
భారీగా డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన కంపెనీ
మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌ల పేరుతో దోపిడీ
సింగపూర్, దుబాయ్, యూఏఈలోని షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు.. తెలుగు రాష్ట్రాల నుంచి మోసపోయింది సుమారు 7 వేలమంది
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఫాల్కన్ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌చేశారు.
ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) ఈనెల 15న అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఫాల్కన్ ఎండీ అమర్‌దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేందర్ సింగ్‌లు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు.
ఇందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టారు. డిపాజిట్లను సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్‌సైట్‌ను సైతం రూపొందించారు.
22 శాతం వరకు రాబడి
నిందితులు 2021లో డిపాజిట్ల సేకరణను ప్రారంభించారు. రూ.25 వేల నుంచి రూ.9 లక్షల డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11–22 శాతం రాబడిని ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. డిపాజిటర్లకు రాబడిని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15న నాటికి ఈ స్కీమ్ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసేశారు.
దీంతో డిపాజిటర్లు లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బీఎన్‌ఎస్‌తోపాటు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్–1999లోని పలు సెక్షన్ల కింద 19 మందిపై కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఈనెల 15న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు.
షెల్ కంపెనీలకు సొమ్ము
జనాల నుంచి సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించారు. కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్, ఆర్‌డీపీ, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్‌కేర్, ఎంబీఆర్–1, క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, ఓజేఏఎస్, హాష్‌బ్లాక్, వెల్‌ఫెల్లా ఇంక్, స్వస్తిక్ నెయ్యి వంటి షెల్ కంపెనీలకు నిధులను మళ్లించారు. నిందితులు గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారు. బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా మోసం చేసినట్లు 2022లో చేవెళ్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment