![Please Extend Maha Kumbh SP Chief Akhilesh Request UP Govt](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Kumbh_Extension.jpg.webp?itok=MYK2jU2m)
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..
మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.
ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్ ఘాట్‌ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా.
మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్‌లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.
ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.
ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా?
Comments
Please login to add a commentAdd a comment