
మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ మోసాలను ఆదిలోనే పసిగట్టేలా ప్రత్యేక వ్యవస్థ
సీఐడీలో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటుపై అధికారుల కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడమే కాదు.. నేరం జరగకుండా నిలువరించడం కూడా పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఆర్థిక నేరాల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎక్కడో కూర్చుని ఇక్కడి ప్రజల బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టి.. వారి కష్టార్జితాన్ని ఎగరేసుకుపోతున్న సైబర్‌నేరగాళ్ల కట్టడికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
మల్టీలెవల్ మార్కెటింగ్, ఆన్‌లైన్‌లో మోసగించే వారిపై ఫోకస్‌పెట్టి.. ఆదిలోనే అలాంటి నేరాల కట్టడికి తెలంగాణ సీఐడీలో మరో నూతన యూనిట్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సైబర్‌నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను అదేవిధంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసినట్టే, ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టేందుకు తెలంగాణ సీఐడీలో అంతర్భాగంగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.
మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా..
ఈ విభాగం ప్రధానంగా ఈ కామర్స్ సైట్స్, ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్ సహా అన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నకిలీ, మోసపూరిత వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా పెడుతుంది. మల్టీలెవల్ మార్కెటింగ్‌తో లాభాలు వస్తాయని, పార్ట్‌టైం జాబ్స్ ఇస్తామని.. పలు రకాల స్కీంలతో ప్రకటనలు ఇచ్చే వారిపై నకిలీ వివరాలతో ఏర్పాటు చేసుకున్న ఖాతాలతో డెకాయి ఆపరేషన్స్ చేస్తుంది.
ఆన్‌లైన్‌లో వచ్చే ప్రకటనల్లో నంబర్లు, అడ్రస్‌లు, వ్యక్తుల గురించి ఆరా తీస్తుంది. ఇందులోని అధికారులు తాము కూడా ఒక వినియోగదారుడిగా అవతలి వ్యక్తులతో (మోసపూరిత ప్రకటనలు ఇచ్చిన వారితో) సంప్రదింపులు చేస్తూ, వారి వివరాలు కనుగొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలా కాకుండా మోసాలకు పాల్పడే వారిని ఆదిలోనే గుర్తిస్తే.. అమాయక పౌరులు వారి వలలో పడి మోసపోకుండా ముందుగానే కట్టడి చేయవచ్చన్నదే ఈ నూతన వింగ్ ఏర్పాటు ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశం.
ఇలా చేయడం ద్వారా ఆర్థిక మోసాల బారి నుంచి ప్రజలను కాపాడటంతోపాటు వారిని అప్రమత్తం చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నూతన వింగ్ ఏర్పాటుతోపాటు, సాంకేతికంగా మంచి పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించేలా పోలీస్ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment