online frauds
-
తియ్యగా మాట్లాడి, దుమ్ము దులిపే ‘బామ్మ: స్కామర్లకు దబిడి దిబిడే
అదిగో గిప్ట్, ఇదిగో లక్షల రూపాయలు అంటూ ఫేక్ కాల్స్‌తో జరుగుతున్న సైబర్‌నేరాలు అన్నీ ఇన్నీ కాదు. ఇది చాలదన్నట్టు, డ్రగ్స్, టాక్స్ అంటూ డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో ఆన్లైన్ ద్వారా సెలబ్రిటీలను కూడా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి కేటుగాళ్ల దుమ్ము దులిపేందుకు ఏఐ బామ్మ వచ్చేసింది. యూకే టెలికం కంపెనీ ‘ఓ2’ డైసీ అనే ఏఐ బామ్మను సృష్టించింది. డైసీ అనేది సాధారణ చాట్‌బాట్ కాదు, లైఫ్‌లైక్, మనుషుల తరహా సంభాషణలను నిర్వహించడానికి రూపొందించబడిన అత్యంత అధునాతన ఏఐ అని కంపెనీ ప్రకటించింది.బ్రిటన్‌లోనూ ఇలాంటి మోసాలు, ఆన్లైన్ స్కామర్ల స్కాంలు తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో డైసీ సృష్టి ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ 10 మందిలో 7 మంది సైబర్ కేటుగాళ్ల మోసాలకు బలవుతున్నారట. వారి ఆటకట్టించి వినియోగదారులను రక్షించాలన్న ఉద్దేశంతోనే త్యాధునిక సాంకేతికతతో దీన్ని తీసుకొచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బామ్మ ఆన్లైన్ స్కామర్ల భరతం పడుతుందని కంపెనీ వెల్లడించింది. స్కామర్లతో తియ్యగా మాట్లాడుతూ వారిని మాటల్లో పెడుతుంది. వారిని సమయాన్ని వృథా చేస్తూ అసహనానికి గురిచేస్తుంది. దాదాపు 40 నిమిషాల పాటు ఎడతెగకుండా మాట్లాడి, అవతలి వారికి పిచెక్కిస్తుంది. దెబ్బకి ఆన్లైన్ నేరగాళ్లు చివరికి ఫోన్ పెట్టేస్తారనీ, దీంతో వారి మోసానికి చెక్ పడుతుందని కంపెనీ తెలిపింది. తద్వారా బాధితుల సంఖ్య తగ్గుతుందని భావిస్తోంది.మరో విధంగా చెప్పాలంటే మోసంతో ఫోన్ చేసేవారికి ఏఐ గ్రాండ్‌మదర్ డైసీ చుక్కలు చూపిస్తుంది. తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలియనంత తీయగా మాట్లాడుతూ వారి అసలు సంగతిని తెలుసుకుంటుంది. అంతేకాదు డైసీ కేవలం స్కామర్ల సమయాన్ని వృధా చేయడం మాత్రమే కాదు, ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా ఆమె సహాయపడుతుంది. ఇందుకోసం స్కామ్‌లో 5వేల పౌండ్లను కోల్పోయిన రియాలిటీ టీవీ స్టార్ అమీ హార్ట్ డైసీతో జతకట్టడం విశేషం.మరోవైపు ఓ2 కంపెనీ ప్రతి నెల మిలియన్ల కొద్దీ స్కామర్ల కాల్స్‌ను, టెక్స్ట్ మెసేజ్‌లను బ్లాక్ చేస్తోంది. అలాగే ఉచిత సేవ అయిన 7726కి సందేశాలను ఫార్వార్డ్ చేయడం ద్వారా అనుమానాస్పద కేసులను తమకు నివేదించమని ప్రజలను కోరుతుంది. స్కామ్‌లను అడ్డుకునేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్ , ప్రత్యేకమైనమంత్రిత్వ విభాగం కావాలని కూడా కోరుతోంది. -
ఆ రాష్ట్రాల్లో స్కామర్స్... మేము వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు
-
పార్ట్‌టైమ్ జాబ్ నిలువునా ముంచేసింది.. ఇది ఓ టెకీ కథ.. తస్మాత్ జాగ్రత్త!
ఆన్లైన్, సైబర్ మోసాలు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యులే కాకుండా బాగా చదువుకున్నవారు, టెక్నాలజీపై అవగాహన ఉండి ఐటీ రంగంలో పనిచేస్తున్న వారు కూడా ఈ ఆన్లైన్ ఫ్రాడ్లకు బలవుతున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌తో నిలువునా మోసపోయిన ఓ టెకీ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి వివిధ ఆన్లైన్ టాస్క్‌లపేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహా ఎనిమిది మందిని ఏకంగా రూ. 1.04 కోట్లకు మోసగించిన ఉదంతానికి సంబంధించి పుణే, పింప్రీ చించ్వాడ్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు గురువారం ఎనిమిది ఎఫ్ఐఆర్లను నమోదు చేశాయి. రూ. 30.20 లక్షలు నష్టపోయిన టెకీ ఒక ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహారాష్ట్రలోని వాకాడ్ ప్రాంతానికి చెందిన 39 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ గత జనవరి 24 నుంచి 27 తేదీల మధ్య రూ.30.20 లక్షలు నష్టపోయారు. ఇటీవల జాబ్ పోవడంతో నిరుద్యోగిగా మారారు. దీంతో ఆన్లైన్ టాస్క్‌లు పూర్తి చేసే పార్ట్‌టైమ్‌లో చేరారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్ గురించి జనవరి 24న తన మొబైల్ ఫోన్‌కు సందేశం వచ్చింది. దీనికి స్పందించిన ఆయనకు ఫోన్లో మెసెంజర్ యాప్‌ను డౌన్లోడ్ చేయాలని చెప్పారు. ఆపై ఆయన్ను ఓ గ్రూప్‌లో చేర్చారు. ఆ తర్వాత వివిధ రకాల వస్తువులు, కంపెనీలకు రేటింగ్ ఇచ్చే టాస్క్‌లు అప్పగించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేశాక రూ.40 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ముందుగా కొద్దికొద్దిగా టెకీ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇలా జనవరి 24 నుంచి 12 విడతల్లో రూ.30.20 లక్షలు మోసగాళ్లు చెప్పిన బ్యాంక్ అకౌంట్లకు బాధితుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కంపెనీకి లాస్ వచ్చిందని మళ్లీ కొంత డబ్బు పంపించాలని చెప్పడంతో అనుమానం వచ్చిన అతను తాను అప్పటిదాకా ట్రాన్స్ఫర్ డబ్బును తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో మోసగాళ్లు అతని స్పందించడం మానేశారు. మేనేజర్ రూ.72.05 లక్షలు ఇదే విధంగా థెర్‌గావ్‌కు చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్ యువతి కూడా రూ.2.39 లక్షలు నష్టపోయింది. ఈమే కాకుండా మరో ఆరుగురు కూడా ఆన్లైన్ టాస్క్‌లతో మోసపోయారు. వీరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నారు. ఆమె ఏకంగా రూ.72.05 లక్షలు నష్టపోవడం గమనార్హం. -
భారీ మోసం.. సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌తో ఆన్లైన్లో డబ్బు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఫేక్ సింగర్ ప్రింట్స్‌తో ఆన్లైన్లో నగదును విత్ డ్రా చేసుకున్నారు. ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు భారీ స్కెచ్ వేశారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. కేటుగాళ్లు ఫేక్ ఫింగర్ ప్రింట్స్‌ను ఉపయోగించి ఆన్లైన్లో నగుదును విత్ డ్రా చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉన్న సేల్ డీడ్ల ద్వారా ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు కాజేశారు. ఫ్రింగర్ ప్రింట్స్‌తో పాటుగా ఆధార్ నంబర్లను కూడా దొంగతనం చేశారు. ఈ క్రమంలో సేల్ డీడ్‌లో ఉన్న ఫింగర్ ప్రింట్స్‌ను తీసుకుని సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌ను నిందితులు తయారు చేశారు. ఇక, ఆధార్ ద్వారా నగదు విత్ డ్రా చేసే విధానాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు భారీ స్కెచ్ వేశారు. సిలికాన్ ఫింగర్ ప్రింట్స్, ఆధార్ నెంబర్ ద్వారా కస్టమర్లకు తెలియకుండానే నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి సీఐడీ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజిత్ సాహ, అలం అనే ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే, వీరిద్దరికీ సహకరించిన కస్టమర్ సర్వీస్ అధికారులపై కూడా సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది కూడా చదవండి: భార్యపై అత్యాచారం చేశాడని!.. మైలార్‌దేవ్‌పల్లి మైనర్ రాజా కేసులో వీడిన మిస్టరీ -
స్క్రీన్ షేరింగ్ పేరుతో మోసం.. రూ. 50000 మాయం.. ఎలా అంటే?
ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఆన్లైన్ మోసాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఫోన్‌పే (PhonePe) అప్డేట్ చేసుకోవడం వల్ల రూ. 50,000 కంటే ఎక్కువ నష్టపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌పే వినియోగించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ యాప్ అప్పటికే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో లింక్ అయి ఉంది. దీంతో అతడు పరిష్కార మార్గం కోసం గూగుల్‌లో వెతికే ప్రయత్నంలో 08918924399 నెంబర్ చూసి దానికి కాల్ చేసాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఫోన్ తీయగానే మొదట కాల్ కట్ చేసి, మరొక నంబర్ (01725644238) నుండి కాల్ చేసాడు. బాధితుడు ఫోన్‌పే యాప్ వినియోగించడంలో వచ్చిన సమస్యను గురించి అపరిచిత వ్యక్తికి చెప్పాడు. ఆ సమయంలో అతని రెండు బ్యాంక్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఆ తరువాత స్క్రీన్ షేరింగ్ యాప్ అయిన రస్ట్ డెస్క్‌ని ఇన్స్టాల్ చేయమని బాధితుడిని కోరాడు. అపరిచిత వ్యక్తి సలహా మేరకు స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. అప్పటికే బ్యాంక్ అకౌంట్స్ మీద నిఘా వేసిన స్కామర్ బాధితుని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ నుంచి రూ.29,998 & యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నుంచి రూ.27,803 దోచేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయగా, బెల్తంగడి పోలీసులు జూలై 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదీ చదవండి: అకౌంట్లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడం ఎలా.. ప్రస్తుతం ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయని అందరికి తెలుసు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే ఉత్తమ మార్గం అపరిచితులను నమ్మకుండా ఉండటమే.. ఒకవేళా ఏదైనా సమస్య తలెత్తితే అధికారికి నెంబర్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా పరిష్కరించుకోవాలి. సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో ప్రాసెస్ గురించి ఖచ్చితంగా తెలియకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే ఏ కంపెనీ అయినా ఇతర యాప్స్ డౌన్లోడ్ చేయమని గానీ.. ఫోన్ స్క్రీన్ షేర్ చేయమని గానీ అడగదు. ఇటీవల వాట్సాప్ & టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న మోసాలు చాలా ఎక్కువవుతున్నాయి. కావున మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయడం ఉత్తమం. -
100 పెట్టి, వంద కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే స్థితిలో..
మెరిసేవన్నీ బంగారం కానట్టే, మనం చూసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో అందరూ నిజమైన వారు కాకపోవచ్చు. వారు చూపే ఉత్పత్తులు నమ్మదగినవి అయిఉండకపోవచ్చు. ఎందుకంటే, రూ.100 పెట్టి, వంద అంతకంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కొనుగోలు చేసే కొత్త మార్కెట్ ప్లేస్‌గా ప్రస్తుత సోషల్‌మీడియా తయారైంది. సరైన అవగాహన లేకపోతే పెయిడ్ పోస్ట్– వ్యక్తిగత అభిప్రాయం మధ్య తేడాను గుర్తించడం కష్టం. సెలబ్రిటీలు, ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నవారు చెబుతున్నారు కదా అని నాసిరకం వస్తుసేవలను కొనుగోలు చేసి మోసపోవద్దు. ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి కంపెనీలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వైపు మళ్లుతున్నాయని ఆన్లైన్ ట్రెండ్ నివేదికలు చూపుతున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఎండార్స్మెంట్ పెరగడానికి ప్రధాన కారణాలివి.. ►ఇన్ఫ్లుయెన్సర్ సపోర్ట్ చేసే ఉత్పత్తులను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ. ►వినియోగదారులు ఆన్లైన్లో ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ చూపించే వ్యూస్, కామెంట్స్‌ను చూసి నమ్ముతారు. ►ఎక్కువ షేర్ అయిన కంటెంట్‌ను చదవడానికి అధిక సమయం కేటాయిస్తారు. అలాగే ఆ సమాచారాన్ని వినియోగదారులు నమ్మే అవకాశాలు ఎక్కువ. ►ఇన్ప్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్ కామెంట్స్‌కు ప్రతిస్పందించడం, ఉత్పత్తులు, సేవలపై వారి అభిప్రాయాలను చెప్పడం.. మొదలైన వాటితో వినియోగదారుడు నమ్మకం పెంచుకుంటాడు. ►ఇన్ఫ్లుయెన్సర్లు వారి ఫాలోవర్స్‌తో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండటం కూడా దీనికి ఒక కారణం. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు.. ►నకిలీ ఉత్పత్తులు/సేవలు/ యాప్‌లు అందించే డబ్బును చూసి ఆశపడవద్దు. వాటి వల్ల మీపైన కూడా యూజర్లకు నమ్మకం పోయే అవకాశం ఉంది. ►ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ముందుగా గూగుల్‌లో శోధించండి. చట్టబద్ధమైన సమాచారం ఉందో లేదో రివ్యూలు చదివి నిర్ధారించండి. ►మీ ఫోన్ నెంబర్ లేదా చిరునామాను సోషల్ మీడియాలో ఉంచవద్దు. ఎందుకంటే వీటిని వ్యాపార ఉపయోగాల కోసం ఇతరులు సేకరించే అవకాశం ఉంది. ►యాప్‌లకు ఇచ్చిన యాక్సెస్‌ను ఒకటికి పదిసార్లు చెక్ చేసి గాని నిర్ధారణకు రాకండి. ►ఫోన్లో అవసరమైన ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. అందుకు.. ఫోన్లో జీపీఎస్, బ్లూ టూత్, పాస్వర్డ్లు, పిన్‌లను సెట్ చేయండి. ►నమ్మకమైన ప్రొవైడర్ల నుండి మాత్రమే కావల్సినవాటిని డౌన్లోడ్ చేసుకోండి. ►అన్ని ఆఫ్‌లైన్, ఆన్లైన్ పరస్పర చర్యల కోసం సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ►మీ వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ట్రోలింగ్కి ఆస్కారమిచ్చే వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, ఫొటోలు/వీడియోల ... వంటివి పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తపడటం మంచిది. ►అన్ని ఫొటోలపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి. ►హద్దులను సృష్టించుకోండి. అంటే, భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగత కథనాల జోలికి వెళ్లకండి. ►ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేయవద్దు. ►జాత్యాహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యాలను నివారించడం మంచిది. ►మీ డేటాను రక్షించుకోవడం ముఖ్యం. మాల్వేర్, ట్రాకర్లను నిరోధించే పెయిడ్ టూల్స్‌ను ఉపయోగించండి. ►పాస్వర్డ్లు, ఇమెయిల్, నగదు చెల్లింపులను రక్షించడానికి రెండు రకాల ప్రామాణికతను పాటించాలి. ►ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి నకిలీ సమీక్షలు, కామెంట్స్, లైక్స్‌ను కొనుగోలు చేయకూడదు. ఇలాంటి వాటిలో ఎక్కువ... ►నకిలీ కంపెనీలు ముఖ్యంగా ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, పెట్టుబడి, మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిఫ్టో కరెన్సీ .. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ఇంటర్నెట్లో గుర్తుతెలియని విధంగా పనిచేస్తాయి. వారి యాప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి సగటు మధ్యతరగతిని ప్రలోభ పెట్టడానికి ఖరీదైన మార్కెటింగ్ ప్రచారాలను ప్రారంభించాయి. ►ఆపిల్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయని యాప్‌లు చాలా వరకు చట్టబద్ధమైనవి కావు. వీటి ఉద్ధృతికి అడ్డుకట్ట వేయాలంటే మన దేశంలో చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకు పట్టే సమయం ఎంతో తెలియదు కాబట్టి మనమే జాగ్రత్త వహించడం ముఖ్యం. గుర్తించడం ఇలా? ►ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ చేసిన సర్వే ప్రకారం 50 శాతం ఫాలోవర్లు నకిలీలే అని తేలింది. చాలా మంది ప్రముఖ బాలీవుడ్ నటులు, నటీమణులు, ర్యాపర్లను కూడా నకిలీ ఇన్ఫ్లుయెన్సర్లుగా మోసగాళ్లు వాడుకుంటున్నారు. ►పోస్టింగ్‌కు ఉన్న ఫాలోవర్ల ట్రెండ్‌ను చూడాలి. ►ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ చేసే పోస్టింగ్‌లపై దృష్టి పెట్టండి. ఫాలోవర్స్ ఎక్కువ, పోస్ట్‌లు తక్కువ ఉంటే అవి రెడ్ ఫ్లాగ్స్ అని గుర్తించాలి. ►కొన్ని నకిలీ ఇన్ఫ్లుయెన్సర్ల అకౌంట్స్ చూస్తే ఒకే విధమైన కామెంట్స్, ఒకే విధమైన ఫాలోవర్లు ఉంటారు. ►ఇన్ఫ్లుయెన్సర్ల మానిటరింగ్ టూల్స్ అంటే కూపన్కోడ్లు, లింక్, బయో డిస్క్రిప్షన్లు... మొదలైనవి పర్యవేక్షించడం ద్వారా మోసపూరితమైన వాటిని కనిపెట్టవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
క్రెడిట్ కార్డ్‌లు వినియోగిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే!
న్యూఢిల్లీ: దేశీయంగా చోటు చేసుకుంటున్న మోసాల్లో 57 శాతం పైగా ఉదంతాలు ‘ప్లాట్‌ఫామ్’ ఆధారితమైనవే ఉంటున్నాయని కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా ఒక నివేదికలో తెలిపింది. కోవిడ్ మహమ్మారి రాక తర్వాత ఈ తరహా నేరాలు భారీగా పెరిగాయని తెలిపింది. రిమోట్ పని విధానం, ఈ–కామర్స్, డెలివరీ యాప్‌లు, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు మొదలైనవన్నీ కూడా ఇటువంటి మోసాల పెరుగుదలకు దారి తీశాయని ‘ఆర్థిక నేరాలు, మోసాల సర్వే 2022’ నివేదికలో పీడబ్ల్యూసీ వివరించింది. సోషల్ మీడియా, ఈ–కామర్స్, ఎంటర్ప్రైజ్, ఫిన్‌టెక్ వేదికలను ప్లాట్‌ఫామ్‌లుగా పరిగణిస్తున్నారు. ప్లాట్‌ఫామ్ మోసాల వల్ల 26 శాతం దేశీ సంస్థలు 1 మిలియన్ డాలర్ల పైగా (దాదాపు రూ. 8.2 కోట్లు) నష్టపోయినట్లు పేర్కొంది. 111 సంస్థలపై సర్వే ఆధారంగా పీడబ్ల్యూసీ ఈ నివేదిక రూపొందించింది. ఇందులో టెక్నాలజీ, ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, రిటైల్, విద్య, హెల్త్‌కేర్ తదితర రంగాల కంపెనీలు ఉన్నాయి. ప్లాట్‌ఫామ్‌ల వినియోగం వేగవంతం.. గడిచిన కొన్నాళ్లుగా భారతీయ వినియోగదారులు, సంస్థల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ల వినియోగం చాలా వేగంగా పెరిగిందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ పునీత్ గర్ఖెల్ తెలిపారు. ‘సగటున ఒక భారతీయ కంపెనీ అయిదు వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లపై తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ–కామర్స్, కాంటాక్ట్‌రహిత చెల్లింపులు, హోమ్ డెలివరీ విధానాలు, రిమోట్ పని విధానం మొదలైనవి వివిధ రకాల ప్లాట్‌ఫాం ఆధారిత ఆవిష్కరణలకు దారి తీసినప్పటికీ నేరగాళ్లకు కూడా కొత్త మార్గాలు లభించినట్లయింది‘ అని పేర్కొన్నారు. కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్తగా ముంచుకొచ్చే ముప్పుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. మోసాలను ముందస్తుగా గుర్తించి, నివారించడంపై ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండాలని నివేదిక సూచించింది. ఇందులోని మరిన్ని అంశాలు.. ► ప్రతి 10 ప్లాట్‌ఫామ్ మోసాల్లో నాలుగు .. అంతర్గత కుట్రదారుల వల్లే చోటుచేసుకున్నాయి. ► లోపలి వారు, బైటివారు కుమ్మక్కై చేసిన మోసాలు 26 శాతం ఉన్నాయి. కంపెనీలు అంతర్గతంగా పటిష్టమైన చర్యలు అమలు చేస్తే మూడింట రెండొంతుల ప్లాట్‌ఫామ్ మోసాలను నివారించవచ్చని దీని ద్వారా తెలుస్తోందని నివేదిక తెలిపింది. ► కస్టమర్లు మోసపోయిన కేసుల్లో 92 శాతం మోసాలు చెల్లింపులపరమైనవిగా ఉన్నాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. -
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
రూ.120 కోసం యువతి కక్కుర్తి.. రూ.7.23 లక్షలు మాయం!
ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచేలా పని చేయడంలో తప్పులేదు. కానీ టెక్నాలజీ వినియోగం పెరిగే కొద్ది సైబర్ నేరస్తులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈజీ మనీ కోసం ఫోన్‌కాల్, మెసేజ్‌లతో ఆమాయకులకు ‘ఆశ’ చూపిస్తూ అందిన కాడికి దోచేస్తున్న సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఓ యువతి పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అదే సమయంలో ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మేడం మీరు ఆన్లైన్లో జాబ్ కోసం వెతుకుతున్నారని తెలిసింది. ఈ సువర్ణావకం మీకోసమే. మేం చెప్పిన పని మీరు చేస్తే కాలు కదపకుండా కూర్చున్న చోటునుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకు మీరు ఇంట్లోకూర్చొని యూట్యూబ్ ఛానెల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే. అలా చేస్తే డబ్బు సంపాదించవచ్చు’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దీంతో ఆ యువతి తనకు వచ్చిన పార్ట్‌టైమ్ జాబ్ మెసేజ్‌కు సంతోష పడింది. సైబర్ కేటుగాళ్లు పంపిన రెండు యూట్యూబ్ ఛానల్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. అందుకు గాను సైబర్ నేరస్తులు ఆమెకు రూ.120 పంపారు. ఆ సంతోషం రెట్టింపైంది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలువ లేదు. స్కామర్లు తెలివిగా ఆమె సబ్‌స్క్రైబ్ చేసిన యూట్యూబ్ ఛానళ్ల స్క్రీన్షాట్లను పంపమని అడిగారు. అనంతరం 'జాబ్ కోడ్' కూడా పంపారు. ఆ కోడ్‌ను టెలిగ్రామ్ అకౌంట్ పంపమని కోరారు. పైన పేర్కొన్న టెలిగ్రామ్ ఖాతాకు ఆమె జాబ్ కోడ్‌ను పంపిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ యువతి బ్యాంకు వివరాలను సేకరించారు. వాళ్లు వివరాలు అడిగారని వెనకముందా అలోచించకుండా బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, జాబ్ కోడ్ పంపడంతో నిందితులు పని మొదలు పెట్టారు. ముందుగా ఆమె నమ్మేలా పార్ట్‌టైమ్ జాబ్ చేసినందుకు రెండు రోజుల వ్యవధిలో పలు మార్లు ఆమె అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేశారు. నమ్మకం కుదిరాక అమె బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.7,23,889 మొత్తాన్ని నాలుగు వేర్వేరు అకౌంట్ల నుంచి డబ్బుల్ని మాయం చేశారు. పాపం తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సురక్షితంగా ఉండడం ఎలా? ఇటువంటి మోసాల నుండి సురక్షితంగా ఉండేలా లింక్డ్న్, నౌకరీ, ఇండీడ్ మొదలైన గుర్తింపు పొందిన పోర్టల్స్ నుంచి పార్ట్‌టైమ్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇతర మార్గాల ద్వారా ఉద్యోగాల కోసం ప్రయత్నించే సమయంలో మీకు జాబ్ ఆఫర్ చేస్తే సదరు వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి పేరు, వారి కంపెనీ పేరు మొదలైన వివరాలను అడగాలి. ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్న కంపెనీ గురించి ఆన్లైన్లో సమాచారం సేకరించండి. అలాగే, పేరు, ఫోన్ నంబర్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని, అపరిచితుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపడం, లేదంటే బ్యాంక్ వివరాలను షేర్ చేయడం వంటివి చేయొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
లైక్,షేర్.. చీటింగ్
విజయవాడ స్పోర్ట్స్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్లోని వెబ్‌సైట్‌ను క్లిక్ చేసింది. వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘ఇన్‌స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్‌లు మొదలయ్యాయి. ఆ రోజు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్‌లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్‌లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్‌లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్కు రేటింగ్ ఇవ్వాలంతే.. ఇది సింపుల్ టాస్క్.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసి వెబ్సైట్ వాలెట్ చెక్ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్‌డ్రా చేసుకుందామని విఫలయత్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించింది. రూ. ఏడు వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేస్తే మీ వాలెట్లో ఉన్న రూ.10 వేలు తీసుకొవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బులు వాలెట్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విసురుతున్న వలలో నిరుద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఘటనలు ఈ ఆన్లైన్ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్‌కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్ పోలీస్ స్టేషన్లో 19 కేసులు నమోదయ్యాయి అప్రమత్తంగా ఉండండి.. స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్ ద్వారానే వెబ్ లింక్స్‌ను తయారు చేస్తారు. డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
ఒంటరిగా ఉన్నారా? భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నారా అంటూ వల..
డిజిటల్ మాధ్యమం ద్వారా ఖాతాలలోని డబ్బును దొంగిలించడానికి ఎస్సెమ్మెస్ ఫార్వర్డింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు మోసగాళ్లు. ఎస్సెమ్మెస్ ల ద్వారా మీ ఖాతాలో లక్షల రూపాయలు బదిలీ అవుతున్నాయనో, ఎలక్ట్రిసిటీ బిల్లు, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్ .. వంటివి అప్డేట్ చేసుకోవడానికి వివరాలను పూరింపమని వచ్చే సంక్షిప్త సందేశాల పట్ల జాగ్రత్త పడటం మంచిది. డిజిటల్‌గా చెల్లింపుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది ఆన్లైన్ మోసానికి మరింత హాని చేస్తుంది. ఆన్లైన్ చెల్లింపులు, డిజిటల్ లావాదేవీలు గత కొన్నేళ్లుగా జీవితాలను సులభతరం చేశాయి. మెజారిటీ కస్టమర్లు, చిల్లర దుకాణాలు, బడ్డీకొట్ల వాళ్లు కూడా ఈ చెల్లింపు పద్ధతులను ఇష్టపడుతున్నారు. స్కామర్లు మనదేశంలోని వ్యక్తులను మోసం చేయడానికి ఎస్సెమ్మెస్ ఫార్వార్డింగ్ యాప్‌లను ఉపయోగిస్తారు. వాటిలో చాలా వరకు స్కామ్‌లు ఫిషింగ్ మోసాలకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా స్కామర్లు అందించిన షార్ట్ లింక్‌లను బాధితులు క్లిక్ చేసిన తర్వాత మాల్వేర్ ఇన్స్టాల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. స్కామర్లు ఉపయోగించేవి: బాధితుడి నమ్మకం, అజ్ఞానం, భయం, దురాశ, అత్యవసరం.. ఇవే మోసగాళ్లకు పెట్టుబడి. మోడల్ 1 : డబ్బు క్రెడిట్ ఉదాహరణకు: మీ అకౌంట్లోకి రూ. 3,3000 క్రెడిట్ అవుతుంది. మీ వివరాలను తక్షణమే నమోదు చేయండి. అందుకు వెంటనే తనిఖీ చేయండి... అంటూ ఓ లింక్ ఇస్తారు. మీరు అలాంటి మెసేజ్ చదివినా కానీ, అక్కడ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయకూడదని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఆ లింక్ మీ డబ్బును దోచుకోవడానికి ఒక మార్గం కావచ్చు. మోడల్ 2 : విద్యుత్ బిల్లు నోటిఫికేషన్ ప్రియమైన కస్టమర్, మీ మునుపటి నెల బిల్లు అప్డేట్ కానందున ఈ రాత్రి 8:30 లకు ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నుండి మీ ఎలక్ట్రిసిటీ పవర్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. దయచేసి వెంటనే అధికారిని సంప్రదించండి 8240471159.. ధన్యవాదాలు అనే మెసేజ్ వస్తుంది. మోడల్ 3 : పాన్‌కార్డ్ అప్డేట్ ప్రియమైన వినియోగదారు మీ యోనో ఎస్బిఐ నెట్ బ్యాంకింగ్ ఖాతా ఈరోజు సస్పెండ్ చేయబడుతుంది. దయచేసి మీ పాన్ కార్డ్‌ని అప్డేట్ చేయండి. అందుకు ఇక్కడ లింక్ క్లిక్ చేయండి http://bit y. wr/wkx822222 అని ఉంటుంది. మోడల్ 4 : క్రెడిట్ కార్డ్ బకాయి ‘‘ప్రియమైన కస్టమర్, దయచేసి మీ కార్డ్ బకాయి మొత్తాన్ని చెల్లించండి. మా పోర్టల్‌లో డిజిటల్ మోడ్‌లను ఉపయోగించి 0003తో ముగిసే మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 2786.74 లేదా కనీస మొత్తం రూ. 140/– చెల్లించండి. అందుకు http://nmc. rf /kojkBGGGG. ఇప్పటికే చెల్లించినట్లయితే ఈ సందేశాన్ని మర్చిపోండి. UPI చెల్లింపు వీడియోను bit. y/2qKYXb88888లో, VPA ID ఈ వీడియోను bit. ly.2JJQr9KKKKKలో చూడండి’’అనే మెసేజ్ ఉంటుంది. మోడల్ 5 : రొమాన్స్ ఫ్రాడ్ ‘మీరు మీ జీవితంలో ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా, ఒక మధురమైన కాల్ మీ కలలను సాకారం చేయగలదు, స్నేహం డేటింగ్ భాగస్వామి మీ కోసం వేచి ఉన్నారు. కాల్ చేయండి’ అంటూ నెంబర్ ఇస్తారు. మోడల్ 6 : డిపాజిట్ మోసం ‘అనుకోకుండా మీ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయబడింది, దయచేసి తిరిగి చెల్లించండి’ అని మెసేజ్‌లో ఉంటుంది. మోడల్ 7 : లాటరీ మోసాలు ‘మీ మొబైల్ నంబర్ లాటరీలో రూ. గెలుచుకున్నమొత్తం 1.85 కోట్లు, అమెరికా నుంచి కారును పంపుతున్నాం, క్లెయిమ్ చేయడానికి మీ పేర్లు, మొబైల్ నంబర్, చిరునామా.. వివరాలతో ప్రత్యుత్తరం పంపండి’ claim4222837@gmail.comఅని మెసేజ్‌లో ఉంటుంది. గమనించగలరు. చిట్కాలు 1. తెలిసిన మూలాల ద్వారా పంపబడినప్పటికీ,www.unshorten.it ఉపయోగించి సంక్షిప్త URL / లింక్‌లను ధ్రువీకరించండి. 2. క్లిక్ చేసే ముందు వెబ్‌లింక్‌ను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయండి. దాని ఫిషింగ్ లింక్ కాదని నిర్ధారించడానికి www.isitphishing.org లేదా www.urlvoid.com ఉపయోగించి అన్ని లింక్‌లను ధ్రువీకరించండి. 3. ఇ–మెయిల్ ద్వారా సున్నితమైన, వ్యక్తిగత లేదా యాజమాన్య సమాచారాన్ని ఎవరు అడుగుతున్నారో దానితో సంబంధం లేకుండా ఎప్పుడూ పంపకండి. 4. https://dnschecker.org/email-header-analyzer.php ని ఉపయోగించి ఇమెయిల్ యొక్క పూర్తి సారాంశాన్ని తనిఖీ చేయండి 5. మీ ఇ–మెయిల్ లేదా ఎస్సెమ్మెస్ మొత్తం తప్పులతో కూడిన స్పెల్లింగ్స్, సరైన విధంగా లేని వ్యాకరణాన్ని గమనించవచ్చు. 6. వ్యక్తిగత సమాచారం కోసం అడిగే లింక్‌లు / ఫారమ్‌లు (పాస్వర్డ్లు – బ్యాంక్ సమాచారం) ఉంటాయి. 7. సెర్చ్ ఇంజిన్లలో కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఎప్పుడూ వెతకవద్దు. సరైన కస్టమర్ కేర్ నంబర్ కోసం సంబంధిత యాప్ లేదా సంబంధిత అప్లికేషన్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి. 8. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం లేదా OTP, UPIN, బ్యాంక్ CVV నంబర్లను ఇవ్వడం అంటే మీరు మీ ఖాతా నుండి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని, మీకు రావడం లేదని అర్థం. 9. అన్ని సోషల్ మీడియా, బ్యాంకింగ్, ఇ–మెయిల్ ఖాతాల కోసం టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)ని ప్రారంభించండి. 10. బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నప్పుడు లేదా సోషల్, ఇ–మెయిల్ ఖాతాలకు లాగిన్ చేస్తున్నప్పుడు మీ స్క్రీన్‌ను ఎప్పుడూ షేర్ చేయవద్దు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime: కేవైసీ అప్డేట్ చేస్తున్నారా?! పొరపాటున ఇలా చేశారో.. అంతే ఇక! Cyber Crime Prevention Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూటిక్ ఉందా?! ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అంతే సంగతులు -
జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న లింక్డ్ ఇన్ ప్లాట్‌ఫారమ్ వృత్తిపరమైన వ్యక్తులతో కనెక్ట్ అవడానికి, జాబ్సెర్చ్లకు సహాయపడుతుంది. జనాదరణ పొందిన ఈ ప్లాట్‌ఫారమ్‌ను స్కామర్లు మోసాలకు ఉపయోగించుకుంటున్నారు. లింక్డ్ఇన్ స్కామ్‌ల నుండి రక్షించుకోవడానికి, వాటి బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు. లింక్డ్ ఇన్ మన కెరీర్ ఫీల్డ్‌లోని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే, మీరు సెర్చ్ చేసేటప్పుడు వచ్చే ప్రతి రిక్వెస్ట్‌ను అంగీకరించే ముందు, ప్రొఫైల్ లేదా వివరాలను తనిఖీ చేయడం సరైన విధానం. లింక్డ్ఇన్ తరచుగా ఆకట్టుకోవడమే కాదు నిపుణులలో ప్లాట్‌ఫారమ్ ఎంత ప్రజాదరణ పొందిందో సూచిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాట్‌ఫారమ్ స్కామర్లను కూడా ఆకర్షించింది. లింక్డ్ఇన్లో సబ్స్రైబర్లు నిపుణులుగా ఉండటం, వారి నమ్మకం ఈ స్కామ్‌కి ప్రధాన కారణమవుతోంది. నకిలీ ప్రొఫైల్ స్కామర్లు నకిలీ ప్రొఫైల్స్‌ను సృష్టిస్తారు. వారు తమ ప్రొఫైల్స్‌ను వీలైనంత చట్టబద్ధంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. వాటి ద్వారా ఈ కింది మోసాలకు పాల్పడతారు.. అడ్వాన్స్ ఫీజు మోసాలు ముందుగా స్కామర్లు ఒక చిన్న ఫీజుతో రిక్వెస్ట్ పెడతారు. దానికి బదులుగా మీరు పెద్ద మొత్తంలో డబ్బును పొందుతారని చూపుతారు. అందుకు, సివివి నంబర్లు, ఓటీపీలతో పాటు మీ బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డ్ నంబర్లను అందించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. కొన్నిసార్లు డబ్బు పొందడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయమని మిమ్మల్ని అడగవచ్చు. జాబ్ స్కామ్‌లు ఈ స్కామ్‌లలో సాధారణంగా రిక్రూటర్లుగా నటిస్తున్న వ్యక్తులు, యజమానులు లేదా ఉద్యోగాలను అందించే ప్లేస్మెంట్ ఏజెన్సీలు ముఖ్యంగా ఐటీ సంబంధిత కొత్త ఉద్యోగాలను ఆఫర్ చేస్తుంటారు. చాలా వరకు ఈ నకిలీ ప్రొఫైల్స్ మీకు బ్యాక్ డోర్ జాబ్‌లను అందిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేకుండా ఇంటి నుండి పనికి ఆహ్వానిస్తాయి (ఎ) ఆఫర్‌ను రిలీజ్ చేయడానికి, దరఖాస్తు ప్రక్రియ పూర్తయినందున వారు మిమ్మల్ని కొత్త మొత్తం చెల్లించమని అడుగుతారు. వారి స్కామర్లలో చాలా మంది ఉద్యోగాలను ప్రకటించే కంపెనీలలో అంతర్గత వ్యక్తిని కలిగి ఉంటారు లేదా చట్టబద్ధమైన కంపెనీల ఇ–మెయిల్లు, ఆఫీస్ ఫోన్ నంబర్లను వాడుతుంటారు. డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు ఈ స్కామర్లు మిమ్మల్ని సంప్రదించి, సన్నిహిత సంబంధంపై ఆసక్తిని వ్యక్తం చేసే మోసగాళ్ల నుండి వస్తాయి. వారు సాధారణంగా మీ ప్రొఫైల్ ఫోటోపై వ్యాఖ్యానిస్తారు. తమ రిక్వెస్ట్‌ను ఓకే చేయమని కోరుతారు. ఈ డేటింగ్, రొమాన్స్ స్కామ్‌లు చాలా వరకు సెక్స్టార్షన్ స్కామ్‌లకు దారితీయవచ్చు. ఫిషింగ్ స్కామ్‌లు ఎవరైనా ఇ–మెయిల్ చిరునామా, ఫోన్ నంబర్ లేదా వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని నకిలీగా మారుస్తారు. ఈ స్కామ్‌లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికే రూపొందించబడ్డాయని గుర్తించాలి. అవార్డులు ఇస్తున్నామని, ప్రముఖ మ్యాగజైన్ మొదటి పేజీలో ప్రచురిస్తామని, సంఘాలలో సభ్యత్వాన్ని అందిస్తామని... ఇలాంటి ఆకర్షణీయమైన మెయిల్స్ ఉంటాయి. టెక్ సపోర్ట్ ప్రీమియం లింక్డ్ ఇన్ ఉచిత ఆఫర్లను అందించే టెక్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లుగా స్కామర్లను ఉపయోగిస్తారు. లేదా కస్టమర్ సపోర్ట్‌గా పేరున్న బ్రాండ్‌ను అనుకరిస్తారు. చాలా సందర్భాలలో చిన్న చిన్న లింక్‌లు స్కామర్ల ద్వారా పంపబడతాయి. చివరికి ఆ లింక్‌లు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయబడే మాల్వేర్ లేదా కీ–లాగర్కు దారితీస్తాయి. దీని నుంచి తమ పనులు చక్కబెట్టుకోవడానికి స్కామర్లకు సులువు అవుతుంది కాబట్టి జాగ్రత్త అవసరం. నకిలీ ప్రొఫైల్‌ల సంకేతాలివి మీకు తెలియని వ్యక్తి నుండి లింక్డ్ఇన్లో రిక్వెస్ట్ వచ్చినప్పుడు, మీరు కనెక్ట్ చేయడానికి ముందు వారి ప్రొఫైల్‌ను పూర్తిగా తనిఖీ చేయడం అలవాటు చేసుకోవాలి. లింక్డ్ఇన్ లో స్పామ్, నకిలీ ఖాతాలను సాధారణంగా గుర్తించడం చాలా సులభం. మీరు ఈ నకిలీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లలో సాధారణమైన నమూనాలు, సంకేతాలను చూడవచ్చు. నకిలీ ప్రొఫైల్‌లకు వ్యతిరేకంగా నిజమైన ప్రొఫైల్స్‌ను అంచనా వేసేటప్పుడు ఉపయోగించే కొన్ని సంకేతాలివి.. ►వారికి ప్రొఫైల్ చిత్రం ఉండదు. లేదా సరిగా లేని ఫొటో ఉపయోగిస్తారు ►వారికి అధికారిక ఇ–మెయిల్ చిరునామా ఉండదు ►వారి ప్రొఫైల్‌లో వ్యాకరణం, స్పెల్లింగ్‌లో లోపాలు ఉంటాయి ►వారి ప్రొఫైల్ అసంపూర్ణంగా ఉంటుంది. వ్యక్తిగత సమాచారం ఉండదు ►సారాంశం, నైపుణ్య విభాగాలలో నిర్దిష్టత లేని సాధారణ ప్రకటనలను ఉంటాయి ►వారి వర్క్ హిస్టరీలో చాలా వరకు ఖాళీలు ఉంటాయి ►వారు తమ ప్రొఫైల్‌లోని వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వరు ►లింక్డ్ఇన్ తో పాటు ఇతర నెట్వర్కర్స్తో కనెక్ట్ అయ్యే ముందు వారి పూర్తి ప్రొఫైల్‌ను క్రాస్ చెక్ చేయండిమీరు ఏదైనా లింక్డ్ఇన్ కనెక్ట్ నుండి వ్యక్తిగతంగా మాట్లాడే ►ముందు పూర్తి ఇ–మెయిల్ హెడర్లను చెక్ చేయండి. ►ఇ–మెయిల్ మోసపూరితంగా లేదని నిర్ధారించుకున్న తర్వాతే మాట్లాడండి. గోప్యత భద్రతా చిట్కాలు ప్రతి నెలా మీ లింక్డ్ఇన్ పాస్‌వర్డ్‌ను మార్చుకోండి. ∙మీ ప్రొఫైల్‌లో సంప్రదింపు సమాచారాన్ని పరిమితం చేయండి. మీ ప్రొఫైల్ సారాంశంలో మీ ఇ–మెయిల్ చిరునామా, ఇంటి చిరునామా లేదా ఫోన్ నంబర్‌ను ఉంచడం మానుకోండి. ►ప్రైవేట్, సెమీప్రైవేట్ మోడ్‌లో బ్రౌజింగ్ ప్రొఫైల్స్: https://www.linkedin.com/help/linkedin/answer/a567226/browsing-profiles-in-private-and-semi-private-mode?%20lang=en ►దిగువ ఇచ్చిన యుఆర్ఎల్ను ఉపయోగించి ప్రొఫైల్‌లో మీ గోప్యతా సెటింగ్‌లను సరిగ్గా పరిశీలించి, సెటప్ చేయండి. https://www.linkedin.com/mypreferences/d/categories/account ►మీ ఖాతా కోసం రెండు కారకాల ప్రమాణీకరణను ప్రారంభించండి దాని ప్రామాణికతను ధృవీకరించకుండా చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు, మీరు https://-www.isitphishing.org ఉపయోగించవచ్చు. ►దిగువ యుఆర్‌ఎల్‌లో సరైన (కంటెంట్, మెసేజ్‌లు, ప్రొఫైల్స్, గ్రూప్స్) తెలియజేయడం అలవాటు చేసుకోండి. https://www.linkedin.com/help/linkedin/answer/14z6 సైబర్క్రైమ్కిరిపోర్ట్ చేయచ్చు ►లింక్డ్ ఇన్‌లో స్కామ్‌ను తెలియజేయండి. https://www.linkedin.com/help/linkedin/ask/TS-RPS l https://cybercrime.gov.in/లో ఫిర్యాదును రిజిస్టర్ చేయచ్చు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్లను సంప్రదించవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్.. మిమ్మల్ని మీరే ఇలా కాపాడుకోండి!
Cyber Crime Prevention Tips In Telugu: నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ రోజువారీ అవసరం. తెలిసినా, తెలియకపోయినా ప్రజలు ఏ వ్యక్తితోనైనా క్షణాల్లో మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది. దీంతో వేధింపులకు సంబంధించి ఆడ–మగ తేడా లేకుండా ఆన్లైన్ దుర్వినియోగం చేయడమూ పెరిగింది. అయితే, వీటిలో మహిళలు అనుభవించే హింస మాత్రం తరచూ లైంగిక లేదా స్త్రీ వ్యతిరేకపరమైన వేధింపులు ఉంటున్నాయి. మహిళలను వేధించే సమస్యల్లో గృహహింస, యాసిడ్ దాడి, ఈవ్ టీజింగ్, వరకట్నం, లైంగిక దాడులు, హ్యూమన్ ట్రాఫికింగ్, భ్రూణహత్యలు.. ఇలా ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. వీటికితోడు కోవిడ్–19 మహమ్మారి సామాజిక, ఆర్థిక ఒత్తిడిని బలపరిచింది. ఈ రకమైన హింస విస్తృతమైన లింగ ఆధారిత వివక్షకు దారి తీస్తోంది. దీంతో ఈ హింస ఉధృతితో మహిళలపై సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటిలో తరచూ వినిపించేవి సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే, బాధించే సందేశాలు, బ్లాక్‌మెయిలింగ్ ... వంటి నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్టాకింగ్ డిజిటల్ ప్రపంచం ఎక్కువగా మాట్లాడే వాటిలో సైబర్ స్టాకింగ్ ఒకటి. దీంట్లో మహిళలు, పిల్లలనే లక్ష్యంగా చేసుకుని వేధింపులు ఉంటాయి. ఇది ఆన్లైన్ ముప్పు అని చెప్పవచ్చు. అవతలి వ్యక్తితో మనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ స్టాకింగ్ కంటే సైబర్ స్టాకింగ్ నేరాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నేరస్థుడిని కనుక్కోవడం అంత సులభం కాదు. దీంట్లో అధికంగా టీనేజర్లు బాధితులవుతున్నారు. మహిళలపై ట్రోల్‌ల సంఖ్య పెరిగింది. కరోనా కాలం ఆన్లైన్ హింస, లైంగిక వేధింపుల గురించి ఒక కొత్త ఆందోళనలను లేవనెత్తింది. కోవిడ్ –19 తర్వాత ప్రపంచం ఆన్లైన్ వైపు వేగంగా కదులుతున్నందున, స్త్రీవాద దృక్పథం మారాల్సి ఉంది. పరువు నష్టం తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి ప్రజలకు ఒక వేదిక ఇంటర్నెట్. దీని ద్వారా కలిగించే పరువు నష్టం మరో వ్యక్తి ప్రతిష్టకు కలిగే గాయం. ఇది ఇంటర్నెట్ సహాయంతో ఏ వ్యక్తికైనా వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించడాన్ని సూచిస్తుంది. ఇప్పటికే సైబర్ పరువు నష్టంపై అనేక కేసులు ఉన్నాయి. ఇది ఎక్కువగా ఫేస్బుక్, గూగుల్ లేదా ఏదైనా ఇతర సోషల్ నెట్వర్కింగ్ లేదా మెయిల్ వెబ్సైట్ లో ఒకరి ఐడీ హ్యాక్ చేయడం ద్వారా ఉంటుంది. అలాగే, ఒక వ్యక్తి తాలూకు పూర్తి సమాచారంతో మరో నకిలీ ఖాతాను సృష్టించడం ద్వారా కూడా జరుగుతుంది. ఫొటో మార్ఫింగ్ మార్ఫింగ్ అనేది అసలు ఫొటోలను మార్పిడి చేయడం. హ్యాకర్ మీ ఫొటోలను ఉపయోగించి, దానిని మార్ఫ్ చేసి, దుర్వినియోగం చేయడం సులభం. మార్ఫింగ్ చేయకుండా మీరు ఎవ్వరినీ ఆపలేరు. మీ ఫొటోలు పబ్లిక్‌గా ఉంటే, వ్యక్తులు వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వాటిని మార్ఫ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. తమ లైంగిక ఊహలను సంతృప్తి పరుచుకోవడానికి పోర్న్ సైట్లలో వాటిని ఉపయోగిస్తుంటారు. ఎవరైనా మీ ఫోటో తీసి వాటిని అలా ఉపయోగించినా మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇ–మెయిల్ స్పూఫింగ్ ఒకదాని నుంచి పంపించినట్టు ఇ–మెయిల్‌ను సూచిస్తుంది. కానీ అది మరొక దగ్గర నుండి పంపించినదై ఉంటుంది. ఈ సాంకేతికతను ఉపయోగించే ఇ–మెయిల్స్ తరచూ కొన్ని మెసేజ్‌లు, పంక్తులు, లోగోలను కలిగి ఉంటాయి. ఇ–మెయిల్ స్పూఫింగ్ అనేది ఫిషింగ్, స్పామ్ ప్రచారాలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన వ్యూహం. అంటే లాటరీ వచ్చిందనో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. అనో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు అవి సరైన మెయిల్స్ అని గుర్తించినప్పుడే వాటిని ఓపెన్ చేయడం మంచిది. సైబర్ సేఫ్టీ పాయింట్స్ ►పాస్‌వర్డ్‌లను షేర్ చేయద్దు బ్యాంక్ ఖాతా అయితే ఎవరికి వారు తమ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటారు. లేదా ఎవరికీ చెప్పకుండా ఒక చోట రాసి పెట్టుకుంటారు. అలాగే, మీ డిజిటల్ పాస్‌వర్డ్‌ను ఎంత నమ్మకమున్న స్నేహితుడు లేదా భాగస్వామితోనైనా షేర్ చేయకూడదు. దీనికి సంబంధిం చిన భయం మంచిదే. స్నేహితులు ఉద్దేశపూర్వకంగా మీకు హాని కలిగించకపోయినా, వారు అనుకోకుండా ఎవరికైనా మీ పాస్‌వర్డ్‌ను చెప్పవచ్చు. కొన్నిసార్లు మీ పాస్వర్డ్ మారకముందే సంబంధాలు మారిపోతుంటాయి. మీ విచక్షణను ఉపయోగించండి, ఆ పాస్‌వర్డ్‌లను ప్రైవేట్‌గా, సంక్లిష్టంగా ఉంచండి. ►మీ వెబ్‌క్యామ్‌ని కనెక్ట్ చేసి ఉంచద్దు మీ వెబ్ కెమెరాను ఆన్ చేసి, మీకు తెలియకుండానే మీ కదలికలను చాకచక్యంగా రికార్డ్ చేయగల అనేక యాప్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఉపయోగంలో లేనప్పుడు మీ కెమెరా లెన్స్‌ను మూసి ఉంచండి లేదా పూర్తిగా ఏదైనా కవర్‌తో కప్పి ఉంచండి. ►అవసరానికి మించి షేర్ చేయద్దు సంబంధాలలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అత్యుత్తమ వ్యక్తులు కూడా ఒకోసారి మరోవైపుకు మారచ్చు. అందుకే మీరు షేర్ చేసిన మీ సన్నిహిత సందేశాలు, ఫొటోలు, సమాచారం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆన్ లైన్ పరిచయస్తులను ఒంటరిగా కలవవద్దు ఆన్లైన్ వ్యక్తులను బయట కలిసే ముందు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తెలియజేయండి. మీరు రద్దీగా ఉండే అంటే కాఫీ షాప్ లేదా మాల్లో సదరు వ్యక్తిని కలుసుకోవడానికి నిర్ణయించుకోవడం శ్రేయస్కరం. అవసరమైనంత వరకే.. అనుమానం లేని మహిళలతో స్నేహం చేయడానికి సోషల్ మీడియా సైట్లను బ్రౌజ్ చేస్తున్న వారిలో చెడ్డవారు అనేకం ఉన్నారు. అందుకని.. మీ ఆచూకీ, జీవనశైలి గురించిన వివరాలను పోస్ట్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. స్టాకర్లు ఒక సాధారణ ఫోటోగ్రాఫ్ లేదా స్టేటస్ అప్డేట్తో మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలను కనుక్కోగలరు. మీ కెమెరాలో జియోట్యాగింగ్ని స్విచాఫ్ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి సిస్టమ్ అప్డేట్ చాలా ముఖ్యమైనది. ఇది భద్రతా అప్డేట్లు, ప్యాచ్‌లు తాజా బెదిరింపులను దూరంగా ఉంచుతుంది. