సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించిన నేరంలో ఒకరు
ఓఆర్‌ఆర్‌పై అభ్యంతరకరంగా వ్యవహరించి మరొకరు
ఒకే రోజు చోటుచేసుకున్న ఇద్దరు నిందితుల అరెస్టులు
బంజారాహిల్స్/ఘట్‌కేసర్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని జూబ్లీహిల్స్ పోలీసులు... రాచకొండ కమిషనరేట్‌లోని ఘట్‌కేసర్ అధికారులు.. బుధవారం ఇద్దరు యూట్యూబర్స్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. వీరిలో ఒకరు సినీ నటితో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల్లోకి చేరగా... మరొకరు ఔటర్ రింగ్ రోడ్‌పై (ఓఆర్‌ఆర్) న్యూసెన్స్ క్రియేట్ చేసి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఇతడి అరెస్టు ద్వారా పోలీసులు రీల్స్, మీమ్స్ పేరుతో ఓవర్ చేస్తే ఊరుకునేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
Irresponsible Instagram Content Creator Arrested
Recently a viral video surfaced showing an individual throwing ₹20,000 bundle on the roadside of ORR and challenging viewers to a #MoneyHunt. This irresponsible act caused chaos, inconvenience, and posed a significant threat… pic.twitter.com/tpypMB6lnQ— Rachakonda Police (@RachakondaCop) December 18, 2024
మారానంటూ మళ్లీ మొదటికి...
మణికొండ పంచవటి కాలనీలో నివసించే సినీ నటికి ఏడాదిన్నరగా యూట్యూబర్ ప్రసాద్ బెహరాతో పరిచయం ఉంది. ఇతడు యూట్యూబ్, కొన్ని చిత్రాల ద్వారా ప్రాచుర్యం పొందాడు. సదరు నటి ‘పెళ్లివారమండీ’ వెబ్ సిరీస్‌లో ప్రసాద్‌తో జత కట్టారు. షూటింగ్ సమయంలో ప్రసాద్ ప్రవర్తన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తట్టుకోలేక వెబ్ సిరీస్ నుంచి ఆమె తప్పుకున్నారు. ఆపై ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన ప్రసాద్ క్షమాపణలు చెప్పాడు. నిజమని నమ్మిన ఆమె ఏడాది తర్వాత మెకానిక్ అనే వెబ్ సిరీస్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. తన ప్రవర్తన మార్చుకోని అతగాడు అసభ్యంగా మాట్లాడటం, తాకడం చేశాడు. ఆమె అడ్డు చెప్పగా... షూటింగ్స్‌లో ఇవన్నీ సహజమని, కాదంటే నీకే నష్టమని హెచ్చరించాడు. అతడి ప్రవర్తన, మాటలు, చేష్టలతో విసిగిపోయిన పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటే.. దుర్భాషలాడాడు. దీంతో ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించగా... ప్రసాద్‌పై బీఎన్‌ఎస్‌లోని 75 (2), 79, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
కట్ట విసిరి కట్టలు సంపాదించాలని...
మనీ హంట్ చాలెంజ్ పేరుతో ఓఆర్‌ఆర్‌పై ఓ నోట్ల కట్ట విసిరి, ఆ రీల్‌ను సోషల్ మీడియాలో పెట్టి, సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడం ద్వారా యూట్యూబ్ నుంచి భారీ ఆదాయం పొందాలని ప్రయతి్నంచిన మరో యూట్యూబర్ రాయలపురం భానుచందర్ జైలుకు వెళ్లాడు. బాలానగర్‌కు చెందిన ఇతగాడు ఐదు రోజుల క్రితం ఘట్‌కేసర్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ 9 సమీపంలో ఓ రీల్ చేశాడు. రూ.20 వేల కట్టను చెట్ల పొదల్లో పడేసి ఎవరైన వచ్చి తీసుకోవచ్చంటూ దాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశాడు. ఇది వైరల్ కావడంతో ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సీరియస్‌గా తీసుకున్నారు.
ఇలా చేయడం న్యూసెన్స్ కిందికి వస్తుందని, ప్రయాణికులకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తించడమే అని ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇతడిపై బీఎన్‌ఎస్‌లోని 125, 272, ఐటీ యాక్ట్‌లోని 66 సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేయడంతో పాటు అతడి దగ్గర ఉన్న ఐ ఫోన్ 13 ప్రో సీజ్ చేశారు. ఓఆర్‌ఆర్, జాతీయ రహదారులపై రీల్స్ చేస్తే ప్రాణాలకు హాని జరిగే ప్రమాదం ఉందని, ఇలా చేస్తే జైలుకు పంపుతామని మల్కాజ్‌గిరి ఏసీపీ చక్రపాణి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment