ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు.. సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు. వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్‌బుక్, డెబిట్ కార్డులు, పాస్వర్డ్లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు. సైబర్ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు. ఖాతాదారులకు సూచనలు.. ఇతరులు నెలవారీ కమీషన్ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు. మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది. మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పేరిట ఉన్న మ్యూల్ బ్యాంక్ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు. ప్రధానంగా మ్యూల్ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..సోషల్ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు. వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్ ఖాతాల బాధితులే. -
Cyber Scam: రూ. 11 కోట్లు పోగొట్టుకున్న టెకీ..!
బెంగళూరు: ‘ మీరు సైబర్ స్కామ్ నేరగాళ్ల(Cyber Scam) నుంచి జాగ్రత్తగా ఉండండి. తాము ప్రభుత్వ అధికారులమని మీ వివరాలు కావాలంటూ ఫోన్ చేసే వారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అంటూ మనకు ఫోన్లో కాలర్ టోన్ రూపంలో తరచు వినిపిస్తున్న మాట. అది పాట అయినా మాట అయినా కానీ ఆ కాలర్ ట్యూన్ ఉద్దేశం మాత్రం.. ఫోన్ చేసే ఎవరైనా మీ వ్యక్తిగత డేటా ఏ రూపంలో అడిగినా ఇవ్వొద్దనేది దాని సారాంశం.అయితే బెంగళూరు టెకీ(Bengaluru Techie) మాత్రం,, అచ్చం ఇదే తరహాలో మోసం పోయి రూ. 11 కోట్లు పోగొట్టుకున్నాడు. ఓ సంస్థలో టెకీగా ఉద్యోగం చేస్తూ కొంత నగదును ‘మార్కెట్ ఇన్వెస్ట్మెంట్’లో పెట్టాడు. రూ. 50 లక్షలు పెడితే దాని విలువ రూ. 12 కోట్లకు చేరింది.ఈ విషయాన్ని పసిగట్టిన నిందితుడు.. బాధితుడ్ని అత్యంత చాకచక్యంగా వలలో వేసుకున్నాడు. విజయ్ కుమార్ అనే టెకీ నుంచి భారీ మొత్తంలో దోచుకుపోయాడు. తాము ఈడీ అధికారులమని, ప్రభుత్వ అదికారులమని చెబుతూ విజయ్ కుమార్ భయభ్రాంతలకు గురి చేసిందో ఓ ముఠా. మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని, మిమ్ముల్ని అరెస్ట్ చేస్తామని తరచు బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో భయపడిన విజయ్ కుమార్.. వారు చెప్పినట్లు చేశాడు. వారు అడిగిన ఆధార్, పాన్ కార్డువివరాలతో పాటు తన వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా వారికి అందించాడు.అంతే.. దాంతో సైబర్ నేరగాళ్ల పని ఈజీ అయ్యింది. ఇంకేముంది బాధితుడికి ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ. 11 కోట్లను స్వాహా చేశారు. సుమారు ఏడు కోట్ల రూపాయలను ఒకే అకౌంట్ సుంచి దొంగిలించడం గమనార్హం.ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులుతాను నష్టపోయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్నబాధితుడు విజయ్ కుమార్ లబోదిబో మన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇదే దుబాయ్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్(Cyber Fraud) కు సంబంధించిన ఘటనలో తరుణ్ నటానీ, కరణ్, దవల్ షాలను అరెస్ట్ చేశారు. షా అనే నిందితుడు దుబాయ్ చెందిన సైబర్ స్కామ్‌లో ఆరితేరిన ఓ వ్యక్తి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. దీనికి గాను కోటిన్నరకు ఒప్పందం చేసుకున్నాడు సదరు దుబాయ్ చెందిన సైబర్ నేరగాడు. -
అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!
టెక్నాలజీ పెరుగుతోంది, సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా స్కాములకు పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 'జంప్డ్ డిపాజిట్ స్కామ్' (Jumped Deposit Scam) పేరుతో ఓ కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. దీని ద్వారా చాలామంది ప్రజలు భారీగా డబ్బు కోల్పోతున్నారు. ఇంతకీ ఈ కొత్త స్కామ్ ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.జంప్డ్ డిపాజిట్ స్కామ్జంప్డ్ డిపాజిట్ స్కామ్ అనేది యూపీఐ (UPI) వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. బాధితులను ఆకర్శించడానికి.. నేరగాళ్లు బ్యాంక్ ఖాతాల్లో రూ.5,000 లేదా అంతకంటే తక్కువ జమచేస్తారు. ఖాతాలో డబ్బు జమ అయినట్లు ఒక నోటిఫికేషన్ SMS రూపంలో వస్తుంది. ఆ సమయంలో బాధితుడు బ్యాలెన్స్ చెక్ చేయడానికి యూపీఐ ఓపెన్ చేసి.. పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే, నేరగాడికి యాక్సెస్ లభిస్తుంది. దీంతో ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు మాయమైపోతుంది.జంప్డ్ డిపాజిట్ స్కామ్‌ను ఎదుర్కోవడం ఎలా?➤గుర్తు తెలియని నెంబర్ నుంచి మీ ఖాతాలో చిన్న మొత్తం జమ అయితే.. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయవద్దు. 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు వేచి చూడండి. ఆ తరువాత స్కామర్ అభ్యర్థ గడువు ముగిసిపోతుంది.➤ఒకవేళా మీ ఖాతాలో డబ్బు జమ అయిన తరువాత.. బ్యాలన్స్ చెక్ చేసుకునే సమయంలో ఉద్దేశ్యపూర్వకంగానే తప్పు పిన్ ఎంటర్ చేయండి. దీంతో స్కామర్ అభ్యర్థ క్యాన్సిల్ అవుతుంది.➤బ్యాంక్ బ్యాలెన్సును సంబంధించిన యాప్ నోటిఫికెషన్స్ లేదా మెసేజస్ వస్తే.. మీరు నేరుగా బ్యాంకును సంప్రదించి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు.➤ఎప్పుడూ మీ యూపీఐ పిన్ నెంబర్ ఇతరులకు షేర్ చేయవద్దు లేదా చెప్పవద్దు. పిన్ నెంబర్ గోప్యంగానే ఉండాలి.➤జంప్డ్ డిపాజిట్ స్కామ్‌కు సంబంధించిన కేసులు.. ఇటీవల చాలా ఎక్కువవుతున్నాయి. కాబట్టి ఇలాంటి తరహా మోసాల గురైతే.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్‌గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్‌లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్‌ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్‌తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్‌లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్‌లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్‌గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్‌కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్‌ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
ఆన్లైన్ మోసాలు.. విస్తుపోయే వాస్తవాలు!
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో ఓ యువ రైతు ఆన్లైన్ మోసాలకు బలయ్యాడు. సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకున్న వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన బందెనోల్ల పోచిరెడ్డి(30) అనే రైతు బలవనర్మణం చెందాడు.11 వేల కోట్ల రూపాయలు నష్టంప్రతిఏటా వేల కోట్ల రూపాయలను సైబర్ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ మోసాలకు మనదేశం 2024 మొదటి 9 నెలల్లోనే 11,333 కోట్ల రూపాయలు నష్టపోయిందని హోంశాఖ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) వెల్లడించింది. స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.4636 కోట్లు, ఇన్వెస్ట్మెంట్ సంబంధిత పేర్లతో రూ.3216 కోట్లు మాయం చేశారని పేర్కొంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ1616 కోట్లు దోచేశారని లెక్క చెప్పింది. ఆన్లైన్ మోసాలపై ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఫిర్యాదులు వచ్చినట్టు సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ సైబర్ దాడుల ముప్పు కొనసాగుతుందని డేటా సెక్యురిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(డీఎస్‌సీఐ) హెచ్చరించింది.డిజిటల్ అరెస్ట్.. లేటెస్ట్ ట్రెండ్మన దైనందిన జీవితాల్లో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో తప్పనిసరిగా ఆన్లైన్, మొబైల్ సేవలపై ఆధారపడాల్సి వస్తోంది. మన అవసరాలు, ఆశలను ఆసరాగా తీసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త అవతారాల్లో జనాన్ని వంచించి, కేసుల పేరుతో భయపెట్టి సొమ్ములు చేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో సైబర్ మోసాల కేసులు నానాటికీ ఎగబాకుతున్నాయి. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీగా డబ్బులు కొట్టేసిన ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ.. మన్ కీ బాత్ కార్యక్రమం 115వ ఎపిసోడ్లో డిజిటల్ అరెస్ట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి చెందిన ఏ దర్యాప్తు సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా విచారణ చేపట్టదని ఆయన తెలిపారు.30 లక్షల ఫిర్యాదులుఅమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ దుండగులు మోసాలకు పాల్పుడుతున్నారు. వృద్ధులు, మహిళలను టార్గెట్ చేసి సొమ్ములు కాజేస్తున్నారు. సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్ డేటా ప్రకారం 2021 నుంచి ఇప్పటి వరకు సైబర్ మోసాలపై 30.05 లక్షల ఫిర్యాదులు నమోదు కాగా, రూ.27,914 కోట్లను కేటుగాళ్లు కొల్లగొట్టారు. 2023లో 11,31,221 కేసులు నమోదు కాగా, 2022లో 5,14,741, 2021లో 1,35,242 ఫిర్యాదులు వచ్చాయి. కాగా, కంబోడియా, మయన్మార్, లావోస్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు సైబర్ మోసాలకు అడ్డాలు మారాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో నమోదైన ఆన్లైన్ మోసాల్లో 45 శాతం ఈ దేశాల నుంచే జరుగుతున్నట్టు గుర్తించారు. చదవండి: సైబర్ స్కామర్స్‌తో జాగ్రత్త.. మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..అప్రమత్తతే రక్షణ కవచంసైబర్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే స్వీయ అప్రమత్తతే ఆయుధమని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, వ్యక్తిగత ఇ-మెయిల్, వాట్సాప్‌లో వచ్చే అనుమానాస్పద లింకులు.. సందేశాలకు స్పందించవద్దని కోరుతున్నారు. ఎక్కువ డబ్బు ఆశచూపే వారి పట్ల అలర్ట్‌గా ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థల పేరుతో ఎవరైనా భయపడితే కంగారు పడొద్దని, నేరుగా పోలీసులను సంప్రదించాలని నిపుణులు సలహాయిస్తున్నారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైనట్టు భావిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. మున్ముందు కూడా కొత్త తరహా సైబర్ మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. -
మీరు కూడా ఆ ఉచ్చులోనే చిక్కుకున్నారా..?
-
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్‌లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్‌ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్‌లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
సైబర్ నేరస్తుల బారి నుంచి తప్పించుకోండిలా..
Cyber Crime Prevention Tips: ఇటీవల కాలంలో సైబర్ మోసాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలను లక్షంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్లతో ఏమార్చి ప్రజలను దోచుకుంటున్నారు. బ్యాంకులు, క్రెడిట్ కార్డులతో మోసాలకు పాల్పడుతూ భారీగా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వ పథకాల పేర్లతోనూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే మాట ఎక్కువగా వినబడుతోంది. వర్ధమాన్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్పీ ఒశ్వాల్(82)ను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి ఆయన నుంచి ఏకంగా 7 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ చోరులు.సైబర్ నేరాలు ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి.. వాటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం, నిపుణులు పలు సూచనలు చేశారు. సైబర్ నేరాల్లో ఎక్కువగా 10 రకాల మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అవేంటో తెలుసుకుందాం.1. ట్రాయ్ ఫోన్ స్కామ్:మీ మొబైల్ నంబర్ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నట్టు టెలికం రెగ్యులెటరీ అథారిటీ (ట్రాయ్) నుంచి ఫోన్ వస్తుంది. మీ ఫోన్ సేవలు నిలిపివేయకూడదంటే అధికారితో మాట్లాడాలంటూ భయపెడతారు. సైబర్ చోరుడు.. సైబర్ క్రైమ్ సెల్ పోలీసు అధికారిగా మిమ్మల్ని భయపెట్టి ఏమార్చాలని చూస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏటంటే ట్రాయ్.. ఫోన్ సేవలు నిలిపివేయదు. టెలికం కంపెనీలు మాత్రమే ఆ పని చేస్తాయి.2. పార్శిల్ స్కామ్: నిషేధిత వస్తువులతో కూడిన పార్శిల్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని, ఈ కేసు నుంచి బయట పడాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తూ ఫోన చేస్తారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులను సంప్రదించాలి. బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన నంబరును పోలీసులకు ఇవ్వాలి.3. డిజిటల్ అరెస్ట్: మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని ఎక్కడికి వెళ్లినా తమ నిఘాలోనే ఉండాలని స్కామర్లు బెదిరిస్తారు. పోలీసులు, సీబీఐ అధికారుల పేరుతో ఫోన్ చేసి డబ్బులు గుంజాలని చూస్తారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువయ్యాయి. వాస్తవం ఏమిటంటే పోలీసులు డిజిటల్ అరెస్టులు లేదా ఆన్లైన్ విచారణలు నిర్వహించరు.4. కుటుంబ సభ్యుల అరెస్ట్: కాలేజీ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని మీకు ఫోన్ కాల్ వస్తే అనుమానించాల్సిందే. ఎందుకంటే సైబర్ స్కామర్లు ఇలాంటి ట్రిక్స్‌తో చాలా మందిని బురిడీ కొట్టించారు. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు చిక్కుల్లో పడ్డారనగానే ఎవరికైనా కంగారు పుడుతుంది. ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కంగారు పడకుండా స్థిమితంగా ఆలోచించాలి. ఆపదలో చిక్కుకున్నారని చెబుతున్నవారితో నేరుగా మాట్లాడటానికి ప్రయత్నించండి.5. రిచ్ క్విక్ ట్రేడింగ్: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తున్నాయి. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు జనాన్ని కొల్లగొడుతున్నారు. స్వల్పకాలంలోనే అత్యధిక రాబడి వస్తుందని ఆశ పడితే అసలుకే మోసం రావొచ్చు. కాబట్టి ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.6. ఈజీ వర్క్.. ఎర్న్ బిగ్: చిన్నచిన్న పనులకు ఎక్కువ డబ్బులు ఇచ్చి ముగ్గులోకి లాగుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఉదాహరణకు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామని ఆఫర్ చేస్తారు. చెప్పినట్టుగానే డబ్బులు ఇచ్చేస్తారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. తమతో పాటు పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపించి.. భారీ మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈజీ మనీ పథకాలు స్కామ్‌లని గుర్తిస్తే సైబర్ చోరుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు.7. క్రెడిట్ కార్డ్ స్కామ్: మీరు వాడుతున్న క్రెడిట్ కార్డ్‌తో భారీ లావాదేవి జరిగిందని, దీన్ని నిర్ధారించుకోవడానికి ఫోన్ చేసినట్టు మీకు ఫోన్ వస్తే కాస్త ఆలోచించండి. సాయం చేస్తానని చెప్పి మీకు ఫోన్ చేసిన వ్యక్తి.. తన మరొకరికి కాల్ ఫార్వార్డ్ చేస్తాడు. మిమ్మల్ని నమ్మించిన తర్వాత సీవీవీ, ఓటీపీ అడిగి ముంచేస్తారు. మీ పేరుతో క్రెడిట్ కార్డు ఉన్నయిట్టయితే, దాంతో చేసే లావాదేవీలకు సంబంధించిన సమాచారం ఫోన్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ ఏదైనా అనుమానం కలిగితే బ్యాంకును సంప్రదించాలి. అంతేకానీ అపరిచితులకు వివరాలు చెప్పకండి.8. నగదు బదిలీతో మస్కా: కొంత నగదు బ్యాంకు ఖాతాలో పడినట్టు స్కామర్లు మీ ఫోన్‌కు ఫేక్ మేసేజ్ పంపిస్తారు. తర్వాత మీకు ఫోన్ చేసి.. పొరపాటున నగదు బదిలీ అయిందని, తన డబ్బు తిరిగిచ్చేయాలని మస్కా కొడతారు. నిజంగా ఆ మేసేజ్ బ్యాంకు నుంచి వచ్చింది కాదు. నగదు బదిలీ కూడా అబద్ధం. ఎవరైనా ఇలాంటి ఫోన్ కాల్ చేస్తే బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. నిజంగా నగదు బదిలీ జరిగిందా, లేదా అనేది నిర్ధారించుకోండి.9. కేవైసీ గడువు: కేవైసీ గడువు ముగిసిందని, అప్డేట్ చేసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి అంటూ.. ఎస్ఎంఎస్, కాల్, ఈ-మెయిల్ ఏవైనా వస్తే జాగ్రత్త పడండి. పొరపాటున ఈ లింకులు క్లిక్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడినట్టే. ఈ లింకులు స్కామర్ల డివైజ్‌లకు కనెక్ట్ అయివుంటాయి. కాబట్టి వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. బ్యాంకులు లింకుల ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పవు. నేరుగా వచ్చి మాత్రమే కేవైసీ వివరాలు ఇమ్మని అడుగుతాయి.10. పన్ను వాపసు: ట్యాక్స్‌పేయర్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఎదురు చూస్తున్నావారికి ఫోన్ చేసి తమను తామును అధికారులుగా పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రిఫండ్ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించాలని కోరతారు. డిటైల్స్ చెప్పగానే మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేస్తారు. ట్యాక్స్‌పేయర్ల బ్యాంకు ఖాతాల వివరాలు పన్నుల శాఖ వద్ద ఉంటాయి. కాబట్టి వారికే నేరుగా ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తాయి. కాబట్టి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పే మాటలను అసలు నమ్మకండి.స్కామర్ల బారిన పడకుండా ఉండాలంటే..1. స్పందించే ముందు సమాచారాన్ని ధృవీకరించుకోండి2. అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకండి3. నగదు లావాదేవీలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోండి4. అనుమానాస్పద కాల్లు/నంబర్లపై రిపోర్ట్ చేయండి5. అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి6. కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేయండి7. వ్యక్తిగత/బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దుస్కామర్లపై ఫిర్యాదు చేయండిలా..1. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (1800-11-4000)2. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (cybercrime.gov.in)3. స్థానిక పోలీస్ స్టేషన్4. ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండిsancharsaathi.gov.in/sfc/Home/sfc-complaint.jsp -
ఫేస్‌బుక్‌తో మోసం.. రూ.3 కోట్లు నష్టం
టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే తెలుసుకున్నాం. అలాంటి మరో సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం నివాసితులైన నబనిత, మృణాల్ మిశ్రా ఫేస్బుక్లో ఏకంగా రూ.3.1 కోట్లు నష్టపోయారు. స్టాక్ ట్రేడింగ్‌లో పెట్టుబడి అంటూ ఈ దంపతులను మోసం చేసి.. సైబర్ నేరగాళ్లు జూలై, ఆగస్టు మధ్య కాలంలో వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు.నిజానికి నబానితా మిశ్రా ఫేస్బుక్లో ఒక ప్రకటన చూసి దానిపైన క్లిక్ చేసింది. ఆ తరువాత వ్యాపార సేవలను అందించడంలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న వాట్సాప్ గ్రూప్‌లో ఆమెను యాడ్ చేశారు. గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ రజత్ చోప్రా జీటీసీ అనే పోటీలో పాల్గొనమని సభ్యులను ప్రోత్సహించారు.ఇన్వెస్ట్మెంట్ సలహా కోసం మొదట నెలవారీ సబ్స్క్రిప్షన్ రూ. 2,000 చెల్లించానని.. ఆపై షేర్లు, ఐపిఓ ఇన్వెస్ట్మెంట్లకు కూడా బదిలీలు చేయాలని చెప్పారు. అప్పటికే వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులు తమ పెట్టుబడులపై లాభాలను అందుకున్నట్లు వివరించారు.ఐపీవో లావాదేవీలలో ఒకదాని కోసం కంపెనీ తనకు రూ. 80 లక్షలు అప్పుగా ఇచ్చిందని నబానితా మిశ్రా తెలిపారు. ఆమె తన ఖాతాను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ డబ్బును తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. అలా చేయడానికి ఆమె తన తండ్రి ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తాలను తనఖా పెట్టింది. ఆ తరువాత ఒక అకౌంట్ యాక్సెస్ చేయగలిగింది. కంపెనీ యాప్‌లో ఆమె పెట్టుబడులు, లాభాల వివరాలను చెక్ చేసుకోగలిగింది. కానీ డబ్బును మాత్రం విత్ డ్రా చేయలేకపోయింది. ఆ తరువాత ఆమెకు అనుమానం వచ్చిన వాట్సాప్ నెంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు అవన్నీ స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. -
చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ఆన్ లైన్ ఫ్రాడ్
-
చిత్తూరు జిల్లాలో 50 కోట్ల స్కాం..
-
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
ప్రముఖ నటుడి భార్య మోసపోయింది. తెలిసి తెలిసి లక్షల రూపాయలు పోగొట్టేసుకుంది. అయితే కొన్ని నెలల ముందు భర్త ఇలానే మోసపోగా.. ఇప్పుడు అతడి భార్యకు ఇలానే జరిగింది. అయితే తెలిసి మరీ ఇలా జరగడం నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు? అసలేం జరిగింది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)బాలీవుడ్లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్ బేడీ.. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీసుల్లోనూ యాక్ట్ చేశాడు. అయితే గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నాడు. రాకేశ్‌కి చెందిన ఫ్లాట్ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు.ఇప్పుడు నటుడు రాకేశ్ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్ కట్ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఈమె సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్) -
ఐపీఎల్ టికెట్ల పేరిట మోసం!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు వారి అభిమాన జట్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు అంటూ సరికొత్త మోసానికి తెరతీశారు. నకిలీ వెబ్సైట్లు, యాప్‌లు సృష్టించి ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కిన బెంగళూరుకు చెందిన మహిళ రూ.86 వేలు పోగొట్టుకున్నారు. మార్చి 29న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూసేందుకు సదరు మహిళ ఫేస్బుక్లో ‘ఐపీఎల్ క్రికెట్ టికెట్’ అనే అకౌంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరిట మోసగించే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఆ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఐపీఎల్ టికెట్లను బుక్ మైషోలో అధికారికంగా విక్రయిస్తున్నారు. అచ్చం బుక్ మై షో మాదిరిగానే సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి నట్టు పోలీసులు గుర్తించారు. బుక్‌మై షో తరహాలో దగ్గరగా ఉండే పేర్లతో వీటిని తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసగిస్తున్న ’book. myshow&premium.net', 'bookmyshow. cloud' అనే వెబ్సైట్లను పోలీసులు మూసివేయించారు. నకిలీ వెబ్సైట్లో ఎర్లీబర్డ్, స్పెషల్ డిస్కౌంట్, పది టికెట్లు కొంటే కొంత డిస్కౌంట్ ఇలా ఆఫర్లను పెడుతూ మోసగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ విధానంలోనే పేమెంట్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని కేసులలో సైబర్ నేరగాళ్లు టికెట్‌కు అయ్యే మొత్తంలో కొంత డబ్బులు ఆన్లైన్లో చెల్లించి బుక్ చేసుకోండి..తర్వాత స్టేడియం వద్ద మిగిలిన సొమ్ము చెల్లించి టికెట్లు పొందండి అంటూ బురిడీ కొట్టిస్తున్నట్టు తెలిపారు. ఆ వెబ్సైట్లలోనే కొనండి కేవలం అధికారిక వెబ్సైట్లలో మాత్రమే ఐపీఎల్ టికెట్లు కొనాలని, ఫేక్ వెబ్సైట్ల మోసాలకు గురి కా వొద్దని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ ఇంకా నడుస్తున్నందున టికెట్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టికెట్ కొనుగోలు చేసేందుకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, అది సైబర్ మోసంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. సైబర్ మో సాలపై సైబర్ క్రైం పోలీసులకు 1930 టోల్‌ఫ్రీ నంబర్లో లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పెద్ద సమస్యగా మారుతున్న USB ఛార్జర్ స్కామ్: నివారణ మార్గాలివే..
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో సైబర్ నేరగాళ్లకు ఏ చిన్న అవకాశం దొరికినా చేతివాటం చూపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అనేకరకాలైన సైబర్ స్కామ్‌లలో USB ఛార్జర్ స్కామ్ కూడా ఒకటి. ఇది నేడు పెద్ద సమస్యగా అవతరిస్తోంది. దీంతో విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు, బస్టాండ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ ఛార్జింగ్ పోర్టల్‌లను ఉపయోగించవద్దని కేంద్రం పౌరులను హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి విమానాశ్రయాలు, కేఫ్‌లు, హోటళ్లు మరియు బస్టాండ్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. USB స్టేషన్లలో పరికరాలను ఛార్జింగ్ చేయడం వలన వినియోగదారులు జ్యూస్-జాకింగ్ సైబర్ దాడులకు గురవుతారు. పబ్లిక్ ప్రదేశాల్లోని USB స్టేషన్లలో పరికరాలను ఛార్జింగ్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్లు అందులోని డేటాను దొంగలించవచ్చు. లేదా డివైజ్‌లలో మాల్వేర్ని ఇన్స్టాల్ చేయడం వంటివి చేస్తారు. ఇలా ఒకసారి చేసిన తరువాత వ్యక్తిగత సమాచారం దొంగలించి బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటికి పాల్పడతారు. దీని ద్వారా వినియోగదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సైబర్ దాడుల నుంచి తప్పించుకోవడం ఎలా? పబ్లిక్ ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేసిన USB ఛార్జింగ్ పోర్ట్‌లను ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. వ్యక్తిగత కేబుల్లు లేదా పవర్ బ్యాంక్‌లను మీ వద్ద ఉంచుకోవాలి తెలియని డివైజ్లతో ఏమాత్రం ఛార్జ్ చేసుకోకూడదు, డివైజ్‌లను ఎప్పుడూ లాక్ చేసి ఉంచాలి. మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోవడం ఉత్తమం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ మోసాలకు గురైతే.. సైబర్ క్రైమ్ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930కి కాల్ చేయాలి. Safety tip of the day: Beware of USB charger scam.#indiancert #cyberswachhtakendra #staysafeonline #cybersecurity #besafe #staysafe #mygov #Meity #onlinefraud #cybercrime #scam #cyberalert #CSK #cybersecurityawareness pic.twitter.com/FBIgqGiEnU — CERT-In (@IndianCERT) March 27, 2024 -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్‌లు, డిన్నర్లు అంటూ సోషల్‌మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్‌లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్‌లను ఈమెయిల్స్‌కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్‌టాప్‌లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్‌లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్‌ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్‌లు,ఈ మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
దేశం మొత్తం ఇవే స్కాములు, ‘పిగ్ బుచరింగ్’పై నితిన్ కామత్!
ప్రముఖ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ జిరోదా వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ సోషల్ మీడియా యూజర్లకు హెచ్చరికలు జారీ చేశారు.‘పిగ్ బుచరింగ్’ స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ పిగ్ బుచరింగ్ స్కామ్‌లు వందల నుంచి కోట్లలో జరుగుతున్నాయని ఎక్స్ (ట్వీట్టర్)లో పోస్ట్ చేశారు. పిగ్ బుచరింగ్ అంటే? పిగ్ బుచరింగ్ అనేది ఓ సైబర్ స్కామ్. ఆన్లైన్లో ఫేక్ మెసేజ్‌లు, యూజర్లను నమ్మించేలా ఫేక్ పేమెంట్లతో బురిడి కొట్టించి సొమ్ము చేసుకునే లాంటింది. ఈ కుంబకోణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కామత్ పలు జాగ్రత్తలు చెప్పారు. పిగ్ బుచర్స్ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసుకుంటారు. ఆన్లైన్లో యాక్టీవ్‌గా ఉండే యూజర్ల నమ్మకాన్ని గెలుచుకునేలా ఆ ఫేక్ ప్రొఫైల్‌తో ప్రేమ, ఫ్రెండ్షిప్ పేరుతో దగ్గరవుతారు. ఒక్కసారి యూజర్లు పిగ్ బుచర్స్‌ను నమ్మితే చాలు. ఇక వాళ్ల పని మొదలు పెడతారు.ఫేక్ జాబ్స్, అధికమొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాల్ని కల్పిస్తున్నామంటూ ఆశచూపిస్తారు. ఆపై యూజర్ల అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని దోచుకుంటారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని కామత్ చెప్పారు. ఇలాంటి వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని సలహా ఇచ్చారు. ఈ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే? ఈ తరహా సైబర్ స్కాములు ఏ స్థాయిలో ఉంటాయంటే.. సైబర్ నేరస్తుల చేతుల్లో మోసపోతున్నామని తెలియకుండా.. మరో స్కామ్‌లో ఇరుక్కుపోతారని కామత్ తన పోస్ట్‌లో చెప్పారు. ఎక్కువ మంది బాధితులు అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల ఉన్నాయంటూ ఫేక్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్‌ను నమ్మి మోసపోతున్నారని తెలిపారు. అంతేకాదు యూజర్లను నమ్మించేలా జెండర్ మార్చి మారుపేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగిస్తారని జిరోధా సీఈఓ చెప్పారు. మయన్మార్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఓ ఫేక్ కంపెనీ చేసిన పిగ్ బుచర్స్ స్కామ్‌లో 16 మంది భారతీయులు మోసపోయినట్లు వెలుగులోకి వచ్చిన కథనాల్ని సైతం షేర్ చేశారు. పిగ్ బుచర్స్‌తో అప్రమత్తం ►వాట్సప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, డేటింగ్ యాప్‌లలో అనుమానాస్పద మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వకూడదు ►ఎవరైనా మిమ్మల్ని కొత్త యాప్‌లను డౌన్లోడ్ చేయమని లేదా లింక్‌లను క్లిక్ చేయమని అడిగితే వెంటనే వాటిని డిలీట్ చేయండి, లేదంటే నెంబర్‌ను బ్లాక్ చేయండి. ► స్కామర్లు యూజర్ల ఆశలు, భయాలు, కలలు, దురాశ వంటి భావోద్వేగాలతో ఆడుకుంటారు. ఎప్పుడూ తొందరపడి స్పందించొద్దు ► భయపడవద్దు. తొందర పడి తీసుకునే నిర్ణయాలతో ఇబ్బందులకు గురవుతుంటారు. ►అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, లాయర్లను సంప్రదించండి. ►ఎవరైనా ఉద్యోగం లేదా అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకునే అవకాశాలున్నాయని, ఇందుకోసం డబ్బులు కట్టాలని అడిగితే అది మోసంగా భావించాలి. ►ఆధార్, పాస్‌పోర్ట్ వంటి వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి వివరాలు ఇతర ఆర్ధిక పరమైన విషయాల్ని ఎవరితో పంచుకోవద్దని జిరోధా సీఈవో నిఖిల్ కామ్ యూజర్లను కోరారు. -
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
మంగళగిరిలో ‘ఐపీజీ’ బాధితులు 700 మందికిపైనే!
మంగళగిరి: సైబర్ మోసగాళ్ల ఐపీజీ రెంట్ యాప్ ఉచ్చులో మంగళగిరికి చెందిన 700 మందికిపైగా చిక్కి విలవిల్లాడుతున్నారు. పెట్టుబడికి వారం రోజుల్లో రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపడంతో వీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. వీరు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు రెండురోజుల కిందట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. ప్రారంభంలో ఒకరిద్దరుగా ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు తిరిగి ఇచ్చిన యాప్ నిర్వాహకులు తరువాత క్రమంగా చెల్లింపులు నిలిపేశారు. నిదానంగా ముఖం చాటేసిన నిర్వాహకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా యాప్‌లోను సమాధానం చెప్పకపోవడం, ఐపీజీ రెంట్ కామ్ యాప్‌ను సైతం మూసేయడంతో పెట్టుబడిదారులు మోసపోయామని గ్రహించారు. తొలుత కిషోర్‌కు అతడి స్నేహతుడు ఐపీజీ యాప్ లింక్ పంపారు. తన స్నేహితులు చాలామంది ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారని, మంచి ఆదాయం వస్తుందని అతడు చెప్పడంతో కిషోర్ ఆ యాప్‌లో నమోదు చేసుకున్నారు. మొదట రూ.800 పెట్టుబడి పెట్టగా వారానికి రూ.1,600 ఆదాయం వచ్చింది. రెండుమూడుసార్లు పెట్టుబడికి రెట్టింపు ఆదాయం రావడంతో కిషోర్ తన స్నేహితులకు యాప్ లింక్ పంపి రెట్టింపు ఆదాయం గురించి చెప్పారు. కిషోర్ స్నేహితులు, బంధువులతోపాటు చైన్‌లింక్‌గా మారి ఒక్క మంగళగిరిలోనే 700 మందికిపైగా ఈ యాప్‌లో నమోదు చేసుకున్నారు. రూ.800, రూ.1,200 నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు.. ఇలా శక్తిమేర పెట్టుబడులు పెట్టారు. మార్చి నెలాఖరు కావడంతో యాప్ ఆఫర్ ప్రకటించిందని చెప్పి రూ.30 వేలు పెట్టుబడి పెట్టినవారికి అదనంగా ఆదాయంతోపాటు వారం రోజులకు వడ్డీ రూ.27 వేలు కలిపి రూ.80 వేలు వస్తాయని ఆశచూపారు. దీంతో పలువురు ఎక్కువ సొమ్ము యాప్‌లో పెట్టుబడి పెట్టారు. బాధితుల్లో అత్యధికంగా మహిళలున్నారు. వారం రోజుల తర్వాత మోసగాళ్లు యాప్‌ను మూసేయడంతో కిషోర్ ఆన్లైన్లో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. మరికొందరు బాధితులతో కలిసి ఈ నెల 7వ తేదీన పట్టణ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తమకు ఫిర్యాదు చేసినట్లు పట్టణ సీఐ బి.అంకమ్మరావు చెప్పారు. సైబర్ క్రైమ్ కావడంతో దర్యాప్తు చేయాల్సిందిగా సైబర్ క్రైమ్‌కు అప్పగించామని తెలిపారు. -
కొలువని చెప్పి.. స్కాం కేఫ్‌లో ఖైదు చేసి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు ఉపాధి పేరుతో వెళ్లి కంబోడియా సైబర్ స్కాం గ్యాంగ్ చేతిలో చిక్కుకున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి వెళ్లి.. క్రిప్టోకరెన్సీ, క్రెడిట్‌కార్డ్, హనీట్రాప్ పనులు చేయిస్తుండటంతో ఆందోళనలో పడ్డారు. ఆ పనులు చేయలేక, చేయబోమంటే వారు పెడుతున్న చిత్ర హింసలు భరించలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? కరీంనగర్‌లోని గాంధీరోడ్ చౌరస్తా సమీపంలో ఓ కన్సల్టెన్సీ ఉంది. కంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని, మంచి జీతం వస్తుందని కన్సల్టెన్సీ నిర్వాహకుడు స్థానిక ముస్లిం యువకులకు చెప్పాడు. దీనితో కొందరు యువకులు రూ.2 లక్షల చొప్పున అతడికి చెల్లించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఈ ఏడాది ఆగస్టు చివర్లో, సెప్టెంబరు మొదటివారంలో ఆరుగురు యువకులను కంబోడియాకు పంపాడు. అక్కడికెళ్లాక ఓ కంపెనీ వాళ్లు ఆ యువకులను చుట్టూ ఎత్తయిన గోడలు, విద్యుత్ కంచె లు, సాయుధ పహారాతో ఉన్న ఓ టౌన్‌షిప్‌కు తీసుకెళ్లారు. అమెరికా, యూరప్ వాసుల నంబర్లు ఇచ్చి.. వారిని వాట్సా ప్ ద్వారా సంప్రదించి క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే బాగా డబ్బులు వస్తాయంటూ ఒప్పించాలని చెప్పారు. ఆ పని చేయలేమంటే.. పాస్‌పోర్టులు ఇవ్వబోమని, జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని యువకులు వాపోతున్నారు. నేరాలు ఇలా చేయిస్తూ.. కరీంనగర్‌కు చెందిన బాధిత యువకుడు షాబాజ్‌ఖాన్ చెప్పిన వివరాల మేరకు.. ఈ యువకులు అమెరికా, యూరోపియన్ కస్టమర్లను వాట్సాప్‌లో, ఫోన్లలో సంప్రదించాలి. సాఫ్ట్వేర్ సాయంతో మహిళల్లా గొంతు మార్చి మాట కలపాలి. బాగా డబ్బులు వస్తాయని మెల్లగా వారిని ఒప్పించి ఓ క్రిప్టోకరెన్సీ యాప్‌లో కనీసం 100 డాలర్లు పెట్టుబడి పెట్టించాలి. రెండు, మూడు రోజుల్లో.. లాభం వచ్చి ఆ సొమ్ము 1000 డాలర్లకు పెరిగినట్టు చూపిస్తుంది. ఇది చెప్పి.. వారిని మరింత ఆశపెట్టి