హలో.. గుడ్‌మార్నింగ్...
మీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పమంటారా..?
1111 కదా..
ఏంటి షాక్‌కు గురయ్యారా..?
ఓకే.. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ పాస్ వర్డ్ చెప్పనా..?
1234..
అవాక్కయ్యారా..? మీ వివరాలు
మాకెలా తెలిసాయని ఆలోచిస్తున్నారా.? కంగారు పడకండి. మిమ్మల్ని మేం ఫాలో అవ్వడం లేదు.
కానీ.. ఎలా తెలుసుకున్నామనే కదా.. మీ డౌట్.?
ఏం లేదండీ.. మీరే కాదు.. ప్రతి పది మందిలో ఐదుగురు ఇవే పాస్‌వర్డ్‌లు వినియోగిస్తున్నారు. మీ విషయంలో ఓ రాయి వేశాం. అంతే...!!!
హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకోకండి. ఇప్పుడు కాస్తా ఊరటగా అనిపించినా.. మీ వ్యక్తిగత వివరాల గోప్యతకు భంగం వాటిల్లుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఓ హెచ్చరిక ఇస్తున్నాం. ఇక మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే..
నగరంలో.. దాదాపు అందరూ ఇదే తరహా తప్పులు చేస్తున్నారు. నిద్రలో లేచి అడిగినా గుర్తుంటుందనీ, వేరే నంబర్ పెడితే మర్చిపోతామని.. చాలా మంది ఒకే తరహా పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు వినియోగిస్తున్నారు. ఇదే సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది.
1234 అధికంగా..
చాలా మంది పుట్టిన రోజు తేదీని, జాబ్‌లో జాయిన్ అయిన తేదీని రహస్య కోడ్‌గా వినియోగిస్తున్నారు. ఇలా చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త.. ఎందుకంటే మీ కొలీగ్స్, సహచరులకు మీరు అవకాశమిచ్చినట్లే. డబ్బు ఎవరికి చేదు చెప్పం డని హెచ్చరిస్తోంది.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెన్సీ. ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో ఎక్కువ శాతం మంది కొన్ని నంబర్లనే పిన్, పాస్‌వర్డ్‌లకు పరిమితమైపోతున్నారని తేలిం ది. ఈ నివేదిక ప్రకారం.. నగరంలో ఎక్కువ మంది వాడుతున్న పిన్ నంబర్, పాస్‌వర్డ్ 1234. ఆ తర్వాత స్థానంలో 1111 ఉంది. కేవలం సమాచారం ఇచ్చిపుచ్చుకునే ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంతో కష్టమైంది పెడుతున్న చాలా మంది.. డబ్బులకు సంబంధించిన లావాదేవీలు జరిపే డెబిట్, క్రెడిట్ కార్డులకు, విలువైన వ్యక్తిగత సమాచారం దాచి ఉన్న స్మార్ట్‌ఫోన్లకు మాత్రం సులువైన పిన్ నంబర్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. సైబర్ నేరాలు జరిగే అవకాశముందని బ్యాంకు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ప్రకారం..
చాలా మంది తమ పుట్టిన రోజు తేదీని, సంవత్సరాన్ని పాస్‌వర్డ్‌గా పెట్టుకుంటున్నారు. వీటిలో ఎక్కువగా 1980 నుంచి 2000 వరకూ పిన్ నంబర్లు మాత్రమే ఉంటున్నాయి.
క్రెడిట్, డెబిట్ కార్డు పాస్‌వర్డ్ నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి. సాధారణంగా నాలుగంకెల నంబర్లు 10 వేల వరకూ ఉన్నాయి. కానీ.. వందలో సగం మంది 10వేల నాలుగంకెల సంఖ్యల్లో కేవలం 500 నంబర్లు మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. ఇలా వాడటం వల్ల ఏటీఎం కార్డు పోయినా, చోరీకి గురైనా.. సులువుగా డబ్బులు డ్రా చేసుకునే అవకాశం దొంగలకు కలుగుతోంది.
నగర వాసులు ఎక్కువగా వినియోగిస్తున్న పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లు ఇవేనని సంస్థ చెబుతోంది. 1234, 1111, 0000, 1212, 2222, 2244, 7777, 8888, 3333, 4444, 5555, 6666, 1122, 1313, 1010, 2001, 2010
తస్మాత్ జాగ్రత్త
పిన్ నంబరే కదా అనుకుంటే చాలా పొరపాటే. ఎందుకంటే.. నాలుగు అంకెల ఈ సంఖ్య మీ ఆర్థిక స్థితిగతినే మార్చేసే అవకాశముంది. ఒక్క పిన్ విషయంలోనే కాదు.. మిగిలిన విషయాల్లోనూ జాగరూకతతో వ్యవహరించాలి. తద్వారా మీ డబ్బు భద్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే దొంగిలించిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు విత్‌డ్రా అయితే.. అందుకు బ్యాంకు బాధ్యత వహించదన్న విషయం గుర్తించుకోవాలి. తర్వాత ఎన్ని పాట్లు పడ్డా పోయిన డబ్బు రాదు.
ఎప్పటికప్పుడు మారిస్తే మంచిది
పిన్ నంబర్లను నెలకు, రెండు నెలలకోసారి మారిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒక పెద్ద లావాదేవీలు జరిపిన తక్షణమే పిన్ నంబర్ మారిస్తే.. సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా బయటపడగలమని సూచిస్తున్నారు. అదే విదంగా పిన్ నంబర్ ఎంటర్ చేసే ముందు మిమ్మల్ని ఎవరైనా గమనించినట్‌లైతే.. మీ లావాదేవీలను వెంటనే రద్దు చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిన్ ఎంటర్ చేసే సమయంలో చేతిని అడ్డం పెట్టుకోవడం, లేకపోతే.. ఇతరులకు కనబడకుండా జాగ్రత్తపడితే మంచిది. వేరే వ్యక్తులు మీకు సహాయం చేస్తామని వచ్చినప్పుడు తిరస్కరించండి. వారు బలవంతం పెడితే.. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందివ్వండి. చాలా మంది తమ పిన్ నంబర్‌ను మర్చిపోతామేమోననే ఉద్దేశంతో పౌచ్‌లో పిన్ నంబర్ కూడా రాసి ఉంచుతారు. ఈ తరహా చర్యలు.. కేటుగాళ్లకు ఊతమిచ్చినట్లే. మీ మెదడే పర్సుగా.. పాస్‌వర్డ్‌ని భద్రంగా దాచుకోండి సుమా.
అపరిచితులతో అప్రమత్తంగా ఉండండి
ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువ య్యాయి. అపరి చితులతో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా కొత్త వారు ఫోన్ చేసి సెల్‌కు ఓటీపీ నెంబర్ వస్తుందని, దాన్ని చెప్పాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పరాదు. అలా చెబితే బ్యాంకు ఖాతాలోని మొత్తం డబ్బు డ్రా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏటీఎం కేంద్రాల్లో డబ్బు అపరిచిత వ్యక్తులకు కార్డులు ఇవ్వొద్దు. తెలిసిన వారైతేనే డబ్బు డ్రా చేసుకునేందుకు సహాయం తీసుకోండి. ఎవరైనా మోసం చేస్తే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి. కేసు నమోదు చేసుకుని నిందితులను పట్టుకుంటాం. సైబర్ నేరాగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి.
– ఎం.చిదానందరెడ్డి, మదనపల్లె డీఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment