Multilevel Marketing
-
‘సంకల్ప’ స్కాం
ఒకటికి పది రెట్లిస్తాం.. డబ్బులే డబ్బులు!! బంగారం.. స్థలాలు.. కట్టిన సొమ్మంతా తిరిగిస్తాం... ఎర్ర చందనం మొక్కలతో చెట్లకు డబ్బులు కాయిస్తాం!! తెలిసిన వారిని చేరిస్తే కమీషన్ కూడా ఇస్తాం.. మీరు మునగండి.. మీ పక్కవారినీ ముంచండి! యాప్‌లో ఒకరి తరువాత ఒకరుగా మోసపోయిన గొలుసు కట్టు గోల్మాల్ బాగోతమిదీ.. – సాక్షి ప్రతినిధి, విజయవాడ యాప్ ద్వారా.. విజయవాడలో సంకల్ప సిద్ధి మార్ట్ పేరుతో ఏర్పాటైన చెయిన్ లింక్, మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ మోసాలు బహిర్గతమయ్యాయి. సీతారాంపురంలోని దుర్గా అగ్రహారంలో ఏడాది క్రితం ఓ అద్దె ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ యాప్ ద్వారా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. పది రోజులుగా యాప్ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వేల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. ఐదు రకాల స్కీంలతో చెయిన్ చీటింగ్ ► సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు సభ్యత్వం కోసం రూ.3 వేలు చొప్పున బాధితుల నుంచి వసూలు చేసి నమ్మకం కలిగించేందుకు సరుకులు ఇచ్చారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజుల్లో కట్టిన డబ్బంతా వెనక్కు వస్తుందని నమ్మించారు. ► రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామనేది రెండో స్కీం ► రూ.లక్ష నగదు చెల్లిస్తే లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మూడో స్కీం ద్వారా ఆశ చూపారు. ► రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతోపాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ వసూళ్లకు పాల్పడ్డారు. ► రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతోపాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో ఎర వేశారు. పోలీసుల అదుపులో నిందితులు దుర్గా అగ్రహారం, బందర్ రోడ్డులోని కార్యాలయం, నిడమానూరులోని సంకల్పసిద్ధి మార్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ డేటాను సీజ్ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి రూ.2.5 కోట్ల నగదును సీజ్ చేశారు. సంస్థ చైర్మన్ గుత్తా వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. న్యాయం చేస్తాం.. చట్టపరమైన చర్యలు తీసుకొని సంకల్ప సిద్ధి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – టి.కె.రాణా, సీపీ -
ఇండస్ వీవా రూ. 66.30 కోట్ల ఆస్తులు జప్తు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ పరిధిలో నమోదైన మల్టీలేవెల్ మార్కెటింగ్ కేసులో ఇండస్ వీవాకు చెందిన రూ.66.30 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలు జారీచేసింది. పిరమిడ్ పద్ధతిలో ఒకరిని జాయిన్ చేస్తే 20 శాతం కమీషన్ పద్ధతిలో 10 లక్షల మంది సభ్యుల నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసిన ఇండస్ వీవా కంపెనీ వ్యవహారంలో ఈడీ చర్యలు చేపట్టింది. మనీల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించి చర్యలు చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇండస్ వీవా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీఏ అంజార్, ప్రమోటర్ అభిలాష్ థామస్‌ను గతేడాది డిసెంబర్లోనే అరెస్ట్ చేసిన ఈడీ.. మనీల్యాండరింగ్ ద్వారా కోట్ల రూపాయలతో ఆస్తుల కొన్నట్టు గుర్తించింది. రూ.50.47 కోట్ల విలువైన స్థిరాస్తులు, కంపెనీకి చెందిన 20 అకౌంట్లలోని రూ.15.83 కోట్ల నగదును జప్తు చేసినట్లు వెల్లడించింది. -
రూ. 3000 ఖరీదైన చీర రూ.300 కే!!
సుమతి (పేరు మార్చడమైనది) ఆన్లైన్లో పండగ ఆఫర్ల కింద వచ్చిన అప్లికేషన్స్ చూస్తూ ఉంటే మంచి కలర్ కాంబినేషన్ ఉన్న పట్టు చీర కనపడింది. ‘మూడు వేల రూపాయల చీర, మూడు వందలకే’ అని ఉండటంతో క్లిక్ చేసింది. ఆ చీర బుక్ అవ్వాలంటే అందులో ఇచ్చిన అకౌంట్లో డబ్బులు జమ చేయడంతోపాటు వివరాలన్నీ పొందుపరిచిన ఒక ఫారాన్ని నింపాలి. డబ్బు కట్టడంతోపాటు వివరాలన్నీ ఇచ్చింది. కానీ, ఎన్ని రోజులైనా ఆ చీర మాత్రం రాలేదు. ‘మా లక్కీ స్కీమ్‌లో పాల్గొనండి, ఐ ఫోన్ గెల్చుకోండి’ అని ఉన్న అప్లికేషన్‌ను శేఖర్ (పేరు మార్చడమైనది) క్లిక్ చేశాడు. ఆ లక్కీ డిప్లో పాల్గొనాలంటే రెండు వేల రూపాయలు చెల్లించి, స్కీమ్‌లో చేరాలని ఉంది. తన వివరాలతో పాటు, రెండు వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఆ స్కీమ్‌లో చేరాడు. కానీ, శేఖర్‌కి ఫోన్ రాలేదు. ఆ డబ్బులూ తిరిగి రాలేదు. సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకోవడానికి ఆఫర్లు లైక్స్, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకోవడానికి కొందరు ‘ఉచితం లేదా డిస్కౌంట్’ అనే పదాలను ఎరగా వేస్తుంటారు. ‘50,000 రూపాయల ధర పలికే గడియారాన్ని 5,000కే అమ్ముతున్నాను’ అనే ఆఫర్లు వస్తుంటాయి. మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం.. ‘ఆఫర్’ని ఎరగా వేసి వివరాలన్నీ సేకరించి, ఆ తర్వాత మోసానికి పాల్పడే వారుంటారు. వివరాలన్ని ‘డార్క్’వెబ్సైట్లలో పెడుతూ, మరో ఆన్లైన్ మోసాలకు ఉపయోగించడానికి ఆ డేటాను వాడుతుంటారు. ఒరిజినల్ అని చెప్పి, అమ్మడం ఇది మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం. బ్రాండెడ్ వస్తువులా అనిపించే రెప్లికా ఐటమ్ చూపించి అసలైనదే అని చూపుతారు. మీతో పాటు మరికొంతమందిని తమ స్కీమ్‌లో చేర్చితే ‘50,000 రూపాయల వస్తువు 5000 కు సొంతం చేసుకోవచ్చు అనే ఆశను చూపెడతారు. నాణ్యతలేని వస్తువులతో ఎర రెప్లికా వస్తువుల్లోనూ గ్రేడ్స్ ఉంటాయి. అవి చూడటానికే బాగుంటాయి కానీ, ఏ మాత్రం పనిచేయవు. అలాంటి వస్తువులను చూపి, డబ్బులు రాబట్టి మోసం చేస్తారు. ఆఫర్ల వర్షం దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో జనాల బలహీనతను దృష్టిలో పెట్టుకొని, బంపర్ ఆఫర్, వీల్ తిప్పడం, స్క్రాచ్ కార్డ్‌లు.. వంటి వాటితో ఆన్లైన్ మోసానికి దిగుతుంటారు. ఈ షాపింగ్ మోసాలు ఢిల్లీ చుట్టుపక్కల నుంచి అధికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీటిల్లో ఎక్కువగా ఫోన్లు, వాచీలు, చీరలు, డ్రెస్సుల