మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు | Akasa Air announced reduction in ticket prices and an increase in the number of flights to Prayagraj | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు

Published Fri, Jan 31 2025 10:38 AM | Last Updated on Fri, Jan 31 2025 10:58 AM

Akasa Air announced reduction in ticket prices and an increase in the number of flights to Prayagraj

మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్‌ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్‌రాజ్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపు

ఆకాసా ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.

ప్రభుత్వ జోక్యం

వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్‌మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.

ప్రయాణికులపై ప్రభావం..

ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్‌లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.

ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..

ఇప్పటికే చాలా సంస్థలు..

యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement