
ఆన్‌లైన్ మోసాల్లో పట్టుబడిన క్రిప్టో కరెన్సీ సీజ్
దోపిడీ సొమ్ము దేశం దాటకుండా కొత్త ఉపాయం
సీజ్ చేస్తున్న పోలీసులు, వివిధ దర్యాప్తు ఏజెన్సీలు
ఈ ప్రక్రియ పెద్ద ప్రహసనమే అంటున్న అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో సీజింగ్
సాక్షి, హైదరాబాద్: నగలు, నగదు, వస్తువులు, వాహనాల సీజింగ్.. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్, ఆస్తుల అటాచ్‌మెంట్.. ఇవన్నీ పోలీసులకు సుపరిచితమే. వీటిలోకి ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా వచ్చి చేరింది. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు దోచిన సొమ్మును దేశం దాటించేందుకు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు. ఈ నేపథ్యంలో నేరస్తులు పట్టుబడితే వారి నుంచి ఆ క్రిప్టో కరెన్సీని పోలీసులు రికవరీ చేస్తున్నారు. అయితే, క్రిప్టో సీజింగ్ కొత్త కావడంతో పెద్ద ప్రహసనంగా మారింది.
పెరుగుతున్న క్రిప్టో సీజింగ్
గెయిన్ బిట్ కాయిన్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న సీబీఐ గత బుధవారం ఐదు రాష్ట్రాల్లో దాడులు చేసి రూ.23.94 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసింది. గోల్డ్ కాస్ట్ సోలార్ స్కామ్‌లో ఢిల్లీ పోలీసులు గత ఏడాది అక్టోబర్‌లో రూ.80 లక్షల విలువైన క్రిప్టోను సీజ్ చేశారు. రూ.2.06 కోట్లతో ముడిపడిన ట్రేడింగ్ ఫ్రాడ్ కేసును ఛేదించి హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరి 29న రూ.40 లక్షల విలువైన బిట్ కాయిన్లు సీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇదే తొలి అధికారిక క్రిప్టో కరెన్సీ/బిట్ కాయిన్ సీజింగ్. సైబర్ నేరాలతో బిట్ కాయిన్స్‌కు విడదీయరాని బంధం ఉన్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం అత్యవసరంగా మారింది.
క్రిప్టో రూపంలో దేశం దాటుతున్న మోసం సొమ్ము
ప్రస్తుతం యాప్‌ల ఆధారంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో చాలావరకు చైనీయులే సూత్రధారులుగా ఉంటున్నారు. నేపాల్, చైనా, ఇండోనేసి యా, దుబాయ్ తదితర దేశాల్లో కూర్చుని, ఇక్కడ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని దందా చేస్తున్నారు. ఏజెంట్ల కమీ షన్ పోగా మిగిలిన దోపిడీ సొమ్ము విదేశా ల్లోని ఆ సూత్రధారులకు చేరాల్సిందే.
ఒకప్పుడు ఈ లావాదేవీలన్నీ హవాలా రూపంలో జరిగేవి. కొన్ని దేశాలకు హవాలా కష్టసాధ్యం కావడంతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సూత్రధారులు క్రిప్టో కరెన్సీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడి పాత్రధారుల ఖాతాల్లోకి నగదు వెళ్లిన తర్వాత దాన్ని బిట్ కాయిన్ రూపంలోకి మార్చి తమ వద్దకు వచ్చేలా చేసుకుంటున్నారు.
క్రిప్టో వాలెట్స్‌లో రెండు రకాలు
గూగుల్ ప్లేస్టోర్స్, యాపిల్ యాప్ స్టోర్స్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక యాప్స్ ఉన్నాయి. వాలెట్స్‌గా పిలిచే వీటిని డౌన్‌లోడ్ చేసుకుని, బ్యాంకు ఖాతాకు అనుసంధానించుకోవడం ద్వారా క్రిప్టో కరెన్సీ క్రయవిక్రయాలు చేయవచ్చు. ఈ వాలెట్స్‌లో బినాన్స్, కాయిన్ బేస్ వంటి కస్టోడియన్ వాలెట్స్‌తో పాటు సేఫ్ పాల్, ట్రస్ట్ వంటి నాన్ కస్టోడియన్ వాలెట్స్ ఉంటాయి.
