
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...
కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.
మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది.
ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు.

ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్‌సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు.
