బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు | Cyber Scams: Do Not Give Bank Personal Details To Anyone | Sakshi
Sakshi News home page

బ్యాంకు ఖాతా ఇచ్చారో.. కరుసైపోతారు

Published Sun, Jan 19 2025 8:58 PM | Last Updated on Sun, Jan 19 2025 9:00 PM

Cyber Scams: Do Not Give Bank Personal Details To Anyone
  • అమాయకులకు కమీషన్ల వలవేసి వారి వివరాలతో సైబర్‌ నేరస్తుల ‘మ్యూల్‌’ బ్యాంకు అకౌంట్లు సైబర్‌ నేరగాళ్ల చేతిలో 
  • దేశవ్యాప్తంగా 5 లక్షల వరకు ఇలాంటి ఖాతాలే
  • తమ వివరాలు బయటపడకుండా డబ్బు విదేశాలకు మళ్లిస్తున్న సైబర్‌ ముఠాలు 
  • ప్రతి సైబర్‌ మోసంలో కనీసం ఐదు మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలు వాడుతున్నట్టు చెబుతున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: కంటికి కనిపించకుండా ఎక్కడో కూర్చుని మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లు.. కొట్టేసిన సొమ్మును తమ వద్దకు చేర్చుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వాడుతున్నారు. తమ చేతికి నేరం అంటుకోకుండా కమీషన్ల ఆశజూపి అమాయకులనే చివరకు బలి చేస్తున్నారు. ‘మ్యూల్‌’బ్యాంకు ఖాతాలతో మొత్తంగా ముంచేస్తున్నారు. ఒకటి కాదు...రెండు కాదు..దేశవ్యాప్తంగా ఐదు లక్షల మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతాలు సైబర్‌ నేరగాళ్ల చేతిలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) 2024లో మొత్తం 1.14 లక్షల సైబర్‌ నేరాలు నమోదు చేయగా..ఈ కేసులలో ప్రతి కేసులో కనీసం ఐదు మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు వినియోగించినట్టు తెలిపారు.  

aఅమాయకుల నుంచి వివిధ మోసపూరిత విధానాల్లో కొల్లగొట్టిన సొమ్మును పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సైబర్‌ నేరగాళ్లు వీటిని వెంటవెంటనే పలు బ్యాంకు ఖాతాల్లోకి (మ్యూల్‌ ఖాతాల్లోకి) బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు కొట్టేసిన సొమ్ము ఎక్కువ మొత్తంలో ఉంటే ఎక్కువ బ్యాంకు ఖాతాల్లోకి చిన్నచిన్న మొత్తాలుగా చేసి బదిలీ చేస్తున్నారు. కొన్నిసార్లు వందల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దర్యాప్తు అధికారులు ఆ సొమ్మును గుర్తించడం..తిరిగి ఫ్రీజ్‌ చేయడం సవాల్‌గా మారుతోంది. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన సొమ్మును చివరగా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంత రూటు మార్చిన సైబర్‌ కేటుగాళ్లు కొన్ని బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన తర్వాత వెంటనే వాటిని నగదు రూపంలో విత్‌డ్రా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని మధ్యవర్తుల ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి విదేశాలకు పంపుతున్నారు. ఇటీవలే తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఈ తరహా ముఠాలోని 21 మందిని 2024 డిసెంబర్‌ 24న అరెస్టు చేశారు.  

బ్యాంకుల సమన్వయంతోనే కట్టడి సాధ్యం..  

మ్యూల్‌ బ్యాంకు ఖాతాల బెడద తగ్గించడంలో బ్యాంకు అధికారులది కీలకపాత్ర అని పోలీసులు చెబుతున్నారు. ఏదైనా బ్యాంకు ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్టుగా గుర్తిస్తే అలాంటి బ్యాంకు ఖాతాలకు రెడ్‌ప్లాగ్‌ పెట్టుకుని, వెనువెంటనే దర్యాప్తు సంస్థలకు తెలియజేస్తే ఫలితం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నారు. ఉదాహరణకు ఒక బ్యాంకు ఖాతాదారుడి అకౌంట్‌లో అకస్మాత్తుగా లక్షల రూపాయలు జమ అవుతుండటం..అదేరీతిలో లక్షల్లో డబ్బులు ఇతర ఖాతాల్లోకి మళ్లిస్తున్నట్టు గుర్తిస్తే అలాంటివి మ్యూల్‌ బ్యాంకు ఖాతాలుగా గుర్తించాలని వారు పేర్కొంటున్నారు. కానీ వాస్తవానికి ఈ సమన్వయం లోపిస్తోంది. బ్యాంకుల సాధారణ ప్రక్రియలో భాగంగా ఇలాంటి రెడ్‌ఫ్లాగ్‌ ఖాతాల (అనుమానాస్పద లావాదేవీలు గుర్తించిన ఖాతాలు) వివరాలు ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)కు చేరవేస్తాయి. కొన్ని నెలల తర్వాత సంబంధిత పోలీసులకు ఆ సమాచారం చేరుతుంది. ఈలోగా సైబర్‌ నేరగాళ్లు నిధులను విదేశాలకు మళ్లించడం పూర్తి చేస్తుండటంతో ఆ సమాచారం పోలీసులకు నిరుపయోగంగా మారుతోంది.  

మ్యూల్‌ బ్యాంకు ఖాతా అంటే..? 
ఒకరి వివరాలతో ఉన్న బ్యాంకు ఖాతాను నేరపూరిత లావాదేవీలకు ఇతరులు వినియోగిస్తే (నిజమైన ఖాతాదారుడికి తెలిసి ఇది జరగవచ్చు.. తెలియకుండా కూడా జరగొచ్చు) ఇలాంటి బ్యాంకు ఖాతాను మ్యూల్‌ బ్యాంక్‌ అకౌంట్‌గా చెబుతారు. కొందరు నెలవారీ కమీషన్లకు ఆశపడి తమ అధికారిక ధ్రువపత్రాలు ఉపయోగించి తెరచిన బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగిస్తున్నారు. ఇలాంటి బ్యాంకు ఖాతాల్లో ఎవరి నుంచి డబ్బులు జమ అవుతున్నాయి. అవి మళ్లీ ఎక్కడికి బదిలీ అవుతున్నాయన్న వివరాలు ఖాతాదారుడికి తెలిసే అవకాశం కూడా ఉండదు.  

మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు ఇలా తెరిపిస్తారు..  
సులువుగా డబ్బులు సంపాదించవచ్చని ఆశజూపి అమాయకులకు వల వేస్తారు.  
వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచేలా ఒప్పిస్తారు.  
ఆ తర్వాత నిజమైన బ్యాంకు ఖాతాదారుడి నుంచి బ్యాంకు పాస్‌బుక్, డెబిట్‌ కార్డులు, పాస్‌వర్డ్‌లు మోసగాళ్లు తమ ఏజెంట్ల ద్వారా ఆ బ్యాంకు ఖాతాలు పూర్తిగా తమ ఆ«దీనంలోకి తీసుకుంటారు.  
సైబర్‌ మోసాల్లో కొల్లగొట్టే సొమ్మును ఈ బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం..తర్వాత ఇతర ఖాతాల్లోకి మళ్లించడం వంటి లావాదేవీలు చేస్తుంటారు.  

ఖాతాదారులకు సూచనలు..  
ఇతరులు నెలవారీ కమీషన్‌ ఇస్తామంటే ఆశపడి మీ బ్యాంకు ఖాతాను ఇతరులకు ఇవ్వొద్దు.  
మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడుతుంది.  
మీరు మళ్లీ కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  
మీ పేరిట ఉన్న మ్యూల్‌ బ్యాంక్‌ ఖాతా నేరస్తులు అక్రమ నిధుల బదిలీకి, లేదా మనీలాండరింగ్‌ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉన్నందున చట్టపరంగా అసలు ఖాతాదారులకు శిక్ష తప్పదు.  

ప్రధానంగా మ్యూల్‌ బ్యాంకు ఖాతాల బాధితులు వీరే..
సోషల్‌ మీడియాలో ప్రకటనల ద్వారా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగులు ఈ ఉచ్చులో చిక్కుతున్నారు.  
వివరాలు ఇస్తే నెలకు కొంత కమీషన్‌ వస్తుందని ఆశపడి నిరుద్యోగ యువత వారి వివరాలతో బ్యాంకు ఖాతాలు తెరిచి మ్యూల్‌ ఖాతాలుగా వాడేందుకు ఇస్తున్నారు.  
ఆర్థిక అవసరాలు ఆసరాగా చేసుకుని, నేరస్తులు కమీషన్లు ఆశజూపి రైతులను ఈ ఉచ్చులో దింపుతున్నారు.  
పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ప్రకారం..జిమ్‌ ట్రైనర్లు, టైలర్లు, ప్రైవేటు కాంట్రాక్టర్లు, హోటల్స్‌ నిర్వాహకులు ఇలా పలువురు మ్యూల్‌ ఖాతాల బాధితులే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement