తక్కువ ధరకే ఇస్తామంటూ దగా
నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లలో టికెట్లు విక్రయిస్తున్నట్లుగా సైబర్ నేరగాళ్ల ప్రకటనలు
అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు కొనండి: తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులు వారి అభిమాన జట్ల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు అమిత ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు తక్కువ ధరకే ఐపీఎల్ టికెట్లు అంటూ సరికొత్త మోసానికి తెరతీశారు. నకిలీ వెబ్‌సైట్‌లు, యాప్‌లు సృష్టించి ప్రకటనలు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ల మోసానికి చిక్కిన బెంగళూరుకు చెందిన మహిళ రూ.86 వేలు పోగొట్టుకున్నారు.
మార్చి 29న జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చూసేందుకు సదరు మహిళ ఫేస్‌బుక్‌లో ‘ఐపీఎల్ క్రికెట్ టికెట్’ అనే అకౌంట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించగా సైబర్ నేరగాళ్లు మోసగించారు. సైబర్ నేరగాళ్లు ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరిట మోసగించే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు.
ఆ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఐపీఎల్ టికెట్లను బుక్ మైషోలో అధికారికంగా విక్రయిస్తున్నారు. అచ్చం బుక్ మై షో మాదిరిగానే సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి నట్టు పోలీసులు గుర్తించారు. బుక్‌మై షో తరహాలో దగ్గరగా ఉండే పేర్లతో వీటిని తయారు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదే తరహాలో మోసగిస్తున్న ’book. myshow&premium.net', 'bookmyshow. cloud' అనే వెబ్‌సైట్లను పోలీసులు మూసివేయించారు. నకిలీ వెబ్‌సైట్‌లో ఎర్లీబర్డ్, స్పెషల్ డిస్కౌంట్, పది టికెట్లు కొంటే కొంత డిస్కౌంట్ ఇలా ఆఫర్లను పెడుతూ మోసగిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యూపీఐ విధానంలోనే పేమెంట్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. మరికొన్ని కేసులలో సైబర్ నేరగాళ్లు టికెట్‌కు అయ్యే మొత్తంలో కొంత డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించి బుక్ చేసుకోండి..తర్వాత స్టేడియం వద్ద మిగిలిన సొమ్ము చెల్లించి టికెట్లు పొందండి అంటూ బురిడీ కొట్టిస్తున్నట్టు తెలిపారు.
ఆ వెబ్‌సైట్‌లలోనే కొనండి
కేవలం అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే ఐపీఎల్ టికెట్లు కొనాలని, ఫేక్ వెబ్‌సైట్ల మోసాలకు గురి కా వొద్దని తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ ఇంకా నడుస్తున్నందున టికెట్ల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టికెట్ కొనుగోలు చేసేందుకు వ్యక్తిగత, బ్యాంకు ఖాతా, ఏటీఎం, క్రెడిట్ కార్డు నంబర్లు, పిన్ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవద్దని, అది సైబర్ మోసంగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. సైబర్ మో సాలపై సైబర్ క్రైం పోలీసులకు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌లో లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment