
సైబర్ మోసాల సరికొత్త రూపు
ఫోన్ కాల్ మెర్జింగ్‌తో ఖాతాలు ఖాళీ
అప్రమత్తంగా ఉండాలని యూపీఐ సూచన
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.
కాల్ మెర్జింగ్ స్కాం అంటే?
ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్‌ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్‌ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్‌తో కనెక్ట్ అవుతాడు.
ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు.
మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.
కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?
» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్‌ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.
» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.
» అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.
» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment