
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్‌రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్‌రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.
మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.
అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్‌తో నింపేస్తున్నారు.
ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్‌రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.