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో పరికరాలు భద్రం భద్రతా వ్యవస్థ లేకుండా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కలిగి ఉండటం అనేది తలుపులు తెరిచి ఇంట్లో కూర్చున్నట్లే. ఆండ్రాయిడ్, మ్యాక్ పరికరాలకు రెండూ హానికరమైన సాఫ్ట్వేర్ దాడికి ఉపకరణాలు. ఇవి మీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలవు కాబట్టి మీ అన్ని పరికరాలలో ‘నార్టన్ సెక్యూరిటీ’ వంటి భద్రతా వ్యవస్థను ఇన్స్టాల్ చేయండి. ఫైన్ ప్రింట్ ఏదైనా సేవ, రహస్యానికి సంబంధించిన సమాచారం, సేవా నిబంధనలను అర్థం చేసుకోండి. కొన్ని వెబ్సైట్లు మీ సమాచారాన్ని ఎవరికైనా ఇచ్చేయవచ్చు. లేదా అమ్మచ్చు, అద్దెకు తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగా మీకే తిరిగి రావచ్చు, మీరు నిబంధనలు షరతులకు అంగీకరించినందున చట్టం మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు. ‘ఉచితం’ అంటూ ఏదీ లేదు ఫ్రీ గేమ్‌లు, ఆఫర్లు, డీల్‌లు మొదలైనవిగా కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. అవి వైరస్లు, స్పైవేర్, హానికరమైన సాఫ్ట్వేర్లతో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఇవి మీ పరికరంలోకి ప్రవేశించి, మీ మొత్తం డేటాను పొందగలవు. వద్దనుకున్న వారు బ్లాక్ అవసరం లేని వ్యక్తులను జాబితా నుండి అన్ ఫ్రెండ్ చేయండి లేదా బ్లాక్ చేయండి. మీ స్నేహితుల జాబితాలో ఎవరు ఉండాలో మీరు ఎంచుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే ఆనఖలైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ సరైన జ్ఞానం, రక్షణ మొదటి వరుసలో ఉండాలి. మీ రక్షణలో మీ ప్రవృత్తులే కీలక పాత్ర పోషిస్తాయని గ్రహించండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు! -
బుక్ చేయకుండానే పార్సిల్.. ఆర్డర్ కాన్సిల్ అంటూ ఖాతా ఖాళీ
పిల్లలు స్కూల్‌కి, భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంటి పనుల్లో తీరికలేకుండా ఉన్న ఉమాదేవికి గేటు దగ్గర నుంచి ‘కొరియర్..’ అన్న కేక వినిపించింది. బయటకు వచ్చి అడిగితే ‘ఉమాదేవి పేరున పార్సిల్ వచ్చింది’ అని చెప్పాడు బాయ్. ‘నా పేరున పార్సిల్ రావడమేంటి? నేనేదీ బుక్ చేయలేదు. ఎవరు పంపించారు’ అంది ఉమాదేవి. ‘మీరు ఆన్లైన్లో బుక్ చేశారు మేడమ్. రూ.500 విలువైన పార్సిల్ తీసుకొని, మనీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడు. తనకేమీ తెలియదని చెప్పింది ఉమాదేవి. అయితే, బుకింగ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు కొరియర్ బాయ్. ‘సరే’ అంది ఉమాదేవి. ‘మీ మొబైల్‌కి ఆర్డర్ కాన్సిల్ ఓటీపీ వచ్చింది, చెప్పండి’ అని అడిగాడు. ఉమాదేవి తన ఫోన్‌కి వచ్చిన ఓటీపీ చెప్పింది. థాంక్యూ చెప్పి కొరియర్ బాయ్ వెళ్లిపోయాడు. ‘పిల్లలు ఫోన్ ఆడుకుంటూ ఏదైనా తెలియక క్లిక్ చేశారా..’ అనుకుంటూ లోపలికెళ్లిపోయింది. పనైపోయాక భర్తకు ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్లో బ్యాంక్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాకైంది. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.65000 డెబిట్ అయినట్టు ఉంది మెసేజ్. ఇటీవల ఆన్లైన్లో బుక్ చేయకుండానే కొరియర్ ద్వారా పార్సిల్స్ రావడం, వీటి ద్వారా ఫోన్ నెంబర్, ఓటీపీ, బ్యాంక్ ఖాతా నుంచి నగదు కొల్లగొట్టడం వంటివి అధికంగా జరుగుతున్నాయి. ఈ తరహా మోసానికి గృహిణులను టార్గెట్ చేస్తున్నట్టుగా సైబర్‌క్రైమ్ విభాగం నుంచి నివేదిక. సైబర్ క్రైమ్‌పోలీసులు కూడా ఆర్డర్ చేయకుండానే ఆన్లైన్ పార్శిల్స్ వచ్చాయని ఎవరైనా మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసే హెచ్చరిక.. ఆన్లైన్లో చూసినప్పుడు ఒక వస్తువు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరకు లభిస్తున్నట్టు కనిపిస్తుంది. వాటి ప్రయోజనాలు లేదా ఫీచర్లు నిజమని అనిపించేలా ఉంటాయి. ఆ లింక్స్‌ను ఓపెన్ చేయద్దు. ఫోన్‌కాల్ ద్వారా తక్షణ చెల్లింపు లేదా ఎలక్ట్రానిక్ నిధుల బదిలీ ద్వారా చెల్లించాలని పట్టుబడితే అనుమానించాలి. చౌకైన డీల్ ని యాక్సెస్ చేయడానికి ముందు మీరు వోచర్ల కోసం ముందస్తుగా నగదు చెల్లించాలని వారు పట్టుబట్టవచ్చు. సోషల్ మీడియా, ఆన్లైన్లో కొన్ని లింక్స్ తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టు చూపుతాయి. ఇది నిజం కాదు. వారు ఓటీపీని భాగస్వామ్యం చేయమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్‌లు లేదా షార్ట్ లింక్‌లను పూరించమని మిమ్మల్ని అడగచ్చు. కొరియర్ క్యాన్సిల్ కోసం ఓటీపీ చెప్పమని అభ్యర్థించవచ్చు. జాగ్రత్త అవసరం. సురక్షిత చెల్లింపు కోసం ఇలా చేయండి.. ఆన్లైన్లో ప్యాడ్ లాక్ చిహ్నంతో ఉన్న లింకులను మాత్రమే ఓపెన్ చేయాలి. ఓటీపీ నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. మీరు ఫోన్ కాల్లో ఉన్నప్పుడు నగదు చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకూడదు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుందని అర్థం. ఏవైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్‌ఫో¯Œ లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లు ఎనీ డెస్క్, టీమ్‌వ్యూవర్ మొదలైన వాటిని ఉపయోగించడం మానుకోవాలి. గూగుల్లోనూ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం వెతకద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ నుండి కస్టమర్ కేర్ నంబర్‌ను తీసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
టీమ్వ్యూమర్, ఎనీడెస్క్ డౌన్లోడ్ చేయమంటారు? ఓటీపీ చెబుతున్నారా?
పిల్లల పుస్తకాలు సర్దుతుండగా ఫోన్ మోగితే తీసింది మంగ. అవతలి నుంచి ‘మేడమ్ మీ బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం. మీరు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. బ్యాంకు నుంచి మీకో మెసేజ్ వస్తుంది. అందులోని కోడ్ చెప్పాల్సి ఉంటుంది చెప్పండి’ అనడంతో అలాగే అంది మంగ. వచ్చిన మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందే కాబట్టి ఫర్వాలేదులే అన్న భరోసాతో ఆ కోడ్ నంబర్ చెప్పేసింది. అవతలి నుంచి ‘సరే, మేడమ్.. థాంక్యూ’ అంటూ ఫోన్ కట్ చేశారు. మంగ ఫోన్ పక్కన పెట్టేసే టైమ్‌లో వచ్చిన మెసేజ్ అలర్ట్ చూసి ఏంటా అని ఆ మెసేజ్ ఓపెన్ చేసి, చూసింది. బ్యాంకునుంచి మెసేజ్.. తన ఖాతానుంచి ఎవరో అకౌంట్‌కు రూ.2 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉండటంతో షాక్ అయ్యింది. ∙∙ సుందర్ టీవీ చూస్తూ టిఫిన్ చేస్తున్నాడు. కాసేపట్లో ఆఫీసుకు బయల్దేరాలి. అప్పుడే ఫోన్ రావడంతో విసుగ్గా ఆన్సర్ చేశాడు. అవతలి నుంచి క్రెడిట్ కార్డ్ బోనస్ పాయింట్స్ రిడీమ్ చేసుకోమంటూ కస్టమర్ కేర్ కాల్. కట్ చేద్దామంటే పాయింట్స్ గురించి చెబుతున్నారు. కొంతైనా బెనిఫిట్ ఉంటుంది కదా అని కాలర్ అడిగిన సమాధానం చెబుతూ వచ్చాడు. పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి ధృవీకరణ ప్రశ్నలు అడగడంతో చెప్పాడు. ‘మీ నంబర్‌కు వచ్చిన మెసేజ్ లింక్ ఓపెన్ చేసి, వివరాలు ఇస్తే, ఐదు నిమిషాల్లో మీకు రిడీమ్ పాయింట్స్ మనీబ్యాక్ వస్తుంది సర్’ అనడంతో అదే పని చేశాడు సుందర్. ఆ తర్వాత ఫోన్ పక్కన పెట్టేసి, తినడం పూర్తయ్యాక ఆఫీసుకు బయల్దేరుతూ ఫోన్ చూసుకున్నాడు. తన బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు డెబిట్ అయినట్టుగా బ్యాంక్ మెసేజ్ ఉండటంతో సుందర్ కి ఏమీ అర్థం కాలేదు. ∙∙ ఇటీవలి కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలలో OTP/UPI మోసం ఒకటి. మధ్యవయస్కులు, వృద్ధులే ఎక్కువగా ఇలాంటి మోసాల బారిన పడుతున్నారు. మోసగాళ్లు బాధితుల నుంచి ఓటీపిని అడుగుతారు. లేదా స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా బాధితుడి ఫోన్‌పై వారికి తెలియకుండానే పూర్తి నియంత్రణను సాధిస్తారు. ఫోన్‌పై పూర్తి యాక్సెస్ పొందిన తర్వాత, మోసగాడు పాస్‌వర్డ్‌లను పట్టుకుని బాధితుడి ఖాతాతో లావాదేవీలు చేయడం ప్రారంభిస్తాడు. ఇటీవలి కాలంలో నగదు చెల్లింపులను సులభతరం చేసే డిజిటల్ లావాదేవీలకు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వేగవంతమైన ప్రక్రియగా మారింది. దీంతో UPI ప్లాట్‌ఫారమ్‌లోనూ వివిధ రకాల మోసాలు చోటుచేసుకుంటున్నాయి. మోసగాళ్ల లక్ష్యాలు బాధితుల దృష్టిని ఆకర్షించడానికి, మోసగాళ్ళు బ్యాంక్ సిబ్బందిలా నటించి, అప్డేట్లు, బోనస్ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌ల వంటి సాధారణ సమస్యల కోసం కాల్ చేస్తారు. కాల్ సహజమైనదే అనిపించడానికి వారు మీ పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్‌ను ధృవీకరించమని అడగడం ద్వారా బ్యాంకర్లు సాధారణంగా చేసే ప్రక్రియను అనుకరిస్తారు. ►మోసగాళ్లు ఒక కథను రూపొందిస్తారు. తద్వారా బాధితుడు సమస్యను పరిష్కరించడానికి వారికి వ్యక్తిగత సమాచారాన్ని అందజేస్తారు. ►మోసగాడు బాధితుడిని వారి ఫోన్‌కు స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయమని అడుగుతాడు. దాంట్లో భాగంగా TeamViewer, AnyDesk వంటివిPlaystore / App store అందుబాటులో ఉన్నాయి. OTP మోసానికి మరొక పద్ధతి ►సంక్షిప్త లింక్‌లు, గూగుల్ ఫారమ్‌లతో ఎసెమ్మెస్ ద్వారా లాగిన్, పాస్వర్డ్, OTP/UPI డేటాను పూరించమని అడుగుతారు. ►ప్రత్యామ్నాయంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్ మొదలైన అప్లికేషన్లలో మోసగాడు (కొనుగోలుదారులా నటించి) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు చెల్లింపు అభ్యర్థనను పంపుతాడు. ►మోసగాళ్లు (కొనుగోలుదారులా నటించడం) కస్టమర్ వర్చువల్ చెల్లింపు చిరునామాకు త్వరగా స్పందించడానికి క్యూఆర్ కోడ్ చెల్లింపు అభ్యర్థనను పంపుతారు మోసపోకుండా జాగ్రత్తలు ►∙సురక్షిత చెల్లింపు కోసం (https://- URL) ప్యాడ్‌లాక్ సింబల్ చూడండి ►OTP / MPIN నంబర్లను కొనుగోలుదారు లేదా విక్రేతకు ఏ రూపంలోనూ భాగస్వామ్యం చేయవద్దు. ►మీరు ఫోన్‌కాల్‌లో ఉన్నప్పుడు హడావుడిగా చెల్లింపు లావాదేవీని ఎప్పుడూ చేయకండి. ►కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన ఏవైనా చిన్న లింక్‌లను క్లిక్ చేసి పూరించవద్దు. ►∙కొనుగోలుదారు లేదా విక్రేత అందించిన గూగుల్ ఫారమ్‌ల లింక్‌లను పూరించవద్దు. ►ఫోన్ కాల్లో ఉన్నప్పుడు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవద్దు, ►ఏదైనా బ్యాంకింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ఫోన్లలో స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్లను అంటే టఛిట్ఛ్ఛn జ్చిట్ఛ, అnyఈ్ఛటజు, ఖ్ఛీ్చఝ Vజ్ఛీఠ్ఛీట మొదలైన వాటిని ఉపయోగించవద్దు. ►గూగుల్ లేదా ఏదైనా సోషల్ మీడియాలో మీ యాప్ కస్టమర్ సపోర్ట్ నంబర్ల కోసం శోధించవద్దు. మీ యాప్ లేదా బ్యాంక్ అధికారిక వెబ్సైట్ నుంచి కస్టమర్‌కేర్ నంబర్‌ను తీసుకోవడం సురక్షితం. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఇన్‌స్టా‘గ్రామర్’ తెలుసా..?
ఫోటోలు, వీడియోలు షేరింగ్ కోసం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్స్టాగ్రామ్ ఒకటి. నచ్చినవాటిని పోస్ట్ చేస్తూ, నలుగురి మెప్పు పొందేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. షాపింగ్ కోసమైతే ఇప్పుడు ఇదో అతిపెద్ద వేదిక అని కూడా చెప్పవచ్చు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉండగా వీరిలో 30 శాతం మంది 18– 24 ఏళ్ల మధ్య ఉంటే, 32 శాతం మంది 25–32 ఏళ్ల మధ్య వారున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నవారు అందులోని గ్రామర్ గురించి కూడా తెలుసుకుంటే మోసాల బారినపడకుండా ఉండగలం. ప్రయోజనాలు మంచివే.. ∙బ్రాండ్లపట్ల అవగాహనను పెంచుతుంది. కస్టమర్లో నమ్మకాన్ని పెంచుతుంది. ∙అభిమానులను సంపాదించుకోవాలన్నా, కస్టమర్లను చేరుకోవాలన్నా సత్వర మార్గం అందుకు తగిన ఫొటో లేదా వీడియోను షేర్ చేయడం. ఇది చాలా సులువైన ప్రక్రియ. ∙నాణ్యమైన కంటెంట్‌ను పోస్ట్ చేయడం, ప్రశ్నలు అడగడం, ఫీడ్‌బ్యాక్ అందించడం ద్వారా కొత్త కస్టమర్లను సంపాదించవచ్చు. ఇది ఒక ప్రచార సాధనం కూడా. ఉత్పత్తులు లేదా సేవల కోసం షాపింగ్ చేయడానికి ఫాలోవర్లు, వెబ్సైట్ విజిటర్స్ పెరుగుతారు. ∙కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రచారాలను సృష్టించుకోవచ్చు. ∙ప్రయోజనాలు ఉన్నాయి కదా అని మన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే కోరి సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ∙వ్యక్తిగత జీవితాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు ట్రోల్ చేయబడే విధంగా వ్యక్తిగత కథనాలు, అభిప్రాయాల వ్యక్తీకరణలు, స్విమ్సూట్లలో ఉన్న ఫొటోలు, వీడియోలు వంటివి లేకుండా చూసుకోవడం ముఖ్యం. ∙మీరు షేర్ చేసే ఫొటోలు, వీడియోలపై వాటర్‌మార్క్‌లను ఉపయోగించండి. ∙మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే మీ అకౌంట్ కనిపించేలా సెట్టింగ్ చేసుకోవడం మంచిది. హద్దులను సెట్ చేయండి ∙భవిష్యత్తులో ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచే వ్యక్తిగత కథనాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు. ∙మనోభావాలను దెబ్బతీసే వాటిని ఎప్పుడూ పోస్ట్ చేయవద్దు ∙జాత్యహంకార, రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలను నివారించండి. ఇలా సురక్షితం ∙మీ చిరునామా, ఫోన్‌నంబర్, వ్యక్తిగత వివరాలను మీ సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రచురించవద్దు. ఎందుకంటే ఇది వాణిజ్య, సామాజిక ప్రయోజనాల కోసం వినియోగించబడుతుంది కనుక యాప్స్‌కి ఇవ్వబడిన యాక్సెస్ అధికారాలు మీకు నిజంగా అవసరమని నిర్ధారించుకున్నాకే ఓకే చేయడం మంచిది. ∙అవసరం లేని యాప్‌లను అలాగే ఫాలోవర్స్‌ని కాలానుగుణంగా తొలగించడం మేలు. ∙మీ ఫోన్ లో జిపిఎస్, బ్లూటూత్, పాస్వర్డ్లు, పిన్ లను సెట్ చేయండి. ∙యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవాలి. ∙ఆఫ్‌లైన్, ఆన్ లైన్ చర్యలకు, వ్యక్తీకరణలు ఒకే విధంగా పరిగణించాలి. డేటా రక్షణ ∙పెయిడ్ అప్లికేషన్ లను ఉపయోగించండి. అవి సాధారణంగా మాల్వేర్, ట్రాకర్లను బ్లాక్ చేస్తాయి. ∙పాస్వర్డ్లు, ఇ–మెయిల్, ఆన్లైన్ చెల్లింపులకు రెండు రకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. బ్యాంకు ఫోన్ నంబర్–సోషల్ మీడియా ఫోన్ నంబరు విడివిడిగా వాడటం ఉత్తమం. ప్రైవేట్‌గా ఉండాలంటే.. నేటి ప్రపంచంలో సోషల్ మీడియా లేని జీవితం అసంపూర్ణం అని తెలిసిందే. అయినప్పటికీ, చెడు చేసే ఉద్దేశాలు ఉన్నవారి కారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉండటమే పెద్ద లోపంగా భావిస్తున్నారు. అంతేకాదు, మోసగాళ్లను ఎదుర్కోవటానికి మార్గాలను తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మోసాలు ఇవీ.. ∙నకిలీ ఖాతాలను సృష్టించడం, నకిలీ ప్రకటనలను ప్రచురించడం ఇక్కడ చాలా సులభం. స్కామర్లకు ఇదో వరంలా మారింది. వారు చట్టబద్ధమైన బ్రాండ్ల నుండి ఉత్పత్తికి సంబంధించిన అన్ని ఫొటోలను దొంగిలిస్తారు. ఖాతాను సృష్టించిన తర్వాత కేవలం రెండు నిమిషాల్లో వారి నకిలీ ప్రకటనలతో ముందుకు వస్తారు. ∙ఇన్స్టాగ్రామ్ ప్రధానంగా నకిలీ/ప్రతిరూపం/సెకండ్ కాపీ వెబ్సైట్లకు ఒక మార్గంలా ఉపయోగపడుతుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే బదులు, నకిలీ వెబ్సైట్ల సృష్టికి దారి తీస్తారు. వాటి గురించి కొనుగోలుదారుకు తెలియదు. కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టే సోషల్ మీడియా వల్ల ప్రయోజనాలు, సమస్యలూ రెండూ ఉన్నాయి. ప్రయోజనకరంగా మార్చుకోవడం, సురక్షితంగా ఉండేలా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. షాపింగ్ స్కామ్‌లూ ఎక్కువే! ∙బాధితులు ఇన్ స్టాగ్రామ్‌లో పెద్ద బ్రాండ్ మొబైల్‌లు, వాచీల కోసం వెతుకుతారు. అవి సాధారణంగా క్లోన్ చేయబడిన లేదా కాపీ ఉత్పత్తులతో అకౌంట్లలో కనిపిస్తాయి. వీటిని ఎంచుకున్నప్పుడు స్కామర్లు తక్షణమే ప్రతిస్పందిస్తారు. ప్రొడక్ట్ ఫొటోలు /వీడియోలను పంపుతారు. బాధితులు అడ్వాన్స్‌లో 25% బుకింగ్ మొత్తంగా చెల్లిస్తారు. స్కామర్లు బుకింగ్‌ల నకిలీ స్క్రీన్ షాట్లను పంచుకుంటారు, ట్రాకింగ్ ఐడీలను అందిస్తారు. ఆ తర్వాత, డెలివరీ రోజున మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని అభ్యర్థిస్తారు. డెలివరీ రోజున, డెలివరీ చేసే వ్యక్తితో ఓటీపీని షేర్ చేయమని కోరుతూ మెసేజ్ వస్తుంది. చెల్లించిన తర్వాత, కొంతమంది స్కామర్లు నాణ్యత లేని కాపీ ప్రొడక్ట్స్‌ను పంపిస్తారు. కొంతమంది స్కామర్లు అసలే ప్రొడక్ట్స్‌ని పంపించకుండా అకౌంట్‌ను క్లోజ్ చేస్తారు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
‘పెళ్లాడబోయే వాడే’ కదా అని పర్సనల్ వీడియోలు షేర్ చేయడంతో..
Cyber Crime And Phone Addiction Prevention Tips: లాస్య (పేరు మార్చడమైనది) డిగ్రీ పూర్తి చేసింది. ఇటీవలే ఆన్లైన్లో వినీత్ (పేరు మార్చడమైనది)తో పరిచయం ఏర్పడింది. ఇంటర్నెట్లోనే చాటింగ్, వీడియో కాలింగ్‌తో రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి ఇద్దరికీ. ఇంట్లో కూడా వినీత్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇరువైపుల పెద్దలు ఆన్లైన్లో పరిచయాలు చేసుకున్నారు. నిశ్చితార్థం ముహూర్తం ఫిక్స్ చేసుకొని, ఆ రోజున కలుసుకుందామనుకున్నారు. చివరికి ఎంగేజ్మెంట్ దగ్గర పడుతున్నా లాస్య నిర్లిప్తంగా... ఏదో పోగొట్టుకున్నట్లు ఉంటుండడంతో తల్లిదండ్రులు విషయం ఏంటని ఆరాతీశారు. తను మోసపోయిన విధానం గురించి లాస్య ఎలాగూ నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలను వినీత్‌తో పంచుకుంటే.. వాటిని అడ్డు పెట్టుకొని ఇప్పుడు లక్షల రూపాయలు ఇవ్వమని వేధిస్తున్నాడని, లేదంటే వాటిని ఇతర సైట్లలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ భోరున ఏడ్చింది. ఏం చేయాలో తోచక తలలు పట్టుకున్నారు తల్లిదండ్రులు. డిజిటల్ మాధ్యమంగా అనుకోని పరిచయాల వల్ల జరిగే మోసాలు ఎన్నో. ;పదే పదే అదే పనిగా.. అనురాధ (పేరుమార్చడమైనది) ఆఫీసులో పనిలో ఉంది. కానీ, ఫోన్‌ని పదే పదే చూస్తోంది. మరో గంటలో ఫైల్ కంప్లీట్ చేసి, పై అధికారికి సబ్మిట్ చేయాలి. కానీ, ఉదయం అప్లోడ్ చేసిన పోస్ట్‌కి పెద్దగా స్పందన లేదు. ఏం చేయాలి?! కొత్తగా ఎవరైనా కామెంట్స్ పెట్టారా లేదా.. అని నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి ఫోన్ చూస్తూనే ఉంది. పని మీదకు ధ్యాస వెళ్లడం లేదు. సాధారణంగా శారీరక, మానసిక సమతుల్యంపై గతంలో దృష్టి పెట్టేవారు. ఇప్పుడు వీటికితోడు డిజిటల్ వెల్బీయింగ్ కూడా తోడైంది. అవగాహన లేమి కారణంగా డిజిటల్ మాధ్యమంగా ఆన్లైన్ వ్యసనానికి, రకరకాల మోసాల బారిన పడుతున్నవారి సంఖ్యా పెరుగుతుంది. ఎన్నోవిధాలుగా వచ్చే సమాచారం నిజమని నమ్మితే, ఆ తర్వాత జరిగే అనర్థాలు వేరు. డిజిటల్లో మంచిని తీసుకుంటూ, చెడును వదిలేస్తూ మన జీవనానికి ఉపయోగపడే సమాచారం తీసుకోవడానికి వెల్బీయింగ్ ఆఫీసర్ ఎందుకు అవసరమో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాదాపు రోజులో 6–7 గంటల పాటు ఫోన్‌కే సమయాన్ని కేటాయిస్తుంటారు. ఆన్లైన్లో ఉంటున్నవారిలో గృహిణులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఆఫీసులో ఉన్నవారు అక్కడి పని మర్యాదను ఎలా పాటించాలి, వ్యక్తిగత సమాచారాన్ని ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? పిల్లలు తమ చదువుకు సంబంధించిన విషయాల పట్ల ఎలా శ్రద్ధ చూపాలి... వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం. దీనిని చీఫ్ వెల్బీయింగ్ ఆఫీసర్ ద్వారా సాధించవచ్చు. డిజిటల్ క్షేమం... స్మార్ట్‌ఫోన్‌ని ఉదాహరణగా తీసుకుంటే.. ఇందులో అలారం గడియారం, కెమరా, నగదు ట్రాన్సాక్షన్లను భర్తీ చేసేసింది. మీరు దీని నుంచి దూరం అవ్వాలనుకున్నా కాలేరు. అయితే, వీటిమూలాన ప్రతికూల పరిణామాలూ తప్పవు. 1. అలవాటు–స్వీయ నియంత్రణతో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది. 2. సామాజిక బాధ్యతలలో బాహ్య ఒత్తిడి కూడా ఉంటుంది. 3. డిజిటల్ వెల్‌బీయింగ్‌ను అర్థం చేసుకోవడం, కుటుంబం, పని, వివిధ అవసరాలకు తగిన సాంకేతికతతో సమతుల్యతను సాధించడం అవసరం. 4. సాంకేతికతను ఉపయోగించడంలో సమయం పైనా దృష్టి పెట్టాలి. 5. డిజిటల్‌ను ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఆఫ్ చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. 6. ముఖ్యంగా పరధ్యానాన్ని తగ్గించాలి. ఒక్క క్లిక్... కేవలం అప్లికేషన్‌ను క్లిక్ చేయడం ద్వారా డిజిటల్ అనుభవాన్ని పొందలేం. వాటిని ఆచరణలో పెట్టడం ద్వారానే అనుకున్నవి సాధించవచ్చు. మానసిక ఆరోగ్యం కోసం చుట్టూ ఉన్న కొన్ని ప్రాంతాలు, ముందుగా ప్లాన్ చేసిన షెడ్యూల్, టైమ్ మేనేజ్మెంట్ సెషన్లను గుర్తించి, వాటిని ఉపయోగించుకోవచ్చు. భౌతిక శ్రేయస్సు కోసం డిజిటల్ వినియోగం అంతగాలేని పర్యటనలు, వ్యాయామాలు, ఉత్తరాలు.. వంటి వాటిమీద దృష్టి పెట్టవచ్చు. సోషల్ మీడియాను నిర్వహించడం, డిజిటల్ పేరెంటింగ్ వంటి డిజిటల్ శ్రేయస్సు చుట్టూ ఉన్న కొన్నింటిని ఉపయోగించుకోవచ్చు. ఉపయోగపడే యాప్‌లు మీరు రోజూ ఎన్నిగంటలు నిద్రపోతున్నారో తనిఖీ చేయడానికి స్లీప్ ట్రాకింగ్ యాప్‌లు ఉన్నాయి. డైటరీ ట్రాకింగ్ యాప్‌లతో భోజనాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కేలరీలను లెక్కించడం, హైడ్రేటెడ్‌గా ఉండాలని గుర్తుచేయడం.. వంటి పనులను ఆ యాప్స్ చేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు. లేచి కదలాలని లేదా యోగా లేదా సైక్లింగ్ వంటి యాక్టివిటీస్ చేయడంలో గైడ్ చేయాలని గుర్తు చేస్తాయి. ఆందోళన, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌ను ఎదుర్కోవడానికి విశ్రాంతి, ధ్యానం చేయడంలో మానసిక ఆరోగ్య యాప్‌లు సహాయపడతాయి. మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి స్క్రీన్ టైమ్‌ను సెట్ చేసుకోండి. డిజిటల్ సంక్షేమ అధికారి పాత్ర ఎందుకంటే... డిజిటల్ వెల్బీయింగ్ పాలసీని రూపొందిండంతోపాటు దానిని ఆచరించాలి. అమలు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎంతవరకు డిజిటల్ ఉపయోగపడుతుందో.. సమీక్షించుకోవాలి. మీ చుట్టూ ఉన్నవారిని కూడా గైడ్ చేస్తూ, మంచి పనులను ప్రోత్సహించండి. ఈ పనిని మీకు మీరుగా, కుటుంబంలో, స్నేహితుల్లో ఎవరైనా చేయచ్చు. - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫ్రీగా కోవిడ్ కిట్సా.. జాగ్రత్తగా ఉండండి!!
కీర్తి (పేరు మార్చడమైనది)కి రెండు రోజులుగా జలుబు, దగ్గు, కాస్త జ్వరంగా ఉంది. ఇంట్లో వాళ్లు కోవిడ్ ఏమో టెస్ట్ చేయించుకుంటే మంచిది అని పోరుతున్నారు. దానికి టెస్టింగ్ సెంటర్ వరకు ఎందుకు కిట్ తెప్పించుకుంటే సరిపోతుంది కదా! అని ఆన్లైన్లో శోధించడం మొదలుపెట్టింది. ఒక లింక్‌లో రూ.100 కే కోవిడ్ టెస్ట్ కిట్ అని చూసింది. కిట్ సమయానికి రాకపోతే మనీ బ్యాక్ కూడా చేస్తాం డీటెయిల్స్ ఇస్తే అని ఉంటే.. తన వివరాలన్నీ ఇచ్చింది. ఆ తర్వాత తన అకౌంట్ నుంచి డబ్బులు వేరేగా ట్రాన్స్ఫర్ అవడం చూసి బ్యాంక్‌ను సంప్రదించి, తను మోసపోయానట్టుగా తెలుసుకుంది. ∙∙ కరోనా మహమ్మారి ఒక విధంగా ప్రజలను భయభ్రాంతులను చేస్తుంటే మరో వైపు సైబర్‌నేరగాళ్లు రకరకాల పద్ధతులు ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాతో పాటు ఖాతా నుంచి నగదు కూడా దొంగిలిస్తున్నారు. మొదటి, రెండో వేవ్‌లలో బ్యాంకుల మారటోరియం గురించి వివరాలు సేకరిస్తున్నాం అంటూ, చారిటీ ఆర్గనైజేషన్ నుంచి చేస్తున్నాం అంటూ, మాస్కులు ఫ్రీగా ఇస్తున్నాం అని, ఆక్సిజన్ సిలండర్లు తక్కువ ధరకే అంటూ.. రకరకాల లింక్‌లను ఆన్లైన్ వేదికగా సెండ్ చేశారు. వాటి ద్వారా మోసపోయినవారూ ఉన్నారు. ∙∙ కోవిడ్ బూస్టర్ డోసులు, కోవిడ్ టెస్టింగ్ కిట్, డాక్టర్ ఆన్ హెల్ప్.. ఈ మూడింటిపై ఎక్కువ ఫ్రాడ్ జరుగుతున్నాయి. మీ కుటుంబంలో ఎవరికైనా కరోనా వస్తే 24 గంటలు మీకు ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది. అవసరమైతే మీకు మనిషిని కూడా ఏర్పాటు చేస్తాం, పేదలకు సాయం చేయండి అంటూ చారిటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. రూ.100లకే కోవిడ్ టెస్టింగ్ కిట్, తక్కువ ధరలో పల్స్ ఆక్సిమీటర్, స్మార్ట్ పల్స్ వాచ్, పోస్టర్ కిట్ ఎట్ హోమ్... ఇలాంటివాటిని ఆధారంగా చేసుకొని రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు సైబర్‌నేరగాళ్లు. (చదవండి: జెన్ జడ్... క్యాన్సిల్ కల్చర్.. యూత్‌ను పట్టేసింది!) మోసాల నుంచి జాగ్రత్త.. ► కోవిడ్ ఆధారిత వస్తువులను ఉచితంగా డెలివరీ చేస్తాం అనే ఎసెమ్మెస్, వాట్సప్ లింక్‌లు వస్తుంటాయి. వీటిని క్లిక్ చేయకుండా ఉండాలి. ► కోవిడ్–19ను ప్రస్తావిస్తూ వచ్చిన తెలియని ఇ–మెయిల్లను, లింక్‌లను, మ్యాప్‌లను క్లిక్ చేయరాదు. ► ఇ–మెయిల్, బ్యాంకింగ్ వాటికి విడివిడిగా రెండు ఫోన్ నెంబర్లను వాడటం మంచిది. ► మీ పాస్‌వర్డ్‌లను అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్వర్డ్లు సంక్లిష్టమైన వర్డ్స్‌తో ఉండేలా జాగ్రత్తపడండి. ► అక్షరదోషాలు, అదనపు పదాలు ఉన్న URLల పట్ల జాగ్రత్త వహించండి. ► విరాళం ఇచ్చే ముందు స్వచ్ఛంద సంస్థ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి. ► కోవిడ్–19 గురించిన తాజా సమాచారం కోసం చట్లబద్ధమైన, ప్రభుత్వ వెబ్సైట్లను ఉపయోగించండి. ► ఆన్లైన్ చాట్లు, సమావేశాలలో పాల్గొన్నప్పుడు మీరున్న నేపథ్య స్థానాన్ని బ్లర్ చేయడం, ఇతర చిత్రాలను ఉపయోగించడం మంచిది. - అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అయ్యో పాపం! రూ. 1 లక్ష విలువైన ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫ్యాక్‌లో..