భారీగా డబ్బు పెట్టుబడి పెట్టించాలి. తర్వాత ఫోన్ స్విచాఫ్. ఆ సొమ్మంతా ఈ సైబర్ నేర గ్యాంగ్ కాజేస్తుంది. తర్వాత మరొకరికి గాలం వేయాలి. తమకు రోజూ ఇదే పని అని షాబాజ్‌ఖాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విలపిస్తూ చెప్పాడు. తనను వదిలేయాలంటే 3,000 డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.2.4 లక్షలు) చెల్లించాలని, లేదా తనకు బదులు మరో యువకుడిని అక్కడికి పిలిపించాలని ముఠా సభ్యులు తేల్చిచెబుతున్నారని వివరించాడు. తనతోపాటు సిరిసిల్ల, చింతకుంట, వేములవాడ, మానకొండూరుకు చెందిన యువకులు కూడా బందీగా ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం తమను కాపాడాలని వేడుకున్నాడు. అయితే వారిని ఫోన్లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. అక్కడి ప్రజాప్రతినిధుల అండదండలతోనే.. కాంబోడియాలో సైబర్ మాఫియా ముఠాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని.. మాఫియా నిర్వాహకుల్లో కొందరు అక్కడ ప్రజాప్రతినిధులు కూడా అని ప్రచారం ఉంది. ఆ ముఠాలు క్యాసినోలు, సైబర్ స్కాం కేఫ్‌లు నిర్వహిస్తూ డబ్బులు దండుకుంటుంటాయి. స్థానికులు తిరగబడే అవకాశం ఉంటుందని.. మలేసియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారత్ తదితర దేశాల నుంచి యువతీ యువకులను ఉద్యోగాల పేరిట వల వేసి రప్పించుకుంటాయి. సైబర్ నేరాల్లో శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటాయి. ఇచ్చిన టార్గెట్ చేరకపోతే కొట్టడం, కరెంటు షాక్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటాయి. చిత్ర హింసలు భరించలేని విదేశీయులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు, అక్కడి అకృత్యాలపై ఇంటర్నెట్లోనూ వార్తలు ఉన్నాయి. బాధితులు ముందుకురావాలి కంబోడియాలో చిక్కుకున్న యువకుల గురించి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఫిర్యాదు చేస్తే న్యాయం చేకూర్చేందుకు ప్రయత్నిస్తాం. – సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్‌గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్‌లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్‌లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్‌లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్‌ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్‌ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్‌లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్‌లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్‌లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్‌కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్‌కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్‌లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్‌లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్‌షాప్‌ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్‌లో లేని యాప్‌లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్‌లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
ఆదమరిచి క్లిక్ చేస్తే.. బ్లాక్ మెయిల్ చేసి..
బనశంకరి: స్మార్ట్ ఫోన్ వినియోగదారులనే టార్గెట్‌గా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఎస్కార్ట్స్, లోకాంటో వెబ్ లింక్‌లు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట మొబైల్ ఫోన్‌కు మోసపూరిత వెబ్సైట్ లింక్ తో కూడిన మెసేజ్ పంపిస్తారు. లేదా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం లో పరిచయం పెంచుకుని మొబైల్ నంబర్లను సేకరించి పలు రకాల ప్రలోభాలతో ఊరిస్తారు. వారు పంపిన లింక్‌పై క్లిక్ చేయమంటారు. క్లిక్ చేస్తే చాలు.. వీడియో కాల్లో నగ్న దృశ్యాలు కనిపించి క్షణాల్లో రికార్డు, స్క్రీన్ షాట్లను తీసుకుంటారు. మరో పక్క బాధితుని బంధుమిత్రుల ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు, ఫోన్‌నంబర్లనూ సేకరిస్తారు. వారికి మీ చిత్రాలను, వీడియోలను ట్యాగ్‌చేస్తామని, వాట్సప్‌కు పంపుతామని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ రకంగా పెద్దమొత్తంలో డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు తరచూ బెంగళూరు నగర సీఇఎన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అపరిచిత వీడియో కాల్స్‌కు, వెబ్ లింక్‌లకు స్పందించరాదని పోలీసులు సలహా ఇచ్చారు. -
రూ.1,130 కోట్ల ‘సైబర్ స్కామ్’!
