Cyber criminal
-
Hyderabad: ఘరానా సైబర్ నేరగాడి ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట: యజమాని అతడు కాదు... విక్రయించేది–ఖరీదు చేసేదీ కూడా అతగాడు కానేకాదు... అయినప్పటికీ ఈ–కామర్స్ సైట్లో ఫోన్లకు సంబంధించిన పోస్టులు చేసిన వారిని సంప్రదించి డిలీట్ చేయిస్తాడు... ఆపై అవే వివరాలను తాను పోస్టు చేస్తాడు...క్రయవిక్రయాలు చేసే వారిని ఓ ‘ప్లాట్‌ఫామ్’ పైకి తీసుకువస్తాడు..ఆ ఇద్దరినీ కలిపి తాను ‘లాభపడతాడు’. కేవలం ఐఫోన్లనే టార్గెట్‌గా చేసుకుని, ఈ వినూత్న పంథాలో తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని మోసం చేసి రూ.60 లక్షలు స్వాహా చేసిన ఘరానా మోసగాడు మరిశర్ల బాలాజీ నాయుడిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ఎస్.మోహన్‌కుమార్ ప్రకటించారు. ఇన్స్పెక్టర్ బి.శోభన్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బి.శ్రవణ్ కుమార్‌లతో కలిసి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్... ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన బాలాజీ నాయుడు అక్కడి ఎస్వీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చిన ఇతగాడు తొలినాళ్లల్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేశాడు. జల్సాలు, బెట్టింగ్స్, ఆన్లైన్ గేమింగ్స్‌కు జీతం డబ్బులు చాలకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడానికి నేరబాట పట్టాడు. ఇందులో భాగంగా వివిధ పేర్లతో సిమ్‌కార్డులు తీసుకునే ఇతగాడు తరచు తన ఫోన్లు మారుస్తూ ఉంటాడు. 2018 నుంచి మోసాలు చేయడం మొదలెట్టిన బాలాజీ ఇప్పటి వరకు 30 ఫోన్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. సెకండ్ హ్యాండ్ వస్తువులు విక్రయించడానికి ఉపకరించే ఈ–కామర్స్ సైట్ ఓఎల్ఎక్స్ ఆధారంగా మోసాలు ప్రారంభించాడు. ఆ సైట్/యాప్‌ను ఆద్యంతం గమనించే బాలాజీ సెకండ్ హ్యాండ్ ఐఫోన్ల విక్రయానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లోని వాళ్లు పెట్టిన పోస్టుల్ని గుర్తిస్తాడు. వాటిలో కొన్ని ఎంపిక చేసుకుని అందులోని ఫొటోతో పాటు ఇతర వివరాలు కాపీ చేసుకుని భద్రపరుచుకుంటాడు. వారితో తీయించి తాను పోస్టు చేసి... ఆపై ఆ పోస్టు చేసిన వ్యక్తిని సంప్రదించే బాలాజీ ఏమాత్రం బేరసారాలు లేకుండా ఆ ఫోన్ తాను ఖరీదు చేస్తున్నట్లు, త్వరలోనే సంప్రదించి కలుస్తానని చెప్తాడు. అలా వారి నమ్మకాన్ని పొంది ఓఎల్ఎక్స్ నుంచి పోస్టు తీసేలా చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత తన వద్ద ఉన్న ఫొటో, వివరాలతో తానే ఆ ఫోన్ విక్రయిస్తున్నట్లు అదే ఓఎల్ఎక్స్లో పోస్టు చేసే బాలాజీ..తక్కువ రేటు పొందుపరుస్తాడు. ఈ పోస్టును చూసిన వాళ్లల్లో ఆకర్షితులైన వాళ్లు ఫోన్ ద్వారా బాలాజీని సంప్రదిస్తారు. వారితో బేరసారాలు పూర్తి చేసే అతగాడు..ఫలానా చోట తనను కలిసి, నగదు చెల్లించి, ఫోన్ తీసుకువెళ్లాలని సూచిస్తాడు. అదే సమయంలో ఫోన్ అసలు యజమానికి సంప్రదించే బాలాజీ అతడినీ ఆ ప్రాంతానికి రమ్మని, నగదు చెల్లించి ఫోన్ తీసుకుంటానని చెప్తాడు. అలా ఫోన్ యజమాని, తన ప్రకటన చూసి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన వ్యక్తి కలుసుకోవడానికి కొద్దిసేపటి ముందు వారిని మరోసారి సంప్రదిస్తాడు. తాను రాలేకపోతున్నానని, తన సోదరుడు వస్తున్నాడని చెప్పి, ఫోన్ రేటు విషయం చెప్తే అంత డబ్బు పెట్టి ఎందుకు కొంటున్నావు? అని మందలిస్తారంటూ వారికి చెప్తాడు. ఈ కారణంగానే రేటు విషయం చర్చించ వద్దంటూ ఇద్దరికీ చెప్తాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసిన తర్వాత ఖరీదు చేసే వ్యక్తిని బుట్టలో వేసుకుని యజమాని వద్ద ఫోన్ చూసిన వెంటనే నగదు తనకు బదిలీ చేసేలా చేస్తాడు. ఆపై తన ఫోన్ స్విచ్ఛాప్ చేసుకుంటాడు. క్రయవిక్రేతలు మాత్రం కొద్దిసేపు ఘర్షణ పడి, అసలు విషయం తెలుసుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఇలా ఇతగాడు తెలుగు రాష్ట్రాల్లో 200 మందిని ముంచి రూ.60 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును డప్ఫాబెట్, సారా, రమ్మీటైమ్, రమ్మీ సర్కిల్ వంటి గేమింగ్, బెట్టింగ్ యాప్స్‌లో పెట్టడం, జల్సాలు చేయడం చేసి ఖర్చు చేస్తాడు. కొన్ని సందర్భాల్లో బాధితులకు నేరుగా ఆయా యాప్స్‌కు సంబంధించిన క్యూర్కోడ్స్ పంపి, నేరుగా డబ్బు వాటికే పంపేలా చేశాడు. ఇతగాడిని కటకటాల్లోకి పంపిన పంజగుట్ట పోలీసులు రెండు ఫోన్లు, మూడు సిమ్‌కార్డులు స్వాదీనం చేసుకున్నారు. బాలాజీపై నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో 138 ఫిర్యాదులు, తెలుగు రాష్ట్రాల్లో 19 కేసులు నమోదై ఉన్నాయి. ఇటీవల పంజగుట్టలో 3, మధురానగర్‌లో మరో 3 కేసులు నమోదు కాగా..మరో 25 కేసులు ఉన్నట్లు గుర్తించారు. -
డ్రగ్స్ కేసులో ఉన్నావంటూ బెదిరించి...
పటాన్చెరు టౌన్: మలేసియాకు అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్నావు.. మనీలాండరింగ్ కేసులో అనుమానితుడిగా ఉన్నావంటూ బెదిరించి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి రూ. కోటి 58 లక్షల 47 వేలు కాజేశాడు ఓ సైబర్ నేరగాడు. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఆగస్టు 29వ తేదీన అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వ చ్చి0ది. కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని, మీపై అక్రమ డ్రగ్స్ రవా ణా అలిగేషన్ ఉందని, అదేవిధంగా మనీ లాండరింగ్ కేసులో మీ పేరు ఉందని బెదిరించారు. పేరు తప్పించేందుకు డబ్బులు ఇవ్వాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో బెదిరిపోయిన ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.. కోటి 58 లక్షల 47 వేలు పంపాడు. ఇంకా డబ్బులు వే యాలని ఒత్తిడి చేయడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పార్శిల్‌పై ముంబై పోలీసుల విచారణ పేరుతో కాల్స్
బనశంకరి: ఉపాధ్యాయునికి ముంబై పోలీసుల ముసుగులో ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు రూ.32.25 లక్షలు దోచుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. చతురరావ్ (50) అనే ఉపాధ్యాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశాన్య సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎలా జరిగిందంటే వివరాలు... శనివారం కొరియర్ కంపెనీ ప్రతినిధి పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాడు.. మీకు కొరియర్ పార్శిల్ వచ్చింది, అందులో మీ మొబైల్ నంబర్, ఆధార్, ఐదు పాస్‌పోర్టులు, ఐదు క్రెడిట్‌కార్డులు, ల్యాప్‌టాప్ ఉన్నాయి, ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మీరు వీడియోకాల్ ద్వారా మాట్లాడాలి, దీనికోసం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఒక లింక్ పంపించాడు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అదే వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి, మరో వ్యక్తి ఎవరో మీపేరుతో రికార్డులు దుర్వినియోగానికి పాల్పడ్డాడు, వారి ఆచూకీ కనిపెట్టాలంటే మా అకౌంట్ కు నగదు జమచేయాలని చెప్పాడు. నిజమేననుకున్న చతుర్రావ్, వంచకులు తెలిపిన రెండు బ్యాంక్ అకౌంట్లకు దశలవారీగా రూ.32.25 లక్షలను పంపించాడు. తరువాత ఆయన ఫోన్ చేయగా మోసగాని నంబర్ స్విచాఫ్ వచ్చింది. ఇది వంచన అని తెలసుకున్న బాధితుడు సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని వంచకుల కోసం గాలింపు చేపట్టారు. -
సైబర్ నేరగాడి అరెస్ట్
కడప అర్బన్: అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్‌కు చెందిన ఎంఓ జలాల్‌ఖాన్‌ను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరికొందరి బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద వున్న ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్హాల్లో బుధవారం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వివరాలు వెల్లడించారు. జలాల్ఖాన్, అతడి స్నేహితులు తన్వీర్ ఆలం, ఇపజిడ్ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన నంబర్లకు ట్రూకాలర్ ద్వారా ఫోన్ చేస్తూ డబ్బు కోసం వేధించడం మొదలెడతారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా బద్వేల్ టౌన్ సుమిత్రానగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి అల్లూరి మోహన్ నంబరుకు ఫోన్ చేశారు. వాట్సాప్ ద్వారా లోన్ తీసుకున్నావని, తాము చెప్పిన మొత్తం చెల్లించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించసాగారు. తాను లోన్ తీసుకోలేదని చెప్పినా పదేపదే బెదిరింపు కాల్స్ చేసేవారు. బాధితుడి ఫొటోలు మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా కుటుంబసభ్యులకు పంపించారు. వారికి భయపడిన మోహన్ పలు దఫాలుగా సుమారు రూ.లక్ష అరవై వేలు పంపాడు. ఇక తాను ఇవ్వలేనని చెప్పినా వేధింపులు మానకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. బద్వేల్ పోలీసులు అక్టోబర్ 14న కేసు నమోదు చేశారు. ఈ కేసును జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని కడప అదనపు ఎస్పీ తుషార్ డూడీ, మైదుకూరు డీఎస్పీ వంశీధర్ గౌడ్ల పర్యవేక్షణలో బద్వేల్ అర్బన్ సీఐ జి.వెంకటేశ్వర్లు, కడప సైబర్‌క్రైం సీఐ శ్రీధర్‌నాయుడు ఆధ్వర్యంలో రెండు టీములు ఏర్పాటు చేశారు. బాధితుడు డబ్బు చెల్లించిన యూపీఐ ఐడీలను సేకరించి, వాటి ద్వారా నిందితులు ఉపయోగించిన అకౌంట్ వివరాలను సేకరించారు. వాటి ద్వారా కేసు విచారణలో లోన్ యాప్‌ల ద్వారా మోసం చేస్తున్న ప్రధాన నిందితుడు ఎంఓ జలాల్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రెండు సెల్ఫోన్లను సీజ్ చేశారు. కాగా.. ప్రస్తుతం అరెస్టయిన నిందితుడు జలాల్ఖాన్, అతని స్నేహితులపై 14 రాష్ట్రాల్లో 58 ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్) ఫిర్యాదులున్నాయి. వీరికి ఉన్న 7 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి రూ.2.05 కోట్లు ఫ్రీజ్ చేయించారు. ఈ వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ విభాగాలకు పంపిస్తామని ఎస్పీ వివరించారు. -
ఆ నంబర్లతో బీ ‘కేర్’ఫుల్!.. ఇంటర్నెట్లో దొంగ కస్టమర్ కేర్ నంబర్ల సృష్టి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన శరత్ తన హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్‌ను ఫోన్‌పే గేట్‌వే ద్వారా చెల్లించాడు. అయితే గంటలు గడిచినా కూడా తనకు పేమెంట్ కన్ఫర్మేషన్ మెసేజ్ రాకపోవడంతో గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికాడు. హెచ్డీఎఫ్సీ కస్టమర్ కేర్ అని ఉన్న ఓ నంబర్‌కు డయల్ చేశాడు. అవతలి వ్యక్తి అడిగిన కార్డు నంబర్, పిన్.. ఇలా అన్ని వివరాలు చెప్పేశాడు. కొద్దిసేపటి తర్వాత కార్డు నుంచి రూ.1.2 లక్షలు డెబిట్ అయినట్టు సందేశం రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్లు పేరిట కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు సైబర్ పోలీసులు గుర్తించారు. బ్యాంకు అయినా, మరే ఇతర సంస్థ అయినా.. వాటి కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్‌లో కాకుండా సంబంధిత సంస్థల అధికారిక వెబ్సైట్లలో గుర్తించి సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. ఇలా ఒక్క శరత్ మాత్రమే కాదు రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఇలా దొంగ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా మోసపోయిన బాధితులు వేలల్లో ఉండటం ఆందోళన కల్గిస్తున్న అంశం. అవగాహన, అప్రమత్తతే రక్ష... క్రెడిట్ కార్డు, ఆన్లైన్ షాపింగ్, ఉద్యోగాల కన్సల్టెన్సీ, లోన్లు పేరిట, అలాగే బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెబుతూ సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే కస్టమర్ కేర్ అని నంబర్లు అని పెట్టి సైతం మోసాలు చేస్తున్నారు. బాలానగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడికి రూ.2,800 ఫోన్ పే చేశాడు. కానీ డబ్బు అతడికి చేరకపోవడంతో గూగుల్‌లో ఫోన్‌పే పేరిట ఉన్న కస్టమర్ కేర్ అనే నంబర్‌కు కాల్ చేశాడు. అవతల వైపు ఉన్న వ్యక్తి అకౌంట్ నంబర్ అడగడంతో చెప్పాడు. నేరగాడు ఎనీ డెస్క్ యాప్ డౌన్లోడ్ చేయమని చెప్పడంతో ఇన్స్టాల్ చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి అతని అకౌంట్ నుంచి రూ.75 వేల నగదును ఐదు సార్లు ఇతర అకౌంట్లలోకి బదిలీ చేసినట్టు సందేశం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఇలా ఇంటర్నెట్లో ఏది పడితే అదే కస్టమర్ కేర్ నంబర్ అనుకొని పొరపడి కాల్ చేసి బ్యాంకు ఖాతాల వివరాలు షేర్ చేయడంతో, దేశవ్యాప్తంగా ఏటా రూ.3 వేల కోట్లకు పైగా సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారని దర్యాప్తు బృందాలు తెలిపాయి. అమాయకంగా నమ్మేయకుండా కనీస అవగాహన, అప్రమత్తతతో వ్యవహరిస్తే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చని పోలీస్ శాఖ సూచిస్తోంది. బ్యాంక్ లోన్ పేరిట.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ మహిళ బ్యాంకు పేరిట వచ్చిన ఫోన్ కాల్ మాట్లాడింది. అవతలి వ్యక్తి మీకు లోన్ ఆఫర్ వచ్చింది, రూ.2 లక్షలు అకౌంట్లోకి పంపిస్తాము. రెండేళ్ల తర్వాత కడితే సరిపోతుంది అని చెప్పాడు. సంబంధిత మహిళ నమ్మి సైబర్ నేరస్తుడు అడిగిన ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ సైతం చెప్పి రూ.42 వేలు పోగొట్టుకుంది. డబ్బులు పోయిన విషయం కూడా ఆలస్యంగా తెలియడంతో తన కుమారుడికి చెప్పుకొని లబోదిబోమంది. ఇలా రుణాల పేరిట కూడా సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్‌గా చేసుకొని బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగావకాశాలంటూ మోసం ఈ మెయిల్స్ ద్వారా ఉద్యోగావకాశాల ప్రకటనలు చూసిన జీడిమెట్లకు చెందిన సందీప్ వచ్చిన లింక్‌ను క్లిక్ చేశాడు. పేరు, విద్యార్హతలు, ఫొటో, బ్యాంకు అకౌంట్ నంబర్.. ఇలా అన్ని వివరాలు అడిగారు. ఉద్యోగావకాశం కావడంతో సందీప్ నిజాయితీగా అన్ని ఫిల్ చేశాడు. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది ఎంటర్ చేయాలని ఉంది. అదే రీతిలో ఓటీపీ ఎంటర్ చేశాడు. ఆ తర్వాత మరో మెయిల్ వస్తుంది, సంబంధిత లింక్‌ను మొబైల్లో క్లిక్ చేస్తే నివసిస్తున్న నగరంలోని ఎంఎన్సీ కంపెనీల నుంచి ఆఫర్లకు సంబంధించిన అలర్ట్స్ వస్తాయని సూచించడంతో ఓపెన్ చేశాడు. అంతే ఆ మొబైల్లో రిమోట్ కంట్రోల్ యాప్ ఇన్స్టాల్ అయ్యింది, ఆ విషయం సందీప్‌కు తెలియదు. మరుసటి రోజు తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 12 వేలు డెబిట్ అయినట్టు సందేశం రావడంతో పోలీసులను ఆశ్రయించాడు. మొబైల్ ఫోన్లోని రిమోట్ యాక్సెస్ యాప్ ద్వారా ఓటీపీలను రిసీవ్ చేసుకొని డబ్బులు కొట్టేసినట్టు పోలీసులు గుర్తించారు. బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఓటీపీలు చెప్పొద్దు.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల్లో కాల్ సెంటర్లు, కస్టమర్ కేర్, కేవైసీ అప్డేట్, ఉద్యోగం, లోన్లు.. ఈ తరహా మోసాలే 66 శాతం వరకు ఉన్నాయని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వెల్లడించాయి. స్మార్ట్‌ఫోన్‌తో ఇంటర్నెట్ విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం కష్టంగా మారడమే సైబర్ నేరస్తుల పాలిట కల్పతరువుగా మారిందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్యాంకు అకౌంట్ నంబర్లు, ఓటీపీలు చెప్పి, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. -
నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి..
కడప అర్బన్(వైఎస్సార్ జిల్లా): వేరేవారి బ్యాంకు ఖాతాలనుంచి ఆధునిక టెక్నాలజీ సాయంతో డబ్బును దోచేస్తున్న ఓ సైబర్ నేరగాడిని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి..అతని వద్ద నుంచి రూ. 3 లక్షలు రికవరీ చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని సుందరయ్య నగర్‌కు చెందిన మల్లెపోగు ప్రసాద్ (31) ప్రొద్దుటూరు టౌన్ హోమస్‌పేటలో తమ బంధువులకు చెందిన ధనలక్ష్మి వెబ్ సెంటర్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. చదవండి: అన్నా.. అని వేడినా కనికరించలేదు.. ఆ మాటలు విని వారి గుండెలు బద్దలైపోయాయి ఆరు నెలల క్రితం అరుణ అనే మహిళ నెట్ సెంటర్లో తన వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయి డాక్యుమెంట్లు ప్రింట్ తీసుకుని లాగౌట్ చేయకుండా వెళ్లిపోయింది. దీంతో నిందితుడు వాట్సాప్‌ను చెక్‌చేయగా ఆమె బ్యాంక్ ఖాతా నుంచి నెట్‌బ్యాంకింగ్ ద్వారా ఎవరికో డబ్బులను పంపిన విషయం గమనించాడు. వెంటనే అరుణ కుమార్తె నంబరుకు ఫోన్ చేసి మీ తల్లి ఆధార్, పాన్‌తో లింక్ కాలేదని, తాను చెప్పినట్లు మెసేజ్ పెట్టమని కోరాడు. తరువాత ఆమె సెల్‌కు వచ్చిన మెసేజ్, వెరిఫికేషన్ కోడ్లను స్క్రీన్‌షాట్‌గా తెప్పించుకున్నాడు. అనంతరం అరుణ వాడుతున్న నంబరును ఎయిర్టెల్ నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసి హైదరాబాద్‌లో సిమ్‌కార్డును తీసుకుని యాక్టివేట్ చేసుకున్నాడు. దీని కోసం నిందితుడు తన ఫేస్‌కట్‌తోనే పోలి ఉన్న రాయచోటికి చెందిన మగ్దూం బాషా అనే అతని ఆధార్‌కార్డును ఉపయోగించాడు. ఈ నంబరు సిమ్‌ను తన సెల్లో వేసుకుని ఫోన్‌పే, నెట్ బ్యాంకింగ్ ఇన్స్టాల్ చేసుకుని అరుణకు చెందిన కెనరాబ్యాంక్ ఖాతానుంచి మొత్తం రూ. 4.31 లక్షలను కాజేశాడు. తన బ్యాంకు ఖాతానుంచి రూ.4 లక్షలకుపైగా డబ్బు మాయం కావడంతో.. ఆందోళనకు గురైన మహిళ ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు, కడప సైబర్ సెల్ పోలీసు బృందం అధునాతన టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడు తాను దొంగిలించిన మొత్తంలో రూ. 3.10 లక్షలు తన తల్లి ఆరోగ్య సమస్య తీరడానికి హోమం చేయాలంటూ కర్నూలు జిల్లా కొలిమికుంట్లకు చెందిన ఓ పూజారికి ఇచ్చినట్లు తెలిపాడు. నిందితుడిని అక్కడికి తీసుకుపోయిన పోలీసులు పూజారి నుంచి ఆ రూ.3 లక్షలు రికవరీ చేశారు. -
సెక్యూరిటీ గార్డ్ టు సైబర్ క్రిమినల్!
సాక్షి, సిటీబ్యూరో: నేపాల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అర్జున్ బోర సైబర్ నేరగాడిగా మారాడు. తన సోదరుడితో పాటు నాగరాజు అనే వ్యక్తితో కలిసి బ్లాక్ ఫంగస్ మందులు విక్రయిస్తామంటూ ఎర వేసి మోసం చేయడంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పట్టుకున్న ఇతడిని పీటీ వారెంట్‌పై బుధవారం సిటీకి తరలించారు. నగరానికి చెందిన ధనుంజయ్ తండ్రి బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ల కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పరిచయస్తులు బెంగళూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఇచ్చారు. ధనుంజయ్ ఆ నంబర్లో సంప్రదించగా... రూ.1.29 లక్షలకు ఇంజెక్షన్లు సరఫరా చేయడానికి అంగీకరించాడు. ఇందులో రూ.20 వేలు అర్జున్ ఖాతాకు, మిగిలిన మొత్తం నాగరాజు ఖాతాకు బదిలీ చేయించారు. ఆపై వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన ధనుంజయ్ సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అర్జున్ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న ఇతడి సోదరుడితో పాటు నాగరాజు కోసం గాలిస్తోంది. చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! -
'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'
సాక్షి, బనశంకరి: 1947 నాటి రూపాయి నాణేన్ని కొనుగోలు చేస్తానని చెప్పి ఉపాధ్యాయురాలికి రూ.లక్ష టోపీ వేశాడు సైబర్ మోసగాడు. బెంగళూరు సర్జాపుర రోడ్డులో ఉండే టీచర్ (38) తన వద్ద 1947 నాటి అరుదైన రూపాయి నాణెం ఉందని, విక్రయిస్తానని జూన్ 15 తేదీన ఓఎల్ఎక్స్ యాప్‌లో ప్రకటన ఇచ్చి మొబైల్ నెంబరు పెట్టింది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను రూ.కోటికి కొంటానని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నాడు. అంత డబ్బు మీ ఖాతాలోకి పంపాలంటే కొన్ని పన్నులు కట్టాలి అని ఆమె నుంచే పలుసార్లు రూ.లక్ష వరకు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అతడు మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని కోరడం, గట్టిగా అడిగిన తరువాత అతని ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మోసపోయినట్లు తెలుసుకున్న టీచరమ్మ వైట్‌పీల్డ్ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
పోలీసుల కళ్లుగప్పి సైబర్ నేరస్థుడి పరారీ
-
మచ్చిక చేసుకొని ముంచేస్తారు
కరీంనగర్‌క్రైం: ప్రస్తుతం అంతా ఆన్లైన్..అత్యవసరంగా డబ్బు అవసరముంటే వివిధ యాప్‌ల రూపంలో క్షణాల్లో అకౌంట్లోకి బదిలీ అవుతున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో నేరాలు రెట్టింపుస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రయోజనాలు చేకూర్చుతున్న యాప్‌లు, ఆన్లైన్ వెబ్సైట్ల కారణంగా వినియోగదారులు నిండామునుగుతున్నారు. వివిధ రకాలుగా మోసం వస్తువుల క్రయ, విక్రయాలు, లాటరీలు, తక్కువవడ్డీకి రుణాలు, వివిధరకాల ఆన్లైన్ గేమ్స్ పేరుతో మోసగాళ్లు అమాయక ప్రజలను ఆకర్షణీయమైన ప్రకటనతో ప్రలోభపెట్టి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. వాహనాలు, వస్తువులను అతితక్కువ ధరలకు విక్రయిస్తామని ఫొటోలు పెట్టి ఆకర్షిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 22 సైబర్ కేసులు నమోదవగా టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు 19 కేసులను bó దించారు. ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి జాగ్రత్త ♦ పిల్లలకు డెబిట్/క్రెడిట్‌కార్డుల వివరాలను చిన్నపిల్లలకు తెలుపవద్దు. ♦ డబ్బులతో కూడుకున్న ఆన్లైన్ గేమ్స్ పిల్లలను ఆడనివ్వకుండా చూసుకోవాలి. ♦ ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకోకుండా గూగుల్‌పే, ఫోన్‌పే ఇతరత్రా పద్ధతుల్లో డబ్బు పంపొద్దు. ♦ ఆన్లైన్లో చూసి వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసే క్రమంలో వాహనాలను, వాటి ధ్రువపత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించి కొనుగోలు చేయాలి. ♦ డెబిట్‌కార్డు/క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరికి ఫోన్ ద్వారా తెలుపవద్దు. ♦ ఫోన్‌ద్వారా లావాదేవీలు నిర్వహించేప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వివరాలు గోప్యంగా ఉంచాలి ♦ వివిధరకాల వెబ్సైట్లను చూసినప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు మధ్యలో వచ్చే లింక్స్ క్లిక్ చేయకుండా ఉంటే మంచిది. ♦ ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేప్పుడు అనుమానిత ఫోన్కాల్లకు స్పందించవద్దు. ♦ పరిచయం లేని వ్యక్తులతో లావాదేవీలు వద్దు. ♦ వస్తువులు కొనుగోలు చేసేప్పుడు ముందుగానే డబ్బు పంపకుండా ఉంటే మంచిది. ♦ అకౌంట్లకు నగదు జమ అవుతుంది అనే వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ♦ అనుమానిత లింక్‌లు ఓపెన్ చెయ్యొద్దు. గోప్యంగా ఉండాల్సిన వివరాలు వెల్లడించవద్దు. ♦ దీంతోపాటు పలు విషయాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు వృథాకాకుండా ఉంటాయి. పోలీసులకు సమాచారమివ్వాలి ఆన్లైన్ మోసాల గురించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారమందించాలి. మోసగాళ్లు సూచించిన విధంగా డబ్బు చెల్లిస్తే నష్టపోకతప్పదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. డబ్బులు పోగొట్టుకున్న తర్వాత ఫిర్యాదు చేస్తే ఫలితం ఉండదు. కమిషనరేట్ కేంద్రంలో సైబర్‌ఫోరెన్సిక్ ల్యాబ్ అందుబాటులో ఉంది. దీని ద్వారా అనేక సైబర్‌నేరాలు ఛేదిస్తున్నాం.–వీబీ కమలాసన్‌రెడ్డి, కరీంనగర్ సీపీ -
మాజీ ఎమ్మెల్యే భార్యకు వేధింపులు
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే భార్యకు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రాంరంభించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే మాజీ ఎమ్మెల్యే భార్య పేరుతో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ఐడీని కొందరు దుండగులు క్రియేట్ చేశారు. దీనికి ప్రొఫైల్ పిక్‌గా ఆమె ఫొటోనే వినియోగించారు. ఈ ఐడీ ద్వారా ఆమే స్వయంగా పోస్టులు పెట్టినట్లు అభ్యంతరకరంగా, అసభ్యంగా కొన్ని సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆమె స్నేహితుల, బంధువులకు వెళ్లాయి. కొందరితో ఆమె మాదిరిగా చాటింగ్ కూడా చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రముఖుల కుమార్తెలూ బాధితులే!
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా యువతులను ఆకర్షించడం.. తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో మాటలు చెప్పి నమ్మించడం... ఉద్యోగం, వ్యాపారం, ప్రాజెక్టులు అంటూ అందినంత దండుకోవడం... ఈ పంథాతో అనేక రాష్ట్రాల్లో నేరాలు చేసిన జోగడ వంశీ కృష్ణ అలియాస్ హర్ష వర్ధన్‌రెడ్డి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల కుమార్తెలు సైతం ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్లో యువతులతో పరిచయాలు పెంచుకుని, తన మాటల గారడీతో వారి నుంచి డబ్బు లాగి మోసాలకు పాల్పడే ఈ ఘరానా నేరగాడు ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడతాడని పోలీసులు చెప్తున్నారు. రెండు రోజుల క్రితం నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన యువతి రూ.8.5 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం విదితమే. ఈమెకు హర్ష వర్ధన్రెడ్డిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఇతగాడు ఫేస్‌బుక్‌ను వినియోగించగా... తాజాగా ఇన్‌స్ట్రాగామ్‌కు మారాడు. ఏపీలోని రాజమండ్రిలో ఉన్న రామచంద్రరావుపేటకు చెందిన వంశీ సంపన్న కుటుంబానికి చెందిన వాడే. బీటెక్ రెండేళ్ళకే మానేసిన ఇతగాడు 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కొన్నాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఇతగాడు ఆ తర్వాత సోషల్‌మీడియా ఆ«ధారంగా యువతులకు వల వేసి, తియ్యని మాటలు చెప్తూ డబ్బు లాగడం ప్రారంభించాడు. ఇలాంటి నేరాలకు సంబంధించి వంశీపై నగరంతో పాటు విజయవాడ, నిజామాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, గుంటూరుల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ఓ చోట ఉండకుండా మెట్రో నగరాల్లో సంచరిస్తూ, గుర్రపు పందాలు కాస్తూ జల్సాలు చేయడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు మాత్రం తన స్వస్థలమైన రాజమండ్రికి వెళ్తుంటాడు. ఇతగాడిని 2017లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్లో సుస్మిత అనే యువతిని లోబరుచుకున్న ఇతగాడు ఆమె ఫేస్బుక్ ఖాతాను వినియోగించాడు. దీని ద్వారా సుస్మిత మాదిరిగా, ఆమె స్నేహితురాళ్ళతో ‘మీరు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఉద్యోగం ఎలా ఉంది?’ అంటూ పలకరించే వాడు. ఎవరైనా సుస్మిత చాట్ చేస్తోందని భావించి ఉద్యోగంలో ఉండే బాధలు పంచుకునే వారు. ఆపై వారితో ‘మా ఫ్రెండ్ వంశీకృష్ణ నాకు గూగుల్‌లో ఉద్యోగం ఇప్పించాడు. మీకు కూడా ఇప్పిస్తాడు. సంప్రదించండి అంటూ తన నెంబర్‌నే వారికి పంపేవాడు. అలా సంప్రదించిన వారితో బ్యాక్‌డోర్ ఎంట్రీలు అని చెప్పి రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు తన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకునేవాడు. స్నేహారెడ్డి పేరుతో ఓ నకిలీ ఫ్రొఫైల్ క్రియేట్ చేసిన ఇతగాడు ఆమె మాదిరిగా అనేక మంది యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ దండుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి రూ.1.37 కోట్లు కాజేసిన ఇతగాడిని 2017 జూన్ 15న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన వంశీకృష్ణ తన పంథా మార్చుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినికి సోషల్‌మీడియా ద్వారా వల వేసి మోసం చేశాడు. ఇలా ఏపీ మొత్తమ్మీద అనేక మంది నుంచి రూ.44 లక్షలు కాజేశాడు. వైద్య విద్యార్థిని కేసులో జోగడ వంశీకృష్ణ అలియాస్ హర్ష కోసం 2018లో కాకినాడ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ముంబై, పుణే, మైసూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో వేటాడి ఆ ఏడాది సెప్టెంబర్ 5న అతడి స్వస్థలమైన రాజమండ్రిలోనే పట్టుకున్నారు. గుర్రపు పందాలు కాసే అలవాటు ఉన్న వంశీకృష్ణ ఓ దశలో గంటకు రూ.7 లక్షల వరకు పందాలు కాసి పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. వంశీ కోసం గాలిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని పట్టుకుంటే మరింత మంది బాధితుల వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు. -
20 రోజుల పరిచయం.. మోసపోయిన వృద్ధురాలు..!
సాక్షి, సిటీబ్యూరో: తన పేరు మార్క్ జాయ్ అంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు... సెప్టెంబర్ 4 నుంచి వాట్సాప్‌లో చాటింగ్ చేశాడు... 21న బహుమతి పంపుతున్నానంటూ కొంత మొత్తం డిమాండ్ చేశాడు... 24న మరికొంత మొత్తం డిపాజిట్ చేయమన్నాడు.. మొత్తమ్మీద 20 రోజుల పరిచయంతో ఆ వృద్ధురాలి నుంచి రూ.1.17 లక్షలు దండుకుని మోసం చేశాడు. ఎట్టకేలకు మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ రోడ్‌కు చెందిన ‘జేఎంకే’ ఏడేళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్న ఆమెకు ఫేస్బుక్లో ఖాతా ఉంది. సెప్టెంబర్ 1న ఈమెకు మార్క్ జాయ్ అనే ఐడీ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అందులోని వివరాల ప్రకారం అతను లండన్‌లో ఉంటున్నట్లు ఉంది. ఈ రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇద్దరూ ఫేస్బుక్ స్నేహితులుగా మారిపోయారు. సరిగ్గా నాలుగు రోజుల తర్వాత వాట్సాప్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్న వీరు చాటింగ్ మొదలెట్టారు. హఠాత్తుగా మన స్నేహానికి గుర్తుగా ఓ గిఫ్ట్ పంపుతున్నానంటూ చెప్పిన అతగాడు దానిని అందుకోవాలన్నాడు. ఆపై సెప్టెంబర్ 21న ఖరీదైన వస్తువులతో కూడా ఆ గిఫ్ట్‌ప్యాక్ విమానాశ్రయంలో ఆగిపోయిందని, రిలీజ్ చేయించుకోవడానికి రూ.32 వేలు చెల్లించాలంటూ మెసేజ్ వచ్చింది. దీనిని నమ్మిన ఆమె సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టాంగ్కోయ్ అనే పేరుతో ఉన్న వ్యక్తి ఖాతాకు నగదు బదిలీ చేసింది. అదే నెల 24న మరో మెసేజ్ పంపిన అతగాడు మరో రూ.85 వేలు డిమాండ్ చేయడంతో రాజ్ దాస్ పేరుతో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకే కాల్ చేసిన మార్క్ ఈసారి ఏకంగా రూ.1.65 లక్షలు చెల్లించాలంటూ సూచించాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు మోసపోయినట్లు భావించి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ బి.రమేష్ దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి బాధితురాలు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలు నాగాలాండ్‌కు చెందినవిగా తేల్చారు. మొకోక్చుంగ్, దింబబూర్ల్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో ఉన్న ఈ వివరాలతో పాటు సాంకేతిక ఆ«ధారాలను బట్టి నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలిని పరిచయం చేసుకునే సందర్భంలో మార్క్ తాను లండన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. ఆపై గిఫ్ట్‌ను విమానంలో పంపిస్తున్నానని, ఎయిర్‌పోర్ట్‌లో ఆగాయని అన్నాడు. అయితే డబ్బు డిపాజిట్ చేయమన్న ఖాతాలు మాత్రం ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లోని బ్యాంకు శాఖల్లో ఉన్నవి ఇచ్చాడు. ఇలాంటి వివరాలు సరిచూసుకున్నా మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. -
వాట్సప్, ఫేస్‌బుక్‌లతో అమ్మాయిలకు వల
తూర్పుగోదావరి, కాకినాడ రూరల్: సోషల్ మీడియాలో అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వారికి మాయమాటలు చెప్పి లక్షలాది రూపాయలు కాజేశాడు. కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి బురిడీ కొట్టించాడు. ఇలా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వారికి టోకరా ఇచ్చిన అంతర్రాష్ర ్ట మాయగాడిని కాకినాడ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 1.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను టూటౌన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ రవివర్మ, టూటౌన్ సీఐ ఎండీ ఉమర్‌తో కలసి మంగళవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రాజమహేంద్రవరం రామచంద్రరావుపేట, 2వ వీధికి చెందిన జోగాడ వంశీకృష్ణ అలియాస్ హర్ష (28) 2009లో సూరంపాలెంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్‌లో చేరాడు. 2013 వరకూ చదివి మధ్యలో మానేశాడు. 2014లో హైదరాబాద్ వెళ్లి ఓ ప్రైవేట్ కంపెనీలో చేరి కొంతకాలం పనిచేసి మానేశాడు. జల్సాలకు అలవాటుపడిన వంశీకృష్ణ హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు అమ్మాయిలతో పరిచయం పెంచుకొని వారి ద్వారా మరికొందరు అమ్మాయిలను పరిచయం చేసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి రూ. 80 లక్షల వరకూ వసూలు చేశాడు. అతని మోసాన్ని గమనించి వారు పోలీసు కేసులు పెట్టగా పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చి ఫేస్బుక్లో అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. అందులో తన ఫొటోకు బదులుగా మిత్రుడు హర్ష ఫొటోను ఉంచి అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. వారితో వ్యక్తిగత పరిచయాలు పెంచుకొని వారి వివరాలను తెలుసుకొని వాట్సప్ ద్వారా వారి మిత్రులతో పరిచయం పెంచుకొనేవాడు. వారి నుంచి రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 5 లక్షలు తీసుకుంటూ ఆ డబ్బుతో క్రికెట్ బెట్టింగ్, గుర్రప్పందాలు ఆడుతూ జల్సా చేశాడు. అలా రూ. 44 లక్షలు దోచేశాడు. అలాగే రంVýæరాయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆరు నెలల క్రితం మోసం చేసి రూ. 70 వేల నగదు, ఐదున్నర కాసుల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. దాంతో ఆమె కాకినాడ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో అప్పటి నుంచి పోలీసులు వంశీకృష్ణ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ ఆరునెలల్లో అతను 25 సిమ్ కార్డులను మార్చి తప్పించుకు తిరిగాడు. చివరకు టౌన్‌రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం 11 గంటలకు వంశీకృష్ణను అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. ముద్దాయి వంశీకృష్ణపై హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్, ఖమ్మం టూటౌన్, నిజామాబాద్ వన్‌టౌన్, భీమవరం టౌన్, పాలకొల్లు టౌన్, ఆకివీడు, మహబూబ్‌నగర్, కాకినాడ టూటౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్, కైకలూరు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. అమ్మాయిలను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచేసిన ముద్దాయి వంశీకృష్ణపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ తెరుస్తామని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఇటువంటి నేరాలు తరచూ జరుగుతున్నాయని వాట్సప్,ఫేస్‌బుక్‌ల్లో తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు, ఫొటోలు తెలియని వ్యక్తులకు ఇవ్వవద్దని డీఎస్పీ రవివర్మ సూచించారు. వంశీకృష్ణను చాకచక్యంగా పట్టుకున్న సీఐ ఉమర్, ఎస్సై జీవీవీ సత్యనారాయణ, ఏఎస్సై పట్టాభి, హెచ్‌సీ నూకరాజు, రమేష్, కానిస్టేబుల్ నూకరాజులను డీఎస్పీ రవివర్మ అభినందించారు. -
ఏమార్చి.. ఏటీఎం కార్డులు మార్చి
తడ: ఓ సైబర్ మాయగాడు ఏటీఎం కేంద్రం ముగ్గురు యువతులను మోసగించి రూ.68 వేల నగదు కాజేశాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. బాధితులు శనివారం ఉదయం పోలీసుకు ఫిర్యాదు చేశారు. విశాఖ, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి వచ్చిన పీ ఉమ, వీ లక్ష్మి, ఎస్ వరలక్ష్మి శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరికి నాలుగు నెలలకు సంబంధించిన జీతాలు వారి వారి అకౌంట్లలో పడ్డాయి. ఆ డబ్బులను ఏటీఎం ద్వారా తమ కుటుంబ సభ్యులకు బదిలీ చేసేందుకు తడలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంక్ వద్ద ఉన్న ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు. ఏటీఎం ద్వారా ప్రయత్నిస్తుండగా అదే సమయంలో ఏటీఎం లోపలే ఉన్న ఓ వ్యక్తి కలగజేసుకుని ఆపరేటింగ్ విధానాన్ని తప్పు బడుతూ వారి ఏటీఎం కార్డులను తీసుకుని పిన్ నంబర్ అడుగుతూ ఆపరేటింగ్ చేశాడు. నగదు పంపాల్సిన బ్యాంక్ వేరేది కావడంతో బదిలీ ఆపేసి ఖర్చులకు మాత్రం తలా రూ.2 వేలు చొప్పున డ్రా చేయించుకుని ఏటీఎం కార్డులు తీసుకుని హాస్టల్‌కు వెళ్లి పోయారు. హాస్టల్‌కి వెళ్లి కొద్ది సేపటికి డబ్బులు డ్రా అవుతున్నట్టు మెసేజ్‌లు రావడంతో ఆందోళన చెందిన యువతులు ఏటీఎంలు పరిశీలించగా అవి డూప్లికేట్ ఏటీఎం కార్డులని తేలింది. వెంటనే తేరుకున్న యువతులు ఆటోలో సూళ్లూరుపేట కెనరా బ్యాంక్ వద్దకు వెళ్లి వెతగ్గా ఆ వ్యక్తి ఆచూకీ లభించలేదు. అనంతరం పరిశ్రమలో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతని ద్వారా తడ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై శనివారం తడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు వదిలి, అయిన వారిని వదిలి, సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగాలు చేసి కుటుంబ అవసరాల కోసం భద్రంగా దాచుకున్న జీతం మొత్తం మోసగాడి పాలు కావడంతో యువతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఏటీఎం సెంటర్లలో సరైన పర్యవేక్షణ లేకపోవడం, సెక్యూరిటీ లేకపోవడం, ఎవరు పడితే వారు గుంపులు గుంపులుగా ఏటీఎంల్లో చొరబడ్డా అడిగే నాథుడు లేకపోవడంతో మోసాలకు ఆస్కారాలు కలుగుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోసగాడు దొరికాడు
- బ్యాంకుల్లో రుణాలు ఇప్పిస్తామంటూ టోకరా - బాధితుడి ఫిర్యాదుతో కేసును ఛేదించిన ఆదోని పోలీసులు - నిందితుడి నుంచి రూ. 91 వేలు, సిమ్‌కార్డులు స్వాధీనం ఆదోని టౌన్: అమాయక పేదలే అతని టార్గెట్. రుణాలు ఇప్పిస్తామంటూ పేపర్లలో ప్రకటనిలిచ్చి బురిడీ కొట్టించడంలో నేర్పరి. ఎంతో మందిని మోసం చేసిన ఓ సైబర్ నేరగాడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మంగళవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. రాజస్థాన్‌కు చెందిన సందీప్ కుమార్ అగర్వాల్ హైదరాబాద్‌లో ఉంటూ అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఫైనాన్స్ కంపెనీలలో లోన్లు మంజూరు చేయిస్తానని వివిధ దినపత్రికలలో క్లాసీఫైడ్ యాడ్స్ వేయించడం, ఎస్ఎంఎస్లు పంపడం, ఫోన్లతో అమాయక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించేవాడు. ఇందుకు వివిధ కంపెనీలకు చెందిన సిమ్ కార్డులను వినియోగించాడు. ప్రియా ఫైనాన్స్, సుప్రియ, నిహారిక, లక్ష్మి తదితర ఫైనాన్స్‌ల నుంచి లోన్లు మంజూరు చేయిస్తానని నమ్మబలికేవాడు. ఈ క్రమంలో కౌతాళం మండలం హాల్వి గ్రామానికి చెందిన సంపత్‌కుమార్‌కు సుప్రియ ఫైనాన్స్‌లో రూ. 5 లక్షలు ఎలాంటి పూచికత్తు లేకుండా లోన్ మంజూరు చేయిస్తానని చెప్పాడు. పలుమార్లు ఫోన్లలో మాట్లాడుతూ నమ్మించాడు. ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ మంజూరైనట్లు ప్రత్యేకంగా తాను తయారు చేసుకున్న ఫారంను చూపించాడు. దానిని నమ్మిన సంపత్‌కుమార్ వివి«ధ దశల్లో రూ.91 వేలు నేరగాడి అకౌంట్లో జమ చేశాడు. అయినా లోన్ మంజూరు కాకపోవడంతో అనుమానం కల్గిన బాధితుడు గత నెల 9వ తేదీన కౌతాళం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వల పన్ని పట్టుకున్నారు: బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదోని తాలూకా సీఐ దైవప్రసాద్, ఎస్ఐ సుబ్రమణ్యం రెడ్డి, సిబ్బంది ఆనంద్, వలితో ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. 41 రోజులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడు ఉపయోగించిన ఫోన్ ఆధారంగా విచారణ చేయగా ఆచూకీ లభించలేదు. బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా విచారించగా ఏడు అకౌంట్లు ఉన్నట్లు తేలింది. అయినా నిందితుడిని పట్టుకోలేక పోయారు. ఈ నేపథ్యంలో బాధితుడి నుంచే ఎర వేశారు. లోన్ మంజూరవుతున్నట్లు వేరే నెంబర్‌తో నిందితుడి మళ్లీ బాధితుడికి ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానంతో అతనిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో లోన్ మంజూరుకు మరి కొంత నగదు అడగడంతో ఆదోనికి వస్తే ఇస్తానని బాధితుడు చెప్పాడు. మంగళవారం సందీప్ కుమార్ అగర్వాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. అప్పటికే మాటు వేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ. 91 వేల నగదు, రెండు సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మాయమాటలు నమ్మొద్దు: నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. ఈ–మెయిల్స్‌కు, సెల్‌కు మేసేజ్‌లు వస్తే లోన్ మంజూరైందని, ఫ్రీ ఇన్సూరెన్స్ ఇస్తామని, సెల్ఫోన్లలో వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. ఎవరైనా ఎక్కడైనా మోసపోయినట్లయితే పోలీసులను ఆశ్రయించాలని చెప్పారు. కేసును చాలెంజ్‌గా తీసుకొని ఛేదించిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
నన్నెవరూ ఆపలేరు..!
ఒకటి బ్లాక్ చేస్తే పదులు క్రియేట్ చేస్తా! ఇన్‌స్ట్రాగామ్‌లో ఓ సైబర్ నేరగాడి సవాల్ దేవుళ్లను కించపరుస్తూ ఫొటోలతో పోస్టులు సైబర్ క్రైమ్ పోలీసులకు నగరవాసి ఫిర్యాదు సిటీబ్యూరో: సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఓ సైబర్ నేరగాడు సవాల్ విసురుతున్నాడు. అనేక మంది దేవుళ్లను కించపరుస్తూ ఫొటోలను పోస్ట్ చేస్తున్న ఇతగాడు ఒక ఐడీని బ్లాక్ చేయిస్తే పది సృష్టిస్తానంటూ ఆన్లైన్లో ప్రకటిస్తున్నాడు. దీనిపై నగరవాసి ఫిర్యాదు మేరకు సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఉన్న అభ్యంతరకర పోస్టింగ్స్‌ను అబిడ్స్ ప్రాంతానికి చెందిన వ్యాపారి శనివారం రాత్రి గుర్తించారు. వాటిని పోస్ట్ చేసిన వ్యక్తిని సంప్రదించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఓ వర్గాన్ని కించపరుస్తూ ప్రచారం చేస్తున్న వీటిని తొలగించాల్సిందిగా కోరుతూ ఇన్‌స్ట్రాగామ్ యాజమాన్యాన్ని ఆశ్రయించారు. తక్షణం స్పందించిన వారు సదరు అభ్యంతరకర పోస్టుల్ని చేస్తున్న ఐడీని బ్లాక్ చేశారు. మార్ఫింగ్ చేసిన ఆయా ఫొటోలను సైతం తీసేశారు. దీనిపై నగర వ్యాపారి సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఓపక్క పోలీసుల విచారణ సాగుతుండగానే సైబర్ నేరగాడు మరింత బరితెగించాడు. ఏకంగా 17 ఐడీలను క్రియేట్ చేసి వివిధ వర్గాలకు చెందిన దేవుళ్ళను కించపరుస్తూ పోస్టులు పెట్టాడు. అందులో ఓ ఐడీ నుంచి ‘ఒక ఐడీని బ్లాక్ చేయిస్తే పది క్రియేట్ చేస్తా’ అంటూ సవాల్ కూడా విసిరాడు. సదరు సైబర్ నేరగాడు బెంగళూరు కేంద్రంగా వీటిని పోస్టు చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత సున్నితమైన ఈ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణం స్పందించాలని, వీలైనంత త్వరలో సైబర్ నేరగాడు వినియోగిస్తున్న ఐడీలన్నింటినీ బ్లాక్ చేయించడంతో పాటు నిందితుడిని అరెస్టు చేయాలని ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీసుల్ని కోరుతున్నారు.