ఆన్లైన్ షాపింగ్ చేసి ఖరీదైన వస్తువులను ఆర్డర్ చేస్తే, వాటి స్థానంలో సబ్బులు, ఇటుక రాళ్లు తెచ్చి చేతుల్లో పెట్టడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఈ రోజుల్లో ఆన్లైన్ మోసాలు పరిపాటైపోయాయి. తాజాగా యూకేకు చెందిన ఓ వ్యక్తికి ఇలాంటి చేదులనుభవమే ఎదురైంది. సదరు వ్యక్తి ఆన్లైన్లో ఐ ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. ఐతే ఫోన్‌కు బదులుగా 2 వైట్ కలర్ ఓరియో క్యాడ్బరీ చాక్లెట్లు ఆర్డర్ ప్యాక్‌లో ఉండటంతో చూసి లబోదిబోమన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన డానియెల్ కారోల్ దాదాపు రూ. 1,05, 000 లక్షల విలువైన ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ను ఆర్డర్ చేశాడు. ఆర్డర్ రావల్సిన తేదీకి రెండు వారాలు ఆలస్యంగా డెలివరీ అందింది. దానిని ఓపెన్ చేసిన డానియెల్ లోపల ఐ ఫోన్ లేకపోవడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయాడు. దాని స్థానంలో వైట్ టాయిలెట్ పేపర్ రోల్‌తో చుట్టిన 120 గ్రాముల వైట్ ఓరియో చాక్లెట్లు ఉన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో డానియెల్ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. పార్సిల్ తాలూకు ఫొటోలు కూడా షేర్ చేశాడు. డిసెంబర్ 2న యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఆర్డర్ చేశానని, డిసెంబర్ 17న డెలివరీ అందాల్సి ఉండగా అలా జరగలేదని ట్విటర్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన డీహెచ్ఎల్ డెలివరీ సర్వీస్‌ను సంప్రదించి రిప్లేస్ చేయవల్సిందిగా కోరింది. చదవండి: ‘తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే’ Hi Daniel if your are having an issue with your delivery please do DM us with your shipment number and full address so we can check out what has happened. Thanks, Helen https://t.co/HfmWwImQTE — DHLParcelUK (@DHLParcelUK) December 21, 2021 -
Facebook Scam: ‘ఈ వీడియోలో ఉంది మీరేనా?’
Facebook Messenger Video Link Scam Alert: ఆన్లైన్ మోసాలకు భారత్ నెంబర్ వన్ అడ్డాగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు పెరిగిపోవడం.. కనీస అవగాహన లేకపోవడం లాంటి కారణాలతో కొత్త తరహా ఆన్లైన్ స్కామ్‌లు తెర పైకి వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఫేస్బుక్ మెసేంజర్ వీడియో స్కామ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఫేస్బుక్ అకౌంట్ టార్గెట్‌గా జరిగే పిషింగ్ స్కామ్ ఇది. ఈ గాలంలో చిక్కితే గనుక.. ఫేస్బుక్ లాగిన్ క్రెడెన్షియల్స్ సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. తద్వారా ఆన్లైన్ మోసగాళ్లు ఫేస్బుక్ అకౌంట్లపై పట్టు సాధిస్తారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘సోఫోస్’ ఈ స్కామ్‌కు సంబంధించి హెచ్చరిక జారీ చేసింది కూడా. విశేషం ఏంటంటే.. ఐదేళ్ల క్రితం ఇదే తరహా స్కామ్ ఒకటి ఫేస్‌బుక్‌ను కుదిపేసింది కూడా. లింక్‌కి టెంప్ట్ అయితే.. ముందుగా ఫేస్బుక్ మెసేంజర్ (మెసేజ్ బాక్స్) కు ఓ లింక్ పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఆ లింక్ పైన ‘ఈ వీడియో ఉంది మీరేనా?’ అని రాసి ఉంటుంది. ఆ లింక్ యూబ్యూట్ లింక్ మాదిరి ఉంటుంది. కాబట్టి, చాలా క్యాజువల్‌గా యూజర్ క్లిక్ చేసే అవకాశం ఉంది. ఒక్కసారి గనుక క్లిక్ చేసినట్లయితే.. నేరుగా ఫేస్బుక్ లాగిన్‌కు వెళ్తుంది. ఒకవేళ ఫేస్‌బుక్‌లోకి లాగిన్ గనుక అయినట్లయితే.. కిస్సా ఖల్లాస్. ఫేక్ పేజీ.. అది ఫేస్బుక్ లాగిన్ పేజీ అనుకుంటే పొరపాటే!. పక్కా ఫేక్ పేజీ. యూజర్ ఇన్ఫర్మేషన్ను తస్కరించేందుకే ప్రత్యేకంగా అలా డిజైన్ చేసి పంపిస్తారు ఆన్లైన్ మోసగాళ్లు. ఒకవేళ అక్కడ లాగిన్ గనుక అయితే పాస్‌వర్డ్‌తో సహా అన్నీ వాళ్లకు తెలిసిపోతాయి. వెంటనే ఫేస్బుక్ అకౌంట్ మీద పట్టు సాధించి.. ఆపై బ్లాక్‌మెయిల్‌కు, మోసాలకు దిగుతారు. గుర్తుపట్టడం ఎలా? ఆ ఫేస్బుక్ లాగిన్ లింక్ ఫేక్ లేదా ఒరిజినల్ అని గుర్తుపట్టడం ఎలా?. వెబ్సైట్ యూఆర్ఎల్ ఒక్కటే మార్గం. లింక్ పైన యూఆర్ఎల్లో HTTPS లేదంటే HTTPతో మొదలైందంటే.. అది ఒరిజినల్ అని గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో సేఫ్ ప్రొటోకాల్ కింద వెబ్సైట్లు అన్నీ HTTPS యూఆర్ఎల్ను కచ్చితంగా ఫాలో అవుతున్నాయి కాబట్టి. మోసపోయి ఫిర్యాదులు చేయడం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చదవండి: మీ Whatsapp బ్యాన్ అని చూపిస్తుందా? పని చేయట్లేదా? ఇలా చేయండి -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు హెచ్చరిక
కరోనా కారణంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈజీ మనీ కోసం సైబర్ నేరస్తులు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. అయితే ఇప్పుడు సైబర్ నేరస్తులు పంథా మార్చి ఈపీఎఫ్ఓ అకౌంట్లలో మనీని కాజేసేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ అకౌంట్లలో మోసాలు బాగా పెరిగిపోయాయి. ఫేక్ ఈపీఎఫ్ లింక్‌తో ఓటీపీలతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఈపీఎఫ్ఓ సంస్థ హెచ్చరించింది. తాము ఈపీఎఫ్ఓ ప్రతినిధుల మంటూ కాల్స్ చేసి వ్యక్తిగత వివరాల్ని తీసుకుంటున్నారని, అలాంటి ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని సూచించింది. అంతేకాదు ఈపీఎఫ్ సర్వీసుల కోసం ఈపీఎఫ్ఓ సంస్థ ఖాతాదారుల నుంచి డబ్బులు సేకరించదని తెలిపింది. డిజిలాకర్‌తో భద్రం ఈపీఎఫ్ఓ సంబంధించిన సమస్యలపై ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్లో నివృత్తి చేసుకోవాలని కోరింది. అలా వ్యక్తిగత వ్యక్తిగత డాక్యుమెంట్లను డిజిలాకర్‌లో భద్రపరుచుకోవాలని తెలిపింది. క్లౌడ్ ఆధారిత ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్ సురక్షితంగా ఉంటుందని, అందులో మీ డాక్యుమెంట్లను భద్రపరుచుకోవాలని కోరింది. -
డిజిటల్ లావాదేవీలపట్ల జాగ్రత్త: ఎస్బీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ లావాదేవీలపట్ల బ్యాంక్ వినియోగదార్లు జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. తెలియని నంబర్లు, ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ) చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ సూచించారు. ‘కస్టమర్లకు ఎస్బీఐ ఎటువంటి లింక్స్ పంపదు. ఓటీపీ చెప్పాలంటూ ఫోన్ ద్వారా మా బ్యాంక్ సిబ్బంది కోరరు. బ్యాంక్ శాఖ ద్వారానే లావాదేవీలు ఉంటాయి. ఓటీపీలు, సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదు’ అని వివరించారు. ఎస్బీఐ ‘మీటింగ్ కస్టమర్స్’ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాల యానికి గురువారం ఆయన విచ్చేశారు. చాలా ఏళ్లుగా సాక్షి మీడియా గ్రూప్ తమ కస్టమర్‌గా ఉం దని గుర్తుచేశారు. అద్భుతమైన సంస్థకు రావ డం ఆనందంగా ఉందన్నారు. సీజీఎంతోపాటు బ్యాంక్ అధికారులు సురేంద్ర నాయక్, పి.ఎల్.శ్రీనివాస్ రావు, పల్లవి శర్మ, మారుతి, సంతోష్ ఉన్నారు. -
వర్క్ ఫ్రం హోం: కొత్త తలనొప్పులు తప్పవా?
కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఆన్లైన్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కంపెనీ బోర్డుల్లోని స్వతంత్ర డైరెక్టర్లు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ భాగస్వామ్యంతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ‘కార్పొరేట్ మోసాలు, దుర్వినియోగం: ఇండింపెండెంట్ డైరెక్టర్ల పాత్ర’ పేరుతో ఈ సర్వే వివరాలను డెలాయిట్ బుధవారం విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న స్వతంత్ర డైరెక్టర్లలో 63 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఆన్లైన్ మోసాలు పెరగొచ్చని చెప్పారు. ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తుండడం, నగదు ప్రవాహాల సమస్యలు మోసాలు పెరిగేందుకు కారణం కావచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లకు సంబంధించి ఎక్కువ మోసాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. మోసాలను నివారించేందుకు, గుర్తించే విషయంలో తాము ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని 75 శాతం మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు తెలిపారు. మోసాల రిస్క్‌ను నివారించే విషయంలో పటిష్టమైన కార్యాచరణను కంపెనీ బోర్డు అమలు చేస్తోందని 57 శాతం మంది చెప్పారు. వ్యాపార నిర్వహణ పరిస్థితులు శరవేగంగా మార్పునకు గురవుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ రిస్క్ నిర్వహణ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే పేర్కొంది. చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ -
ఆర్బీఐ: ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు!!
ఖాతాదారుల నుంచి నెలనెలా ఆటోమేటిక్‌గా డబ్బు కట్టింగ్లు అయ్యే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఖాతాదారు నుంచి అదనపు ధృవీకరణ తర్వాతే డబ్బులు కట్ అవుతాయని పేర్కొంది. ఇందుకోసం బ్యాంకుల తరపు నుంచి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని పేర్కొన్న ఆర్బీఐ.. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(AFA). యూజర్ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే.. చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ప్యాకేజీ రెన్యువల్ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఇక మీదట అలా కుదరదు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయనుంది. హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాకింగ్ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్ఏ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్లైన్ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. కార్డులతో పాటు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI), ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చెల్లింపులకు వర్తించనుంది. క్లిక్: Cryptocurrency- ఆర్బీఐ ఆందోళన ఇక ఏఎఫ్ఏ పద్దతిలో చెల్లింపుల ద్వారా భద్రతపరమైన డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో, మొదటి ట్రాన్జాక్షన్, ప్రీ ట్రాన్జాక్షన్ నోటిఫికేషన్, విత్‌డ్రా కోసం ఏఎఫ్ఏ తప్పనిసరని, ఇదంతా యూజర్ భద్రత కోసమేనని ఆర్బీఐ అంటోంది. ఈ రూల్అమలులోకి రాగానే.. బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో అమలు చేయాలనుకుంటున్న AFA పద్దతిని.. త్వరలో మిగతా అంశాల్లోనూ విస్తరించే విషయం కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. చదవండి: ఉల్లి ధరలు పెరగనున్నాయా? ఎందుకంటే.. -
ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతాయంటే...
విజయ్ కృష్ణ, సంజనా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అలర్ట్’. మూర్తి కొడిగంటి దర్శకత్వంలో మల్లిఖార్జున్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఆన్లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై సినిమా ఉంటుంది’’ అన్నారు విజయ్ కృష్ణ. ‘‘వాస్తవ ఘటనతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు మల్లిఖార్జున్. ‘‘అలర్ట్’ కథతో షార్ట్ ఫిల్మ్ చేశాం.. అది అందరికీ నచ్చడంతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు మూర్తి కొడిగంటి. -
మీ నంబర్ ఇకపై పని చేయదు అంటూ..
సాక్షి, హిమాయత్ నగర్: మీరు వాడుతున్న ఫోన్ నంబర్ మరికొద్దిసేపటిలో క్లోజ్ అవుతుందని ఓ వ్యక్తికి మెసేజ్ వచ్చింది. కంగారు పడ్డ వ్యక్తి మెసేజ్ వచ్చిన నంబర్ కు ఫోన్ చెయ్యడంతో ఆన్ లైన్ ప్రక్రియతో రూ.61వేలు లూటీ చేసిన సంఘటన నారాయణ గూడ పీఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. క్రైమ్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నారాయణ గూడ విఠల్ వాడిలో ఈ సంఘటన జరిగింది. ఎయిర్‌బస్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే సూర్య విక్టర్ ప్రతాప్ కు 9339635199 ఈ నంబర్ నుంచి మీరు వాడుతున్న ప్రస్తుత నంబర్ ఆగిపోతుందని మెసేజ్ వచ్చింది. కంగారు పడ్డ ఆయన వచ్చిన నంబర్ కు ఫోన్ చేసాడు. వాళ్లు క్యూక్ వ్యువర్ యాప్ఙ్ డౌన్ లోడ్ చేసుకోమన్నారు. అది చేసుకోగానే అతని అకౌంట్ నుంచి ముందుగా రూ.14,987 , రెండవసారి ఫోన్ పే యాప్ నుంచి రూ.46,514 కట్ అయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఆన్లైన్లో సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
సాక్షి, హైదారాబాద్: మీరు రోజూ ఆన్లైన్లో ఎంతసేపు గడుపుతున్నారు? ఎన్ని వెబ్సైట్లు చూస్తున్నారు? ఏయే కార్యకలాపాలు నిర్వహించారు.. తదితర వ్యవహారాలన్నీ మన బ్రౌజింగ్ హిస్టరీలో ఉంటాయి. అయితే ఇకపై ఎప్పటికప్పుడు మీ బ్రౌజింగ్ హిస్టరీని పూర్తిగా డిలీట్ చేసుకోండి. ముఖ్యంగా పర్సనల్ కంప్యూటర్ కాకుండా వేరేచోట్ల కంప్యూటర్ వాడాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఈ పని చేయాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా మీ డేటా, బ్యాంకు ఖాతాల్లో సొమ్మును కాపాడుకోవచ్చని చెబుతున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ దాడులు, ఆన్లైన్ నేరాలు, మోసాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండేందుకు పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కొంతకాలంగా మ్యాజిక్‌వీల్, జాబ్స్, లోన్, డీమార్ట్ ఆఫర్లు, వాలెంటైన్స్ డే గిఫ్టులు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరిట అనేక మోసాలు వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా లాక్డౌన్ అనంతరం డేటా వినియోగం పెరగడంతో సైబర్ నేరగాళ్ల అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. కరోనా సృష్టించిన అనివార్య పరిస్థితుల కారణంగా అవసరం లేని వారు కూడా స్మార్ట్‌ఫోన్ వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సైబర్ మోసాల పాలిట పడే బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తం చేసేందుకు తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారానికి తెరతీశారు. సైబర్ కేసుల దర్యాప్తును అదనపు సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. 2020లో 4,544 సైబర్ కేసులు నమోదవడంతో ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలోనూ సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సా మాజిక ఖాతాల ద్వా రా సైబర్ మోసా లపై లఘు చిత్రాలు, నేరాల గురించి వివ రించే పోస్టులను ప్ర జలకు చేరువయ్యే లా షేర్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మొబైల్ ఫోనే మోసగాళ్ల ఆయుధం.. లాక్డౌన్ తర్వాత సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. తెలంగాణలోనూ కరోనా భయానికి భౌతికదూరం పాటించడం, కరెన్సీ వినియోగం తగ్గించడంతో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న నేరగాళ్లు మొబైల్ఫోన్ల ద్వారా అమాయకులకు ఎరవేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల వద్ద నమోదవుతున్న నేరాల్లో 90 శాతం మొబైల్ ఫోన్ల ఆధారంగానే జరుగుతున్నాయి. అందుకే ప్రతి మొబైల్ వినియోగదారుడు కింది జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. యాప్ లేదా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. అవి మీ కాంటాక్ట్స్, ఫోన్, వీడియోలు, ఇతర యాప్‌లపై అజమాయిషీ అడుగుతుంటాయి. అలాంటి వాటిని తిరస్కరించండి. లేకపోతే వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి. ప్రతి మొబైల్లోనూ భద్రతా యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోండి. ఇవి మీ మొబైల్లోని ప్రతి యాప్‌ను తనిఖీ చేస్తుంది. దురదృష్టవశాత్తూ మీ ఫోన్ పోయినా, ఎవరైనా దొంగిలించినా.. దాన్ని తిరిగి కనిపెట్టడంలో కూడా ఇవి సాయపడుతాయి. మీ మొబైల్ లేదా వాట్సాప్ లేదా ఈ–మెయిల్‌కి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బహుమతులు, హాలీడే ట్రిప్పులు, అనుమానాస్పద యూఆర్ లింకులు పంపిస్తుంటారు. వీటిని క్లిక్ చేయకండి. చేస్తే దొంగల చేతికి తాళం చెవి ఇచ్చినట్లే. మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. దాని వల్ల మీ డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ భద్రంగా ఉంటాయి. ఉచిత వైఫైలు వాడకండి. అలాంటి వైఫైల కారణంగా మన ఫోన్ మనకు తెలియకుండానే సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఎనీ డెస్క్, టీం వ్యూయర్ లాంటి యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయకండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు వీటి సాయంతో మీ ఖాతాలను క్షణాల్లో ఖాళీ చేయిస్తారు. చదవండి: సినిమా థియేటర్లో బాంబు ఉందని నకిలీ ట్వీట్.. -
ఖాతాదారుడు మరణిస్తే బ్యాంక్‌కు తెల్పాలి..
సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకు ప్రతినిధులమంటూ ఫోన్ చేసి ఖాతాదారుడి బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా డబ్బులు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు...ఇప్పుడూ పంథా మార్చి చచ్చిన వాళ్లను కూడా వదలడం లేదు. వారి బ్యాంక్ ఖాతాల వివరాలు తెలుసుకుని మోసపూరిత విధానంలో రుణాలు పొందిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందనే లోతుల్లోకి వెళితే..మృతుడి దగ్గరి నుంచి అతడు పనిచేసిన కార్యాలయం, మొబైల్ స్టోర్, బ్యాంకు కార్యాలయం..ఇలా అన్నీచోట్లా చేసిన చిన్న చిన్న తప్పిదాలే లక్షల్లో డబ్బులు స్వాహాకు కారణమయ్యాయని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఐటీ ఉద్యోగుల జీతం భారీగా ఉండటం, వారికి రుణాలు సులభంగా మంజూరుకు సిబిల్ స్కోరు బాగుండడంతో వీరిపై కన్నేసిన నేరగాళ్లు ప్రతిరోజూ దినపత్రికలు చదివేవారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తూ మరణించిన ఐటీ ఉద్యోగుల వార్తలు చదివి ఆ తర్వాత సోషల్ మీడియాలో వారి పేరుతో ప్రొఫైల్స్ వెతికి వ్యక్తిగత, కెరీర్ వివరాలు తెలుసుకునేవారు. ఒకవేళ ఆ ప్రొఫైల్స్‌లో మృతుడి సెల్‌నంబర్ దొరకకపోతే, వారి కార్యాలయానికో, లేదంటే మృతుడు చికిత్స పొందిన ఆసుపత్రి వద్దకు వెళ్లి ఏదో కారణం చెప్పి ఆ సెల్‌నంబర్ దొరకబుచ్చుకునేవారు. ఆ తర్వాత నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, డూప్లికేట్ సిమ్‌లు పొంది బ్యాంకుల నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్లు, క్రెడిట్ కార్డులు పొందేవరకు ఎక్కడా ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన ప్రమాదాల్లో మరణించిన ఐటీ ఉద్యోగుల వార్తలను దినపత్రికల్లో చదివి సోషల్ మీడియాలో శోధించి రూ.53,95,043 కొల్లగొట్టిన ఆరుగురు సభ్యులతో కూడిన ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐటీ ఉద్యోగులే కాకుండా ప్రతిఒక్కరూ సైబర్ నేరాలబారిన పడకుండా జాగ్రత్తపడాలని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఎంతో బెటర్... ♦ సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఎవరితో షేర్ చేయవద్దు. ఒకవేళ ఉన్నా అందరికీ కనబడకుండా ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ♦ గూగుల్‌లో ఒకటికి రెండుసార్లు వ్యక్తిగత వివరాలు ఏమైనా ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే అర్కుట్, గూగుల్ ప్లస్, ఫేస్బుక్, ట్విట్టర్...ఇలా ఏదైనా ఎక్కడా ఒక్కదాంట్లో ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోకపోవడం వల్ల ఆ వివరాలు ఇతరులకు తెలిసే అవకాశముంది. ♦ అపరిచితులకు స్నేహితుల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీలు చెప్పొద్దు ♦ ఆయా కంపెనీలు కూడా తమ ఉద్యోగుల వివరాలు ఇతరులెవరికీ చెప్పొద్దు ♦ సరైన తనిఖీ లేకుండా టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ డూప్లికేట్ సిమ్ కార్డులు ఇవ్వొద్దు ఖాతాదారుడు మరణిస్తే బ్యాంక్‌కు తెల్పాలి.. మరణించిన ఐటీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలతో సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్న నేపథ్యంలో ఆయా కంపెనీలు, లేదంటే మృతుడి కుటుంబ సభ్యులు ఖాతాదారు మరణించిన విషయాన్ని బ్యాంకు అధికారులకు తెలపాలి. ఇలా చేయడం వల్ల ఆ ఖాతాలపై అధికారుల నిఘా ఉండి ప్రీ అప్రూవ్డ్లోన్లు, క్రెడిట్‌కార్డుల రుణాల మోసం జరిగేందుకు అస్కారముండదు.ఒకవేళ ఎవరైనా వచ్చి వాకబు చేసినా అపరిచితులైతే ఇట్టే దొరికే అవకాశముంటుంది. అలాగే బ్యాంక్ ఖాతా నంబర్, కస్టమర్ ఐడీ, ఈ మెయిల్ ఐడీ ఎవరికీ పడితే వారికి బ్యాంక్ సిబ్బంది చెప్పొద్దు. వివరాలు అడిగే వ్యక్తి సరైనోడా, కాదా అని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతరుల క్రెడిట్, డెబిట్ కార్డులను పొందుతున్న మోసగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే ఆన్లైన్లో క్రెడిట్, డెబిట్ కార్డుల జారీకి మరిన్ని కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంక్ సిబ్బందికి మోసాలపై అవగాహన కలిగించాలి. ఇలా అప్రమత్తతో సైబర్ నేరాలు జరగకుండా నియంత్రించే అవకాశముంటుందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. -
సైబర్ మోసాలపై టెకీల పోరు
బెంగళూరు: సైబర్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టెక్నాలజీ సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ట్రావెల్ సేవల సంస్థలు మేక్మైట్రిప్ గ్రూప్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్.. మొబైల్ చెల్లింపుల సంస్థ పేటీఎం, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటోలతో పాటు ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ మొదలైనవి ఇందుకోసం జట్టు కట్టాయి. సైబర్ మోసాల తీరుతెన్నులు, నివారణ తీసుకోతగిన చర్యలపై చర్చించేందుకు ఈ సంస్థలు గతవారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా సమావేశమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసపూరిత టోల్ ఫ్రీ నంబర్లు మొదలైన మార్గాల్లో మోసాలు జరుగుతున్న తీరును అవి వివరించినట్లు పేర్కొన్నాయి. అమాయక కస్టమర్లను మోసగించేందుకు ఉపయోగిస్తున్న 4,000 పైచిలుకు సిమ్ కార్డు నంబర్లు, 350–400 దాకా బ్యాంకు ఖాతాల వివరాలను రిజర్వ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం కంపెనీలకు కూడా అందించినట్లు వివరించాయి. అటు నకిలీ టోల్ ఫ్రీ నంబర్లు పేజీలో ప్రముఖంగా పైన కనిపించే విధంగా నేరగాళ్లు ఏ విధంగా సెర్చి ఇంజిన్‌ను దుర్వినియోగం చేస్తున్నదీ టెక్ దిగ్గజం గూగుల్‌కు కూడా ఆయా టెక్ దిగ్గజాలు తెలియజేశాయి. సాధారణంగా ఇలా సెర్చి ఇంజిన్ పేజీలో పైన ప్రముఖంగా కనిపించే నకిలీ టోల్ ఫ్రీ నంబర్లను వినియోగదారులు అసలైనవిగా భావించి.. మోసాల బారిన పడుతున్న ఉదంతాలు అనేకం నమోదవుతున్నాయి. ఎస్బీఐకు లేఖ.. గత కొద్ది వారాలుగా ఈ ఇంటర్నెట్ కంపెనీలు.. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో పాటు టెలికం రంగానికి చెందిన ఎయిర్టెల్ తదితర సంస్థలతో కూడా సమావేశాలు జరుపుతున్నాయి. ప్రభుత్వ రంగంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఆన్లైన్ కంపెనీలు లేఖ రాశాయి. ఎస్బీఐ ఖాతాలను ఉపయోగించి భారీ స్థాయిలో జరుగుతున్న సైబర్ మోసాల గురించి తెలియజేశాయి. అమాయక ఖాతాదారులను మోసగించేందుకు.. కీలకమైన వారి అకౌంట్ల వివరాలను తెలుసుకునే నేరగాళ్లు చాలామటుకు ఎస్బీఐ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు వివరిం చాయి. ఎస్బీఐ భారీ బ్యాంకు కావడంతో ఇలాంటి వారిని పట్టుకోవడం కష్టతరం కావొచ్చని టెక్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఈ మోసాలను అరికట్టడానికి తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చాయి. రాబోయే రోజుల్లో మరిన్ని టెక్ కంపెనీలు ఈ సంస్థలతో జట్టు కట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోసాలు ఇలా.. ఎక్కువగా పట్టణేతర ప్రాంతాల వారు, సీనియర్ సిటిజన్లు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడుతున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఖాతాగా భ్రమింపచేసే అకౌంటు నుంచి ఎస్ఎంఎస్లు పంపించడం ద్వారా నేరగాళ్లు మోసాలకు తెరతీస్తున్నారు. సిసలైన కంపెనీగా కనిపించినప్పటికీ.. ఇలాంటి పోర్టల్ పేర్లలో ఎక్కడో ఒకటో అరా తేడాలుంటున్నాయి. ఉదాహరణకు.. మేక్‌మై ట్రిప్ పోర్టల్ వంటి పోర్టల్స్ పేర్లలో నకిలీ సైట్లు అదనంగా మరో అక్షరం చేరుస్తున్నాయి. ఆకర్షణీయ బహుమతుల ఆఫర్లతో తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఇలాంటి మెసేజ్‌లను వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఆయా లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా మోసాల బారిన పడుతున్నారు. -
చంద్రన్న బీమా పేరుతో ఆన్లైన్ మోసం
-
‘చంద్రన్న బీమా’ నుంచి కాల్.. లక్ష పేరిట టోకరా!
సాక్షి, అమరావతి: చంద్రన్న బీమా పథకం పేరుతో ఓ యువకుడికి టోకరా ఇచ్చారు ఆన్ లైన్ కేటుగాళ్లు. అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానిపల్లికి చెందిన గురుప్రసాద్ అనే యువకుడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘విజయవాడ చంద్రన్న బీమా వింగ్ నుంచి ఫోన్ చేస్తున్నాం. మీకు లక్ష రూపాయల విడుదలయ్యింది. మీ అకౌంట్ నెంబర్‌తో పాటు ఏటీఎం డిటైల్స్ అందించాలి’ అని మోసగాళ్లు కోరారు. చంద్రన్న బీమా డబ్బులు వస్తాయని ఆశపడిన ఆ యువకుడు.. ఏటీఎం డిటైల్స్ అందించారు. అంతే తన అకౌంట్లోని 40 రూపాయలు మాయమయ్యాయని వాపోతున్నాడు బాధితుడు. మోసపోయానని తెలుసుకున్న గురుప్రసాద్ పోలీసులను ఆశ్రయించాడు. -
లక్కీడ్రా అంటూ ఫ్లిప్‌కార్ట్ పేరుతో టోకరా..
జనాల బలహీనతే వారి పెట్టుబడి.. ఆశ చూపి మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గిఫ్ట్ తగిలిందని ఫలానా అకౌంట్లో డబ్బు జమ చేస్తే పంపుతామంటూ తియ్యటి మాటలతో మాయ చేస్తారు. వారు అనుకున్నట్టుగా డబ్బు పడగానే ఫోన్ స్విచ్చాఫ్ చేస్తారు. ఇదీ ఆన్లైన్లో జరుగుతున్న మోసాల తంతు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నా జనాల్లో మార్పు రావడం లేదు. ఫలితంగా ఆన్లైన్ మాయగాళ్ల చేతిలో మోసపోతూ పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అనంతపురం, శింగనమల: ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువుకు రూ.15 లక్షలు బహుమతి తగిలిందని, తాము చెప్పిన మొత్తం అకౌంట్లో జమ చేస్తే రూ.15 లక్షల నగదు లేక రూ.15 లక్షల విలువజేసే కారు అందిస్తామని చెప్పారు. ఈ మేరకు వాట్సప్‌లో కార్డు కూడా పంపారు. తీరా అకౌంట్లో డబ్బు వేశాక ఫోన్ ఎత్తకుండా మానేశారు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకెళితే..మండలంలోని తరిమెల గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కరెంట్ కాంట్రాక్ట్ పని చేసేవాడు. మూడు నెలల క్రితం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.459 పెట్టి బ్లూటూత్ కొనుగోలు చేశాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో 9870511627 నంబర్ నుంచి శ్వేతాశర్మ పేరుతో ఫోన్ వచ్చింది. జార్కండ్ నుంచి ఫోన్ చేస్తున్నట్లు తెలుగులో మాట్లాడింది. ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేసిన వారి ఐడీలతో సంస్థ లక్కీ డ్రా తీసిందని, ఇందులో మీకు రూ.15 లక్షలు తగిలిందని చెప్పుకొచ్చింది. రూ.15 లక్షల నగదు మీ ఖాతాలోకి వేయాలంటే ముందుగా రూ.15 వేలు తమ ఖాతాలోకి జమ చేయాలని సూచించింది. నగదు జమ అయిన అరగంటలో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పింది. ఒకవేళ రూ.15 లక్షల నగదు వద్దనుకుంటే రూ.15 లక్షల విలువజేసే మహీంద్ర ఎక్స్‌యూవీ 500 కారు అందిస్తామని, ఇందుకు రూ.15,500 జమ చేయాల్సి ఉంటుందని వివరించింది. ఇందుకు సంబంధించిన కారు ఫొటో, లక్కీడ్రా ఎంపికైన పత్రాలను వాట్సప్ (7256812304) ద్వారా పంపింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన సురేష్ గూగుల్ పే ద్వారా రూ.15,000 ఆమె సూచించిన ఖాతాలో జమ చేశాడు. గంట పాటు ఎదురుచూసినా డబ్బు జమకాకపోవడంతో అతడు పై నంబర్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ రింగవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు. చివరకు తాను మోసపోయినట్లు గుర్తించి శింగనమల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని, నిందితులు వాడిన ఫోన్ నంబర్ బిహార్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించినట్లు ఎస్ఐ ప్రసాద్‌బాబు తెలిపారు. -
మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పమంటారా..?
హలో.. గుడ్‌మార్నింగ్... మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పమంటారా..? 1111 కదా.. ఏంటి షాక్‌కు గురయ్యారా..? ఓకే.. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పనా..? 1234.. అవాక్కయ్యారా..? మీ వివరాలు మాకెలా తెలిసాయని ఆలోచిస్తున్నారా.? కంగారు పడకండి. మిమ్మల్ని మేం ఫాలో అవ్వడం లేదు. కానీ.. ఎలా తెలుసుకున్నామనే కదా.. మీ డౌట్.? ఏం లేదండీ.. మీరే కాదు.. ప్రతి పది మందిలో ఐదుగురు ఇవే పాస్వర్డ్లు వినియోగిస్తున్నారు. మీ విషయంలో ఓ రాయి వేశాం. అంతే...!!! హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకోకండి. ఇప్పుడు కాస్తా ఊరటగా అనిపించినా.. మీ వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం వాటిల్లుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఓ హెచ్చరిక ఇస్తున్నాం. ఇక మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే.. నగరంలో.. దాదాపు అందరూ ఇదే తరహా తప్పులు చేస్తున్నారు. నిద్రలో లేచి అడిగినా గుర్తుంటుందనీ, వేరే నంబర్ పెడితే మర్చిపోతామని.. చాలా మంది ఒకే తరహా పిన్ నంబర్లు, పాస్వర్డ్లు వినియోగిస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. 1234 అధికంగా.. చాలా మంది పుట్టిన రోజు తేదీని, జాబ్‌లో జాయిన్ అయిన తేదీని రహస్య కోడ్‌గా వినియోగిస్తున్నారు. ఇలా చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ కొలీగ్స్, సహచరులకు మీరు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పం డని హెచ్చరిస్తోంది.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్‌వర్డ్‌లకు పరిమితమైపోతున్నారని తేలిం ది. ఈ నివేదిక ప్రకారం.. నగరంలో ఎక్కువ మంది వాడుతున్న పిన్ నంబర్, పాస్వర్డ్ 1234. ఆ తర్వాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంతో కష్టమైంది పెడుతున్న చాలా మంది.. డబ్బులకు సంబంధించిన లావాదేవీలు జరిపే డెబిట్, క్రెడిట్ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచి ఉన్న స్మార్ట్ఫోన్లకు మాత్రం సులువైన పిన్ నంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. సైబర్ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. చాలా మంది తమ పుట్టిన రోజు తేదీని, సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు పాస్వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నంబర్లు 10 వేల వరకూ ఉన్నాయి. కానీ.. వందలో సగం మంది 10వేల నాలుగంకెల సంఖ్యల్లో కేవలం 500 నంబర్లు మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. ఇలా వాడటం వల్ల ఏటీఎం కార్డు పోయినా, చోరీకి గురైనా.. సులువుగా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు కలుగుతోంది. నగర వాసులు ఎక్కువగా వినియోగిస్తున్న పాస్వర్డ్లు, పిన్ నంబర్లు ఇవేనని సంస్థ చెబుతోంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010 తస్మాత్ జాగ్రత్త పిన్ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే.. నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్ విషయంలోనే కాదు.. మిగిలిన విషయాల్లోనూ జాగరూకతతో వ్యవహరించాలి. తద్వారా మీ డబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్‌డ్రా అయితే.. అందుకు బ్యాంకు బాధ్యత వహించదన్న విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడ్డా పోయిన డబ్బు రాదు. ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. అదే విదంగా పిన్ నంబర్ ఎంటర్ చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించినట్లైతే.. మీ లావాదేవీలను వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో చేతిని అడ్డం పెట్టుకోవడం, లేకపోతే.. ఇతరులకు కనబడకుండా జాగ్రత్తపడితే మంచిది. వేరే వ్యక్తులు మీకు సహాయం చేస్తామని వచ్చినప్పుడు తిరస్కరించండి. వారు బలవంతం పెడితే.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందివ్వండి. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతామేమోననే ఉద్దేశంతో పౌచ్‌లో పిన్ నంబర్ కూడా రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు.. కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోండి సుమా. అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ య్యాయి. అపరి చితులతో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి సెల్‌కు ఓటీపీ నెంబర్ వస్తుందని, దాన్ని చెప్పాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదు. అలా చెబితే బ్యాంకు ఖాతాలోని మొత్తం డబ్బు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏటీఎం కేంద్రాల్లో డబ్బు అపరిచిత వ్యక్తులకు కార్డులు ఇవ్వొద్దు. తెలిసిన వారైతేనే డబ్బు డ్రా చేసుకునేందుకు సహాయం తీసుకోండి. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకుంటాం. సైబర్ నేరాగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి. – ఎం.చిదానందరెడ్డి, మదనపల్లె డీఎస్పీ -
100 అడిగి..రూ. లక్ష నొక్కేసింది
సాక్షి, హైదరాబాద్: హఠాత్తుగా వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది.. తన పేరు నిధి పాండేగా పరిచయం చేసుకుంది.. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత చీటింగ్‌కు తెరలేపింది.. తనకు రూ.100 అవసరమంటూ ఆన్లైన్లో బదిలీ చేయించుకుంది.. ఆపై అసలు కథ ప్రారంభించి రూ.1.18 లక్షలు కాజేసింది.. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బాధితుడు అసలు వివరాలు బయటకు చెప్పడం లేదని భావిస్తున్నారు. హిమయత్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ ఉద్యోగికి ఇటీవల వాట్సాప్‌లో ఓ సందేశం వచ్చింది. తన పేరు నిధి పాండేగా ఓ యువతి పరిచయం చేసుకుంది. కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తనకు అత్యవసరంగా రూ.100 కావాలని కోరింది. వాటిని బదిలీ చేయమంటూ తన బ్యాంకు ఖాతా వివరాలు అందించింది. దీంతో బాధితులు ఆమొత్తం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆమెకు బదిలీ చేశాడు. ఇది జరిగిన మరుసటి రోజు అర్ధరాత్రి తన నెట్ బ్యాంకింగ్ ఖాతాలోకి వెంకటేష్ అనే వ్యక్తి బెనిఫిషియర్‌గా యాడ్ అయ్యాడని, ఆపై కొన్ని గంటల వ్యవధిలోనే తనఖాతాలో ఉండాల్సిన రూ. 1.18 లక్షలు అతడి ఖాతాలోకి బదిలీ అయ్యాయని సైబర్ క్రైమ్ పోలీసులకు చెప్పాడు. తన సెల్‌ఫోన్‌కు ఎలాంటి వన్‌టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) రాలేదని, నగదు బదిలీకి సంబంధించిన సందేశం మాత్రం వచ్చిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే పోలీసులు మాత్రం అలా నగదు బదిలీ చేసుకోవడం సాధ్యం కాదని చెబుతున్నారు. బాధితుడు నిధితో తాను ఉత్తరప్రదేశ్‌కు చెందిన వాడినని చెప్పడంతో ఇరువురూ స్నేహంగా మారి ఉంటారని, ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లు చాటింగ్ తర్వాత ఇతడు తన నెట్ బ్యాకింగ్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ తదితరాలు ఇచ్చి ఉంటాడని భావిస్తున్నారు. వీటిని వినియోగించుకున్న నిధి బెనిఫిషియర్‌ను యాడ్ చేయడంతో పాటు సెల్‌ఫోన్ నెంబర్ కూడా మార్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితుడికి రావాల్సిన ఓటీపీ ఆ నెంబర్‌కు వెళ్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ లోతుగా ఆరా తీస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆ నలుగురు.. అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి సిటీలో తిష్టవేసిన పాకిస్థానీ మహ్మద్ ఇక్రమ్‌తో పాటు అతడికి నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందించిన కరీంనగర్‌కు చెందిన లెక్చరర్ మక్సూద్, దళారులు కిర్మాణి, ఖాజాలను సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నలుగురినీ గత వారం అరెస్టు చేసిన విషయం విదితమే. తదుపరి విచారణలో భాగంగా మరిన్ని వివరాలు, ఆధారాలు సేకరించాల్సి ఉండటంతో కోర్టు అనుమతితో వీరిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ విచారణలో భాగంగా మహ్మద్ ఇక్రమ్ నివసించిన చాదర్‌ఘాట్, మలక్‌పేట్, గోల్నాక ప్రాంతాలకు అతడికి తీసుకువెళ్లి విచారించారు. నకిలీ సర్టిఫికేట్లతో ఇతడు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశాడు? తదితరవివరాలను ఇన్స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం లోతుగా ఆరా తీస్తోంది. మరోపక్క కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా విభాగాలూ రంగంలోకి దిగాయి. నేపాల్ మీదుగా అక్రమ మార్గంలో వచ్చిన ఇక్రమ్ వ్యవహారంలో మరో కోణమేదైనా ఉందా? అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. -
ఆన్లైన్ లాటరీ పేరుతో బురిడీ
విజయవాడ: ఆన్లైన్ లాటరీ పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి డబ్బు దండుకునే ఇద్దరు నిందితులను కమిషనరేట్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను సూర్యారావుపేట పోలీసు స్టేషన్లో లా అండ్ ఆర్డర్ డీసీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. ‘హలో, మాదొక ప్రముఖ కంపెనీ, లాటరీ తీశాం, అందులో మీరు అధిక మొత్తంలో నగదు గెలుచుకున్నారంటూ’ మెసేజ్ పంపి, ఆ డబ్బు మీకు రావాలంటే పూర్తి వివరాలు చెప్పి కొంత డబ్బును అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుందని మెయిల్ ఇస్తారు. దాన్ని నమ్మి బ్యాంకు ఖాతాలకు నగదు పంపిన వారి డబ్బులు గల్లంతు చేసే ఇద్దరిని ఉయ్యూరు పోలీసులు అరెస్టు చేశారు. పై విధంగా నేరాలకు పాల్పడిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన బుధేరా గ్రామానికి చెందిన సోను కుమార్, యూపీకి చెందిన ఒసిక్క గ్రామస్తుడు సి.చమాల్ అలియాస్ అరుణ్ కుమార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించటంతో వారు చేసిన సైబర్ నేరాలు వెల్లడించారు. మోసం ఎలా అంటే.. గత ఫ్రిబవరి 6వ తేదీ ఉయ్యూరు సర్కిల్ పరిధిలో తోట్లవల్లూరు పోలీస్టేషన్ ఏరియాలో ఓ మహిళకు రూ.5.35కోట్లు లక్కీడ్రా ఇచ్చినట్లుగా మోసపూరిత మెసేజ్ పెట్టారు. ఆమె వద్ద నుంచి మూడు దఫాలుగా రూ.1.61లక్షలు తమ అకౌంట్లో డిపాజిట్ చేయించుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోట్లవలూర్లు పోలీసులు కేసు నమోదు చేసి సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరిని పట్టుకుని విచారించారు. నిందితులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 345 మందితో కాంట్రాక్ట్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు హైదరాబాద్‌లో ఇద్దరిని, వైజాగ్‌లో ఇద్దరిని లాటరీ పేరుతో మోసగించి రూ. 3లక్షలు అపహరించినట్లు చెప్పారు. తోట్లవల్లూరు పోలీసులు సూచనల మేరకు హైదరాబాద్, వైజాగ్‌లో డబ్బుపోగొట్టుకున్న బాధితులు ఆక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా తోట్లవల్లూరు కేసుకు సంబంధించి రూ.1.60లక్షలు నగదు, 15 బ్యాంక్ అకౌంట్లు, 5మొబైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది. నిందితులకు సంబంధించి 15 అనుమానాస్పద బ్యాంకు అకౌంట్లను గుర్తించి వాటిలో 8 అకౌంట్ల నుంచి రూ. 50వేల నగదును సీజ్ చేశారు. ఆయా అకౌంట్లలో రూ. 44లక్షల అనుమానాస్పద నగదు లావాదేవీలను గుర్తించారు. విలేకరుల సమావేశంలో ఉయ్యూరు సీఐ సత్యానందం పాల్గొన్నారు. -
సిమ్ స్వాపింగ్!
ఇతరుల బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బు దండుకునేందుకు సైబర నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఆన్లైన్లో అందినకాడికి కొల్లగొట్టడానికి ఇప్పుడు ‘సిమ్ స్వాపింగ్’కు పాల్పడుతున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పని వినియోగదారులను ఈ తరహాలో బురిడీ కొట్టిస్తున్నారు. బ్యాంకు లావాదేవీలకు ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్‌ను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. సాక్షి, సిటీబ్యూరో: బ్యాంకుల కాల్‌సెంటర్ల మాదిరిగా ఫోన్లు చేస్తూ వ్యక్తిగత సమాచారం తెలుసుకుని ఆన్లైన్లో అందినకాడికి కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అనేక వివరాలు చెప్పినా... వన్ టైమ్ పాస్వర్డ్ చెప్పని వినియోగదారులను ‘సిమ్ స్వాపింగ్’తో బురిడీ కొట్టిస్తున్నారు. వినియోగిస్తున్న సిమ్‌కార్డులను వారితోనే బ్లాక్ చేయిస్తూ తమ ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. ఈ పంథాలో రూ.లక్ష కోల్పోయిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు ’ఈ’ రకంగా బ్యాంకుల పేర్లతో ఫోన్లు చేసి ఖాతాలు ఖాళీ చేసే నేరాలు మూడునాలుగేళ్లుగా జోరుగా సాగుతున్నాయి. జుమ్తార, ఢిల్లీ కేంద్రాలుగా వ్యవస్థీకృతంగా ‘ఈ–నేరాలు’ చేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆయా ప్రాంతాల్లో దీని కోసం ప్రత్యేకంగా కాల్సెంటర్లను సైతం ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న ఉద్యోగులతో దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాదారులకు ఫోన్లు చేయిస్తుంటారు. తాము ఫలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామంటూ పరిచయం చేసుకునే నేరగాళ్లు క్రెడిట్/డెబిట్ కార్డ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామనో, ఆధార్ సీడింగ్ అనే చెప్తూ వినియోగదారుల నుంచి కార్డ్, పిన్ నెంబర్లతో పాటు ఓటీపీ సైతం తీసుకుంటున్నారు. ఆపై ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వారి ఖాతాల్లో ఉన్న నగదు స్వాహా చేయడం, ఈ–కామర్స్ సైట్స్‌లో ఖరీదు చేయడం, ఈ–వ్యాలెట్స్‌లోకి బదిలీ చేసుకోవడం చేసి మోసం చేస్తున్నారు. వివిధ మార్గాల్లో డేటా సంగ్రహణ... వివిధ బ్యాంకులకు చెందిన డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగదారుల డేటాను సైబర్ నేరగాళ్లు అనేక మార్గాల్లో చేజిక్కించుకుంటున్నారు. ఆయా బ్యాంకులకు చెందిన కాల్ సెంటర్ల ద్వారా కార్డు నెంబర్, వినియోగదారుడి పేరు ఇతర వివరాలతో పాటు కొన్ని సందర్భాల్లో సీవీవీ కోడ్స్ కూడా సంగ్రహించేస్తున్నారు. అయితే ఖాతాల్లో ఉన్న నగదు కాజేయడానికి ఓటీపీ తప్పనిసరి. సైబర్ క్రైమ్ పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమాల ఫలితంగా ఈ తరహా సైబర్ నేరాలు, నేరగాళ్లు చేసే మోసాలపై వినియోగదారులకు కొంతమేర అవగాహన ఏర్పడింది. ఈ కారణంగానే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు మోసపోయామంటూ ఒకరు సంప్రదిస్తుంటే.. తమను మోసం చేయడానికి ప్రయత్నించారంటూ ఐదారుగురు సమాచారం ఇస్తున్నారు. బ్యాంకుల పేరుతో కాల్స్ చేస్తున్న కేటుగాళ్లకు అనేక వివరాలూ చెప్తున్నప్పటికీ... ఓటీపీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అనుమానిస్తున్నారు. దీంతో ఆ నెంబర్ చెప్పకుండా ఫోన్లు కట్ చేస్తున్నారు. ఈ రకంగా ‘నష్టపోతున్నామని’ గుర్తించిన సైబర్ నేరగాళ్లు ఇటీవల సిమ్ స్వాపింగ్ ఎత్తు వేస్తున్నారు. కొత్త సిమ్‌కార్డులు తీసుకుంటున్నారు.. సిమ్ స్వాపింగ్ కోసం సైబర్ నేరగాళ్లు ఉత్తరాదికి చెందిన కొన్ని సిమ్‌కార్డుల విక్రయ కేంద్రాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎలాంటి గుర్తింపుకార్డులు సమర్పించకుండానే వారి నుంచి టార్గెట్ చేసిన వినియోగదారుడి సెల్ నెంబర్‌తోనే మరో సిమ్‌కార్డు తీసుకుంటున్నారు. ఇది యాక్టివేట్ కావాలంటే అసలు వినియోగదారుడు అప్పటికే వినియోగిస్తున్న సిమ్ నుంచి కొత్త సిమ్‌పై ఉన్న నెంబర్లను సర్వీస్ ప్రొవైడర్‌కు ఎస్సెమ్మెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత మాత్రమే కొత్త సిమ్ యాక్టివేట్ కావడంతో పాటు పాత సిమ్ బ్లాక్ అవుతుంది. సరిగ్గా ఇదే విధానాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ‘మీ సిమ్ బ్లాక్/డ్యామేజ్ అయింది. ఇబ్బందులు సరిదిద్దడానికి మీ సెల్‌కు వచ్చే నెంబర్‌కు ఫలానా నెంబర్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్‌కు పంపండి’ అంటూ వివిధ నెంబర్ల నుంచి వినియోగదారులకు సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగా ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నారు. అనుమానం రాకుండా ‘పని’ పూర్తి... సదరు ఎస్సెమ్మెస్ సర్వీసు ప్రొవైడర్ నుంచే వచ్చిందని భావిస్తున్న వినియోగదారులు సదరు సిమ్ నెంబర్‌ను కాల్‌సెంటర్‌కు ఎస్సెమ్మెస్ చేస్తున్నారు. దీంతో కొద్దిసేపటికే ఈ సిమ్ బ్లాక్ కావడంతో పాటు నేరగాళ్ల దగ్గర ఉన్న సిమ్ యాక్టివేట్ అవుతోంది. అప్పటికే సదరు వినియోగదారుడికి సంబంధించిన కార్డ్, పిన్ వివరాలు వారి వద్ద ఉండటంతో వాటితో ఆన్లైన్ లావాదేవీలు మొదలుపెడుతున్నారు. అసలు వినియోగదారుడి సెల్ నెంబర్‌కు రావాల్సిన ఓటీపీ సైబర్ నేరగాళ్లు స్వాపింగ్ చేసిన నెంబర్‌కు చేరిపోతోంది. ఇలా వినియోగదారుడికి ఏమాత్రం అనుమానం రాకుండా కొల్లగొట్టేస్తున్నారు. కస్టమర్‌కు ఈ విషయం తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఎవరైనా వినియోగదారుడు తన సిమ్ బ్లాక్ అయినట్లు గుర్తించినా.. సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించడం, ఫిర్యాదు చేయడం జరిగేసరికే సైబర్ నేరగాళ్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. నగరానికి చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారికి ఈ తరహాలో టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు మూడు విడతల్లో ఆయన ఖాతాలో ఉన్న రూ.లక్ష కాజేశారు. ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తతే పరిష్కారం ‘ఇలాంటి నేరాల బారినపడకుండా ఉండలంటే సెల్‌ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండమే ఉత్తమమైన మార్గం. ఇటీవల కాలంలో సిమ్ బ్లాక్ అనే సమస్య ఉత్పన్నం కావట్లేదు. అలా ఎవరి సిమ్‌కార్డ్ అయినా బ్లాక్ అయినట్లు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాలి. తక్షణం బ్యాంకులను సంప్రదించి క్రెడిట్/డెబిట్ కార్డులనే కాకుండా ఆ ఖాతాలనే బ్లాక్ చేయించాలి. ఫలానా నెంబర్‌ను కాల్ సెంటర్‌కు పంపండి అంటూ వచ్చే ఎస్సెమ్మెస్‌లనూ అనుమానించాల్సిందే. సదరు సర్వీసు ప్రొవైడర్ కాల్ సెంటర్‌ను సంప్రదించకుండా ఇలాంటివి పంపకూడదు. మోసపోయిన బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేయాలి’. – సిటీ సైబర్ క్రైమ్ అధికారులు -
నలుగురు ఆన్లైన్ మోసగాళ్ల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ఓ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కార్పొరేట్ కంపెనీలకు గోదాములు, సెల్ టవర్ల కోసం భవనాలను లీజ్‌కు ఇస్తామంటూ నగరానికి చెందిన ఈ ముఠా సభ్యులు ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 150 మంది నుంచి రూ.20కోట్లకుపైగా వసూలు చేసినట్లు వివరించారు. ముఠాలో నలుగురు సభ్యులను అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు మీడియాకు తెలిపారు. నిందితుల నుంచి ఒక రివాల్వర్, 6 బుల్లెట్లు, రూ.60 వేల నగదు, సెల్ఫోన్లు, రబ్బర్ స్టాంప్స్, 4 లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలోని మిగతావారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.