విషయాల్లో జరుగుతుంటాయి. ఆన్లైన్ షాపింగ్ మోసానికి ముందే హెచ్చరికలు ► ఒక వస్తువులు లేదా సేవ నమ్మశక్యం కాని తక్కువ ధరతో ప్రచారం చేయబడుతుంది అంటే ఆలోచించాలి. మోసానికి ముందు ఇదొక హెచ్చరిక అనుకోవాలి. ► ఆన్లైన్ చెల్లింపులు కాకుండా వస్తువు ఇంటికి వద్దకు వచ్చాకే చెల్లింపు అనే ఎంపిక మంచిది. ► డిస్కౌంట్ ఆఫర్‌ని పొందడానికి తమ వోచర్ కోసం ముందే చెల్లించాలనే ఎంపికలు ఉంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. ► నకిలీ సోషల్ మీడియా ఆధారిత కథనాలు కొత్తగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్ లైన్ లో చాలా తక్కువ ధరలకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి, అనేది నిజం కాదు. ► విక్రేత విదేశాల్లో ఉన్నప్పుడు పే మనీ లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్ లావాదేవీ వంటి సురక్షిత చెల్లింపు సేవ ద్వారా చెల్లింపును అనుమతించరు. వారు మిమ్మల్ని ౖఖ్కీ ని చెప్పమని లేదా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలని లేదా చెల్లింపులను స్వీకరించడానికి గూగుల్ ఫారమ్స్ లేదా చిన్న లింక్‌లను పూరించమని అడుగుతారు. ► కొత్తగా పుట్టుకు వచ్చిన వెబ్సైట్లలో నిర్ధారణకు రాకుండా కొనుగోళ్లు చేయకూడదు. వాటి తాలూకు ఫౌండర్స్ ఎవరనేది కూడా చూసుకోవాలి. బ్రాండ్ పేరుతో ఉన్న వెబ్‌సైట్స్ కూడా నకిలీ పేరుతో వస్తాయి. పండగల సమయాల్లో ఈ– తరహా మోసాలు ఎక్కువ. కాబట్టి, వాటి వాడుక, హెచ్టిటిపిఎస్, యుఆర్ఎల్ చెక్ చేసుకొని కొనాలి. షాపింగ్ మోసాల నుండి రక్షణ ► మీరు తీసుకోవాలనుకున్న వస్తువు ‘సమీక్ష (రివ్యూ)లు చదవండి. వాటి నాణ్యత, రిటర్న్ పాలసీల వంటివి ఉన్నాయేమో చూడండి. ► ఎప్పుడైనా (యాప్) అప్లికేషన్ అంతర్నిర్మిత సాధనాలతోనే కమ్యూనికేట్ చేయండి. అప్లికేషన్ వెలుపల కమ్యూనికేట్ చేయవద్దు. ► సురక్షిత నగదు చెల్లింపు కోసం https://URL చూడండి. ► అమ్మకం దారుకి మీ బ్యాంక్ OTP / PIN నంబర్లను ఏ రూపంలోనూ షేర్ చేయవద్దు. ► మీరు ఫోన్ మాట్లాడే సమయంలో చెల్లింపు లావాదేవులను ఎప్పుడూ చేయవద్దు. ► అమ్మకం దారు అందించిన ఏవైనా షార్ట్ లింక్‌లను క్లిక్ చేసి, వాటిని పూరించవద్దు. గూగుల్ లింక్ ద్వారా వచ్చిన ఫామ్‌లను పూరించవద్దు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవద్దు, మీరు స్కాన్ చేస్తుంటే మీ ఖాతా నుండి డబ్బు డెబిట్ అవుతుంది. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
30 రోజుల్లో కోటి రూపాయలంటూ...
సాక్షి, హైదరాబాద్ : 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించుకోండి.. అదెలా అంటే మమ్మల్ని సంప్రదించండి అంటూ.. మల్టిలెవల్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 30 రోజుల్లో కోటి రూపాయలు సంపాదించడంటూ వీరు ఈ మల్టిలెవల్ మార్కెటింగ్ మోసానికి పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తుల నుంచి 6 లక్షల రూపాయల విలువైన గోల్డ్ కాయిన్లను, రూ.1.73 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా మల్టిలెవల్ మార్కెటింగ్ మోసాలు పెరుగుతూ వస్తున్నాయి. అతి తక్కువ కాలంలోనే కోట్లు రూపాయలు ఎలా సంపాదించాలో తాము చెబుతామంటూ.. ఈ ముఠాలు అమాయకుల వద్ద నుంచి డబ్బులు గుంజడం, గోల్డ్ కాయిన్లను సేకరించడం వంటివి చేస్తూ ఉన్నారు. కొన్ని మల్టిలెవల్ మార్కెటింగ్ కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదంతాలు ఉన్నాయి. -
‘క్యూ - నెట్’ కేసులో మైఖేల్ ఫెరీరా అరెస్టు
-
‘క్యూ - నెట్’ కేసులో మైఖేల్ ఫెరీరా అరెస్టు
మరో ముగ్గురు డెరైక్టర్లు కూడా... • మైఖేల్ ఫెరీరా పద్మభూషణ్ గ్రహీత.. బిలియర్డ్స్ మాజీ చాంపియన్ • ముంబై నుంచి పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన సీసీఎస్ పోలీసులు • అరెస్టును సవాల్‌చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిందితులు • కేసులో తదుపరి చర్యలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: క్యూ-నెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మందిని మోసగించిన కేసులో ప్రమేయంపై ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్, పద్మభూషణ్ అవార్డుగ్రహీత మైఖేల్ జోసఫ్ ఫెరీరా (78)తోపాటు మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందిని రూ. 700 కోట్లకు మోసగించిన క్యూ-నెట్ సంస్థకు భారత్‌లో అనుబంధంగా ఏర్పాటైన విహాన్ డెరైక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫెరీరాతోపాటు ముంబై, బెంగళూరు ప్రాంతాలకు చెందిన మాల్కమ్ నోజర్ దేశాయ్, మగర్‌లాల్ వి.బాలాజీ, వి.శ్రీనివాసరావులు డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఇప్పటికే ముంబైలో నమోదైన ఈ తరహా కేసులో పోలీసులకు లొంగిపోయిన ఫెరీరా, మిగతా ముగ్గురు నిందితుల్ని పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేశామన్నారు. హాంకాంగ్‌కు చెందిన ఓ సంస్థ గతంలో క్వెస్ట్ నెట్ పేరుతో ఎంఎల్ఎం స్కీముల్ని నడిపిందని, దీనిపై అనేక కేసులు నమోదు కావడంతో పేరును క్యూ-నెట్‌గా మార్చుకుందన్నారు. భారత్‌లో వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతల్ని ‘విహాన్’ సంస్థకు అప్పగించిందన్నారు. అందుకే ఈ కేసులో ఫెరారీ, ఇతరులను నిందితులుగా చేర్చామన్నారు. ఏసీపీ జోగయ్యతో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహంతి ఈ వివరాలు వెల్లడించారు. మరోవైపు ఫెరీరా, ఇతరులపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు బుధవారం నిలిపేసింది. కేసును కొట్టేయాలంటూ ఫెరీరా, ఇతరులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనంతరం న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. విహాన్ సంస్థలో ఫెరీరా డెరైక్టర్ మాత్రమేనని, ఆ కంపెనీ రోజు వారీ వ్యవహారాలతో ఆయనకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఐదు లక్షల మంది బాధితులు... టూర్స్ అండ్ ట్రావెల్స్, హాలిడే ప్యాకేజెస్, వైద్య ఉత్పత్తుల పేరుతో పలువురిని ఆకర్షించిన ‘క్యూ నెట్’ వివిధ స్కీముల్ని ఏర్పాటు చేసింది. రూ. 30 వేలు కట్టి సభ్యులుగా చేరిన వారు మరికొందరిని చేర్చుకుంటూ వెళ్లాలని పేర్కొంది. కొత్తగా చేరే ప్రతి వ్యక్తి కట్టిన నగదు నుంచి ఆ చైన్‌లో అంతకు ముందు కట్టిన వారికి కమీషన్ ఇస్తూ వచ్చింది. ఇలా చైన్‌ను విస్తరించుకుంటూ వెళ్లారు. తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీల్లోనూ కార్యకలాపాలు సాగించిన క్యూ నెట్ సంస్థ దాదాపు 5 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుని రూ.700 కోట్ల వరకు వసూలు చేసినట్లు అంచనా. ఈ సభ్యుల్లో కొందరికి నగదు తిరిగి రాకపోవడం, సంస్థ ఇచ్చిన హాలిడే ప్యాకేజెస్ చెల్లకపోవడంతో వారు పోలీసుల్ని ఆశ్రయిస్తూ వచ్చారు. ముంబైలో 2013లో ఓ కేసు నమోదవగా గతేడాది హైదరాబాద్ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.