కేంద్ర ఆర్థిక శాఖ అదీనంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) అనుమతి తీసుకుని నడిచేవి కస్టోడియన్ వాలెట్స్. అనుమతి లేకుండా నడిచేవి నాన్ కస్టోడియన్ కిందికి వస్తాయి. కస్టోడియన్ వాలెట్స్ ఆపరేట్ చేయడానికి వినియోగదారుడి నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాల నమోదు, వర్చువల్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఇలా చేస్తే పోలీసుల దర్యాప్తులో తమ ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నాన్ కస్టోడియన్ వాలెట్స్ వాడుతున్నారు. 12 వర్డ్ పాస్ ఫేజ్ నమూనా
అంకెలు, అక్షరాల సమాహారమే
బిట్ కాయిన్‌గా పిలిచే క్రిప్టో కరెన్సీ 25 నుంచి 50 అంకెలు, అక్షరాలతో కూడిన వాలెట్ అడ్రస్ రూపంలో ఉంటుంది. కేవలం ఈ వాలెట్ అడ్రస్ ఆధారంగా క్రిప్టో కరెన్సీ ఏ వాలెట్‌లో ఉందో గుర్తించడం సాధ్యం కాదు. నిందితుల ఫోన్‌లో ఆ వాలెట్ ఉండి, అందులో వాలెట్ అడ్రస్ దొరికితేనే ఆ కరెన్సీ, దాని విలువ తెలుస్తుంది. వాలెట్ ఉన్న ఫోన్‌ను సీజ్ చేసినంత మాత్రాన క్రిప్టో కరెన్సీని సీజ్ చేసినట్లు కాదు. ఓ వినియోగదారుడు క్రిప్టో కరెన్సీ వాలెట్ అడ్రస్‌ను పోగొట్టుకుంటే దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి రెండు పద్ధతులు ఉంటాయి.
కస్టోడియన్ వాలెట్స్‌లో క్రిప్టో కరెన్సీని కేవైసీ ద్వారా, నాన్ కస్టోడియన్ వాలెట్స్‌లో 12 పదాలతో కూడిన ‘12 వర్డ్ పాస్ ఫేజ్’, ఎంపిక చేసుకున్న ప్రశ్నలు–సమాధానాల ద్వారా రిట్రైవ్ చేసుకోవాలి. ఈ విధానంలో సదరు నాన్ కస్టోడియన్ వాలెట్ 12 పదాలను ఓ వరుస క్రమంలో చూపిస్తుంది. దాన్ని రాసుకుని, రహస్యంగా దాచుకునే వినియోగదారుడు.. అవసరమైనప్పుడు క్రిప్టో కరెన్సీ రిట్రైవ్ చేసుకోవడానికి వినియోగిస్తాడు. ఈ పాస్ ఫేజ్ ఎవరి దగ్గర ఉన్నా... దాన్ని వినియోగించి క్రిప్టో అసెట్స్‌ను రిట్రైవ్ చేసుకోవచ్చు.
సైబర్ ఠాణాలకు అధికారిక వాలెట్స్
ఓ నిందితుడి వాలెట్‌లో ఉన్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పాస్ ఫేజ్ అతడి కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితుల వద్దా ఉండే అవకాశం ఉంటుంది. అలా ఉంటే నిందితుడిని అరెస్టు చేయగానే వాళ్లు పాస్ ఫేజ్ వినియోగించి ఆ క్రిప్టో కరెన్సీని తమ ఫోన్లలో యాక్టివేట్ చేసుకుని, మరో దాంట్లోకి మార్చేయడం, ఎన్‌క్యాష్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా చూసేందుకు దర్యాప్తు అధికారులు అధికారికంగా కస్టోడియన్ వాలెట్ యాక్టివేట్ చేసుకుంటున్నారు.
నిందితుడి వాలెట్‌లోని క్రిప్టోను ఇందులోకి బదిలీ చేసుకుని న్యాయస్థానానికి సమాచారం ఇస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా సబ్ ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్ ఇలాగే రూ.40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేశారు. ఈ కేసుతో వచి్చన అనుభవంతో ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ ఠాణాల్లో ఉన్న ప్రతి టీమ్‌కు క్రిప్టో వాలెట్స్ ఓపెన్ చేయించారు. భవిష్యత్‌లో సైబర్ నేరగాళ్ల నుంచి క్రిప్టో కరెన్సీ స్వా«దీనం చేసుకుంటే దాన్ని భద్రపరచడం కోసం వీటిని వినియోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment