సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా యువతులను ఆకర్షించడం.. తనకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానంతో మాటలు చెప్పి నమ్మించడం... ఉద్యోగం, వ్యాపారం, ప్రాజెక్టులు అంటూ అందినంత దండుకోవడం... ఈ పంథాతో అనేక రాష్ట్రాల్లో నేరాలు చేసిన జోగడ వంశీ కృష్ణ అలియాస్ హర్ష వర్ధన్‌రెడ్డి కోసం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఇతడి చేతిలో మోసపోయిన వారిలో అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల కుమార్తెలు సైతం ఉన్నట్లు తెలిసింది. ఆన్‌లైన్‌లో యువతులతో పరిచయాలు పెంచుకుని, తన మాటల గారడీతో వారి నుంచి డబ్బు లాగి మోసాలకు పాల్పడే ఈ ఘరానా నేరగాడు ఆంగ్లంలో అనర్ఘళంగా మాట్లాడతాడని పోలీసులు చెప్తున్నారు.
రెండు రోజుల క్రితం నగరంలోని లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన యువతి రూ.8.5 లక్షలు పోగొట్టుకుని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం విదితమే. ఈమెకు హర్ష వర్ధన్‌రెడ్డిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఇతగాడు ఫేస్‌బుక్‌ను వినియోగించగా... తాజాగా ఇన్‌స్ట్రాగామ్‌కు మారాడు. ఏపీలోని రాజమండ్రిలో ఉన్న రామచంద్రరావుపేటకు చెందిన వంశీ సంపన్న కుటుంబానికి చెందిన వాడే. బీటెక్ రెండేళ్ళకే మానేసిన ఇతగాడు 2014లో హైదరాబాద్‌కు మకాం మార్చాడు. కొన్నాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన ఇతగాడు ఆ తర్వాత సోషల్‌మీడియా ఆ«ధారంగా యువతులకు వల వేసి, తియ్యని మాటలు చెప్తూ డబ్బు లాగడం ప్రారంభించాడు.
ఇలాంటి నేరాలకు సంబంధించి వంశీపై నగరంతో పాటు విజయవాడ, నిజామాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ఖమ్మం, గుంటూరుల్లో కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ఓ చోట ఉండకుండా మెట్రో నగరాల్లో సంచరిస్తూ, గుర్రపు పందాలు కాస్తూ జల్సాలు చేయడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు మాత్రం తన స్వస్థలమైన రాజమండ్రికి వెళ్తుంటాడు. ఇతగాడిని 2017లో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
అప్పట్లో సుస్మిత అనే యువతిని లోబరుచుకున్న ఇతగాడు ఆమె ఫేస్‌బుక్ ఖాతాను వినియోగించాడు. దీని ద్వారా సుస్మిత మాదిరిగా, ఆమె స్నేహితురాళ్ళతో ‘మీరు ఎలా ఉన్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఉద్యోగం ఎలా ఉంది?’ అంటూ పలకరించే వాడు. ఎవరైనా సుస్మిత చాట్ చేస్తోందని భావించి ఉద్యోగంలో ఉండే బాధలు పంచుకునే వారు. ఆపై వారితో ‘మా ఫ్రెండ్ వంశీకృష్ణ నాకు గూగుల్‌లో ఉద్యోగం ఇప్పించాడు. మీకు కూడా ఇప్పిస్తాడు. సంప్రదించండి అంటూ తన నెంబర్‌నే వారికి పంపేవాడు. అలా సంప్రదించిన వారితో బ్యాక్‌డోర్ ఎంట్రీలు అని చెప్పి రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు తన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించుకునేవాడు.
స్నేహారెడ్డి పేరుతో ఓ నకిలీ ఫ్రొఫైల్ క్రియేట్ చేసిన ఇతగాడు ఆమె మాదిరిగా అనేక మంది యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి, యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలంటూ దండుకున్నాడు. దాదాపు 40 మంది నుంచి రూ.1.37 కోట్లు కాజేసిన ఇతగాడిని 2017 జూన్ 15న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్‌పై వచ్చిన వంశీకృష్ణ తన పంథా మార్చుకోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినికి సోషల్‌మీడియా ద్వారా వల వేసి మోసం చేశాడు. ఇలా ఏపీ మొత్తమ్మీద అనేక మంది నుంచి రూ.44 లక్షలు కాజేశాడు.
వైద్య విద్యార్థిని కేసులో జోగడ వంశీకృష్ణ అలియాస్ హర్ష కోసం 2018లో కాకినాడ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ముంబై, పుణే, మైసూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ల్లో వేటాడి ఆ ఏడాది సెప్టెంబర్ 5న అతడి స్వస్థలమైన రాజమండ్రిలోనే పట్టుకున్నారు. గుర్రపు పందాలు కాసే అలవాటు ఉన్న వంశీకృష్ణ ఓ దశలో గంటకు రూ.7 లక్షల వరకు పందాలు కాసి పోగొట్టుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. వంశీ కోసం గాలిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని పట్టుకుంటే మరింత మంది బాధితుల వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment