
లక్నో: ఆయనో రాష్ట్ర మంత్రి. స్థానిక ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ సమయంలో సదరు ఆస్పత్రిలో విధులు నిర్వహించే ఓ దివ్యాంగ వైద్యాదికారి తనకి సరిగ్గా రాచమర్యాదలు చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి వాళ్లని ఈ ఆస్పత్రిలో ఎందుకు బాధ్యతలు అప్పగించారో. నియోజకవర్గంలో కాకుండా అడవుల్లో పోస్టింగ్ ఇవ్వండి అంటూ హుకుం జారీ చేశారు. మంత్రి, డాక్టర్ మధ్య జరిగిన ఘటనపై దుమారం చెలరేగింది.
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చి తనకు స్వాగతం పలకలేదని ఆగ్రహించిన ఆ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్.. శారీరక వైకల్యం ఉన్న వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్‌ను తక్షణమే తన నియోజకవర్గం నుండి బదిలీ చేయాలని ఆదేశించారు.‘ఇతనిని అడవికి పంపించండి.. ఇలాంటి వారిని ఇక్కడ ఎందుకు ఉంచుతున్నారు?’ అంటూ వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. ప్రస్తుతం,ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సంఘటన సోనభద్ర జిల్లా ఒబ్రా నియోజకవర్గంలోని దిబుల్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జరిగింది. మంత్రి అక్కడ సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చారు. మంత్రి వచ్చే సమయంలో వైద్యాధికారి డాక్టర్ రవి సింగ్ ఓ రోగికి చికిత్స చేస్తున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వెళ్లలేకపోయారు. దీనిపై మంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయనను బదిలీ చేయాలని జిల్లా వైద్యాధికారికి ఫోన్‌లో ఆదేశించారు.
ఆ వీడియోలో ‘ఇతనికి ప్రవర్తించటం రాదు. రోగుల పట్ల కూడా ఇదే విధంగా ఉంటారేమో. ఇతనిని అడవికి పంపించండి’ అంటూ ఫోన్ సంభాషించడం మనం గమనించవచ్చు. డాక్టర్ సింగ్ మాత్రం ‘నేను మీ వద్దకు వచ్చాను సార్. రోగికి చికిత్స చేసి వచ్చే సరికి ఆలస్యమైంది అని బదులిచ్చారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయడంతో మంత్రి సంజీవ్ గోండ్ వెనక్కి తగ్గారు. తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. వైద్యుడు నన్ను ఆహ్వానించేందుకు రాలేదంటే బహుశా ఆయనకు నేను వస్తున్నాను అన్న విషయం తెలియకపోయి ఉండొచ్చు. అయితే,ఆసుపత్రిలో సదుపాయాలు బాగుండాలి. వైద్యం కోసం వచ్చే పేదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదంటూ ఆదేశించారు. వారికి ఏదైనా కష్టం కలగిందంటే నేను ఉపేక్షించను అని వ్యాఖ్యానించారు.
मंत्री जी की ये कैसी हेकड़ी!
डॉक्टर ने नहीं किया 'स्वागत' तो भड़क गए राज्यमंत्री संजीव गोंड, CMO में फोन लगाकर की डॉक्टर की शिकायत, कहा- इनको जंगल में भेजिए #UttarPradesh | #ViralVideo | #Hospital pic.twitter.com/HJzftzlbxB— NDTV India (@ndtvindia) April 16, 2025