బ్రిటన్ కేంద్రంగా పాక్‌కు చెందిన ఫిజాన్ నేతృత్వంలో దందా కీలకపాత్ర పోషించిన పలువురు ‘తెలుగువారు’ శిక్షపడ్డాక తప్పించుకువచ్చిన కరీంనగర్ జిల్లా వాసి దర్యాప్తు దశలోనే పారిపోయిన ఖమ్మం జిల్లా వ్యక్తి ఇంటర్‌పోల్ సాయంతో భారత్‌కు లండన్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తి లండన్ కేంద్రంగా భారీ ‘సైబర్ స్కామ్’కు పాల్పడ్డాడు. పదుల సంఖ్యలో ముఠా సభ్యుల్ని ఏర్పాటు చేసుకుని వివిధ బ్యాంకులకు చెందిన కస్టమర్ల నుంచి రూ.1,130 కోట్లు(113 మిలియన్ పౌండ్లు) కాజేశాడు. ఈ ఘరానా మోసానికి పాల్పడ్డ అంతర్జాతీయ ముఠాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. కరీంనగర్ వాసి ముఠా నాయకుడికి కుడి భుజంగా వ్యవహరిస్తే.. ఖమ్మం, రాజమండ్రి యువకులు ‘మనీ మ్యూల్స్’ను ఏర్పాటు చేసే పని చేశారు. సొలిసిటరీ ఖాతాలే టార్గెట్... పాక్‌కు చెందిన ఫిజాన్ హమీద్ చౌదరి బ్రిటన్‌లో 20 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వివిధ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు ఎరవేసి ఏజెంట్లుగా మార్చుకున్నాడు. వీరి ద్వారానే ఆయా బ్యాంకు కస్టమర్లుగా ఉన్న సొలిసిటర్ కంపెనీ(న్యాయవాదులు)ల లావాదేవీలు, కాంటాక్ట్ నంబర్లు తెలుసుకునే వాడు. లండన్‌లో స్థిరాస్తి కొనుగోళ్లన్నీ సొలిసిటరీ కంపెనీల ద్వారానే జరుగుతాయి. ఓ ఆస్తిని విక్రయిస్తున్న వ్యక్తి, ఖరీదు చేస్తున్న వ్యక్తి.. తరఫునా ఈ సొలిసిటర్లు ఉంటారు. వారు ఆస్తి పూర్వాపరాలు పరిశీలించి ఖరీదు ఖరారు చేస్తారు. ఆపై ఆస్తిని ఖరీదు చేస్తున్న వ్యక్తి ఆ మొత్తాన్ని తన సొలిసిటర్ కంపెనీ ఖాతాలో జమ చేస్తారు. ఈ నగదు కంపెనీ ద్వారానే ఆస్తిని విక్రయించే వ్యక్తి సొలిసిటరీ కంపెనీ ఖాతాలోకి వెళ్తుంది. బ్రిటన్‌లో బ్యాంకు రుణంపై వడ్డీ రేట్లు తక్కువ కావడంతో ప్రతి ఒక్కరూ రుణంపైనే ఆస్తులు కొంటారు. బ్యాంకు రుణాలు సైతం సొలిసిటరీ కంపెనీ ఖాతాల్లోకే వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఫిజాన్ గ్యాంగ్ ఈ ఖాతాలను టార్గెట్ చేసుకుంది. బ్యాంకు డేటాతో... సొలిసిటరీ కంపెనీల ఖాతాల వివరాలు, కాంటాక్ట్ నంబర్లు సేకరించే ఫిజాన్.. గ్యాంగ్ మెంబర్ల ద్వారా ఆయా కంపెనీలకు ఫోన్లు చేయించేవాడు. ఇంటర్నెట్ ఆధారంగా స్ఫూఫింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ కాల్స్ చేయడంతో రిసీవ్ చేసుకునే వ్యక్తికి సదరు బ్యాంకు నంబరే డిస్ప్లే అయ్యేది. సదరు కంపెనీ చేసిన రెండు లావాదేవీలను చెప్పి వారికి నమ్మకం కలిగించే వారు. ఆపై వారు చేయని లావాదేవీ ఒకటి చెప్పి, పేమెంట్ ప్రాసెసింగ్‌లో ఉందని సదరు లావాదేవీ మీరే చేశారా? అని అడిగే వారు. దీంతో కంపెనీ వారు ఆ లావాదేవీతో తమకు సంబంధం లేదని చెప్పగా.. దాన్ని రద్దు చేయడానికని ఓ కోడ్ నంబర్ చెప్పేవారు. బ్యాంక్ ఫ్రాడ్స వింగ్‌కు కాల్ చేసి ఈ నంబర్ చెప్పాలని, ఆపై వారు చెప్పిన విధంగా చేస్తే సదరు లావాదేవీ క్యాన్సిల్ అవుతుందని నమ్మబలికేవారు. పరారీలో తెలుగు రాష్ట్రాల వ్యక్తులు ఈ పంథాలో ఫిజాన్ ముఠా కొన్ని నెలల్లోనే 750 కంపెనీల నుంచి రూ.1,130 కోట్ల వరకు స్వాహా చేసింది. లండన్ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ స్కామ్‌గా రికార్డుకెక్కిన ఈ కేసును స్కాట్‌ల్యాండ్ యార్డ్, యూకే మెట్రోపాలిటన్ పోలీసులు గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఛేదించారు. ఫిజాన్తో పాటు లండన్‌లోని అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారిని పట్టుకున్నారు. గత నెల్లో అక్కడి న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్థారించింది. అయితే దర్యాప్తు నుంచి దోషిగా తేలే వరకు వివిధ దశల్లో ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు పారిపోయి వచ్చారు. వీరి కోసం గాలిస్తున్న అక్కడి పోలీసులు ఇంటర్‌పోల్ సాయంతో ఓ ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్ పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. రద్దు చేస్తామంటూ అన్నీ తెలుసుకుని... సైబర్ నేరగాళ్లు వినియోగించే ప్రత్యేక పరిజ్ఞానం కారణంగా వాళ్లు ఫోన్ పెట్టేసినా.. కాల్ కనెక్టయ్యే ఉండేది. దీంతో సొలిసిటరీ కంపెనీ వాళ్లు బ్యాంక్ ఫ్రాడ్ వింగ్‌తో పాటు ఎవరికి కాల్ చేసినా.. అది నేరగాళ్లకే చేరేది. అలా కాల్‌ను రిసీవ్ చేసుకునే సైబర్ నేరగాళ్లు బ్యాంకు అధికారుల మాదిరిగా మాట్లాడేవారు. లావాదేవీ క్యాన్సిల్ చేయడానికి అవసరమంటూ వినియోగదారుడి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు కస్టమర్ నుంచే కార్డ్ రీడర్ జనరేటెడ్ కోడ్ సైతం తీసుకుని నిమిషాల్లో వారి ఖాతాలు ఖాళీ చేసేవారు. ఈ నిధుల్ని ‘మనీ మ్యూల్స్’ ఖాతాల్లోకి మళ్లించి తక్షణం డ్రా చేయించేవారు. కమీషన్ తీసుకుని తమ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించే వారిని మనీ మ్యూల్స్ అంటారు. మనీ మ్యూల్స్‌ను ఏర్పాటు చేసిన వారిలో కరీంనగర్, ఖమ్మంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన వారూ ఉన్నారు. వీరిని ఏర్పాటు చేసే బాధ్యతల్ని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తే ఎక్కువగా నెరిపేవాడు.